సిటీకాప్టర్... సిస్టర్ ఆఫ్ హెలికాప్టర్!
సాంకేతికం
ఇక ముందు ఇలాంటి మాటలు వినిపించవచ్చు...
‘‘మూహూర్తం టైమ్‌కల్లా పెళ్లికి వెళ్లాలి. డ్రైవర్...హెలికాప్టర్ తియ్.’’
కొంపదీసి... హెలికాప్టర్లను చౌకధరలకు కొనుక్కోవచ్చా ఏమిటి?! అనే కదా మీ డౌటు. అదేం కాదుగానీ...‘ఫ్లై సిటీ హెలికాప్టర్’లు అనే బుల్లి హెలికాప్టర్లు భవిష్యత్‌లో రానున్నాయి.
ఈ పర్సనల్ హెలికాప్టర్లు నానో కార్లలా అందుబాటు ధరల్లోకి రావచ్చు. బ్రెజిల్‌కు చెందిన ఎడ్వర్డో గాలనీ ఈ హెలికాప్టర్‌కు డిజైన్ చేసి ‘ఫ్లై సిటీకాప్టర్’ అని పేరు పెట్టాడు. ప్యారిస్‌లో వాహన కాలుష్య సమస్యను తట్టుకోలేక కార్లలకు మూడు రోజుల పాటు విరామం ఇవ్వాల్సిందిగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కాలుష్య సమస్య లేని వాహనం గురించి ఆలోచిస్తున్నప్పుడు గాలనీ ఆలోచనలో నుంచి పుట్టిందే... సిటీకాప్టర్! నగరాలు కిక్కిరిసి పోవడం, ట్రాఫిక్ జామ్‌లతో విపరీతంగా కాలం వృథా కావడం, కాలుష్యం... మొదలైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ బుల్లి హెలికాప్టర్‌ను గాలనీ డిజైన్ చేశాడు.
ఇది కార్టూన్ సీరియల్ ‘ది జెట్‌సన్స్’లోని వాహనాన్ని పోలి ఉంటుంది. ఈ ఎకో-ఫ్రెండ్లీ హెలికాప్టర్‌లు ట్రాఫిక్ జామ్‌ల బాధను తప్పిస్తాయి. ఈ హెలికాప్టర్‌లో చేసే ప్రయాణానికి ‘ఎకో-ఫ్రెండ్లీ ట్రావెల్’ అని పేరు పెట్టాడు గాలనీ. రవాణారంగంలో పనిచేసే సృజనాత్మకత ఉన్న వ్యక్తులకు తన ఐడియా... మరిన్ని కొత్త ఆలోచన ఇస్తుందని నమ్ముతున్నాడు.
భూ తాపాన్ని బలంగా సవాలు చేయడానికి తన నమూనా ఉపయోగపడుతుందనేది గాలనీ విశ్వాసం. ఈ హెలికాప్టర్లు ‘గ్రీన్ రివల్యూషన్’లో భాగం అని కూడా చెబుతున్నాడు. కార్బన్,అల్యూమినియం, టైటానియం... మొద లైన వాటిని ఉపయోగించి తయారుచేసే సిటీకాప్టర్‌కు, ఎలక్ట్రిసిటీ, సోలార్ సెల్స్ ద్వారా శక్తిని సమకూర్చుకోవచ్చు. రీఛార్జీ చేసుకోవచ్చు. వాటి రాక కోసం ఎదురుచూద్దాం!