అమ్మా... నమ్మండి: మధుప్రియ | Mother trust me - Madhupriya, singer | Sakshi
Sakshi News home page

అమ్మా... నమ్మండి: మధుప్రియ

Published Tue, Nov 10 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 12:17 PM

అమ్మా... నమ్మండి: మధుప్రియ

అమ్మా... నమ్మండి: మధుప్రియ

మధుప్రియ:  పెళ్లయ్యాక నేను, మా వారు, అత్తమ్మ, ఆడపడుచులు, వాళ్ల పిల్లలు... అంతా పది మందిమి కలిసి శిరిడీ వెళ్లాం. చాలా సంతోషంగా ఉన్నాను. లేకుంటే మీతో ఇంత బాగా మాట్లాడేదాన్ని కాదుగా! శ్రీకాంత్ (భర్త) నాకు రెండేళ్లుగా తెలుసు. నేను అతనికి ఎనిమిదేళ్లుగా తెలుసు. ‘ఆడపిల్లనమ్మా..’ పాట విన్నప్పటి నుంచే శ్రీకాంత్ నాకు అభిమాని అయ్యాడు. మేం ఉండే ప్రాంతంలోనే ఉండేవాడు తను. రోజూ చూసుకునేవాళ్లం. ఒక రోజు తనే పలకరించాడు. మాటలు.. చాటింగ్‌లు.. అలా అలా మొదలయ్యింది మా ప్రేమ. ఆ తర్వాత శ్రీకాంత్ వాళ్ల చిన్నక్క పరిచయం అయ్యింది. అటు తర్వాత వాళ్లింట్లో వారంతా పరిచయం అయ్యారు. అంతా చాలా మంచివాళ్లు. మంచి కుటుంబం. అందుకే శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకోవడానికి వెంటనే ఒప్పుకున్నాను.
 
నొప్పించక తప్పలేదు

అమ్మానాన్నకు శ్రీకాంత్ నచ్చలేదు. శ్రీకాంత్ పేదరికమే అందుకు కారణం. నాకు నచ్చజెప్పాలని చూశారు. ఇంకొన్ని సంవత్సరాలు ఆగమని చెప్పారు. కానీ, ఆ టైమ్‌లో నా మనసు మార్చే ప్రయత్నం చేస్తారని నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మానాన్నలే లోకంగా ఎదిగిన నేను.. వారిని నొప్పించక తప్పలేదు. జీవితంలో ప్రతీది పోరాటమే. పాటపాడటానికి వెళ్లే మొదట్లోనూ ఎన్నో ఇక్కట్లు పడ్డాను. ఇప్పుడు జీవితం మొదట్లోనూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాను. అయినా దేనికీ భయపడింది లేదు. భయపడను కూడా! అమ్మ ప్రేమ అనంతం

అమ్మ, నాన్న నా కోసం ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేను. నేను పాటపాడాలన్నా, రాయాలన్నా.. నా వెనుక అమ్మ ఉంది. ‘నా కూతురు బాగా పాడుతుంది. ఒక్క పాట పాడటానికి అవకాశమివ్వండి’ అని అమ్మ చాలా మందిని రిక్వెస్ట్ చేసింది. ఏ వేదికల మీద రిక్వెస్ట్ చేసిందో.. ఆ వేదికల మీదే నాకు సన్మానం జరిగినప్పుడు పొంగిపోయింది. అలాంటి అమ్మను నేను మోసం చేయలేదు. నేనేం తప్పు చేయలేదు. అమ్మ నా క్షేమం గురించే ఈ పెళ్లి వద్దని ఉండవచ్చు. కానీ, శ్రీకాంత్‌ని కాదని అమ్మ, నాన్నలు చెప్పినవారిని చేసుకుంటే నేను జీవితాంతం ఆనందంగా ఉండగలనా?! నన్ను నేను మోసం చేసుకొని బతకలేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కొట్లాడి ఈ పెళ్లి చేసుకున్నాను కాబట్టి మంచైనా, చెడైనా నేనే అనుభవించాలి. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో.. అమ్మానాన్నలు మా పెళ్లికి ఒప్పుకోలేదని అంతే బాధగానూ ఉన్నాను. వాళ్లకు నేనంటే ప్రాణం. వాళ్లూ నాకంతకన్నా ఎక్కువ. అయినా నా నిర్ణయంతో అమ్మానాన్నలను బాధపెట్టాను. అందుకే వాళ్లను క్షమించమని అడుగుతున్నాను.
 
మోసపోలేదు.. మోసగించలేదు...
 అమ్మానాన్న అనుకున్నట్టుగా నన్నెవరూ మోసం చేయలేదు. శ్రీకాంత్, నేను పర్సనల్‌గా మా భవిష్యత్తు గురించి చర్చించుకున్నాం. పెళ్లికి రమ్మని అమ్మానాన్నలను చాలా రిక్వెస్ట్ చేశాను. కానీ, వాళ్లు రాలేదు. రిసెప్షన్ అనుకున్నాం. కానీ, వాళ్లు వస్తేనే ఆ వేడుక లేకపోతే వద్దు అని క్యాన్సిల్ చేసుకున్నాం.

చదువుతో నెగ్గుతాను
సమాజంలో ఆడపిల్లలు ఎన్నో ఇక్కట్లకు లోనవుతారు. ‘లా’లో సెక్షన్లు తెలిస్తే ఇంకా ఎన్నో విధాల ఆడపిల్లలకు అండగా ఉండవచ్చు. అందుకే ‘లా’ చదవాలని నిర్ణయించుకున్నాను. నా భవిష్యత్తు ప్రణాళిక ఇదే! ఇప్పటి వరకు పాటలు రాశాను, పాడాను. ఇక ముందు కూడా అలాగే కొనసాగుతాను.

అంగీకరిస్తారనే నమ్ముతున్నా!
ఎవరెన్ని మాట్లాడినా తల్లిదండ్రుల ప్రేమను ఎవరూ పంచలేరు. అమ్మానాన్నలను, అక్కను, చెల్లిని చాలా మిస్ అవుతున్నాను. దీపావళి తర్వాత అమ్మానాన్నల దగ్గరకు శ్రీకాంత్‌తో కలిసి వెళతాను. వాళ్లు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని నమ్ముతున్నాను. వాళ్లకున్న భయాలన్నీ కూడా పోతాయని అనుకుంటున్నాను. ఈ దీపావళిని అత్తగారింట్లో చేసుకుంటున్నాను. మా అత్తగారిని కూడా ‘అమ్మా’ అనే పిలుస్తాను. శ్రీకాంత్ అక్కలు కూడా నాతో చాలా బాగా ఉంటారు.
 
కారణాలనే తప్పు పట్టాలి
 తల్లి-కూతురు బంధం ఎప్పటికీ బలంగా ఉండాలంటే ఏమేం పాటించాలో ఇలా సూచిస్తున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్ వాణీమూర్తి...
 పెళ్లికి ముందు టీనేజ్‌లో కూతురు మొండిపట్టు, అలక, గొడవలు పెట్టుకోవడం సహజం. వాటిని ఓరిమితోనే సహించాలి. ఏది సరైనది, ఏది సరైనది కాదు అనే విషయాలు పిల్లలు వినకపోయినా సాధ్యమైనంతవరకు వారికి జాగ్రత్తలు చెప్పాలి. ప్రతి విషయాన్ని తప్పుపట్టకుండా, జోక్యం చేసుకుండా ఒక సూపర్ వైజర్‌గా మాత్రమే తల్లి ఉండాలి.

పెళ్లి తర్వాత
 పెళ్లి చేసుకున్నాక చాలా మంది అమ్మాయిలు భయపడేది కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుందనే! బాధ్యతలను గౌరవంగా స్వీకరించడానికి అమ్మాయి ఇష్టపడాలి. అత్తవారింట అందరితోనూ కలిసిమెలిసి ఉండాలనే విషయాన్ని తెలియజెప్పాలి. పెళ్లికి ముందే కాదు, తర్వాత కూడా అమ్మాయికి తల్లివైపు నుంచి రక్షణ ఉండాలి. ఒకరి మీద ఒకరు డిమాండింగ్‌గా ఉండకూడదు. ఈ ధోరణి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది.

సొంత నిర్ణయం తీసుకుంటే...!
ప్రాణప్రదంగా పెంచుకున్న కూతురు తమను కాదని వెళ్లిపోతే.. అక్కడ కారణాలనే తప్పు పట్టాలే తప్ప కూతురును కాదు. తమ కూతురుకు తమ మీద వ్యతిరేకత లేదు అని గుర్తించాలి. యవ్వనదశలో ఇలాంటివి సహజమే అనుకోవాలి. పదేపదే ‘ఇలా ఎందుకు జరిగిందా’ అని బాధపడకుండా, ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో ఆలోచించాలి. తమ మధ్య ఏర్పడిన గ్యాప్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దగ్గరవడానికి కలిసి వచ్చే సందర్భాలెన్నో ఉంటాయి. వాటిని తల్లీకూతుళ్లిద్దరూ తప్పక ఉపయోగించుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement