Madhupriya
-
18 ఏళ్ల తర్వాత 'సంక్రాంతి' కోసం సాంగ్ పాడిన రమణగోగుల
టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ ఈసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఈ పాటను ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 2025 సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. -
ఈమె మా అమ్మ
మధుప్రియ పేదింటి అమ్మాయి. కష్టపడి చదివింది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడిక ప్రమోషన్ కూడా వచ్చింది. ప్రియ తల్లి కూరగాయలు అమ్ముతుంటుందని చుట్టుపక్కల అందరికీ తెలుసు. అయితే ప్రియకు తన తల్లి గురించి ఈమధ్యే .. అదీ నాన్న చెబితే.. ఒక నిజం తెలిసింది. అంత నిజం తెలిశాక మధుప్రియ ఊరుకుంటుందా? ‘చూడండి ఈ తల్లి కూతుర్నే నేను..’ అని లోకానికి చెప్పడం కోసమే అన్నట్లు.. వెళ్లి అమ్మ పక్కన కూర్చుని తక్కెడ పట్టుకుంది. ఇంతకీ ప్రియకు తెలిసిన నిజం ఏమిటి? మధుప్రియకు పెద్ద ప్రమోషనే వచ్చింది. గత రెండేళ్లుగా చెన్నైలోని ఎఫ్.పి.ఎస్. ఇన్నొవేషన్స్ ల్యాబ్‌లో సీనియర్ హ్యూమన్ రిసోర్స్ అసోసియేట్‌గా పని చేస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు అదే కంపెనీకి అసోసియేట్ మేనేజర్ అయింది. యూఎస్ కంపెనీ అది. పెద్ద జీతం. ఇక ప్రమోషన్ అంటే ఇంకా పెద్ద జీతం. మధుప్రియ ఇంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆడపిల్లలెవరూ లేరు. తనే మొదటి అమ్మాయి. డిగ్రీ చదువుతుండగానే క్యాపస్ ప్లేస్‌మెంట్స్‌లో సెలక్ట్ అయింది. ఎఫ్.పి.ఎస్. (ఫుల్ పొటెన్షియల్ సొల్యూషన్స్) లోనే. సాఫ్ట్వేర్ కంపెనీ అది. అయితే ఇప్పుడొచ్చిన ప్రమోషన్ కన్నా పెద్ద ప్రమోషన్ ఆమె జీవితంలో మరొకటి ఉంది. ‘‘ఈమె మా అమ్మ’’ అని గర్వంగా చెప్పుకోవడమే ఆమె తనకు తను ఇచ్చుకున్న ప్రమోషన్. ప్రియ తల్లి కూరగాయలు అమ్ముతుంది. తండ్రికి చిన్న ఉద్యోగం. వాళ్లిద్దరి రోజువారి సంపాదనను బట్టి చూస్తే ప్రియ పేదింటి అమ్మాయే. కష్టపడి చదివింది. మంచి ఉద్యోగం సంపాదించింది. ఇందులో విశేషం ఏమీ లేదు. ‘‘ఇప్పుడు నేను సాధించిన ప్రమోషన్లో కూడా విశేషం లేదు’’ అంటోంది ప్రియ! అలా ఆమె అనడానికి ఓ కారణం ఉంది. ఆ కారణం కూడా తండ్రి చెబితేనే ఆమెకు తెలిసింది. చిన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్‌కి తండ్రి వెళ్లేవాడు. తల్లి ఆలస్యంగా వెళ్లేది! ఆలస్యంగా అంటే.. మీటింగ్ అయిపోయాక. ఎప్పుడూ అంతే. ‘‘ఎందుకమ్మా ఆలస్యంగా వస్తావ్’’ అని ప్రియ అడిగేది. ‘‘ఇప్పటికి పనైందమ్మా’’అని తల్లి చెప్పేది. అయితే.. తన బిడ్డ కూరగాయలమ్మే ఆమె కూతురు అని తక్కిన పిల్లలకు తెలియకుండా ఉండటం కోసం ఆమె కావాలని ఆలస్యంగా చేసేదని తండ్రి చెప్పినప్పుడు ప్రియ కళ్ల వెంబడి నీళ్లు తిరగాయి. వెళ్లి తల్లిని కావలించుకుంది. అక్కడితో ఆగలేదు. ‘ఈమె మా అమ్మ’ అని చెప్పాడానికే అన్నట్లు.. వెళ్లి అమ్మ పక్కన కూర్చొని తక్కెడ పట్టుకుంది. ప్రమోషన్ వచ్చి ఇప్పుడు పెద్ద మేనేజర్ అయినా కూడా అమ్మతో కలిసి కాసేపైనా కూరగాయలు అమ్ముతుంది! ఈ అమ్మ కూతుర్నని చెప్పుకోవడాన్ని మించిన ప్రమోషన్ ఏముంటుంది అని నవ్వుతుంది. ‘‘ఈ ప్రమోషన్ మా అమ్మకే అంకితం’’ అంటోంది. ∙ -
మూడు రోజుల కస్టడీకి నూతన్ నాయుడు
సాక్షి, విశాఖ : మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరిట పలువురికి ఫోన్ చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత, బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడుని విశాఖ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అతడిని మరింత లోతుగా విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని విశాఖ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శని, ఆది, సోమవారాల్లో విచారించదానికి న్యాయమూర్తి పోలీసులకు అనుమతి ఇచ్చారు. దీంతో పోలీసులు ఇవాళ ఉదయం విశాఖ సెంట్రల్ జైలు నుంచి పెందుర్తి తీసుకు వచ్చి నూతన్ నాయుడిని విచారిస్తున్నారు. దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. (విశాఖ సెంట్రల్ జైల్‌కు నూతన్ నాయుడు) -
శిరోముండనం కేసు: ఏడుగురు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: దళిత యువకుడు శిరోముండనం కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ సిటీ పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఘటన జరిగిన నూతన్ నాయుడు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిలో నూతన్ నాయుడు భార్య మధు ప్రియను ఏ-1గా గుర్తించారు. మధు ప్రియ ఇంట్లో పని చేసే వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా యువకుడు శ్రీకాంత్‌పై దాడి జరిగిన తీరును పోలీసులు గుర్తించారు. ఇందులో నూతన్ నాయుడు భార్య మధు ప్రియ చూస్తుండగా ఇంట్లో సహాయకులు ఇందిర తదితరులు అత్యంత క్రూరంగా శ్రీకాంత్‌కు శిరోముండనం(గుండు గీయించారు)చేశారు. ఐఫోన్ చోరీ నెపంతో దళిత యువకుడిని పిలిచి శిరోముండనం చేశారని సీపీ మనీష్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. శ్రీకాంత్‌పై దాడి, గుండు చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయని చెప్పారు. శిరోముండనం కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఫోన్ విషయంతో పాటు ఇతర కారణాలపై కూడా లోతుగా విచారణ సాగిస్తామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నూతన్ నాయుడు ప్రమేయం పైన ఆరా తీస్తున్నామని తెలిపారు. బాధితుడిని కర్రలు, రాడ్లతో కొట్టినట్లు వీడియోలో ఉందని సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. చదవండి: సీసీ టీవీ ఫుటేజ్‌లో గుండు చేసిన దృశ్యాలు చదవండి: నూతన్ నాయుడు భార్యపై కేసు నమోదు చదవండి: దళిత యువకుడికి శిరోముండనం -
కొత్త కొత్తగా...
సుజియ్, మధుప్రియ, నాగేంద్ర సి.హెచ్, వెంకట్ ప్రధాన తారలుగా ఓ చిత్రం ప్రారంభమైంది. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా.పర్వతరెడ్డి, నవీన్ కుమార్‌రెడ్డి, సనారెడ్డి, జనార్ధన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలుగు ఫిలించాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సాయివెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు భానుచందర్ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇటీవల వస్తున్న సినిమాలకు భిన్నంగా కొత్త కథతో మా సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. లక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజు, నిర్మాత శేఖర్‌రెడ్డి, డైరెక్టర్ బి. వేణు, హైకోర్టు న్యాయవాది లక్ష్మీపతి, శ్రీనివాస్‌గౌడ్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిట్టు, సంగీతం: ఉదయ్‌కిరణ్. -
వీళ్లు మంచి కిడ్నాపర్లు
