కళ్లు  తెరవండి... | Side effects on the eye with the intensity of light | Sakshi
Sakshi News home page

కళ్లు  తెరవండి...

Published Thu, Apr 18 2019 12:10 AM | Last Updated on Thu, Apr 18 2019 12:10 AM

Side effects on the eye with the intensity of light - Sakshi

సూర్యుడు భగభగా మండుతుంటేకళ్లు మూసుకుంటాం. కానీ... మూసుకునే ఉండలేంగా?!అందుకే...కళ్లు తెరవండి. ఎండాకాలం నిజాలతో  కనువిప్పు కలిగించుకోండి. 

కంటికి ఏదైనా కనపడాలంటే కాంతి కావాల్సిందే. కానీ అదే కాంతి తీవ్రత మరీ ఎక్కువైతే? వేసవిలో కాంతి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. దాంతో ఆ కాంతిలో ఉండే అల్ట్రా వయొలెట్‌ కిరణాలు, ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాల ప్రతికూల ఫలితాలు కంటిని ప్రభావితం చేస్తాయి. ఈ వేసవిలో కాంతి తీవ్రతతో కంటిపై పడే దుష్ప్రభావాలు, ఇతరత్రా సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం. అలాగే వేసవి కాంతి తీవ్రత నుంచి కంటిని రక్షించడం కోసం నాసిరకం కళ్లజోళ్ల వల్ల కంటికి కలిగే నష్టాలు, తీవ్ర కాంతి నుంచి కళ్లను రక్షించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. 

ఏమిటీ కాంతి... దాంతో  ఎలా కనిపిస్తుంది? 
మన కన్ను పనిచేయడానికి దోహదపడే కాంతి అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. సూర్యుని నుంచి భూమికి చేరే అనంతమైన రేడియేషన్‌ పటలంలో మనం చూడగలిగేదీ, మనం గ్రహించగలిగేదీ చాలా పరిమితం. ఈ పరిమితమైన కాంతి మన కంట్లోని కంటిపాప ద్వారా వెళ్లి రెటీనాపై రిఫ్లెక్ట్‌ అవుతుంది. ఆ రెటీనాపై పడ్డ ప్రతిబింబాన్ని ఆప్టిక్‌ నర్వ్‌ మన మెదడుకు చేరవేసి, అదేమిటో తెలిపేలా  చూపుకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగిస్తుంది. 

ఎన్నెన్నో రకాల రేడియేషన్‌...  
నిజానికి రేడియేషన్‌లో ఒక్క కాంతి కిరణాలు మాత్రమే కాకుండా... రేడియో తరంగాలూ, ఎక్స్‌–కిరణాలూ, మైక్రోవేవ్‌... ఇలా ఎన్నెన్నో రకాల తరంగాలు ఉంటాయి. వీటినన్నింటినీ కలిపి ‘ఎలక్ట్రోమాగ్నెటిక్‌ రేడియేషన్‌’ అంటారు. ఇందులో వేర్వేరు రకాల కిరణాలకు వేర్వేరు వేవ్‌లెంగ్త్‌ ఉంటుంది. నిజానికి ఆయా వేవ్‌లెంత్‌లను బట్టే ఆ రేడియేషన్‌ను వర్గీకరిస్తారు. అల రూపంలో ప్రసారితమయ్యే కాంతి కిరణంలోని పక్కపక్కనే ఉండే...  ఒక పీక్‌కూ, మరో పీక్‌కూ మధ్యనున్న దూరమే వేవ్‌లెంగ్త్‌. దీన్ని ప్రామాణికంగా తీసుకొని చూస్తే... మన కళ్లకు కనిపించే, మనం చూడటానికి దోహదం చేసే ఈ కాంతి కేవలం  380 – 780 నానో మీటర్ల (మైక్రాన్స్‌) రేంజ్‌లో మాత్రమే ఉంటుంది. అంతకంటే తక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్‌ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండేవాటిని ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలుగానూ చెబుతుంటారు. 

హాని కలిగేది అల్ట్రా వయొలెట్,ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలతో... 
మనకు చేరే కాంతితో పాటు మన వాతావరణంలో ప్రసరిస్తూ, ప్రవహిస్తూ ఉండే అల్ట్రా వయొలెట్, ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలు కంటికి హాని కలిగిస్తాయి. వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ. ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాల దుష్ప్రభావం ప్రధానంగా కార్నియా మీద ఉంటుంది. 

