మీ క్రెడిట్ స్కోరెంత? | Skorenta your credit? | Sakshi
Sakshi News home page

మీ క్రెడిట్ స్కోరెంత?

Published Fri, Mar 14 2014 11:19 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

మీ క్రెడిట్ స్కోరెంత? - Sakshi

మీ క్రెడిట్ స్కోరెంత?

ఈ రోజుల్లో అప్పు చేయనిదెవరు చెప్పండి? గృహ రుణం, వ్యక్తిగత రుణం, విద్యా రుణం, వాహన రుణం... ఇలా ఏ లోన్ తీసుకోవాలన్నా ప్రస్తుతం క్రెడిట్ స్కోరే కీలకం. ఈ స్కోరు బాగుంటేనే బ్యాంకులు రుణాలిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.  ఈ నేపథ్యంలో క్రెడిట్ స్కోరు ప్రాధాన్యమేంటి? దాన్ని మెరుగుపర్చుకునే మార్గమేంటి? అనే అంశాలపై రేటింగ్ సంస్థ ‘క్రెడిట్ సుధార్’ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ వాధ్వానీ ఏమంటున్నారో చూద్దాం...
 
మెట్రోలు కావొచ్చు.. ఇతర నగరాలు కావొచ్చు.. సొంతిల్లు కావాలని కోరుకునే మధ్యతరగతి వర్గాల సంఖ్య పెరుగుతోంది. దీంతో గృహ రుణాలు తీసుకోవడం తప్పనిసరిగా మారుతోంది. సాధారణంగానే ఇందుకు సంబంధించి చాలా లెక్కలేస్తాం. వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? రుణమెంత వస్తుంది? ఎంత దాకా కట్టాలి? ఇవన్నీ ఆలోచిస్తాం. ఇంత కసరత్తు చేసి వెళితే.. కొన్నిసార్లు బ్యాంకులు రుణం దరఖాస్తును తిరస్కరిస్తుం టాయి. అప్పుడేం చేయాలి? ప్రణాళికలు తలకిందులు కావాల్సిందేనా? అసలింతకీ దరఖాస్తునెందుకు తిరస్కరిస్తారని చూస్తే... ప్రధాన కారణం క్రెడిట్ స్కోరే. లోన్ తీసుకోవాలనుకునేవారు.. గతంలో రుణాలు తీసుకునే విషయంలోను, చెల్లించే విషయంలోనూ ఎలా వ్యవహరించారన్న చరిత్రను చెప్పేదే క్రెడిట్ స్కోరు.  

సిబిల్, ఈక్విఫ్యాక్స్ వంటి క్రెడిట్ బ్యూరోల వద్ద ఈ వివరాలుంటాయి. మనకు గతంలో రుణాలు, క్రెడిట్ కార్డులు లాంటివి ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, డెట్ కలెక్షన్ ఏజన్సీలు ఆ వివరాలన్నీ కూడా ఈ బ్యూరోలకు చేరవేస్తాయి. ఈ సమాచారాన్ని మదించి సదరు బ్యూరోలు మన క్రెడిట్ స్కోరును నిర్ధారిస్తాయి. మనం తర్వాత ఎప్పుడైనా రుణం తీసుకోవాలనుకుంటే.. ఆయా బ్యాంకులు సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోల నుంచి మన క్రెడిట్ స్కోరు తీసుకుంటాయి.

మనకు రుణం ఇవ్వడం సురక్షితమేనా కాదా అన్నది అంచనా వేసుకుంటాయి. కాబట్టి ప్రస్తుతం రుణం పొందాలంటే మన క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంచుకోక తప్పదు. అలా చేయాలంటే బకాయిదారుల జాబితాలో మీ పేరు లేకుండా చూసుకోవడం ముఖ్యం. అలాగే, అవసరానికి మించి.. ఒకేమారు బోలెడ న్ని రుణాలు, బోలెడన్ని క్రెడిట్ కార్డులు తీసుకోవడం కూడా మంచిది కాదు. మీరెప్పుడూ రుణాల్లోనే ఉంటారన్న భావన కలిగినా మీ క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
 
ఒకవేళ ఇప్పటికే ఈ పొరపాటు జరిగి ఉంటే ... సరిదిద్దుకునే అవకాశాలూ, స్కోరును మెరుగుపర్చుకునేందుకు కూడా అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన సర్వీసులు అందించేందుకు ప్రస్తుతం ప్రత్యేకంగా సంస్థలున్నాయి.
 
సాధారణంగా 700-900 పాయింట్ల దాకా స్కోరు తెచ్చుకోగలిగిన పక్షంలో రుణాలు పొందడానికి సులువవుతుంది. స్కోరు మెరుగ్గా ఉంటే.. బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలిస్తాయి కూడా.
 - గౌరవ్ వాధ్వానీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement