ప్రేమ... పిచ్చి | singer madhupriya love story | Sakshi
Sakshi News home page

ప్రేమ... పిచ్చి

Published Tue, Mar 15 2016 10:45 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

భర్త శ్రీకాంత్‌తో  గాయని మధుప్రియ

భర్త శ్రీకాంత్‌తో గాయని మధుప్రియ

పిచ్చి పిచ్చిగా ప్రేమించుకున్నారు. గోడలు దూకారు.  బుర్రలు పగలగొట్టుకున్నారు.   మళ్లీ గోడలు దూకి కలుసుకున్నారు!
డర్టీఫెలో, బ్యాడ్ బాయ్ కాస్తా... లవ్లీఫెలో, గుడ్ బాయ్ అయిపోయాడు.

ఊళ్లో ఉన్న సినిమా డైరెక్టర్లు, రైటర్లు  స్టోరీ నాదంటే నాదని జుట్లు పట్టుకుంటున్నారు.
ఇప్పటికే రైటర్స్ అసోసియేషన్‌లోనాలుగు కథలు నమోదయ్యాయట!

టీవీలు, పేపర్లు పండగ చేసుకున్నాయి.
ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్లు, వాట్సాప్‌లు ‘తీన్మార్’ కొట్టాయి. వీక్షకులు పాప్‌కార్న్ తిన్నారు.

అందరూ హ్యాపీస్. ఎందుకంటే లవ్‌స్టోరీకి కూడా  హ్యాపీ ఎండింగ్ వచ్చింది. మరి ట్రాజెడీ ఎక్కడుంది?
వీళ్లని కన్న అమ్మానాన్నల్లో, జాగ్రత్తగా ఉండకపోతే రేపు మనలో కూడా!!

 
మూడు రోజుల కుటుంబ గొడవల అనంతరం మంగళవారం నాడు మెహిదీపట్నంలోని తమ ఇంటికి వచ్చేశారు గాయని మధుప్రియ, ఆమె భర్త శ్రీకాంత్. ఈ గొడవంతటికీ... ‘మమ్మల్ని విడదీయడానికి జరిగిన కుట్రే’ కారణం అన్నారు.. మధుప్రియను పిచ్చిదాన్ని చేసి ఆమె తల్లిదండ్రులు ఇలా అందరి ముందు నిలబెట్టారని శ్రీకాంత్ అంటే, ‘అవును’ అంటూ మధుప్రియ తన భర్తను సమర్థించింది. పెద్దలను ఎదిరించి ఆర్నెల్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట.. తృటిలో విడిపోబోయి, తిరిగి కలుసుకున్న సందర్భంలో సాక్షి ‘ఫ్యామిలీ’ వీరిని ప్రత్యేకంగా పలకరించింది.

హాయ్ మధుప్రియ, శ్రీకాంత్.. ఎలా ఉన్నారు?

ఇద్దరూ: ఇలా ఉన్నాం... (నీరసంగా నవ్వుతూ).
శ్రీకాంత్: ఇలా జరిగింది.. అనగానే వెనకా ముందు చూడకుండా వందమంది వచ్చి (మీడియా) వంద రకాలుగా రాసుకుని వెళ్లారు. తను (మధుప్రియ) నా దగ్గరకొచ్చాక ఒక్కరూ రాలేదు. సోషల్ మీడియాలో ఎన్నో రాస్తున్నారు... మధుప్రియ అప్పుడు పేరెంట్స్‌ను మోసం చేసింది. ఇప్పుడు భర్తను మోసం చేసింది... అని పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటివి చూస్తే చాలా బాధ కలుగుతుంది. పెళ్లికి ముందు కూడా రెండు నెలలు తను వాళ్ల పేరెంట్స్ కాళ్లా వేళ్లా పడింది. బతిమాలింది. తన్నులు తిన్నది. అయినా వాళ్లు వినలేదు. మమ్మల్ని వాళ్లు ఇక కలవనివ్వరు అనే ఆలోచన వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకున్నాం. ఒక్కటి ఆలోచించండి.. తను నన్ను మోసం చేసి ఉంటే ఈ రోజు గోడ దూకి నా కోసం రాదు కదా!

మధుప్రియ: చెప్పులు కూడా లేకుండా తన కోసం వచ్చేశాను. తనంటే నాకు అంత పిచ్చి ప్రేమ.
     
ఇంత గొడవకు అసలు కారణం ఏంటి?

మధుప్రియ: ఏం జరిగినా ఓపెన్‌గా చెప్పుకునేది శ్రీకాంత్‌తోనే. ‘వాళ్లకు’ (మధుప్రియ పేరెంట్స్) ఏం చెప్పలేదు.. వాళ్లే మాట్లాడారు. వాళ్లే నా మెడలో చైన్లు తీసుకున్నారు.. వాళ్లే పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. అది చెప్పు.. ఇది చెప్పు.. అని నన్ను ఫోర్స్ చే స్తే ఏం చేస్తాను..?
శ్రీకాంత్: ఆ రోజు మాఫ్రెండ్ వాళ్ల ఇంట్లో టెర్రస్ పైన మాట్లాడుతూ ఉన్నాను. నాకు ఇంకో ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది.. టీవీ చూడు అని. చూస్తే షాక్.. ఒక్కసారి తన (మధుప్రియ)తో మాట్లాడించండి.. అంటే ఎవరూ మాట్లాడించలేదు! అసలేమైందంటే... మధుప్రియ నెలన్నరగా రామంతపూర్‌లో ఉన్న వాళ్లింటికి వెళ్లి వస్తోంది. పుట్టి పెరిగిన వారి మధ్య నుంచి వచ్చాక తిరిగి వారిని చూడాలనుకుంటుంది కదా! తను బాధపడకుండా ఉండాలనే నేనే తీసుకెళ్లి తీసుకువస్తూ ఉండేవాడ్ని. కానీ, బయటే ఉండేవాణ్ణి.

మధుప్రియ: ‘ఏదో చిన్న గొడవ’ అని చెప్పా... అయినా భార్యాభర్తలన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు రాకుండా ఉంటాయా. ఎంత పెద్ద వాళ్ల మధ్య అయినా వస్తాయి కదా! మా మధ్య అలాంటివి కూడా లేదు. చాలా చిన్న చిన్నవి... ఎవరికీ చెప్పుకునేటంతవి అసలు కానే కావు.

శ్రీకాంత్: వాళ్లమ్మ, ఇంకొంతమంది కలసి అప్పటికప్పుడు మధుప్రియను వెంటబెట్టుకెళ్లి పోలీసుకేసు పెట్టించారు. తనకు ఇష్టం లేకపోయినా ఆమె చేత ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పించారు. పోలీసులు అడుగుతారు కదా! కారణం. కట్నం అని, కొట్టాడని.. ఇలా తలా ఒకటి చెప్పారు...

మధుప్రియ: సాక్ష్యాలు చూపించాలి కదా! అందుకే నా మెళ్లో చైన్లు లాగేసుకున్నారు.. కొట్టారన్నారు... నా బుర్ర పనిచేయడం మానేసింది. ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదు. కౌన్సెలింగ్ అయిపోయాక తన (శ్రీకాంత్)తో వెళ్లిపోతాను అన్నాను. వెంటనే ‘ఇక మా లైఫ్ అంతే, నీ లైఫ్ కూడా అంతే! ఇప్పుడు నువ్వెళితే నీకే సమస్య... ఇంత జరిగింది.. ఇక మేం చచ్చిపోవాల్సిందే! .. ఇలా తల్లిదండ్రులు బెదిరిస్తే ఏం చేస్తాను?

శ్రీకాంత్: తన సొంత మైండ్‌తో ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా ‘ఇలా చేయకపోతే ఉరేసుకుంటాం.. వెళ్లట్లేదని చెప్పు. వెళ్లనని చెప్పు..’ అంటే తను ఏం చేస్తుంది..?
 
మధుప్రియ: ఆన్ ది స్పాట్ డైవోర్స్ కావాలి అని కూర్చున్నారు వాళ్లు (పేరెంట్స్). పెళ్లయ్యాక ‘వైఫ్ ఆఫ్ శ్రీకాంత్ అని అంటారు కానీ, డాటరాఫ్ .. అనరు కదా’ అని చెబితే.. అయినా సరే..  డైవోర్స్ తీసుకోవాల్సిందే అని బలవంత పెట్టారు. ఇంత ప్రపంచంలో తిరిగారు. నన్ను ఇంత తిప్పారు. వాళ్లకు ఆ మాత్రం తెలియదా.. డైవోర్స్ అంత ఈజీగా రావు అని. ఏదైనా సరే, ఈ రోజుకు ఫినిష్ కావాలి అని సిచ్యుయేషన్‌ని ఇంత పెద్దగా చేశారు.
 
మిమ్మల్ని విడదీయాలని వారు (మధుప్రియ పేరెంట్స్) ఎందుకు అనుకుంటారు?
శ్రీకాంత్: నేనంటే వాళ్లకు ఇష్టం లేదు. అందుకే, నా నుంచి తనను దూరం చేయాలి. నా నుంచి డైవర్ట్ చేస్తే... ఇంక తనకు మేమే ఆధారం. అప్పుడు వీడిని ఏమైనా చేయవచ్చు అని వారి పక్కా ప్లాన్. కౌన్సెలింగ్ తర్వాత నేనా రాత్రి మధుప్రియ వాళ్ల ఇంటికి వెళ్లాను. బండి దిగగానే .. వీళ్ల అమ్మ పై నుంచి కర్రలు పడేసింది. అక్కడున్న పదిమంది నన్ను కొట్టడం స్టార్ట్ చేశారు. నాకేం అర్థం కాలేదు. తను (మధుప్రియ) చూసి.. పరిగెత్తుకు వచ్చింది. అందరూ పట్టుకొని మధుప్రియను ఇంట్లోకి లాక్కెళ్లిపోయారు. ఆ రోజు ఎవరో పిల్లాడు వస్తే.. నేననుకొని.. ఆ అబ్బాయిని చావగొట్టారు. ముందు ప్లాన్ అని నాకూ తెలియదు. తెలిస్తే ఇంత దూరం రానిచ్చేవాడినే కాదు. ఎప్పుడైనా కలిసిపోవాల్సిందే! అనుకున్నాను. కానీ, ఇప్పుడు పక్కాగా చెబుతున్నాను. నన్ను మర్డర్ చేయడానికే ప్లాన్ చేశారు.

