పేలనాశిని
తలకు పేలు పట్టాయంటే ఆ బాధ వర్ణనాతీతం. ఎక్కువగా చిన్నపిల్లలకు తరచు తలలో పేలు పెరుగుతుంటాయి. అక్కడక్కడా పెద్దలకూ ఈ సమస్య ఉంటుంది. పేలను వదలగొట్టడానికి ఘాటైన రసాయనాలతో కూడిన షాంపూలను వాడాల్సి వస్తుంది. అయితే, పేలను సమూలంగా నాశనం చేసి పారేసే హైటెక్ దువ్వెనను జర్మన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. జర్మనీకి చెందిన ఫ్రాన్‌హోఫర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సర్‌ఫేస్ ఇంజనీరింగ్ అండ్ థిన్ ఫిల్మ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ దువ్వెన తయారీలో శీతలీకరించిన ప్లాస్మాను ఉపయోగించారు.
ఈ దువ్వెనలోని పళ్లను ఎలక్ట్రోడ్లుగా ఉపయోగపడేలా తయారు చేశారు. దీంతో ఈ దువ్వెనతో దువ్వినప్పుడు దాని పళ్ల మధ్య ఖాళీ జాగాలోని గాలి ఆ పళ్లను అయొనైజ్ చేసి, స్వల్పంగా విద్యుత్తు పుట్టేలా చేస్తుంది. ఫలితంగా దువ్వగానే ఇందులోని ప్లాస్మా విడుదలై, దాని ద్వారా వెలువడే షాక్ ప్రభావానికి తలలోని పేలు, ఈపులు వంటివన్నీ చచ్చి ఊరుకుంటాయి.
అయితే, ఈ దువ్వెన ద్వారా వెలువడే షాక్ అత్యంత స్వల్పం కావడంతో దీని ప్రభావం మనుషులపై ఏమాత్రం ఉండదని దీని రూపకర్తలు చెబుతున్నారు. జర్మనీలోని కొన్ని పిల్లల ఆస్పత్రిలో ఈ దువ్వెనను ఇప్పటికే వాడుతున్నారు. త్వరలోనే ఇది మార్కెట్లోకి విడుదల కానుందని చెబుతున్నారు.