
అప్పట్లోనే ఓటుకు నోటు
ఇటీవలి రాజకీయాల్లో ఓటుకు నోటు వ్యవహారాలు షరా మామూలే అయినా, నోట్లు వెదజల్లి ఓట్లు కొనుగోలు చేయడం రెండు శతాబ్దాల కిందటే ఉండేది.
ఇటీవలి రాజకీయాల్లో ఓటుకు నోటు వ్యవహారాలు షరా మామూలే అయినా, నోట్లు వెదజల్లి ఓట్లు కొనుగోలు చేయడం రెండు శతాబ్దాల కిందటే ఉండేది. జాన్ మేటన్ అనే బ్రిటిష్ పెద్దమనిషి ఈ పద్ధతికి ఆద్యుడు. ఘనమైన రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబంలో జన్మించిన మేటన్ దొరగారికి లెక్కలేనంత తిక్క ఉండేది. ఈయనగారి తలతిక్క కారణంగానే జనాలు ఈయనను ‘మ్యాడ్ జాక్’ అని ముద్దుగా పిలుచుకునేవారు. పెద్దల ప్రోద్బలంతో, కుటుంబ రాజకీయ వారసత్వ పరంపర కొనసాగించే సదుద్దేశంతో మేటన్ దొరగారు 1819లో నార్త్ ష్రాప్‌షైర్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో టోరీ పార్టీ తరఫున పోటీ చేశారు.
ప్రచార సభల్లో ప్రసంగాలు, ప్రజలకు వాగ్దానాలు చేయడం వంటి చిల్లర వ్యవహారాలన్నీ నచ్చని మేటన్ దొరగారు ఓటర్లందరికీ పది పౌండ్ల నోట్లు ధారాళంగా పంచిపెట్టాడు. నోట్లు పుచ్చుకున్న ఓటర్లందరూ కృతజ్ఞతతో ఆయనగారికి ఓట్లు గుద్దేశారు. ఆ విధంగా ఆయనగారు బ్రిటిష్ పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లోకి అడుగుపెట్టారు. ‘అనుభవించు రాజా...’ అనే రీతిలో మందు విందు చిందుల్లో ఓలలాడే మేటన్ దొరగారికి పార్లమెంటు బొత్తిగా నచ్చలేదు.
సభలో ఆయన గడిపింది కేవలం అరగంట మాత్రమే. ఆ తర్వాత ఎన్నడూ ఆయన సభలో అడుగుపెట్టిన పాపాన పోలేదు. అయితే, ఆయన మొదలుపెట్టిన ‘ఓటుకు నోటు’ పద్ధతిని మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులు అందిపుచ్చుకున్నారు. ఈ పద్ధతిని చట్టాలు ఒప్పుకోకున్నా, ఇప్పటికీ దీనిని ఎవరి శైలిలో వాళ్లు కొనసాగిస్తూ ఆ విధంగా ముందుకు పోతున్నారు.
- పన్యాల జగన్నాథ దాసు