రెక్కలున్నాయని పక్షికి తెలియాలి | Shaheen Womens Resource and Welfare Association in Old Basti | Sakshi
Sakshi News home page

రెక్కలున్నాయని పక్షికి తెలియాలి

Published Mon, Dec 17 2018 12:29 AM | Last Updated on Mon, Dec 17 2018 7:05 AM

Shaheen Womens Resource and Welfare Association in Old Basti - Sakshi

హైదరాబాద్, పాతబస్తీలోని సుల్తాన్‌ షాహి ఏరియాలో ఉంది షాహీన్‌ ఉమెన్స్‌ రిసోర్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌. ఆఫీస్‌ గదిలోకి వెళ్లగానే జమీలా నిషాత్‌ చిరునవ్వుతో ఆహ్వానించారు. ఆమె కుర్చీకి వెనుకగా గోడ మీద ఒక పెన్సిల్‌ డ్రాయింగ్‌ కనిపించింది. ఒక అరబ్‌ షేక్‌ తక్కెడ పట్టుకుని ఉంటాడు. ఆ తక్కెడలో ఒక పక్క అమ్మాయిలు, మరొక పక్క డబ్బు కట్టలు. డబ్బు కట్టల వైపు మొగ్గు చూపుతూ ఉంటుంది తక్కెడ. ఆ బొమ్మ మీద పెద్ద ఇంటూ గుర్తు ఉంది. ఈ దుర్నీతి ఇంకా కొనసాగరాదని చెప్తోందా చిత్రం. తక్కెడ కింద ఉర్దూలో ఒక క్యాప్షన్‌.. ‘మమ్మల్ని నోట్ల కట్టల్తో తూచవద్దు, ముసలి వ్యక్తికి అమ్మవద్దు’ అని. 

2002. హైదరాబాద్‌లో ఒక ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌. పోటీలో చిన్న పిల్లలు డ్రాయింగ్‌ వేస్తున్నారు. పన్నెండేళ్ల షహీదా తదేక దీక్షతో బొమ్మ వేస్తోంది. వేసిన బొమ్మను తనను మార్చి మార్చి చూసుకుంటోంది. ఆ బొమ్మ తనకే నచ్చనట్లుంది. దానిని పక్కన పెట్టి మరో బొమ్మ వేసింది షహీదా. ఇదంతా గమనిస్తున్న జమీలా.. ‘ఏం బొమ్మ వేశావు’ అని షహీదాని అడిగారు. ‘నా బొమ్మ. ఆ బొమ్మలో ఉన్నది నేనే’ అన్నదా అమ్మాయి. ఇంతకీ షహీదా వేసిన బొమ్మలేమై ఉండవచ్చు. ముందు వేసింది రెక్కలు లేని పక్షి బొమ్మ. తర్వాత వేసింది పంజరంలో బందీగా ఉన్న పక్షి బొమ్మ.  

‘షాహీన్‌’ అవిర్భావం వెనుక
పన్నెండేళ్ల అమ్మాయి తన పరిస్థితిని ఒక్క బొమ్మలో చెప్పింది. మాటల్లో చెప్పడం చేతకాక కాదు. తాను చెప్పినా వినడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడం వల్ల. షహీదా బొమ్మ రూపంగానైనా చెప్పగలిగింది. అలా కూడా చెప్పే అవకాశం లేని షహీదాలెంతమందో ఈ సమాజంలో. వారి ఆవేదన వినడానికి ఒక గుండె కావాలి. ఒక అమ్మ కావాలి. ‘ఆ అమ్మ తనే కావాలి’ అనుకున్నారు జమీలా నిషాత్‌. ‘పంజరంలో బందీగా ఉన్న పక్షులకు ఆకాశంలో ఎత్తుకి ఎగిరే శక్తినివ్వాలి. అందుకు ఒక వేదిక కావాలి.. అదే షాహీన్‌’ అన్నారామె. షాహీన్‌ అంటే.. ఎత్తుకి ఎగరగలిగిన శక్తిమంతమైన పక్షి. షాహీన్‌ ఉమెన్స్‌ రీసోర్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటుకు దారి తీసిన సంఘటన.. షహీదా పంజరంలోని పక్షి బొమ్మను గీయడం! 

పేదరికం వల్లనే ప్రలోభాలకు
‘‘షహీదా అనుభవాన్ని పోలినదే మరో సంఘటన. మహిళలను చైతన్య పరచడానికి ఏర్పాటు చేసిన ఓ వర్క్‌షాపులో ఓ మహిళ లేచి.. ‘‘ఆడదాన్ని కొట్టడం నిజంగా నేరమా? అయితే నా భర్త ‘భార్యను కొట్టని వాడు అసలు మగవాడు ఎలా అవుతాడు?’ అంటాడేంటి’’ అని అడిగింది అమాయకంగా. ఇవే కాదు, ఇంతకంటే ఘోరాలూ ఉన్నాయి. అభంశుభం తెలియని అమ్మాయిలకు అరబ్బు షేక్‌లతో పెళ్లి చేయడం వాటిలో ఒకటి. ఒక అమ్మాయికి ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా పదిహేడు సార్లు, పదిహేడు మంది షేక్‌లతో పెళ్లి చేశారు. అంతమంది లైంగిక దాహానికి బలైపోయిన ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. కొందరు క్వాజీలు, పహిల్వాన్‌లు ఈ విధంగా ఆడపిల్లల తల్లిదండ్రులను మాయమాటలతో మభ్యపెడతారు. వారి మాటల్ని నమ్మి అమ్మాయిల తల్లిదండ్రులు ప్రలోభాలకు లోను కావడానికి కారణం కరడు కట్టిన పేదరికమే.

ఆ వలయాన్ని ఛేదించడానికి పోలీసు, మీడియా సహకారంతో మేము అనేక స్టింగ్‌ ఆపరేషన్‌లు చేశాం. సమస్యను నివారించాలంటే ముందు ఆ సమస్యను సమాజానికి తెలియచేయాలి. ఈ దురాగతాన్ని రూపుమాపాలంటే... అందుకు దారి తీసిన పేదరికాన్ని నిర్మూలించాలి. అరబ్‌ షేక్‌లతో పెళ్లి పేరుతో మోసపోయిన  అమ్మాయిలను షాహీన్‌ రక్షణ కిందకు తీసుకొస్తున్నాం. వాళ్లు తమ కాళ్ల మీద తాము జీవించడానికి కావల్సిన జీవన నైపుణ్యాలను నేర్పిస్తున్నాం. మెహిందీ డిజైన్‌లు వేయడం, ఎంబ్రాయిడరీ చేయడం, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్, గాజుల తయారీ, కంప్యూటర్‌ కోర్సులు... ఇలా వారి అభిరుచి మేరకు శిక్షణ ఇప్పిస్తున్నాం.

చట్టం తెలిసుండాలి
ఇస్లాం కుటుంబాల్లో అమ్మాయిలను చదివించడమే గగనంగా ఉంటున్న ప్రాంతాలపై షాహీన్‌ ప్రధానంగా దృష్టి పెట్టింది. అక్కడి అమ్మాయిల్ని చదివించినా పదో తరగతి దాటనివ్వరు. శారీరకంగా, మానసికంగా తమ జీవితం దోపిడీకి గురవుతోందని వారికి తెలుస్తూనే ఉంటుంది. అయితే ఆ దోపిడీని అరికట్టడానికి తామే చేతులు అడ్డు పెట్టుకోవాలని చెప్పే వాళ్లుండరు. తమకు రక్షణగా చట్టం ఉందని కూడా తెలియదు చాలామందికి. గృహహింస బాధితులతోపాటు ఆ ఇంటి వారికి కూడా మేము కౌన్సెలింగ్‌ ఇచ్చేవాళ్లం. చట్టం వచ్చిన తర్వాత గృహహింస నిరోధక చట్టాన్ని (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఫ్రమ్‌ డొమెస్టిక్‌ వయొలెన్స్‌ యాక్ట్, 2005) ఉర్దూలోకి అనువదించి బుక్‌లెట్‌ ప్రచురించి, పాతబస్తీలోని ముస్లిం మహిళలకు పంచి పెట్టాం. మహిళల్ని తమ హక్కుల గురించి చైతన్యవంతం చేయడం కోసం వర్క్‌షాపులు పెట్టినప్పుడు.. మహిళలను మాత్రమే చైతన్యవంతం చేస్తే సరిపోదు, మగవాళ్లను సెన్సిటైజ్‌ చేయాల్సిన అవసరం కూడా ఉందని తెలిసింది. 