అభిషేక్ కన్నెలూరు, మధుప్రియ, ప్రజ్వల్, మమతాశ్రీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘శీను వేణు’. ‘వీళ్లు మంచి కిడ్నాపర్లు’ అన్నది ఉపశీర్షిక. రవి ములకలపల్లి స్వీయ దర్శకత్వంలో వసుంధర క్రియేషన్స్ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్స్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత సానా యాదిరెడ్డి క్లాప్ ఇచ్చారు. నిర్మాత ముత్యాల రాందాస్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు ప్రేమ్‌రాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శక–నిర్మాత రవి మాట్లాడుతూ– ‘‘కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇద్దరు పల్లెటూరి అమ్మాయిలను ముంబై గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుం ది. వాళ్లు ఆ గ్యాంగ్ నుంచి ఎలా తప్పించుకున్నారన్న కథకు వినోదం జోడించి తీస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి. ఆర్యన్ (ఏడుకొండలు). -
ప్రేమ... పిచ్చి
పిచ్చి పిచ్చిగా ప్రేమించుకున్నారు. గోడలు దూకారు. బుర్రలు పగలగొట్టుకున్నారు. మళ్లీ గోడలు దూకి కలుసుకున్నారు! డర్టీఫెలో, బ్యాడ్ బాయ్ కాస్తా... లవ్లీఫెలో, గుడ్ బాయ్ అయిపోయాడు. ఊళ్లో ఉన్న సినిమా డైరెక్టర్లు, రైటర్లు స్టోరీ నాదంటే నాదని జుట్లు పట్టుకుంటున్నారు. ఇప్పటికే రైటర్స్ అసోసియేషన్లోనాలుగు కథలు నమోదయ్యాయట! టీవీలు, పేపర్లు పండగ చేసుకున్నాయి. ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్లు, వాట్సాప్‌లు ‘తీన్మార్’ కొట్టాయి. వీక్షకులు పాప్‌కార్న్ తిన్నారు. అందరూ హ్యాపీస్. ఎందుకంటే లవ్‌స్టోరీకి కూడా హ్యాపీ ఎండింగ్ వచ్చింది. మరి ట్రాజెడీ ఎక్కడుంది? వీళ్లని కన్న అమ్మానాన్నల్లో, జాగ్రత్తగా ఉండకపోతే రేపు మనలో కూడా!! మూడు రోజుల కుటుంబ గొడవల అనంతరం మంగళవారం నాడు మెహిదీపట్నంలోని తమ ఇంటికి వచ్చేశారు గాయని మధుప్రియ, ఆమె భర్త శ్రీకాంత్. ఈ గొడవంతటికీ... ‘మమ్మల్ని విడదీయడానికి జరిగిన కుట్రే’ కారణం అన్నారు.. మధుప్రియను పిచ్చిదాన్ని చేసి ఆమె తల్లిదండ్రులు ఇలా అందరి ముందు నిలబెట్టారని శ్రీకాంత్ అంటే, ‘అవును’ అంటూ మధుప్రియ తన భర్తను సమర్థించింది. పెద్దలను ఎదిరించి ఆర్నెల్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట.. తృటిలో విడిపోబోయి, తిరిగి కలుసుకున్న సందర్భంలో సాక్షి ‘ఫ్యామిలీ’ వీరిని ప్రత్యేకంగా పలకరించింది. హాయ్ మధుప్రియ, శ్రీకాంత్.. ఎలా ఉన్నారు? ఇద్దరూ: ఇలా ఉన్నాం... (నీరసంగా నవ్వుతూ). శ్రీకాంత్: ఇలా జరిగింది.. అనగానే వెనకా ముందు చూడకుండా వందమంది వచ్చి (మీడియా) వంద రకాలుగా రాసుకుని వెళ్లారు. తను (మధుప్రియ) నా దగ్గరకొచ్చాక ఒక్కరూ రాలేదు. సోషల్ మీడియాలో ఎన్నో రాస్తున్నారు... మధుప్రియ అప్పుడు పేరెంట్స్‌ను మోసం చేసింది. ఇప్పుడు భర్తను మోసం చేసింది... అని పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటివి చూస్తే చాలా బాధ కలుగుతుంది. పెళ్లికి ముందు కూడా రెండు నెలలు తను వాళ్ల పేరెంట్స్ కాళ్లా వేళ్లా పడింది. బతిమాలింది. తన్నులు తిన్నది. అయినా వాళ్లు వినలేదు. మమ్మల్ని వాళ్లు ఇక కలవనివ్వరు అనే ఆలోచన వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకున్నాం. ఒక్కటి ఆలోచించండి.. తను నన్ను మోసం చేసి ఉంటే ఈ రోజు గోడ దూకి నా కోసం రాదు కదా! మధుప్రియ: చెప్పులు కూడా లేకుండా తన కోసం వచ్చేశాను. తనంటే నాకు అంత పిచ్చి ప్రేమ. ఇంత గొడవకు అసలు కారణం ఏంటి? మధుప్రియ: ఏం జరిగినా ఓపెన్‌గా చెప్పుకునేది శ్రీకాంత్‌తోనే. ‘వాళ్లకు’ (మధుప్రియ పేరెంట్స్) ఏం చెప్పలేదు.. వాళ్లే మాట్లాడారు. వాళ్లే నా మెడలో చైన్లు తీసుకున్నారు.. వాళ్లే పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. అది చెప్పు.. ఇది చెప్పు.. అని నన్ను ఫోర్స్ చే స్తే ఏం చేస్తాను..? శ్రీకాంత్: ఆ రోజు మాఫ్రెండ్ వాళ్ల ఇంట్లో టెర్రస్ పైన మాట్లాడుతూ ఉన్నాను. నాకు ఇంకో ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది.. టీవీ చూడు అని. చూస్తే షాక్.. ఒక్కసారి తన (మధుప్రియ)తో మాట్లాడించండి.. అంటే ఎవరూ మాట్లాడించలేదు! అసలేమైందంటే... మధుప్రియ నెలన్నరగా రామంతపూర్‌లో ఉన్న వాళ్లింటికి వెళ్లి వస్తోంది. పుట్టి పెరిగిన వారి మధ్య నుంచి వచ్చాక తిరిగి వారిని చూడాలనుకుంటుంది కదా! తను బాధపడకుండా ఉండాలనే నేనే తీసుకెళ్లి తీసుకువస్తూ ఉండేవాడ్ని. కానీ, బయటే ఉండేవాణ్ణి. మధుప్రియ: ‘ఏదో చిన్న గొడవ’ అని చెప్పా... అయినా భార్యాభర్తలన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు రాకుండా ఉంటాయా. ఎంత పెద్ద వాళ్ల మధ్య అయినా వస్తాయి కదా! మా మధ్య అలాంటివి కూడా లేదు. చాలా చిన్న చిన్నవి... ఎవరికీ చెప్పుకునేటంతవి అసలు కానే కావు. శ్రీకాంత్: వాళ్లమ్మ, ఇంకొంతమంది కలసి అప్పటికప్పుడు మధుప్రియను వెంటబెట్టుకెళ్లి పోలీసుకేసు పెట్టించారు. తనకు ఇష్టం లేకపోయినా ఆమె చేత ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పించారు. పోలీసులు అడుగుతారు కదా! కారణం. కట్నం అని, కొట్టాడని.. ఇలా తలా ఒకటి చెప్పారు... మధుప్రియ: సాక్ష్యాలు చూపించాలి కదా! అందుకే నా మెళ్లో చైన్లు లాగేసుకున్నారు.. కొట్టారన్నారు... నా బుర్ర పనిచేయడం మానేసింది. ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదు. కౌన్సెలింగ్ అయిపోయాక తన (శ్రీకాంత్)తో వెళ్లిపోతాను అన్నాను. వెంటనే ‘ఇక మా లైఫ్ అంతే, నీ లైఫ్ కూడా అంతే! ఇప్పుడు నువ్వెళితే నీకే సమస్య... ఇంత జరిగింది.. ఇక మేం చచ్చిపోవాల్సిందే! .. ఇలా తల్లిదండ్రులు బెదిరిస్తే ఏం చేస్తాను? శ్రీకాంత్: తన సొంత మైండ్‌తో ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా ‘ఇలా చేయకపోతే ఉరేసుకుంటాం.. వెళ్లట్లేదని చెప్పు. వెళ్లనని చెప్పు..’ అంటే తను ఏం చేస్తుంది..? మధుప్రియ: ఆన్ ది స్పాట్ డైవోర్స్ కావాలి అని కూర్చున్నారు వాళ్లు (పేరెంట్స్). పెళ్లయ్యాక ‘వైఫ్ ఆఫ్ శ్రీకాంత్ అని అంటారు కానీ, డాటరాఫ్ .. అనరు కదా’ అని చెబితే.. అయినా సరే.. డైవోర్స్ తీసుకోవాల్సిందే అని బలవంత పెట్టారు. ఇంత ప్రపంచంలో తిరిగారు. నన్ను ఇంత తిప్పారు. వాళ్లకు ఆ మాత్రం తెలియదా.. డైవోర్స్ అంత ఈజీగా రావు అని. ఏదైనా సరే, ఈ రోజుకు ఫినిష్ కావాలి అని సిచ్యుయేషన్ని ఇంత పెద్దగా చేశారు. మిమ్మల్ని విడదీయాలని వారు (మధుప్రియ పేరెంట్స్) ఎందుకు అనుకుంటారు? శ్రీకాంత్: నేనంటే వాళ్లకు ఇష్టం లేదు. అందుకే, నా నుంచి తనను దూరం చేయాలి. నా నుంచి డైవర్ట్ చేస్తే... ఇంక తనకు మేమే ఆధారం. అప్పుడు వీడిని ఏమైనా చేయవచ్చు అని వారి పక్కా ప్లాన్. కౌన్సెలింగ్ తర్వాత నేనా రాత్రి మధుప్రియ వాళ్ల ఇంటికి వెళ్లాను. బండి దిగగానే .. వీళ్ల అమ్మ పై నుంచి కర్రలు పడేసింది. అక్కడున్న పదిమంది నన్ను కొట్టడం స్టార్ట్ చేశారు. నాకేం అర్థం కాలేదు. తను (మధుప్రియ) చూసి.. పరిగెత్తుకు వచ్చింది. అందరూ పట్టుకొని మధుప్రియను ఇంట్లోకి లాక్కెళ్లిపోయారు. ఆ రోజు ఎవరో పిల్లాడు వస్తే.. నేననుకొని.. ఆ అబ్బాయిని చావగొట్టారు. ముందు ప్లాన్ అని నాకూ తెలియదు. తెలిస్తే ఇంత దూరం రానిచ్చేవాడినే కాదు. ఎప్పుడైనా కలిసిపోవాల్సిందే! అనుకున్నాను. కానీ, ఇప్పుడు పక్కాగా చెబుతున్నాను. నన్ను మర్డర్ చేయడానికే ప్లాన్ చేశారు. మీ తల్లిదండ్రులు(శ్రీకాంత్) ఈ విషయంలో ఎలా స్పందించారు? మధుప్రియ తల్లితండ్రులతో మాట్లాడాలని వాళ్లు అనుకోలేదా? శ్రీకాంత్: మమ్మల్ని ఇలా చూసి తట్టుకోలేకపోయారు.. ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. మధుప్రియ గురించి మా వాళ్లకు బాగా తెలుసు. తన పేరెంట్స్‌తో ఎవరూ మాట్లాడలేరు. వారి టార్గెట్ నేను. అంతే! మధుప్రియ అప్పుడు అమ్మవాళ్లు చెబితే అలా ప్రవర్తించింది. ఇప్పుడు మీరు చెబితే ఇలా... మధుప్రియ: ఎవరేది చెబితే అది వినేంత పిచ్చిదాన్నికాదు. నాకంటూ సొంత అభిప్రాయం ఉంది. అందుకే నాకై నేనుగా ఇలా వచ్చేశాను. నాతో ఆ రోజు ఫోర్స్‌గా చేయించిన పని అది. ఇప్పుడు శ్రీకాంత్ దగ్గరకు వచ్చింది అతని మీద ఉన్న పిచ్చి ప్రేమకొద్ది. ఆర్థికంగా మధుప్రియ మీదే ఆధారపడ్డారని.. అందుకే గొడవలని టాక్.. మధుప్రియ: అసలా టాక్‌ను క్రియేట్ చేసింది కూడా వాళ్లే. శ్రీకాంత్: పెళ్లికి ముందు ఎలా ఉందో తను ఇప్పుడూ అలాగే ఉంది. ప్రోగ్రామ్స్ చేసుకుంటుంది. నేను సేల్స్‌మ్యాన్‌గా చేస్తున్నాను. నాకు వచ్చే ఆదాయం మాకు సరిపోతుంది. ఎనిమిది వేలు రెంట్. మరో ఎనిమిదివేలు ఖర్చు. అంతదానికి ఇంకా అదనంగా ఏముంటుంది? పట్టుకెళ్లి పోలీసుస్టేషన్లో కూర్చోబెట్టారు. కేసు ఎందుకు పెడుతున్నావంటే.. ఏదో ఒకటి చెప్పాలి. అది స్ట్రాంగ్ అవడానికి ఇవన్నీ చెప్పాలి. అందుకే డబ్బుల గురించి మధుప్రియను కొట్టానన్నారు. కొడితే తన వంటి మీద గాయాలు ఏమైనా ఉన్నాయా.. చూడండి. బొమ్మలా చేసి ఆడుకున్నారండీ... ఇంట్లో పెట్టి తాళాలు వేస్తే తనేం చేస్తుంది. వారికి వస్తేనేమో అది కష్టం. వేరే వాళ్లకొస్తే అది ఎంటర్టైన్మెంట్.. ఈ ఇష్యూ తర్వాత మీకేం అర్థమైంది? శ్రీకాంత్: ఇంకెప్పుడూ తనను (మధుప్రియ)వాళ్లింటికి పంపకూడదు అని! ఈ ఐదారు నెలల్ల్లో ఒక్కరోజు కూడా తనను వదిలి ఉండలేదు. అలాంటిది ఈ మూడు రోజులు నరకం అనుభవించాం. ఏం జరిగినా.. నా జీవితం తనతోనే. మేం కలిసే బతుకుతాం. మమ్మల్నెవరూ విడదీయలేరు. మధుప్రియ: నా జీవితం శ్రీకాంత్‌తోనే. ఇంక ఇలాంటి సమస్యలు ఎప్పుడూ ఎప్పుడూ రావు. రానివ్వను. (కచ్చితంగా) మధుప్రియ గురించి... మధుప్రియ ఐదోతరగతి చదువుతున్నప్పుడే ‘ఆడపిల్లనమ్మా.. ’ అనే పాట ద్వారా గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది. ఎక్కడా సంగీతం నేర్చుకోకపోయినా తెలుగు రాష్ట్రాలలో తన గళం ద్వారా ప్రజలకు బాగా చేరువైంది. కరీంనగర్‌కు చెందిన మధుప్రియ ప్రేమ విషయం వివాదాస్పదమైంది. ఇప్పుడు పెళ్లి కూడా వివాదాస్పదమైంది. శ్రీకాంత్ గురించి... ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కి చెందిన శ్రీకాంత్ హైదరాబాద్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో చిరుద్యోగి.మధుప్రియ భవిష్యత్తును దెబ్బతీసేందుకే మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపణ..మధుప్రియ తల్లిదండ్రులు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీకాంత్ ఆరోపణ. - నిర్మలారెడ్డి ఫొటో: శివ మల్లాల -
అర్ధరాత్రి మధుప్రియ ఇంటిపై దాడి
హైదరాబాద్: గాయని మధుప్రియ ఇంటిపై శనివారం అర్ధరాత్రి దాడి జరిగింది. మధుప్రియ భర్త శ్రీకాంత్, అనుచరులతో వచ్చి తమ ఇంటిపై దాడికి పాల్పడ్డట్లు ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి ఉప్పల్ లోని తమ ఇంటికి వచ్చిన శ్రీకాంత్.. వేధింపుల కేసు ఎందుకు పెట్టారంటూ నానా హంగామా సృష్టంచాడని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కొట్టే ప్రయత్నం చేశాడని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శ్రీకాంత్ అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పెళ్లైన మూడు నెలల నుంచే ఆస్తి కోసం తనను వేధిస్తున్నాడని, ఆ క్రమంలో చిత్రహింసలకు గురిచేశాడని భర్త శ్రీకాంత్ పై మధుప్రియ శనివారం పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకుని తాను తప్పుచేశానని, పెద్దల మాట వినకపోతే జీవితం నాశనం అవుతుందని ఆమె ఫిర్యాదు సందర్భంగా మాట్లాడిన విషయం విదితమే. -
అమ్మా... నమ్మండి: మధుప్రియ
మధుప్రియ: పెళ్లయ్యాక నేను, మా వారు, అత్తమ్మ, ఆడపడుచులు, వాళ్ల పిల్లలు... అంతా పది మందిమి కలిసి శిరిడీ వెళ్లాం. చాలా సంతోషంగా ఉన్నాను. లేకుంటే మీతో ఇంత బాగా మాట్లాడేదాన్ని కాదుగా! శ్రీకాంత్ (భర్త) నాకు రెండేళ్లుగా తెలుసు. నేను అతనికి ఎనిమిదేళ్లుగా తెలుసు. ‘ఆడపిల్లనమ్మా..’ పాట విన్నప్పటి నుంచే శ్రీకాంత్ నాకు అభిమాని అయ్యాడు. మేం ఉండే ప్రాంతంలోనే ఉండేవాడు తను. రోజూ చూసుకునేవాళ్లం. ఒక రోజు తనే పలకరించాడు. మాటలు.. చాటింగ్‌లు.. అలా అలా మొదలయ్యింది మా ప్రేమ. ఆ తర్వాత శ్రీకాంత్ వాళ్ల చిన్నక్క పరిచయం అయ్యింది. అటు తర్వాత వాళ్లింట్లో వారంతా పరిచయం అయ్యారు. అంతా చాలా మంచివాళ్లు. మంచి కుటుంబం. అందుకే శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకోవడానికి వెంటనే ఒప్పుకున్నాను. నొప్పించక తప్పలేదు అమ్మానాన్నకు శ్రీకాంత్ నచ్చలేదు. శ్రీకాంత్ పేదరికమే అందుకు కారణం. నాకు నచ్చజెప్పాలని చూశారు. ఇంకొన్ని సంవత్సరాలు ఆగమని చెప్పారు. కానీ, ఆ టైమ్‌లో నా మనసు మార్చే ప్రయత్నం చేస్తారని నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మానాన్నలే లోకంగా ఎదిగిన నేను.. వారిని నొప్పించక తప్పలేదు. జీవితంలో ప్రతీది పోరాటమే. పాటపాడటానికి వెళ్లే మొదట్లోనూ ఎన్నో ఇక్కట్లు పడ్డాను. ఇప్పుడు జీవితం మొదట్లోనూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాను. అయినా దేనికీ భయపడింది లేదు. భయపడను కూడా! అమ్మ ప్రేమ అనంతం అమ్మ, నాన్న నా కోసం ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేను. నేను పాటపాడాలన్నా, రాయాలన్నా.. నా వెనుక అమ్మ ఉంది. ‘నా కూతురు బాగా పాడుతుంది. ఒక్క పాట పాడటానికి అవకాశమివ్వండి’ అని అమ్మ చాలా మందిని రిక్వెస్ట్ చేసింది. ఏ వేదికల మీద రిక్వెస్ట్ చేసిందో.. ఆ వేదికల మీదే నాకు సన్మానం జరిగినప్పుడు పొంగిపోయింది. అలాంటి అమ్మను నేను మోసం చేయలేదు. నేనేం తప్పు చేయలేదు. అమ్మ నా క్షేమం గురించే ఈ పెళ్లి వద్దని ఉండవచ్చు. కానీ, శ్రీకాంత్‌ని కాదని అమ్మ, నాన్నలు చెప్పినవారిని చేసుకుంటే నేను జీవితాంతం ఆనందంగా ఉండగలనా?! నన్ను నేను మోసం చేసుకొని బతకలేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కొట్లాడి ఈ పెళ్లి చేసుకున్నాను కాబట్టి మంచైనా, చెడైనా నేనే అనుభవించాలి. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో.. అమ్మానాన్నలు మా పెళ్లికి ఒప్పుకోలేదని అంతే బాధగానూ ఉన్నాను. వాళ్లకు నేనంటే ప్రాణం. వాళ్లూ నాకంతకన్నా ఎక్కువ. అయినా నా నిర్ణయంతో అమ్మానాన్నలను బాధపెట్టాను. అందుకే వాళ్లను క్షమించమని అడుగుతున్నాను. మోసపోలేదు.. మోసగించలేదు... అమ్మానాన్న అనుకున్నట్టుగా నన్నెవరూ మోసం చేయలేదు. శ్రీకాంత్, నేను పర్సనల్‌గా మా భవిష్యత్తు గురించి చర్చించుకున్నాం. పెళ్లికి రమ్మని అమ్మానాన్నలను చాలా రిక్వెస్ట్ చేశాను. కానీ, వాళ్లు రాలేదు. రిసెప్షన్ అనుకున్నాం. కానీ, వాళ్లు వస్తేనే ఆ వేడుక లేకపోతే వద్దు అని క్యాన్సిల్ చేసుకున్నాం. చదువుతో నెగ్గుతాను సమాజంలో ఆడపిల్లలు ఎన్నో ఇక్కట్లకు లోనవుతారు. ‘లా’లో సెక్షన్లు తెలిస్తే ఇంకా ఎన్నో విధాల ఆడపిల్లలకు అండగా ఉండవచ్చు. అందుకే ‘లా’ చదవాలని నిర్ణయించుకున్నాను. నా