కాంతికి తక్షణం ఆవల ఉన్న  రేడియేషన్, రకాలు
మనకు కంటికి కనిపించే కాంతికి ఇరుపక్కల ఉండే రేడియేషన్‌తో మన కంటికి చాలా ప్రమాదం . కాంతికి ఇరుపక్కల ఉండే రేడియేషన్, అందులోని రకాల గురించి తెలుసుకుందాం. కాంతిపుంజం లేదా కాంతి కిరణానికి పక్కనే తక్కువ వేవ్‌లెంగ్త్‌లో ఉండే కిరణాలే అల్ట్రా వయొలెట్‌ కిరణాలు.

అల్ట్రా వయొలెట్‌లోని మూడు రకాలు... 
కంటికి హాని చేయగల అల్ట్రా వయొలెట్‌ కిరణాల (యూవీ రేస్‌)ను మూడు రకాలుగా విభజించవచ్చు. అవీ యూవి– ఏ, యూవీ– బీ, యూవీ– సీ వీటిలో మొదటి రెండిటి కంటే యూవీ – సీ చాలా ప్రమాదకరం. ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలను ఇన్‌ఫ్రారెడ్‌ – ఏ, ఇన్‌ఫ్రారెడ్‌ – బీ, ఇన్‌ఫ్రారెడ్‌ – సీ అని మూడుగా వి¿¶ జించవచ్చు. ఈ మూడు రకాల కిరణాలూ కంటికి ప్రమాదకరమైనవి.

రేడియేషన్‌తో కంటికి హాని ఇలా... 
సూర్యుడి నుంచి మొదలై, మొదట శూన్యంలో ప్రయాణం చేసే రేడియేషన్, భూమి ఉపరితలంలో ఉన్న వాతావరణాన్ని చీల్చుకొని మన కంటి వరకు చేరుతుంది. ఈ క్రమంలో రేడియేషన్‌లోని అత్యంత హానికారకమైన కిరణాలను ఓజోన్‌ పొర చాలా వరకు వడపోస్తుంది. అందువల్ల కేవలం 3 శాతం  కిరణాలు మాత్రమే ఉపరితలం వరకు చేరతాయి. 

అల్ట్రా వయొలెట్‌ కిరణాల ప్రభావం ఇలా... 
మామూలు కాంతి వల్ల కంటికి ఎలాంటి హాని ఉండదు గానీ తీవ్రమైన కాంతి వల్ల కంటికి జరిగే నష్టం రెండు రకాలుగా జరగవచ్చు. ఇందులో కంటికి తక్షణం కలిగే అనర్థాలను ‘అక్యూట్‌ అనర్థాలు’గా చెప్పవచ్చు. అదేపనిగా చాలాకాలం పాటు రేడియేషన్‌కు ఎక్స్‌పోజ్‌ అవుతున్నప్పుడు కంటిపైన దీర్ఘకాలిక దుష్ప్రభావాలూ పడవచ్చు. వీటినే ‘క్రానిక్‌ దుష్ప్రభావాలు’ గా పేర్కొంటారు. అల్ట్రా వయొలెట్‌ రకాల్లో యూవీ–ఏ వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలావరకు తాత్కాలికమైనవి. యూవీ–ఏ కంటే యూవీ–బీ కిరణాలవల్ల కలిగే అనర్థాల తీవ్రత ఎక్కువ. అయితే వీటివల్ల కంటికి కలిగే అనర్థాలను వైద్యచికిత్సతో చాలావరకు చక్కదిద్దవచ్చు. కానీ యూవీ–సి వల్ల కలిగే అనర్థాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలకు సైతం ముప్పు కలిగించవచ్చు. అయితే అదృష్టవశాత్తు యూవీ–సీ రకానికి చెందిన కిరణాలను ఓజోన్‌ పొరే నిరోధించి, జీవకోటిని రక్షిస్తుంటుంది. 

హానికర కిరణాల దుష్ప్రభావం ఇలా... 
వాతావరణంలోకి ప్రవేశించిన ఈ కాంతి కిరణాలు కొన్నిసార్లు నేరుగానూ, మరికొన్నిసార్లు రిఫ్లక్షన్‌ చెంది కంటిపై పడి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అయితే రిఫ్లెక్షన్‌తో కలిగే నష్టాలన్నిటిలో చాలా సందర్భాల్లో మంచు, ఇసుక, నేల, రోడ్డు, కంకర, నీళ్ల ఉపరితలం వంటి వాటిపై పడి రిఫ్లెక్ట్‌ అయి కంటికి చేరి దుష్ప్రభావం చూపుతాయి. సాధారణంగా మనం డ్రైవింగ్‌ చేసేప్పుడు నేరుగా పై వైపు కంటే, ఒకింత కిందివైపుకే చూస్తూ వాహనాన్ని నడుపుతుంటాం. కాబట్టి రిఫ్లెక్టెడ్‌ కిరణాలతో ఇలా దుష్ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ. రిఫ్లెక్ట్‌ అయ్యే కిరణాలు సాధారణంగా కిందివైపు నుంచి రిఫ్లెక్ట్‌ అయి కంటికి చేరతాయి కాబట్టి వాటి వల్ల పడే దుష్ప్రభావాలను టోపీ, గొడుగు లాంటి వాటితో ఆపలేం. 

మబ్బుపట్టి ఉన్నా.. వరండాలో ఉన్నా ... 
మబ్బు పట్టి ఉన్నప్పుడు ఈ అల్ట్రా వయొలెట్‌ కిరణాలను మబ్బులు అడ్డుకుంటాయి కాబట్టి వాటి తీవ్రత ఉండదని మనం భావిస్తుంటాం. కానీ... అది వాస్తవం కాదు. మబ్బులు పట్టి ఉన్నా లేదా వరండాలాంటి బయటి గదుల్లో (ఇన్‌–డోర్స్‌లో) ఉన్నప్పటికీ... దాదాపు 3 శాతం అల్ట్రా వయొలెట్‌ కిరణాలు కంటికి చేరే అవకాశం ఉంది. అవి కంటికి హాని చేయవచ్చు. ప్రత్యేకంగా యూవీ–సీ, యూవీ–బీ తరహాకు చెందిన కిరణాల వల్ల మరింత హాని జరిగే అవకాశం ఉంది. ఇక్కడ అదృష్టం ఏమిటంటే... మన కంటిలోపల ఉండే లెన్స్‌ యూవీ–బీ తరహా కిరణాలను చాలావరకు ఫిల్టర్‌ చేస్తుంది. అయితే... కొన్నిసార్లు మాత్రం ఈ యూవీ కిరణాలు రెటీనా వరకు వెళ్లి... సోలార్‌ బర్న్‌ రూపంలో రెటీనాను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంటుంది. 

తాత్కాలిక దుష్ప్రభావాలు
తక్కువ శక్తిమంతమైన యూవీ కిరణాల కారణంగా కంటిపై పడే దుష్ప్రభావాల ఫలితం చాలావరకు తాత్కాలికంగానే ఉంటుంది. ఉదాహరణకు.. కంటి నుంచి నీళ్లు కారడం, కన్ను పొడిబారడం, కళ్ల వాపు, ఎక్కువ కాంతిని చూడాల్సి వస్తే కంటికి ఇబ్బందిగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. ఇలా ఎక్కువ కాంతిని చూడలేకపోవడాన్ని ‘ఫొటోఫోబియా’ అంటారు. 

దీర్ఘకాలిక దుష్ప్రభావాలు
చాలా సందర్భాల్లో యూవీ కిరణాలకు సుదీర్ఘకాలం పాటు ఎక్స్‌పోజ్‌ కావడం కూడా వల్ల అనర్థాలు సంభవిస్తాయి. వీటిని క్రానిక్‌ ‘సైడ్‌ఎఫెక్ట్స్‌’గా పేర్కొంటారు. 

క్రానిక్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌: దీర్ఘకాలం యూవీ కిరణాలకు ఎక్స్‌పోజ్‌ అయితే ఈ కింది అనర్థాలు సంభవిస్తాయి. 

టెరీజియమ్‌: కంటి చివరన ముక్కుకు దగ్గర ఉండే వైపున కంటి లోపలి కండ పింక్‌ రంగులో కనిపిస్తుంటుంది. ఈ కండ క్రమంగా పెరుగుతూ ఒక దశలో నల్లగుడ్డును పూర్తిగా మూసేస్తుంది. దాంతో  చూపు పూర్తిగా తగ్గుతుంది.  ఇలా టెరీజియమ్‌ అనే సమస్య రావడం అన్నది పట్టపగలు తీవ్రమైన కాంతిలో ఆరుబయట పనిచేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక సముద్రప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, కాంతి తీక్షణంగా ఉంటుంది. అందువల్ల సముద్రం అలలపై సర్ఫింగ్‌ చేసేవారిలోనూ టెరీజియమ్‌ తరచుగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘సర్ఫర్స్‌ ఐ’ అని కూడా అంటారు. 

క్యాటరాక్ట్‌: కంటిలో వచ్చే తెల్ల ముత్యం లేదా తెల్లపొరను క్యాటరాక్ట్‌ అంటారన్న విషయం తెలిసిందే. సాధారణంగా వయసు పెరగడం వల్ల వచ్చే ముప్పుగా ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. అయితే వాతావరణంలోని అల్ట్రా వయొలెట్‌ కిరణాలకు అదేపనిగా కన్ను ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల మామూలు కంటే కాటరాక్ట్‌ ముందుగానే వస్తుంది. అన్ని కాటరాక్ట్‌ కేసులను పరిశీలిస్తే... వాటిల్లో 10 శాతం కాటరాక్ట్‌ కేసులు యూవీ కిరణాలకు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల వచ్చేవేనని చాలా అధ్యయనాల్లో తేలింది. 

మాక్యులార్‌ డీజనరేషన్‌: ఒంటిలో ఉన్నట్టే... మెలనిన్‌ అనే నల్లటి రంగునిచ్చే పదార్థం కంటిలోనూ ఉంటుంది. ఇది రెటీనల్‌ పిగ్మెంట్‌ ఎపిథీలియంలో ఉండి కాంతి ప్రసరించినప్పుడు అందులోని యూవీ కిరణాలను వడపోస్తూ కంటికి రక్షణ కల్పిస్తుంది.  ఇది వాతావరణంలో ఉండే అల్ట్రా వయొలెట్‌ కిరణాలను 90 శాతం వరకు వడపోసి, కంటికి రక్షణ ఇస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మెలనిన్‌ పాళ్లు కంటిలో తగ్గుతుంటాయి. దాంతో కంటిలో ఉండే నల్ల గుడ్డుకు గానీ, రెటీనాలో ఉండే ఎపిధీలియంలో గానీ యూవీ కిరణాలను వడపోసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఫలితంగా కంటి చూపుపై ప్రభావం పడే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇలా యూవీ కిరణాలను వడపోసే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల కంటిచూపు క్రమంగా తగ్గవచ్చు. అందుకే దీన్ని ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులార్‌ డీజనరేషన్‌ (ఏఆర్‌ఎమ్‌డీ) అని కూడా అంటారు. 

కంటిపై భాగంలో సంభవించే తీవ్రమైన దుష్ప్రభావాలివి... 
∙    కనురెప్ప క్యాన్సర్‌లు ... కనురెప్పపై యూవీ కిరణాల దుష్ప్రభావాల వల్ల కనిపించే కొన్ని తీవ్రమైన అనర్థాలలో బేసల్‌ సెల్‌ కార్సినోమా, స్క్వామోజ్‌ సెల్‌ కార్సినోమా, మెలనోమా అనే రకం కంటి క్యాన్సర్‌లు ప్రధానమైనవి.  

∙    కంజెంక్టివాకు కలిగే అనర్థాలు: కంటిపై ఉండే పొర అయిన కంజెంక్టివాకు వచ్చే సమస్యను ‘పింగ్వెక్యులా’ అని అంటారు. ఈ తరహా సమస్య వచ్చిన వారిలో కంటిపై ఉండే పొర మందంగా మారి పసుపు రంగును సంతరించుకుంటుంది. కంటిలోని నల్లపొర అంచుల పైకి రెండవైపుల నుంచి ఈ పొర పాకి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని ‘ఎల్లో బంప్‌ ఇన్‌ ఐ’ అని కూడా అంటారు. ఎప్పుడూ కంటిపై యూవీ కిరణాలు ప్రసరిస్తూ ఉండటం వల్ల కన్ను పొడిబారిపోవడం వల్ల కూడా ‘పింగ్వెక్యులా’ రావచ్చు. 

