భక్తులపాలిట కొంగుబంగారం.. దురాజ్‌పల్లి లింగన్న
శివుడు సర్వాంతర్యామి... ప్రతి ప్రాణిలో శివమే జీవం.. అటువంటి శివం భూమిపై లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తుంటాడు. కానీ విగ్రహ స్వరూపంలో దర్శనమిచ్చేది అతి తక్కువగానే. శివుడు అలా భక్తులకు దర్శనమిచ్చే ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేరొందింది నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి జాతర. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు ఉన్న ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు లింగమంతులస్వామి జాతర, యాదవగట్టు, గొల్లగట్టు, పెద్దగట్టు జాతరగా పేర్లు ఉన్నాయి. యాదవులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తూ ఉంటారు. ఈ నెల 8 నుంచి 12వరకు జాతర నిర్వహించనున్నారు.
ఈ ప్రాంతవాసులు దురాజ్‌పల్లి జాతర గురించి రకరకాలుగా చెప్పుకుంటుంటారు. చాలా ఏళ్ల క్రితం దురాజ్‌పల్లి ప్రాంతం దట్టమైన అభయారణ్యంలో ఉండేది. వల్లభాపురం, ఉండ్రుగొండ, కాశీంపేట, దురాజ్‌పల్లి ప్రాంతాల యాదవులు తమ గొర్రెల మందలను తెచ్చి ఈ ప్రాంతంలో మేపే వారు. ఈ ప్రాంతంలో క్రూరమృగాలు కూడా అధిక సంఖ్యలో ఉండేవి. మేత కోసం వచ్చిన గొర్రెలు, మేకలను వందల సంఖ్యలో చంపి తినేవి. దీంతో యాదవులు దిక్కుతోచని స్థితిలో పరమశివుడికి మొరపెట్టుకున్నారు. దీంతో శివుడు లింగమంతులస్వామిగా గుర్రంపై త్రిశూలధారి అయి ఈ ప్రాంతంలో సంచరిస్తూ క్రూరమృగాలను వధించసాగాడు. ఎన్ని క్రూరమృగాలను వధించినా, రాక్షసమాయ మూలంగా వాటి రక్తపు చుక్కలు భూమిపై పడగానే మళ్లీ పుడుతుండటంతో లింగమంతులస్వామి సోదరి సౌడమ్మ ఆ స్థలంలో మృగాల రక్తపు చుక్కలు కిందపడకుండా నాలుకను చాపి, నాకడంతో మృగాలన్నీ మృతి చెందాయి. యాదవులు కృతజ్ఞతగా శివుడికి పిల్లతల్లి గొర్రెను బలి ఇవ్వాలనుకున్నారు. శివుడు తాను శాకాహారినని, తమ సోదరి సౌడమ్మకు బలివ్వమనడంతో వారు సౌడమ్మకు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అప్పుడు యాదవులు శివుడిని ఇక్కడే ఉండాల్సిందిగా వేడుకోవడంతో సమీపంలోని ఉండ్రుగొండ గుట్టల్లో వెలిశాడు. కాలక్రమంలో ఓ యాదవ మహిళ నిండు గర్భంతో లింగమంతులస్వామిని దర్శించుకునేందుకు గుట్ట మెట్లు ఎక్కుతుండగా కాలు జారి కిందపడి గర్భవిచ్ఛిత్తి జరిగి మృతి చెందింది. దాంతో చలించిన శివుడు ఉండ్రుగొండ గుట్టపై నుంచి దురాజ్‌పల్లిలోని పెద్దగట్టుపై వెలిశాడని కథనం.
మరో కథనం..
పూర్వం పెద్దగట్టు సమీపంలో కేసారంగ్రామానికి చెందిన గొర్ల లింగారెడ్డి, మరికొందరు గొర్రెల కాపరులుగా అక్కడకు చేరుకున్నారు. గొర్రెలు మేస్తుండగా గొర్ల భిక్షంరెడ్డి చెట్టుకింద నిద్రకు ఉపక్రమించారు. నిద్రలో లింగారెడ్డికి శివుడు ప్రత్యక్షమై తాను మర్రిచెట్టు సమీపంలో గల బావిలో పూడుకుపోయాయని, తనను వెలికి తీసి ప్రతిష్ఠించాలని చెప్పి అదృశ్యమయ్యాడు. వెంటనే మేలుకొన్న అతను ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పి మరుసటి రోజు బావిలో వెతకగా గుర్రంపై త్రిశూలధారిగా ఉన్న శివుడి విగ్రహం బయటపడింది. అందరూ కలిసి ఆ విగ్రహాన్ని వెలికి తీసి పెద్దగట్టుపై ప్రతిష్ఠించి జాతర జరుపుతున్నారు. ఇప్పటికి కేసారం గొర్ల వంశీయులు దేవుడికి గొర్రెలను బలివ్వడం, దేవరపెట్టెకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న జాతర కావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.
రెండువందల ఏళ్లుగా పూజలు
- గొర్ల గన్నారెడ్డి, కేసారం
రెండువందల ఏళ్లుగా తాతల కాలం నుంచి గట్టుజాతరలో పూజలు చేస్తున్నాం. తమ కోర్కెలు నెరవేరుతున్నందున భక్తుల సంఖ్య అశేషంగా పెరిగింది. గ్రామంలోని మెంతబోయిన వంశస్తులు పూజలు చేయడంతో జాతర ప్రారంభమవుతుంది.