తల్లితో మధుప్రియ, సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజర్
మధుప్రియ పేదింటి అమ్మాయి. కష్టపడి చదివింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడిక ప్రమోషన్ కూడా వచ్చింది. ప్రియ తల్లి కూరగాయలు అమ్ముతుంటుందని చుట్టుపక్కల అందరికీ తెలుసు. అయితే ప్రియకు తన తల్లి గురించి ఈమధ్యే .. అదీ నాన్న చెబితే.. ఒక నిజం తెలిసింది. అంత నిజం తెలిశాక మధుప్రియ ఊరుకుంటుందా? ‘చూడండి ఈ తల్లి కూతుర్నే నేను..’ అని లోకానికి చెప్పడం కోసమే అన్నట్లు.. వెళ్లి అమ్మ పక్కన కూర్చుని తక్కెడ పట్టుకుంది. ఇంతకీ ప్రియకు తెలిసిన నిజం ఏమిటి?
మధుప్రియకు పెద్ద ప్రమోషనే వచ్చింది. గత రెండేళ్లుగా చెన్నైలోని ఎఫ్.పి.ఎస్. ఇన్నొవేషన్స్ ల్యాబ్‌లో సీనియర్ హ్యూమన్ రిసోర్స్ అసోసియేట్‌గా పని చేస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు అదే కంపెనీకి అసోసియేట్ మేనేజర్ అయింది. యూఎస్ కంపెనీ అది. పెద్ద జీతం. ఇక ప్రమోషన్ అంటే ఇంకా పెద్ద జీతం. మధుప్రియ ఇంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆడపిల్లలెవరూ లేరు. తనే మొదటి అమ్మాయి. డిగ్రీ చదువుతుండగానే క్యాపస్ ప్లేస్‌మెంట్స్‌లో సెలక్ట్ అయింది. ఎఫ్.పి.ఎస్. (ఫుల్ పొటెన్షియల్ సొల్యూషన్స్) లోనే. సాఫ్ట్‌వేర్ కంపెనీ అది. అయితే ఇప్పుడొచ్చిన ప్రమోషన్ కన్నా పెద్ద ప్రమోషన్ ఆమె జీవితంలో మరొకటి ఉంది. ‘‘ఈమె మా అమ్మ’’ అని గర్వంగా చెప్పుకోవడమే ఆమె తనకు తను ఇచ్చుకున్న ప్రమోషన్.
ప్రియ తల్లి కూరగాయలు అమ్ముతుంది. తండ్రికి చిన్న ఉద్యోగం. వాళ్లిద్దరి రోజువారి సంపాదనను బట్టి చూస్తే ప్రియ పేదింటి అమ్మాయే. కష్టపడి చదివింది. మంచి ఉద్యోగం సంపాదించింది. ఇందులో విశేషం ఏమీ లేదు. ‘‘ఇప్పుడు నేను సాధించిన ప్రమోషన్‌లో కూడా విశేషం లేదు’’ అంటోంది ప్రియ! అలా ఆమె అనడానికి ఓ కారణం ఉంది. ఆ కారణం కూడా తండ్రి చెబితేనే ఆమెకు తెలిసింది. చిన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్‌కి తండ్రి వెళ్లేవాడు. తల్లి ఆలస్యంగా వెళ్లేది! ఆలస్యంగా అంటే.. మీటింగ్ అయిపోయాక. ఎప్పుడూ అంతే. ‘‘ఎందుకమ్మా ఆలస్యంగా వస్తావ్’’ అని ప్రియ అడిగేది.
‘‘ఇప్పటికి పనైందమ్మా’’అని తల్లి చెప్పేది. అయితే.. తన బిడ్డ కూరగాయలమ్మే ఆమె కూతురు అని తక్కిన పిల్లలకు తెలియకుండా ఉండటం కోసం ఆమె కావాలని ఆలస్యంగా చేసేదని తండ్రి చెప్పినప్పుడు ప్రియ కళ్ల వెంబడి నీళ్లు తిరగాయి. వెళ్లి తల్లిని కావలించుకుంది. అక్కడితో ఆగలేదు. ‘ఈమె మా అమ్మ’ అని చెప్పాడానికే అన్నట్లు.. వెళ్లి అమ్మ పక్కన కూర్చొని తక్కెడ పట్టుకుంది. ప్రమోషన్ వచ్చి ఇప్పుడు పెద్ద మేనేజర్ అయినా కూడా అమ్మతో కలిసి కాసేపైనా కూరగాయలు అమ్ముతుంది! ఈ అమ్మ కూతుర్నని చెప్పుకోవడాన్ని మించిన ప్రమోషన్ ఏముంటుంది అని నవ్వుతుంది. ‘‘ఈ ప్రమోషన్ మా అమ్మకే అంకితం’’ అంటోంది.
∙
Comments
Please login to add a commentAdd a comment