
నిద్రలో కలల స్క్రీన్ ప్లే
కల జీవితానికి స్ఫూర్తి...
స్వప్నలోకం
కల జీవితానికి స్ఫూర్తి. ఆ మాటకొస్తే బతకడానికి ఓ ఆర్తి! అసలు కలలు కనని వారుంటారా? పగటి కలలు, రాత్రి కలలు... ఎన్ని అందమైన అనుభూతులను మిగులుస్తాయి! ఇంకెన్ని భయాలను కలిగిస్తాయి! మన ప్రమేయం లేకుండానే మస్తిష్కం నుంచి ప్రొజెక్ట్ అయి మూసిన కనురెప్పల మాటున కలర్‌ఫుల్ సినిమాను చూపిస్తాయి. ఒక్కోసారి కథానాయకుడిగా స్టోరీనంతా నడిపిస్తుంటాం! మరోసారి ప్రతినాయకుడిగా కత్తి పట్టుకొని కనిపిస్తాం! మన మరణానికి మనమే చింతిస్తుంటాం! నిజ జీవితంలో సాధ్యంకాని సాహసాలన్నిటినీ చేసేస్తుంటాం! కొన్ని కలలు మన ఆశయాలకు ప్రేరణనిస్తూ.. ఇంకొన్ని రాబోయే కీడును హెచ్చరిస్తూ జీవనమార్గాన్ని చూపెడతాయంటారు స్వప్నశాస్త్ర పండితులు.
అందులో నిజానిజాలెలా ఉన్నా లక్ష్యసిద్ధికి కలలు కనాల్సిన అవసరం ఉందని నొక్కివక్కాణిస్తారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్. అలా కలలు కని జీవితాశయాన్ని ఏర్పర్చుకున్న వాళ్లు ఉన్నారు.. భవిష్యత్ గమ్యం గురించి కలలు కని దాన్ని చేరుకున్న వాళ్లూ ఉన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త ఇలియాస్ హోవే తనకు చిన్నప్పడు వచ్చిన కల వల్లే ‘కుట్టు మిషన్’ కనుక్కున్నానని చెప్పారట. అలాగే ‘ఏసీ ఇండక్షన్ మోటార్’ పుట్టడానికి కారణం సైంటిస్ట్ ‘నికోలా టెస్లా’కు వచ్చిన కలే! ప్రపంచాన్నంతా తన చుట్టే తిప్పుకుంటున్న ‘గూగుల్’ ఐడియాను ‘లారీ పేజ్’కు అందించింది ఈ కలామతల్లే! ఈ అద్భుతాలన్నీ మనిషికి కలల కురిపించిన వరాలు.
ప్రమాద సంకేతాలుగా...
అయితే కొందరికి భవిష్యత్తులో తమకు ఎదురయ్యే ప్రమాద సంకేతాలు కూడా కలలుగా వస్తాయట. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌కు ఓ కల వచ్చిందట. అతణ్ని ఎవరో హత్య చేసినట్టు. అచ్చం అతను కలకన్నట్టే తన భార్యతో ఓ థియేటర్‌లో ఉన్నప్పుడు బూత్ అనే వ్యక్తి లింకన్‌ను గన్‌తో కాల్చి చంపాడు. కల నిజమైన విషాదం ఇది. అలాగే 9/11 సంఘటన బాధితులు కూడా తమకు ఏదో ప్రమాదం జరగనున్నట్టు కల కన్నామని చెప్పారట. కలలకున్న ప్రాధాన్యం ఇది మరి. ఏమైనా కలలు రావడం ఆరోగ్యకరమని, కలల ఆధారంగా తమ మానసిక పరిస్థితిని ఎవరికి వారు అంచనా వేసుకోవచ్చని మానసిక వైద్యులూ చెప్తున్నారు. తరచూ పీడ కలలు వచ్చేవారికి మనసులో ఏదో ఆందోళనగా ఉంటుందని, వారు తప్పక నిపుణులను సంప్రదించాల్సిన అవసరం ఉందంటున్నారు.
కలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
- గురక పెడుతున్నప్పుడు కలలు రావడం అసాధ్యం (ట).
- నిద్ర లేచిన మొదటి నిమిషంలోనే 90 శాతం కలను మరచిపోతారు.
- మూడు సంవత్సరాలలోపు పిల్లలు తమ గురించి కలలు కనలేరు.
- మనుషులు ఒక రాత్రి 3-7 కలలు కంటారు. మొత్తం రాత్రిలో రెండు నుంచి మూడు గంటలు కలల్లోనే ఉంటారు.
- ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో దాదాపు 6 ఏళ్లు కలల్లోనే ఉంటారు.
- పురుషుల కలల్లో 70 శాతం పురుషులే వస్తారట. కానీ మహిళల కలల్లో పురుషులు, మహిళలూ సమానంగా వస్తారట.
- 12 శాతం మందికి కలలు బ్లాక్ అండ్ వైట్‌లో వస్తాయట.
- అంధులూ కలలు కంటారు. జన్మతః అంధులకు వారి కలల్లో కేవలం మాటలు మాత్రమే వినిపిస్తాయట. అలాగే మధ్యలో చూపు కోల్పోయిన వారికి వారు చూసిన వ్యక్తులు, దృశ్యాలు కలలోకి వస్తాయట.