ఫోన్‌లోనే విడాకులు?!
ఓ పద్నాలుగేళ్ల అమ్మాయికి అరబ్‌ షేక్‌తో పెళ్లయింది. అతడు కొంతకాలం ఇక్కడ గడిపి తిరిగి వాళ్ల దేశానికి వెళ్లి పోయాడు. అతడు వెళ్లాక తెలిసింది ఆ అమ్మాయికి తాను గర్భవతినని. ఆ విషయాన్ని భర్తకు ఫోన్‌లో తెలియచేసిందామె. అదే ఫోన్‌ కాల్‌లో అతడు ఆమెకు విడాకులిచ్చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? అంతకంటే షాకింగ్‌ ఉంటుందా? జీవితం అగమ్యగోచరం కాక మరేమవుతుంది? అలాంటి కండిషన్‌ను ఎదుర్కోగలిగిన మానసిక స్థయిర్యం ఉండటానికి... ఆమెకి చదువు లేదు, డబ్బు లేదు. తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేరు. అప్పుడా అమ్మాయి బాధ్యతను షాహీన్‌ తీసుకుంది. ఆమెకు ప్రసవం అయ్యే వరకు, అయిన తర్వాత కూడా వైద్య సహాయం చేశాం. ఆ తర్వాత వొకేషనల్‌ ట్రైనింగ్‌ ఇచ్చాం. ఇప్పుడామె ఎవరి మీదా ఆధారపడకుండా స్వయంకృషితో జీవిస్తోంది. త్రిపుల్‌ తలాక్‌ చెల్లదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు బాగుంది. అయితే భార్యాభర్తల మధ్య విడాకుల విషయంలో ఏ తీర్పయినా వారిని కలిపి ఉంచేలా, లేదా సామరస్యంగా విడిపోయేలా చేసేందుకు ఉపకరించాలి. 

నిస్సహాయ స్థితి!
కొన్నిసార్లు దోషులు కళ్ల ముందున్నప్పటికీ చట్టం పరిధిలోకి రాకుండా తప్పించుకుంటారు. ఒకమ్మాయి ఉరేసుకుని చనిపోయింది. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేలేదని ఆమెను అత్తమామలు వేధించేవారని, ఆ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుందని చుట్టు పక్కల అందరూ చెప్పారు. చనిపోయిన అమ్మాయి తరఫున న్యాయపోరాటం చేయడానికి షాహీన్‌ సిద్ధమైంది. అయితే ఆమె ఇంట్లో వాళ్ల దగ్గర.. ‘తనకు జీవించాలని లేదని, చనిపోవాలనిపిస్తోందని’ అర్థం వచ్చేట్లుగా రాసి, ఆమె సంతకం చేసిన కాగితం ఒకటి ఉంది. నిజానికి ఏం జరిగిందో మాకందరికీ తెలుçసు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కొన్ని రోజుల పాటు కళ్లు మూసుకున్నా, తెరిచినా ఆ అమ్మాయి ముఖమే కనిపించేది. ఇలాంటి సంఘటనలతో ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపాను. ఆ ఆవేదన కవితల రూపంలో కాగితం మీదకు జాలువారేది. అయితే ఆ కవితలు దీనావస్థలో ఉన్న ముస్లిం మహిళ బతుకు చిత్రాన్ని చూపిస్తాయి కానీ, సమస్య నుంచి వారిని బయటకు తెచ్చేదెలా? అనే ప్రశ్న తొలుస్తూనే ఉండేది.

