
అమరిక: సేదతీర్చే సంచులు
కుర్చీ ఎలా ఉండాలి? కూర్చుంటే లేవాలనిపించనంత సౌకర్యంగా ఉండాలి. సౌకర్యం అంటే కుర్చీ ఆకారానికి అనుగుణంగా మనం కూర్చోవడం కాదు, కూర్చున్నవాళ్లు ఎటు కదిలినా అటు సర్దుకుపోయేటట్లు ఉండాలి. ఇలా రూపొందినదే బీన్ బ్యాగ్. ఇదేమిటి ఇసుక బస్తాలాగ ఉంది... అని ముఖం చిట్లించిన వాళ్లు కూడా ఒకసారి కూర్చున్నారంటే ఆ క్షణం నుంచే బీన్‌బ్యాగ్ ప్రియులైపోతుంటారు. మార్కెట్‌లోకి వచ్చిన ఒక ప్రయోగం విజయవంతం అయితే ఇక తిరుగేముంది! ఆ ఫార్ములాకి సృజనాత్మకత జోడించి రకరకాల మోడల్స్‌లో తయారుచేస్తారు. అలా రూపొందినవే ఇక్కడ కనిపిస్తున్న రకరకాల బీన్‌బ్యాగ్‌లు. ఇక్కడ నిద్రపోతున్న బిడ్డని చూడండి... అలాగే ఈ బిడ్డ పడుకున్న బీన్‌బెడ్‌ని కూడ
. బిడ్డ నిద్రలో దొర్లి కిందపడకుండా రక్షణగా చిన్న బెల్ట్ కూడా ఉంది ఈ బెడ్‌కి. ఇదే పాపాయి పెద్దయిన తర్వాత ఈ బీన్‌బెడ్‌ని ఏం చేయాలి అనే మీమాంస కూడా అక్కర్లేదు, పక్కనే దానిని సోఫాగా ఉపయోగించిన పెద్ద పాపాయి కూడా ఉంది చూడండి. ఇక్కడ ఇలాంటివే రకరకాల బీన్ బ్యాగ్‌లున్నాయి. త్రీ సీటర్ సోఫా మోడల్, సోఫాకమ్ బెడ్ మోడల్, రిక్లెయినర్ మోడల్... వీటిలో మీకు ఏది నచ్చితే అది, మీ ఇంటికి ఏది నప్పితే దానిని తెచ్చుకోవడమే. వీటికి ఉపయోగించే మెటీరియల్ ఎక్కువ కాలం మన్నుతుంది. కాబట్టి పెట్టిన డబ్బు వృథా కాదు. ఇంట్లో చిన్న పిల్లలుంటే కామిక్ బొమ్మ బీన్‌బ్యాగ్‌ని బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.