మీ తల్లిదండ్రులు(శ్రీకాంత్) ఈ విషయంలో ఎలా స్పందించారు? మధుప్రియ తల్లితండ్రులతో మాట్లాడాలని వాళ్లు అనుకోలేదా?
శ్రీకాంత్: మమ్మల్ని ఇలా చూసి తట్టుకోలేకపోయారు.. ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. మధుప్రియ గురించి మా వాళ్లకు బాగా తెలుసు. తన పేరెంట్స్‌తో ఎవరూ మాట్లాడలేరు. వారి టార్గెట్ నేను. అంతే!

మధుప్రియ అప్పుడు అమ్మవాళ్లు చెబితే అలా ప్రవర్తించింది. ఇప్పుడు మీరు చెబితే ఇలా...
మధుప్రియ: ఎవరేది చెబితే అది వినేంత పిచ్చిదాన్నికాదు. నాకంటూ సొంత అభిప్రాయం ఉంది. అందుకే నాకై నేనుగా ఇలా వచ్చేశాను. నాతో ఆ రోజు ఫోర్స్‌గా చేయించిన పని అది. ఇప్పుడు శ్రీకాంత్ దగ్గరకు వచ్చింది అతని మీద ఉన్న పిచ్చి ప్రేమకొద్ది.
 
ఆర్థికంగా మధుప్రియ మీదే ఆధారపడ్డారని..  అందుకే గొడవలని టాక్..
మధుప్రియ: అసలా టాక్‌ను క్రియేట్ చేసింది కూడా వాళ్లే.

శ్రీకాంత్: పెళ్లికి ముందు ఎలా ఉందో తను ఇప్పుడూ అలాగే ఉంది. ప్రోగ్రామ్స్ చేసుకుంటుంది. నేను సేల్స్‌మ్యాన్‌గా చేస్తున్నాను. నాకు వచ్చే ఆదాయం మాకు సరిపోతుంది. ఎనిమిది వేలు రెంట్. మరో ఎనిమిదివేలు ఖర్చు. అంతదానికి ఇంకా అదనంగా ఏముంటుంది? పట్టుకెళ్లి పోలీసుస్టేషన్‌లో కూర్చోబెట్టారు. కేసు ఎందుకు పెడుతున్నావంటే.. ఏదో ఒకటి చెప్పాలి. అది స్ట్రాంగ్ అవడానికి ఇవన్నీ చెప్పాలి. అందుకే డబ్బుల గురించి మధుప్రియను కొట్టానన్నారు. కొడితే తన వంటి మీద గాయాలు ఏమైనా ఉన్నాయా.. చూడండి. బొమ్మలా చేసి ఆడుకున్నారండీ... ఇంట్లో పెట్టి తాళాలు వేస్తే తనేం చేస్తుంది. వారికి వస్తేనేమో అది కష్టం. వేరే వాళ్లకొస్తే అది ఎంటర్‌టైన్‌మెంట్..
 
ఈ ఇష్యూ తర్వాత మీకేం అర్థమైంది?
శ్రీకాంత్: ఇంకెప్పుడూ తనను (మధుప్రియ)వాళ్లింటికి పంపకూడదు అని! ఈ ఐదారు నెలల్ల్లో ఒక్కరోజు కూడా తనను వదిలి ఉండలేదు. అలాంటిది ఈ మూడు రోజులు నరకం అనుభవించాం. ఏం జరిగినా.. నా జీవితం తనతోనే. మేం కలిసే బతుకుతాం. మమ్మల్నెవరూ విడదీయలేరు.
 
మధుప్రియ: నా జీవితం శ్రీకాంత్‌తోనే. ఇంక ఇలాంటి సమస్యలు ఎప్పుడూ ఎప్పుడూ రావు. రానివ్వను. (కచ్చితంగా)
 
మధుప్రియ గురించి...
మధుప్రియ ఐదోతరగతి చదువుతున్నప్పుడే ‘ఆడపిల్లనమ్మా.. ’ అనే పాట ద్వారా గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది. ఎక్కడా సంగీతం నేర్చుకోకపోయినా తెలుగు రాష్ట్రాలలో తన గళం ద్వారా ప్రజలకు బాగా చేరువైంది. కరీంనగర్‌కు చెందిన మధుప్రియ ప్రేమ విషయం వివాదాస్పదమైంది. ఇప్పుడు పెళ్లి కూడా వివాదాస్పదమైంది.
 
శ్రీకాంత్ గురించి...
ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కి చెందిన శ్రీకాంత్ హైదరాబాద్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో చిరుద్యోగి.మధుప్రియ భవిష్యత్తును దెబ్బతీసేందుకే మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపణ..మధుప్రియ తల్లిదండ్రులు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీకాంత్ ఆరోపణ.
 
- నిర్మలారెడ్డి

ఫొటో: శివ మల్లాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement