శుభారాణి దశ్ రోజూ తెల్లవారుజామున 3.20కి నిద్ర లేస్తారు. కాలకృత్యాలు ముగించుకుని ఆ చీకట్లోనే సైకిల్ మీద న్యూస్ పేపర్ల ఏజెంట్లు ఉండే సెంటర్‌కు వెళ్తారు. భువనేశ్వర్‌లో తన నివాసానికి దగ్గరగా ఉండే 200 ఇళ్లకు ఆ పేపర్లను డెలివరీ చేస్తారు. 7.30 కల్లా పేపర్ వెయ్యడం పూర్తవుతుంది. అక్కడి నుంచి స్కూలు పిల్లలకు ట్యూషన్ చెప్పేందుకు అదే సైకిల్ మీద కొన్ని ఇళ్లకు వెళ్తారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. తర్వాత ఇంట్లోనే సాయంత్రం వరకు కుట్టు మెషీన్ మీద బట్టలు కుడతారు. పాత న్యూస్‌పేపర్‌లతో కవర్లు తయారు చేస్తారు. ఆ కవర్లు ఎక్కువ మొత్తంలో జమ అయ్యాక ఒక రోజు వాటిని తీసుకెళ్లి కిరాణా దుకాణాలకు అమ్ముతారు. శుభారాణి దినచర్య ఇది. ఈ పనులన్నిటి మధ్య ఎప్పుడో కాస్త ఎంగిలి పడతారు. ఉదయం పేపర్ల సెంటర్‌కు వెళ్లినప్పుడు ఎవరైనా ఇప్పిస్తే టీ తాగుతారు. ఎప్పుడైనా గుర్తొస్తే ఒడిశా ఫుట్‌బాల్ అసోసియేషన్ తనకు ఇచ్చిన ప్రశంసాపత్రాలు, అవార్డులను తీసి చూసుకుంటారు.
అవును శుభారాణి ఒకప్పుడు ఫుట్‌బాల్ ప్లేయర్! ఇప్పుడు న్యూస్ పేపర్ హాకర్. ప్రస్తుతం ఆమె వయసు 44 ఏళ్లు. 1992లో తొలిసారి ఒడిశా రాష్ట్ర తొలి మహిళా ఫుట్‌బాల్ జట్టు సభ్యురాలిగా అస్సామీ కొండ ప్రాంతపు మైదానం హఫ్‌లాంగ్‌కు వెళ్లారు శుభారాణి. ఆ ఆటలో శుభారాణి ఒడుపైన ఆట వల్ల ఒడిశా జట్టు క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగింది. ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా ఆమె కెరీర్ కూడా 1998 వరకు చురుగ్గా ఎదిగింది. అయితే ఆ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత శుభారాణి మళ్లీ ఫుట్‌బాల్ ఆడలేకపోయారు. ఒడిశా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికై ఇక ఉద్యోగంలో చేరబోతుండగా జరిగిన యాక్సిడెంట్ అది. అలా ఉద్యోగం కూడా ఆమెకు చేజారింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ పేద కుటుంబంలో పుట్టారు శుభారాణి. స్కూల్లో ఆమె ఖో–ఖో ప్లేయర్. ఫుట్‌బాల్‌కు ముందు చిన్న వయసులోనే ఖో–ఖోలో నేషనల్ గేమ్స్ ఆడారు. శుభారాణికి యాక్సిడెంట్ అయిన రెండేళ్లకు ప్రకాశ్ చంద్ర మిశ్రా అనే బంధువులబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆమె తండ్రి.
ప్రకాశ్ చంద్ర న్యూస్ పేపర్ హాకర్. భువనేశ్వర్ దగ్గరి షాహిద్ నగర్ ఏరియాలో ఇల్లు. చిన్న పెట్టెలాంటి గది అది. అక్కడే జోత్స్నమయి, స్తుతి ఆరాధన పుట్టారు. రెండేళ్ల క్రితం వరకు అక్కడే ఉన్నారు కానీ, పిల్లలు పెద్దవాళ్లు అవుతుండడంతో దగ్గర్లోనే ఇంకో ఇంటికి మారాల్సి వచ్చింది. ఆ ఇంటి అద్దె ఏడు వేలు. భార్యాభర్తలతో పాటు, పిల్లలిద్దరూ చదువుకుంటూనే పేపర్లు వేస్తుంటారు. అందరికీ కలిపి నెలకు 12 వేలు వస్తుంది. అద్దె పోగా మిగిలేది ఐదు వేలు. ఆ ఐదు వేలలోనే కుటుంబం గడవాలి. పాత ఇంట్లో (గదిలో) బాత్రూమ్ లేదు. గది బయటే పాలిథిన్ షీట్‌లతో స్నానాలకు ఒక ‘మాటు’ను ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు లేచే సరికే వీళ్ల స్నానాలు ముగించుకునేవారు. తర్వాత పిల్లల కోసం ఇల్లు మారక తప్పలేదు. భువనేశ్వర్‌లో వచ్చే ఏడాది ‘ఫిఫా’ యు–17 ఉమెన్స్ వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఒడిశా క్రీడా శాఖ అధికారులు ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఆ అధికారుల దగ్గరే పెన్షన్ కోసం శుభారాణి దరఖాస్తు చేసుకున్న కాగితం కూడా ఉంది. వాళ్లు దాన్ని ఓకే చేస్తే నెల నెలా ఆమెకు 3000 రూపాయలు వస్తాయి. శుభారాణి చెయ్యి చాసి ఎవర్నీ ఏమీ అడగలేదు. అడగలేరు కూడా. స్వాభిమానం. కానీ ఇలా జీవితంతో పోరాడేవారికి వాళ్లు నోరు తెరిచి అడక్కుండానే వాళ్లకు దక్కాల్సింది దక్కాలి.
‘‘అద్దె ఏడువేలు పోను, మిగిలే ఐదు వేలతో మేం నలుగురం ఎలాగో నెట్టుకొస్తున్నాం. ఆడపిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. వాళ్ల కోసం ఈ ఐదు వేలల్లోనే దాచేది దాస్తున్నాం. మా భయం ఒక్కటే. ఇంట్లో ఒక్కరికి అనారోగ్యం వచ్చేనా దాచిందంతా కొట్టుకు పోతుంది. అప్పుడు జీవితం మళ్లీ మొదటికే వస్తుంది’’
– శుభారాణి, న్యూస్ పేపర్ హాకర్, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారిణి
Comments
Please login to add a commentAdd a comment