భవిష్యత్తు ప్రణాళిక ఇదే! ఇప్పటి వరకు పాటలు రాశాను, పాడాను. ఇక ముందు కూడా అలాగే కొనసాగుతాను. అంగీకరిస్తారనే నమ్ముతున్నా! ఎవరెన్ని మాట్లాడినా తల్లిదండ్రుల ప్రేమను ఎవరూ పంచలేరు. అమ్మానాన్నలను, అక్కను, చెల్లిని చాలా మిస్ అవుతున్నాను. దీపావళి తర్వాత అమ్మానాన్నల దగ్గరకు శ్రీకాంత్‌తో కలిసి వెళతాను. వాళ్లు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని నమ్ముతున్నాను. వాళ్లకున్న భయాలన్నీ కూడా పోతాయని అనుకుంటున్నాను. ఈ దీపావళిని అత్తగారింట్లో చేసుకుంటున్నాను. మా అత్తగారిని కూడా ‘అమ్మా’ అనే పిలుస్తాను. శ్రీకాంత్ అక్కలు కూడా నాతో చాలా బాగా ఉంటారు. కారణాలనే తప్పు పట్టాలి తల్లి-కూతురు బంధం ఎప్పటికీ బలంగా ఉండాలంటే ఏమేం పాటించాలో ఇలా సూచిస్తున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్ వాణీమూర్తి... పెళ్లికి ముందు టీనేజ్‌లో కూతురు మొండిపట్టు, అలక, గొడవలు పెట్టుకోవడం సహజం. వాటిని ఓరిమితోనే సహించాలి. ఏది సరైనది, ఏది సరైనది కాదు అనే విషయాలు పిల్లలు వినకపోయినా సాధ్యమైనంతవరకు వారికి జాగ్రత్తలు చెప్పాలి. ప్రతి విషయాన్ని తప్పుపట్టకుండా, జోక్యం చేసుకుండా ఒక సూపర్ వైజర్‌గా మాత్రమే తల్లి ఉండాలి. పెళ్లి తర్వాత పెళ్లి చేసుకున్నాక చాలా మంది అమ్మాయిలు భయపడేది కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుందనే! బాధ్యతలను గౌరవంగా స్వీకరించడానికి అమ్మాయి ఇష్టపడాలి. అత్తవారింట అందరితోనూ కలిసిమెలిసి ఉండాలనే విషయాన్ని తెలియజెప్పాలి. పెళ్లికి ముందే కాదు, తర్వాత కూడా అమ్మాయికి తల్లివైపు నుంచి రక్షణ ఉండాలి. ఒకరి మీద ఒకరు డిమాండింగ్‌గా ఉండకూడదు. ఈ ధోరణి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. సొంత నిర్ణయం తీసుకుంటే...! ప్రాణప్రదంగా పెంచుకున్న కూతురు తమను కాదని వెళ్లిపోతే.. అక్కడ కారణాలనే తప్పు పట్టాలే తప్ప కూతురును కాదు. తమ కూతురుకు తమ మీద వ్యతిరేకత లేదు అని గుర్తించాలి. యవ్వనదశలో ఇలాంటివి సహజమే అనుకోవాలి. పదేపదే ‘ఇలా ఎందుకు జరిగిందా’ అని బాధపడకుండా, ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో ఆలోచించాలి. తమ మధ్య ఏర్పడిన గ్యాప్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దగ్గరవడానికి కలిసి వచ్చే సందర్భాలెన్నో ఉంటాయి. వాటిని తల్లీకూతుళ్లిద్దరూ తప్పక ఉపయోగించుకోవాలి. -
'ఆడపిల్ల’కు అన్యాయం జరిగింది
సుజాత: తెల్లటివన్నీ పాలు, నల్లటివన్నీ నీళ్లు అనుకునే అమాయకురాలు నా బిడ్డ. నా బిడ్డ ఎక్కడో అన్యాయానికి గురైంది.. అదే తెలియాలి. ఏ విషయం దాచని నా తల్లి ఎలాంటి కష్ట సమయంలో ఈ పెళ్లికి తలవంచిందో.. అంతుపట్టడం లేదు. తన భవిష్యత్తు ఏమవుతుందో అనే నా బెంగ. నా మధు నన్ను బాధపెట్టి వెళ్లిపోయింది. కాదు కాదు.. రాకాసులు తనను ఎత్తికెళ్లిపోయారు. అబద్ధాలు కాదు... తనకు వచ్చిన సమస్య ఏంటో చెప్పకుండా అబద్ధాలాడుతోంది. అదే జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. గంగిరెద్దులా మెడలో తాళి కట్టించుకుంది. కానీ, ఏ కారణం వల్ల అనేది తెలియడం లేదు. తనను ఒక వ్యక్తిత్వం గల మనిషిగా తీర్చిదిద్దాం. తన జీవితం బాగుండాలని ఎన్నో విధాలుగా కష్టపడ్డాం. ఇంకో ఇద్దరు ఆడపిల్లలున్నా మా దృష్టి అంతా మధుప్రియ మీదనే పెట్టాం. కానీ, తను మా గుండెల మీద తన్ని వెళ్లింది. నా ప్లేస్‌లో ఏ తల్లి ఉన్నా ఈ పాటికి చచ్చిపోయేది. ఇంకా బతుకున్నానంటే మధుప్రియ బతుకు ఏమైపోతుందో అనే.. బెంగతోనే. కాళ్లు కడిగి ఇచ్చుకునేవాళ్లం తను ఏరి కోరి ఆ అబ్బాయిని ఎంచుకోలేదు. ఏదో జరిగింది. అదే బయటకు రావడం లేదు. తను అంతగా ఇష్టపడి ఉండి ఉంటే.. మాకు నిజాలు చెప్పి ఉంటే.. కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేవాళ్లం. చుట్టాలను పిలిచి వేడుకగా పెళ్లి చేసేవాళ్లం. మనసు చాలా సున్నితం మధుప్రియ మనస్తత్వం చాలా సున్నితమైంది. మేం ఏ కాస్త బాధపడినా తట్టుకోలేదు. ఏ విషయాన్నీ తను ఇప్పటిదాకా దాచలేదు. ఇప్పుడు ఈ విషయంలో ఏం జరిగిందో చెప్పమంటే చెప్పడం లేదు. అన్నీ దాచిపెట్టి... తన జీవితాన్ని పణంగా పెట్టింది. ప్రేమ స్వార్థాన్ని కోరుకోదు ప్రేమ త్యాగాన్ని, గౌరవాన్ని, ఆనందాన్ని కోరుకుంటుంది. కానీ, అతని ప్రేమ స్వార్థపూరితమైంది. అందుకే మా బిడ్డను మా నుంచి లాక్కుపోయాడు. బిడ్డలే ప్రాణంగా బతికిన మాక న్నా తనకు ఎవరూ ఎక్కువ కాదు. ఆ విషయం మాకు తెలుసు, తనకూ తెలుసు. మాకు కులం పట్టింపులులేవు. డబ్బు ఉన్నవాళ్లా లేనివాళ్లా అని పట్టించుకోం. మా పెద్దమ్మాయిది ప్రేమవివాహమే. మంచి చెడ్డలు చూసి ఘనంగా పెళ్లి జరిపించాం. మధుప్రియ పెళ్లికి మేం ఒప్పుకోలేదంటే బిడ్డ భవిష్యత్తు ఏమైపోతుందో అని భయపడే కదా! మధుకి వాక్చాతుర్యం ఉంది కానీ, జీవితానుభవం లేదు. నా కూతురిని నమ్మించి మోసం చేశారు. నిజంగా ప్రేమించి ఉంటే.. మా అనుమతి దొరికే వరకు ఎదురుచూసేవారు. అన్నెంపున్నెం ఎరుగని నా బిడ్డను రాకాసులు వచ్చి ఎత్తికెళ్లిపోతుంటే ఏం చేయలేకపోయానే అని నా బాధ. ధైర్యంగా బతుకు బిడ్డా! ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. ధైర్యం లేనివారమయ్యాం. ‘మధూ ఇన్నాళ్లూ నీ కోసమే కష్టపడ్డాం. మా కోసం ఏం చేశావని మిగతా ఇద్దరు బిడ్డలు అడిగితే నేనేమని సమాధానం చెప్పను. అయినా బిడ్డా ... నీకే కష్టం వచ్చినా... మేమున్నాం. ఎలాగైనా నిన్ను కాపాడుకోవడానికి పోరాడతాం. ధైర్యంగా ఉండు. ధైర్యంగా బతుకు.’ అంటూ దీవించారు సుజాత. తల్లి-కూతురు బంధం ఎప్పటికీ బలంగా ఉండాలంటే ఏమేం పాటించాలో ఇలా సూచిస్తున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్ వాణీమూర్తి... పెళ్లికి ముందు టీనేజ్‌లో కూతురు మొండిపట్టు, అలక, గొడవలు పెట్టుకోవడం సహజం. వాటిని ఓరిమితోనే సహించాలి. ఏది సరైనది, ఏది సరైనది కాదు అనే విషయాలు పిల్లలు వినకపోయినా సాధ్యమైనంతవరకు వారికి జాగ్రత్తలు చెప్పాలి. ప్రతి విషయాన్ని తప్పుపట్టకుండా, జోక్యం చేసుకుండా ఒక సూపర్ వైజర్‌గా మాత్రమే తల్లి ఉండాలి. పెళ్లి తర్వాత పెళ్లి చేసుకున్నాక చాలా మంది అమ్మాయిలు భయపడేది కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుందనే! బాధ్యతలను గౌరవంగా స్వీకరించడానికి అమ్మాయి ఇష్టపడాలి. అత్తవారింట అందరితోనూ కలిసిమెలిసి ఉండాలనే విషయాన్ని తెలియజెప్పాలి. పెళ్లికి ముందే కాదు, తర్వాత కూడా అమ్మాయికి తల్లివైపు నుంచి రక్షణ ఉండాలి. ఒకరి మీద ఒకరు డిమాండింగ్‌గా ఉండకూడదు. ఈ ధోరణి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. సొంత నిర్ణయం తీసుకుంటే...! ప్రాణప్రదంగా పెంచుకున్న కూతురు తమను కాదని వెళ్లిపోతే.. అక్కడ కారణాలనే తప్పు పట్టాలే తప్ప కూతురును కాదు. తమ కూతురుకు తమ మీద వ్యతిరేకత లేదు అని గుర్తించాలి. యవ్వనదశలో ఇలాంటివి సహజమే అనుకోవాలి. పదేపదే ‘ఇలా ఎందుకు జరిగిందా’ అని బాధపడకుండా, ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో ఆలోచించాలి. తమ మధ్య ఏర్పడిన గ్యాప్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దగ్గరవడానికి కలిసి వచ్చే సందర్భాలెన్నో ఉంటాయి. వాటిని తల్లీకూతుళ్లిద్దరూ తప్పక ఉపయోగించుకోవాలి.