'ఆడపిల్ల’కు అన్యాయం జరిగింది
సుజాత: తెల్లటివన్నీ పాలు, నల్లటివన్నీ నీళ్లు అనుకునే అమాయకురాలు నా బిడ్డ. నా బిడ్డ ఎక్కడో అన్యాయానికి గురైంది.. అదే తెలియాలి. ఏ విషయం దాచని నా తల్లి ఎలాంటి కష్ట సమయంలో ఈ పెళ్లికి తలవంచిందో.. అంతుపట్టడం లేదు. తన భవిష్యత్తు ఏమవుతుందో అనే నా బెంగ. నా మధు నన్ను బాధపెట్టి వెళ్లిపోయింది. కాదు కాదు.. రాకాసులు తనను ఎత్తికెళ్లిపోయారు.
అబద్ధాలు కాదు...
తనకు వచ్చిన సమస్య ఏంటో చెప్పకుండా అబద్ధాలాడుతోంది. అదే జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. గంగిరెద్దులా మెడలో తాళి కట్టించుకుంది. కానీ, ఏ కారణం వల్ల అనేది తెలియడం లేదు. తనను ఒక వ్యక్తిత్వం గల మనిషిగా తీర్చిదిద్దాం. తన జీవితం బాగుండాలని ఎన్నో విధాలుగా కష్టపడ్డాం. ఇంకో ఇద్దరు ఆడపిల్లలున్నా మా దృష్టి అంతా మధుప్రియ మీదనే పెట్టాం. కానీ, తను మా గుండెల మీద తన్ని వెళ్లింది. నా ప్లేస్‌లో ఏ తల్లి ఉన్నా ఈ పాటికి చచ్చిపోయేది. ఇంకా బతుకున్నానంటే మధుప్రియ బతుకు ఏమైపోతుందో అనే.. బెంగతోనే.
కాళ్లు కడిగి ఇచ్చుకునేవాళ్లం
తను ఏరి కోరి ఆ అబ్బాయిని ఎంచుకోలేదు. ఏదో జరిగింది. అదే బయటకు రావడం లేదు. తను అంతగా ఇష్టపడి ఉండి ఉంటే.. మాకు నిజాలు చెప్పి ఉంటే.. కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేవాళ్లం. చుట్టాలను పిలిచి వేడుకగా పెళ్లి చేసేవాళ్లం.
మనసు చాలా సున్నితం
మధుప్రియ మనస్తత్వం చాలా సున్నితమైంది. మేం ఏ కాస్త బాధపడినా తట్టుకోలేదు. ఏ విషయాన్నీ తను ఇప్పటిదాకా దాచలేదు. ఇప్పుడు ఈ విషయంలో ఏం జరిగిందో చెప్పమంటే చెప్పడం లేదు. అన్నీ దాచిపెట్టి... తన జీవితాన్ని పణంగా పెట్టింది.
ప్రేమ స్వార్థాన్ని కోరుకోదు
ప్రేమ త్యాగాన్ని, గౌరవాన్ని, ఆనందాన్ని కోరుకుంటుంది. కానీ, అతని ప్రేమ స్వార్థపూరితమైంది. అందుకే మా బిడ్డను మా నుంచి లాక్కుపోయాడు. బిడ్డలే ప్రాణంగా బతికిన మాక న్నా తనకు ఎవరూ ఎక్కువ కాదు. ఆ విషయం మాకు తెలుసు, తనకూ తెలుసు. మాకు కులం పట్టింపులులేవు. డబ్బు ఉన్నవాళ్లా లేనివాళ్లా అని పట్టించుకోం. మా పెద్దమ్మాయిది ప్రేమవివాహమే. మంచి చెడ్డలు చూసి ఘనంగా పెళ్లి జరిపించాం. మధుప్రియ పెళ్లికి మేం ఒప్పుకోలేదంటే బిడ్డ భవిష్యత్తు ఏమైపోతుందో అని భయపడే కదా! మధుకి వాక్చాతుర్యం ఉంది కానీ, జీవితానుభవం లేదు. నా కూతురిని నమ్మించి మోసం చేశారు. నిజంగా ప్రేమించి ఉంటే.. మా అనుమతి దొరికే వరకు ఎదురుచూసేవారు. అన్నెంపున్నెం ఎరుగని నా బిడ్డను రాకాసులు వచ్చి ఎత్తికెళ్లిపోతుంటే ఏం చేయలేకపోయానే అని నా బాధ.
ధైర్యంగా బతుకు బిడ్డా!
ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. ధైర్యం లేనివారమయ్యాం. ‘మధూ ఇన్నాళ్లూ నీ కోసమే కష్టపడ్డాం. మా కోసం ఏం చేశావని మిగతా ఇద్దరు బిడ్డలు అడిగితే నేనేమని సమాధానం చెప్పను. అయినా బిడ్డా ... నీకే కష్టం వచ్చినా... మేమున్నాం. ఎలాగైనా నిన్ను కాపాడుకోవడానికి పోరాడతాం. ధైర్యంగా ఉండు. ధైర్యంగా బతుకు.’ అంటూ దీవించారు సుజాత.
తల్లి-కూతురు బంధం ఎప్పటికీ బలంగా ఉండాలంటే ఏమేం పాటించాలో ఇలా సూచిస్తున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్ వాణీమూర్తి...
పెళ్లికి ముందు
టీనేజ్‌లో కూతురు మొండిపట్టు, అలక, గొడవలు పెట్టుకోవడం సహజం. వాటిని ఓరిమితోనే సహించాలి. ఏది సరైనది, ఏది సరైనది కాదు అనే విషయాలు పిల్లలు వినకపోయినా సాధ్యమైనంతవరకు వారికి జాగ్రత్తలు చెప్పాలి. ప్రతి విషయాన్ని తప్పుపట్టకుండా, జోక్యం చేసుకుండా ఒక సూపర్ వైజర్‌గా మాత్రమే తల్లి ఉండాలి.
పెళ్లి తర్వాత
పెళ్లి చేసుకున్నాక చాలా మంది అమ్మాయిలు భయపడేది కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుందనే! బాధ్యతలను గౌరవంగా స్వీకరించడానికి అమ్మాయి ఇష్టపడాలి. అత్తవారింట అందరితోనూ కలిసిమెలిసి ఉండాలనే విషయాన్ని తెలియజెప్పాలి. పెళ్లికి ముందే కాదు, తర్వాత కూడా అమ్మాయికి తల్లివైపు నుంచి రక్షణ ఉండాలి. ఒకరి మీద ఒకరు డిమాండింగ్‌గా ఉండకూడదు. ఈ ధోరణి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది.
సొంత నిర్ణయం తీసుకుంటే...!
ప్రాణప్రదంగా పెంచుకున్న కూతురు తమను కాదని వెళ్లిపోతే.. అక్కడ కారణాలనే తప్పు పట్టాలే తప్ప కూతురును కాదు. తమ కూతురుకు తమ మీద వ్యతిరేకత లేదు అని గుర్తించాలి. యవ్వనదశలో ఇలాంటివి సహజమే అనుకోవాలి. పదేపదే ‘ఇలా ఎందుకు జరిగిందా’ అని బాధపడకుండా, ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో ఆలోచించాలి. తమ మధ్య ఏర్పడిన గ్యాప్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దగ్గరవడానికి కలిసి వచ్చే సందర్భాలెన్నో ఉంటాయి. వాటిని తల్లీకూతుళ్లిద్దరూ తప్పక ఉపయోగించుకోవాలి.