∙    కార్నియాపై: కొందరిలో ఫొటోకెరటైటిస్‌ అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఎలాంటి రక్షణ లేకుండా వెల్డింగ్‌ చేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. మంచుపై స్కీయింగ్‌ చేసే వారిలో సైతం నేరుగా పడే కాంతి కిరణాల వల్ల కార్నియాకు దెబ్బతగిలి కంటి చూపు మందగిస్తుంది. దీన్ని ‘స్నో బ్లైండ్‌నెస్‌’ అంటారు. 

∙    ఐరిస్‌ దెబ్బతినడం వల్ల: కొందరిలో ఐరిస్‌పై దుష్ప్రభావం పడవచ్చు. 

∙    రెటీనా: తీవ్రమైన యూవీ కిరణాలు ప్రసరించడం వల్ల రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. దీన్నే సోలార్‌ బర్న్‌ అంటారు. దీనివల్ల హఠాత్తుగా కనుచూపు తగ్గే ప్రమాదం ఉంది. సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే కలిగే ప్రమాదం కూడా ఇలాంటిదే.  ఈ వేసవిలో కంటికి రక్షణ ఎలాగంటే... 

∙    మంచి మేలైన ప్రమాణాలతో ఉన్న సన్‌ గ్లాసెస్‌ వాడటం ద్వారా తీక్షణ కాంతి దుష్ప్రభావాలనుంచి కంటిని కాపాడుకోవచ్చు. అయితే తక్కువ ప్రమాణాలతో తయారు చేసే సన్‌– గ్లాసెస్‌ వల్ల కన్ను మరింతగా తెరచుకుని చూడటంతో కంటిలోకి హానికరమైన యూవీ కిరణాలు మరింతగా ప్రవేశించవచ్చు. అందుకే మంచి ప్రమాణాలతో... అంటే పాలీకార్బనేట్, ట్రైవిక్స్‌ వంటి మెటీరియల్‌తో తయారైన సన్‌గ్లాసెస్‌ వాడాలి. 

∙    100 శాతం లేదా 400 యూవీ పొటెక్షన్‌ (ఇవి 400 మైక్రాన్స్‌ వరకు వడపోస్తాయి) ఇచ్చే లేబుల్డ్‌ గ్లాసెస్‌ కూడా వాడవచ్చు. 

∙    ఫ్రేమ్‌ అంచులు పెద్దవిగా ఉండే గ్లాసెస్‌ వాడటం వల్ల కంటి మూలల నుంచి కూడా యూవీ కిరణాలు లోపలికి ప్రసరించకుండా ఉంటాయి. అందుకే ఫ్యాషన్‌ పేరిట ఫ్రేమ్‌ తక్కువగా ఉండే వాటికంటే... ఒకింత ఫ్రేమ్‌ ఎక్కువగా ఉండే గ్లాసెస్‌ మరింత మేలు చేస్తాయి. 

∙    కొందరు ఏ రంగు గ్లాసెస్‌ అయితే మేలు అని ప్రశ్నిస్తుంటారు. ఏ రంగు అన్నదానికి అంతగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే... ఏ రంగు అయినా అది పూర్తిగా రక్షణ ఇచ్చేలా ఉండాలి. 

∙    పోలరైజ్‌డ్‌ సన్‌గ్లాసెస్‌ అంత సురక్షితమైనవి కావు. ఎందుకంటే... అవి కేవలం ఒక కోణంలోంచి (భూమికి సమాంతరంగా) వచ్చే కాంతి కిరణాల నుంచి మాత్రమే రక్షణ ఇస్తాయి. 

∙    కాటరాక్ట్‌ సర్జరీ చేయించుకున్న వాళ్లు యూవీ ప్రొటెక్షన్‌ ఉన్న ఇంట్రా ఆక్యులార్‌ లెన్స్‌ (ఐఓఎల్స్‌)ను ఎంచుకోవాలి. 

∙    కంటిపైన కాంతి నేరుగా పడకుండా అంచులు (బ్రిమ్‌) పెద్దవిగా ఉండే టోపీలు (హ్యాట్‌) ధరించడం మేలు. 

∙    ఫొటో కెరటైటిస్‌ వంటి కండిషన్‌ ఉన్నవారు కాంటాక్ట్‌ లెన్స్‌లను వాడటం ఎంతమాత్రమూ సరికాదు. ఎందుకంటే అవి వాతావరణంలోని తీక్షణ కాంతితో పాటు యూవీ కిరణాలను 50 శాతం వరకు కంటిలోకి ప్రసరింపజేస్తాయి.  

∙    ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యుడిని నేరుగా చూడకూడదు. మధ్యాహ్నం వేళల్లో వీలైనంతవరకు బయటకు వెళ్లకూడదు. ∙కంటిని ఎప్పటికప్పుడు చల్లని, శుభ్రమైన నీటితో కడుక్కోవడం మంచిది.  

∙    తరచూ కంటిపరీక్షలు చేయించుకోవడం. వేసవిలో కనీసం ఒకసారైనా కంటిపరీక్షలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా మధ్యవయసు దాటిన వారికి ఇది చాలా అవసరం. ∙నాసిరకం కళ్లజోళ్లలో అల్ట్రా వయొలెట్‌ కిరణాలను ఫిల్టర్‌ చేసే సామర్థ్యం ఉండకపోవచ్చు. అందుకే సమర్థంగా అల్ట్రా వయొలెట్‌ కిరణాలను వడపోసే నాణ్యమైన గ్లాసులు వాడటం మంచిది. ∙వాహనాలపై ప్రయాణం చేసేవారికి తీవ్రమైన కాంతితో పాటు, గాలిలో ఎగిరి వచ్చే ఫ్లైయింగ్‌ అబ్జెక్ట్స్‌ కారణంగా కూడా కంటికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందుకే రాత్రి వేళల్లోనూ కంటికి రక్షణ ఇచ్చే గ్లాసులు ధరించడం మంచిది. ∙ఇటీవల రకరకాల రంగుల అద్దాలు ఉన్న గ్లాసెస్‌ను ధరిస్తున్నారు. బ్లూ కలర్‌ ఉన్న గ్లాసులు అన్నిటికంటే చాలా ప్రమాదం. సాధ్యమైనంత రంగు అద్దాల కంటే వరకు డార్క్‌షేడ్‌లో నల్లటివే వాడటం మంచిది. ∙స్విమ్మింగ్‌పూల్‌లో ఈదేటప్పుడు తప్పక గాగుల్స్‌ వాడాలి. దీనివల్ల రెండు రకాలుగా రక్షణ దొరుకుతుంది. ఒకటి యూవీ కిరణాల నుంచి; మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లోని కెమికల్స్‌ నుంచి. ∙చెమటతో నీళ్లు కళ్ల మీదికి జారినప్పుడు కళ్లను నలపకూడదు.  ∙కళ్లు పొడిబారకుండా...  డాక్టర్‌ సలహా మేరకు ఆర్టిఫిషియల్‌ టియర్స్, లూబ్రికెంట్స్‌ వాడటం మంచిది. 

∙    యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండే మంచి పోషకాహారం తీసుకోవడం అన్నది అన్ని సీజన్‌లతో పాటు ఈ వేసవిలో మరీ ఎక్కువ అవసరం. విటమిన్‌–ఏ ఎక్కువగా ఉండే తాజాపండ్లు, కూరగాయలు ఒంటితో పాటు కంటికీ మేలు చేస్తాయి.

∙    కంటినిండా నిద్రపోవాలి. 

∙    పొగతాగకూడదు. 

∙    అవసరమైనప్పుడు గదిలో తేమశాతాన్ని పెంచే హ్యుమిడిఫైయర్స్‌ వాడుకోవచ్చు. 

పిల్లల్లో  ముప్పు మరీ ఎక్కువ...
సాధారణంగా కాంతి మన కంటిలోకి కాంతి ప్రవేశించగానే మన ఐరిస్‌/ప్యూపిల్‌ (కంటిపాప) కాస్తంత ముడుచుకుపోతుంది. కాంతి తీవ్రతను బట్టి కంటికి రక్షణ కలిగించడం కోసం ప్రకృతి మనలో ఇలాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది. అందుకే తీవ్రమైన కాంతిలోకి వచ్చినప్పుడు మనం కనురెప్పలను కాస్త మూసి, చికిలించి చూస్తుంటాం. బయటి కాంతికి మన కన్ను అడ్జెస్ట్‌ అయ్యేవరకు ఇలా జరగడం మనందరికీ అనుభవమే. అలాగే బయటి నుంచి కాంతి తక్కువ ఉండే ప్రదేశానికి వెళ్లినప్పుడు కూడా కాసేపు మనకు కనపబడదు. మనం ఆ కాంతికి అడ్జెస్ట్‌ అయ్యాక మనకు చిరుచీకట్లోనూ కనిపిస్తుంది. దీనికి కారణం...  కంటిపాప విశాలంగా విప్పారడమే. అయితే చిన్నపిల్లల్లో కంటి పాప సైజ్‌ ఎక్కువ. పైగా లెన్స్‌ ట్రాన్స్‌పరెంట్‌గానూ, క్లియర్‌గానూ ఉంటుంది. పైగా చిన్నపిల్లలు ఆరుబయట ఎండల్లో ఎక్కువగా ఆడుతుంటారు. అందుకే పిల్లల్లో కంటిపై పడే దుష్ప్రభావాలు ఎక్కువ. 

ఇంకా ఎవరెవరిలో... 
∙    కాటరాక్ట్‌ సర్జరీ చేసుకొని, యూవీ ప్రొటెక్షన్‌ లేని ‘ఇంట్రా ఆక్యులార్‌ లెన్స్‌’ వాడిన వారిలో ఈ యూవీ కిరణాల వల్ల దుష్ప్రభావాలు ఎక్కువ. 
∙    యూవీ ప్రొటెక్షన్‌ లేని కాంటక్ట్‌ లెన్స్‌ వాడేవారిలోనూ దుష్ప్రభావాలు ఎక్కువ;
∙    టెట్రాసైక్లిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ వాడేవారు, గర్భనిరోధక మాత్రలు వాడే మహిళల్లో, యాంటీ మలేరియా మందులు వాడే వారితోపాటు, ఇబూప్రొఫేన్‌ వంటి నొప్పి నివారణ మందులు వాడే వారిలో యూవీ ప్రభావం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎక్కువ. 

మరీ ఎక్కువ ప్రమాదం జరిగే  అవకాశాలు ఎప్పుడంటే... 
∙కొందరు తమ వృత్తిరీత్యా చాలా ఎక్కువ కాంతికి ఎక్స్‌పోజ్‌ అవుతుంటారు. వారు సాధారణం కంటే చాలా ఎక్కువ కాంతిలో పనిచేస్తుంటారు. ఉదాహరణకు డ్రైవర్లు చాలా తీవ్రమైన కాంతిని అదేపనిగా చూడాల్సి వస్తుంది. అలాగే వేసవిలో పట్టపగలు తీవ్రమైన కాంతిలో తిరిగే సేల్స్‌ రిప్రజెంటేటివ్స్, నిర్మాణరంగంలోని పనివారు, రైతులు, కూలీలు వంటివారు చాలా ఎక్కువ కాంతికి ఎక్స్‌పోజ్‌ అవుతుంటారు. పైన పేర్కొన్న అనర్థాలు వీళ్లలో చాలా ఎక్కువ.  
∙ఇక అత్యంత ఎక్కువ కాంతిని రిఫ్లెక్ట్‌ చేసే నీటి ఉపరితలానికి దగ్గరగా ఉండే... నదీప్రాంతాలు, సముద్రజలాల ఒడ్డులు (బీచ్‌ల) వంటి చోట్ల తిరుగాడేవారికి; 
∙కాంతి తీక్షణత ఎక్కువగా ఉండే ప్రాంతాలైన భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల వారికీ;  
∙అలాగే చాలా ఎల్తైన పర్వతసానువుల్లాంటి (హిల్లీ ఏరియాస్‌) ప్రదేశాల్లో ఉండేవారికీ;   
∙    తెల్లని దేహఛాయతో ఒంట్లో, కంట్లో మెలనిన్‌ తక్కువగా ఉండే వారికి, చిన్నపిల్లల్లో... కాంతికారణంగా కంటిపై దుష్ప్రభావాలు పడే అవకాశం ఎక్కువ. 
డాక్టర్‌ రవికుమార్‌ రెడ్డి
కంటి వైద్య నిపుణులు,మెడివిజన్‌ ఐ హాస్పిటల్,హైదరాబాద్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement