సీరియల్ శ్రీమతి...
సతి బాధ
బిచ్చం వేయాల్సి వస్తుందని మా అపార్ట్‌మెంట్ వాళ్లు అసలు పిల్లులే లేకుండా చేశారు. కొంచెం పిసినారులు. కాని ఎందుకనో చాలాసేపుగా పిల్లి ఏడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. పిల్లి ఏడవడం గతంలో విన్నావా అని అడగొద్దు. వినలేదు. కాని అది మాత్రం పిల్లి ఏడుపే అనిపించింది. నిద్ర లేచాను. పూర్వం అంటే అందరూ దిండు పక్కన హనుమాన్ చాలీసానో పోతన భాగవతమో లేదంటే యద్దనపూడి సులోచనారాణి నవల- జీవన తరంగాలలో పెట్టుకుని నిద్రపోయేవారు. ఇప్పుడవన్నీ లేవుగా. సెల్‌ఫోన్ ఉంటుంది. పట్టుకొని నొక్కి చూశాను. రెండున్నర!
దేవుడా... ఇంత రాత్రి వేళ ఈ భయంకరమైన పిల్లి ఏడుపు ఏమిటి? అసలే ఆ పూట టీవీలో ‘రాజుగారి పాత వరండా’ వేశారు. భయంతో చచ్చాను. ఇప్పుడీ ఏడుపుకు మళ్లీ చస్తున్నాను. వింజమూరి రవీంద్రనాథ్ సీరియల్ ‘లవంగదళం’ ప్రకారం అసంతృప్త ఆత్మలు పిల్లి రూపం దాలుస్తాయి. ఇప్పుడు కూడా... వ..వ..వణుకుతూ పక్కన చూశాను. మా మణిమకుటం నిండా రగ్గు కప్పుకుని ఈ లోకం ఎటైనా తగలడనీ అనే తాత్త్విక చింతనతో నిద్రపోతూ ఉంది. ఇప్పుడు నా గతి ఏమిటి? అద్దం వైపు చూశాను.
ఎవరో అద్దం ముందు కూచుని తీరిగ్గా తల దువ్వుకుంటూ పిల్లిలా ఏడుస్తున్నారు. అద్దిరి పడి లేచి మంచం మీద నుంచి ఒక్క దూకు దూకి లైట్ వేశాను. మా ఆవిడ!మంచం మీద చూశాను. ఖాళీ రగ్గు.‘ఎ..ఎ.. ఏమిటి... ఏమిటిది?’ ఆశ్చర్యపోయింది. ‘ఏమైంది మీకు ఎందుకంత కంగారు పడుతున్నారు’...‘ఇంత రాత్రి పూట ఎందుకలా ఏడుస్తున్నావ్?’ ‘ఏడుస్తున్నానా? పాడుకుంటూ బాధ పడుతున్నాను’.‘పాడుకుంటున్నావా?’ ‘అవును. ‘మూగరాగం’ సీరియల్‌లో హీరోయిన్‌ని తలుచుకుని బాధ పడుతున్నాను. తను ఇవాళ చచ్చిపోయింది.’ ‘చచ్చిపోయిందా?’
‘సీరియల్‌లో చచ్చిపోయింది. అందుకని తను సీరియల్‌లో డైలీ పాడే ‘ఆడజన్మ అతి సుందరలాల బహుగుణం... మమతం.. జయలలితం... చంద్రికా కుమారతుంగం’... అని పాడుకుంటూ ఉన్నాను’... ‘దానికి ఈ టైమే దొరికిందా’... ‘ఎనిమిదిన్నరకు చచ్చిపోయింది. ఈ విషాదం సింక్ కావడానికి టైమ్ పట్టింది. లేచి గుర్తు చేసుకుంటూ కూచున్నాను’ ‘మరి తల దువ్వుకోవడం ఏమిటి?’
‘వస్తూ వస్తూ మెడికేర్ షాంపూ తెమ్మంటే తెచ్చారా? పేలతో చస్తున్నాను. ఎలాగూ టైమ్ దొరికింది కదా అని...’ ఆ రాత్రి నా నిద్ర సీరియల్ తన్నుకుపోయింది.
ఒకటో తారీఖు వచ్చింది. సరుకుల పట్టి తెచ్చి ఇచ్చింది. చదివి ఉలిక్కి పడ్డాను.‘ఏమిటిది?’‘ఏమిటి ఏమిటిది?’ ‘ఇదేమిటి?’... వేలు పెట్టి చూపించాను.‘విషం’...‘అదే విషం ఏమిటి?’ ‘నా తల కొట్టేసినట్టుగా ఉంటోంది’ ‘అంటే’ ‘మీరు చూళ్లేదా? ప్రతి సీరియల్‌లోనూ కిచెన్ కప్‌బోర్డులో విషం అని రాసిన సీసా ఉంటుంది. ఇంత పెద్ద కిచెన్ చేయించారు. కాని ఒక్క విషం సీసా కూడా లేదు. ఇంకా కొనుక్కోలేదా అని ఇవాళ జరిగిన కిట్టీ పార్టీలో ఆ త్రీనాట్ టూ, ఫోర్ నాట్ సెవన్ చుప్పనాతులు నన్ను ఎగతాళి చేశారు. వాళ్లంతా ఎప్పుడో కొనేసుకున్నారట. అసలు విషం సీసా లేని కిచెనూ ఒక కిచనేనా అని తెగ నవ్వుతున్నారు’‘విషం అని రాసిన సీసా ఎవరు అమ్ముతారు?’‘ఏమో నాకేం తెలుసు’
‘ఒక పని చెయ్. మొన్న వద్దు వద్దంటున్నా వినకుండా గులాబ్‌జాములు చేశావుగా. ఆ జీరా తీసి సీసాలో వేసి పెట్టుకో. సరిపోతుంది’ ‘దానిని మీ అమ్మ కోసం దాచాను’ ‘హర్ని... అమ్మ నా కోడలు పిల్ల కమలాక్షి’ ‘కోడలు పిల్ల కమలాక్షి కాదు... పంకజం. ఆ రోల్ తమిళ నటి పొన్నరుసు వేస్తోంది’ ‘ఇప్పుడేమంటావ్? ‘నా హోదాకు తగ్గట్టుగా కిచెన్‌లో విషం సీసా ఉండాల్సిందే’.
మొన్న ఆఫీసు నుంచి వచ్చేసరికి అలిగి కూచుని ఉంది. మూడు గంటల ఏడు నిమిషాల సేపు బతిమిలాడినా మాట్లాడలేదు. తర్వాత అసలు కారణం చెప్పింది. మా బంధువుల అమ్మాయికి ఫోన్ చేసిందట. తనకు రెండు వారాల క్రితం పాప పుట్టింది. ఆ పాపకు ఎలాగైనా సరే ‘ద్విక్తా కపూర్’ అనే పేరు పెట్టాలని పట్టుపట్టిందట. ఆ అమ్మాయి అంత కంటే మొండి పట్టుదలతో నేనెందుకు పెడతాను... బిందు నాయుడో మంజులా నాయుడో అని పెడతాను అని అడ్డం తిరుక్కుందట.
‘మీరే చెప్పండి. నేను ఏక్తా కపూర్ అని పెట్టమంటే కాదనడంలో అర్థముంది. అంతకంటే ఒక ఆకు ఎక్కువ చదవాలని ద్విక్తా అని చెప్పాను. బిందు, మంజులా లోకల్ కదండీ. ముంబై లెవల్‌లోకి వెళ్లొద్దా. ‘కాదంటే కూర చేయాల్సింది కమలత్తే’ అని కే సెంటిమెంట్‌తో ఒక సీరియల్ కొడితే ఎలా గ్రాండ్‌గా ఉంటుందంటారు’... నేను బాత్‌రూమ్‌లో దాక్కున్నాను.
మా ఆవిడ బంగారం. నేనంటే భలే ఇష్టం. పిల్లలంటే ప్రాణం. ఇక మా అమ్మన్నా... చెల్లెలన్నా... చెప్పుకోవడం ఎందుకు... ఒక్క క్షణం కూడా వాళ్ల నోటి నుండి మాట పెగలనివ్వదు. అన్ని సద్గుణాలు ఉన్నా ఇదో దుర్గణం ఉంది. సీరియల్స్ చూడటం. ఎక్కువ చూస్తుందని చెప్పను కాని మధ్యాహ్నం ఒన్ టు సిక్స్ మళ్లీ సాయంత్రం సిక్స్ టు టెన్ చూస్తుంది. వద్దంటే నా సంగతి చూస్తుంది.
మొన్నొక రోజు ఆఫీస్ నుంచి వస్తూనే అడిగింది. ‘ఏమండీ... మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆమెకేదైనా ఫ్యాక్టరీ ఉందా?’‘లేదు. ఏం?’ ‘ఛ’ డిప్రెస్ అయి కూచుంది. ‘ఏమైందో చెప్పరాదా?’ ‘మీకు గర్ల్‌ఫ్రెండ్ ఉంటే ఆ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫ్యాక్టరీ ఉంటే నాకు ఆ సంగతి తెలిసి నేను కూడా ఫ్యాక్టరీ పెట్టి ఆమె ఫ్యాక్టరీని దివాలా తీయించడానికి అందులో నా మనిషిగా మీ దూరపు బంధువు బాజీరావు మస్తానీని పెట్టి తను పాపర్ పట్టి పోయి బ్లాక్ శారీ కట్టుకుని జుట్టు విరబోసుకొని బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 11లో రెండు కాళ్ల మీద నడుచుకుంటూ పోతుంటే నేను కారు దిగి హాహాహా అని పెద్దగా నవ్వి- చూశావా శర్మిష్టా... నా వాణ్ణి నీవాడుగా చేసుకోవాలనుకున్నావ్. కాని నావాడు నావాడే నీవాడు కాడు నీ వాడు కావాలనుకుంటే నావాడు కాక మునుపే చూసుకోవాల్సింది ఇప్పుడు నావాడు అయిపోయాక కాదు నా వాడు నా వాడు కావాల్సిందే అని పట్టుపడితే నాలోని సతి బయటకు వచ్చి శతమానం భవతికి భాష్యం చెప్పదా. నాతిచరామికి నవీన రూపం ఇవ్వదా. పాణి గ్రహణం అనే మాటకు పెద్ద ఎక్స్‌పోజర్ కల్పించి’...అయ్యా. అదీ సంగతి.
- భా.బా (భార్యా బాధితుడు)
గమనిక: నేను సన్మానాలకు దూరం. రాజమండ్రికి రండి... ఉండ్రాజవరం రండి అని ఫోన్లు చేస్తున్నారు. సారీ. ఇందులో నా గొప్పదనం లేదు. ఉంటే గింటే నా శ్రీమతిదే అని ఆమెకు తెలిసేలా భయభక్తులతో విన్నవించుకుంటున్నాను.