సెల్ఫీలు మన గురించి చెప్పేస్తాయి!
సెల్ఫీలంటే సరదాగా తీసుకునే స్వీయ చిత్రాలు మాత్రమే కాదు. అవి మన వ్యక్తిత్వాన్ని గురించి మనకు చెబుతాయి అంటోంది తాజా అధ్యయనం ఒకటి. మనలోని అంతర్ముఖత్వం, అంకితభావం, స్వార్థం, నిస్వార్థం, ధైర్యం, పిరికితనం...ఇలా ఎన్నో లక్షణాలను సెల్ఫీలు చెబుతాయి.
‘‘ఫోటో మాత్రమే అనుకుంటాంగానీ అది మన వ్యక్తిత్వంలోని ఎన్నో కోణాలను మనకు చెబుతుంది’’ అంటున్నారు సింగపూర్‌లోని నన్‌యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.
సెల్ఫీ కోసం ఎంచుకున్న ప్రదేశం, భంగిమ, కెమెరాకు సంబంధించిన సాంకేతిక అంశాలు... మొదలైనవి మన వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయట. ఇతర వ్యక్తులు తీసే ఫోటోల కంటే సెల్ఫీలే వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో సూచికలుగా పనిచేస్తాయంటున్నారు పరిశోధకులు. పుస్తకాలుగా వచ్చిన ప్రముఖుల సెల్ఫీలను కూడా తమ అధ్యయనానికి పరిశోధకులు ఉపయోగించుకున్నారు.
రెండు ఉదాహరణలు
సంతోషంగా, నవ్వు ముఖంతో కనిపించడం అనేది సిగ్నేచర్ సెల్ఫీ లుక్! ఇలాంటి సెల్పీలు మనలోని సానుకూల దృక్పథాన్ని చాటడంతో పాటు ఇతరులకు సహాయం చేసే మనస్తత్వాన్ని తెలియజేస్తాయట. ముఖం కింది నుంచి సెల్ఫీ తీసుకోవవడం పట్టు విడుపులు లేని ధోరణిని, సరికొత్త ప్రయోగ దృక్పథాన్ని తెలియజేస్తుందట. ప్రైవేటు ప్లేస్‌లలో సెల్ఫీలు తీసుకోకవపోవడం అనేది మనస్సాక్షి విలువనిచ్చే వైఖరికి అద్దం పడుతుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.