చైతన్యం తేవడమే లక్ష్యం
లీగల్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌లు కుటుంబ జీవితాన్ని గాడిలో పెట్టుకోవడానికి దోహదం చేస్తాయి. అంతకంటే ముందు.. వ్యక్తిగా తమకున్న హక్కుల గురించి వాళ్లకు తెలియాలి. చదువుకునే హక్కు ఉందని తెలియాలి, సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉందనీ తెలుసుకోవాలి. పిల్లల్ని కనడం కోసం అనారోగ్యం పాలు కాకుండా తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే హక్కు ఉందని కూడా మహిళలకు తెలియాలి. అవన్నీ తెలియచేయడానికి మేము ఒకసారి వర్క్‌షాప్‌ పెట్టి చెప్తే సరిపోదు. వాళ్లు మళ్లీ మళ్లీ చదువుకునేటట్లు సమాచారం వాళ్ల చేతిలోనే ఉంటే తప్ప వారిలో రావాల్సినంత చైతన్యం వచ్చేలా లేదనిపించింది. అందుకే ఈ చట్టాలను ఉర్దూలో ప్రచురించి పంచి పెట్టాం. కౌమారదశలో ఉన్న అమ్మాయిలతోపాటు, అబ్బాయిలను కూడా మా రక్షణలోకి తీసుకుంటున్నాం. లైంగిక దోపిడీకి గురయ్యే వయసును సంరక్షించగలిగితే, వాళ్లే రేపటి రోజున సున్నితమైన సమాజాన్ని స్థాపించడానికి ముందుకు వస్తారు. పంజరంలో చిక్కుకున్న పక్షుల్ని, బంధ విముక్తుల్ని చేసి, స్వేచ్ఛగా ఎగరగలిగిన శక్తిని పెంపొందించాలనేదే షాహీన్‌ ప్రయత్నం. నేను ఈ సంస్థ స్థాపించడానికి ప్రేరేపించిన అమ్మాయి పంజరంలో చిక్కుకున్న పక్షి బొమ్మ వేసిన షహీదా. ఇప్పుడామె షాహీన్‌ సంస్థలో కార్యదర్శి, కోశాధికారి విధులు నిర్వర్తిస్తోంది’’.

ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి
‘‘ఆర్థిక స్వాతంత్య్రం ఉన్న మహిళ, తన మీద జరిగే అన్యాయాలను సహిస్తూ కాలం గడపదు. తన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలనే నిర్ణయాన్ని తానే తీసుకోగలుగుతుంది. అందుకోసమే ఆర్థిక కారణాల వల్ల చదువాపేసిన అమ్మాయిలను అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా చదివిస్తున్నాం. ఆర్థిక స్వావలంబన సాధించడానికి వారికి ఇష్టమైన పనుల్లో శిక్షణనిస్తున్నాం. ఐదుగురితో మొదలైన షాహీన్‌ సంస్థలో ఇప్పుడు 35 మంది సేవలందిస్తున్నారు. ఈ పదిహేనేళ్లలో ఐదు వేలకు పైగా మహిళల జీవితాలను గట్టెక్కించగలిగాం. నా జీవితం కూడా షాహీన్‌ లేకుండా జమీలా లేదనేంతగా సంస్థతో ముడివడిపోయింది. 


– జమీలా నిషాత్, 
కవయిత్రి, సామాజిక కార్యకర్త


ఆకాంక్ష తీర్చని ఆంక్షల వలయం
అరవై మూడేళ్ల జమీలా నిషాత్‌ పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లో. ఆమె తండ్రి సయీద్‌ బిన్‌ ముహమ్మద్‌ చిత్రకారుడు. జమీలాకి కూడా బొమ్మలు వేయాలని ఉండేది. కానీ వారి సంప్రదాయ కుటుంబంలో ఆంక్షలెదురయ్యాయి. ఆ తీరని ఆకాంక్షను ఆమె సాహిత్యం చదవడం, కవిత్వం రాయడంతో నెరవేర్చుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతో కాలేజ్‌ చదువుతోపాటు కవిత్వాన్ని కొనసాగించారు. పెళ్లి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఎ ఇంగ్లిష్‌తోపాటు థియేటర్‌ ఆర్ట్స్‌లో డిప్లమో చేశారు. మహిళలను చైతన్యవంతం చేయాలనే సంకల్పంతో సామాజిక కార్యకర్తగా మారారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement