
అతనొక అజ్ఞాత కళాకారుడు. స్పష్టంగా మాట్లాడలేడు కాని అందమైన బొమ్మలకు, అనూహ్యమైన ఘటనలకు ప్రాణం పోయగలడు. గడపలకు, గుమ్మాలకు రంగులు వేయడమైతే పుట్టుకతో వచ్చిన విద్య. వాటర్ కలర్స్, ఆయిల్ పెయింట్స్‌తో ప్రముఖ రాజకీయ నాయకుల బొమ్మలను కూడా సొంతంగానే వేస్తున్నాడు. తన బొమ్మలకు గుర్తింపు కావాలని మూగగానే అభ్యర్థిస్తున్నాడు.
గాంధీని గాడ్సే షూట్ చేశాడు. ఇందిరా గాంధీని సెక్యూరిటీ గార్డులే పొట్టన పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. రాజీవ్‌గాంధీని మానవ బాంబు హతమార్చింది, సంజయ్‌గాంధీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. వీటిని తన రంగులలో చిత్రీకరించాడు నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రానికి చెందిన ఎడ్ల శివకుమార్. రాజీవ్‌గాంధీ, సోనియా గాంధీ జంటను చిత్రీకరించి, సోనియాను అచ్చతెలుగు ఆడపడుచులా నగలతో అలంకరించి, తన సృజనను నిరూపించుకున్నాడు.
ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న శివకుమార్, పది సంవత్సరాల వయస్సు వరకు బాగానే మాట్లాడేవాడు. ‘‘ఏం జరిగిందో ఏమో తెలియదుకాని, పదో ఏట నుంచి మాట పోయింది’’ అంటారు శివకుమార్ తల్లి సాయిలమ్మ. బుచ్చన్న సాయిలమ్మ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. శివకుమార్ రెండో సంతానం. ఒక అన్న, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అనారోగ్యం కారణంగా తండ్రి బుచ్చన్న పది సంవత్సరాల క్రితం మరణించాడు. కుటుంబాన్ని తల్లి ఒంటి చేత్తో పోషించవలసి వచ్చింది. కూరగాయలు అమ్ముతూ పిల్లల్ని పెంచుకొస్తోంది. అన్న మల్లేశ్, చెల్లెలు విజయలక్ష్మి ఇద్దరూ మానసికంగా ఎదగలేదు. ‘‘నాకు వచ్చిన విద్య బొమ్మలు వేయడం మాత్రమే.
మా కుటుంబానికి అండగా ఉండాలంటే, నేను మరింత కష్టపడాలి. ఎవరి సహకారమూ లేకుండానే తలుపులకు రంగులు, గడపలకు ముగ్గులు వేసి, ఎంతో కొంత సంపాదిస్తున్నాను. అప్పుడప్పుడు ముగ్గుల పోటీలో పాల్గొని, చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నాను. ఇప్పుడు రాజకీయ నాయకుల బొమ్మలు వేస్తున్నాను’’ అని చెప్పారు 35 ఏళ్ల శివకుమార్. తమ్ముడు సంజయ్ డిగ్రీ వరకు చదివినా ఉద్యోగం రాకపోవడంతో ఆ కుటుంబం ఒక పాత ఇంట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన బొమ్మలను గుర్తించి ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తే బాగుండునని శివకుమార్ ఆశ.
– వైజయంతి పురాణపండ
ఫొటోలు: గోరటి శ్రీరాములు, సాక్షి, తెలకపల్లి
Comments
Please login to add a commentAdd a comment