
న్యూయార్క్ : నిద్రలో తరచూ లేస్తూ, మళ్లీ నిద్రించేందుకు సతమతమయ్యే వారు గుండె పోటు, స్ట్రోక్‌కు గురయ్యే ముప్పు అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. తరచూ నిద్రాభంగానికి లోనయ్యే వారి గుండె కొట్టుకోవడం లయ తప్పి హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరించింది.
కంటినిండా నిద్ర కరవైన వారిలో గుండె క్రమపద్ధతిలో కొట్టుకోవడానికి ఆటంకం కలుగుతుందని, ఇది శరీరంపై ఒత్తిడి పెంచుతుందని అమెరికన్ పరిశోధకులు గుర్తించారు. కోటి 40 లక్షల మందిపై జరిపిన అథ్యయనంలో రాత్రి వేళల్లో నిద్రలేమితో బాధపడేవారిలో గుండె కొట్టుకునే వేగంలో అసాధారణ మార్పులు చోటుచేసుకునే ముప్పు మూడోవంతు అధికమని వెల్లడైంది. నిద్రలేమితో గుండె వ్యాధులు, స్ర్టోక్ ముప్పు అధికమని తొలిసారిగా వెల్లడైన ఈ అథ్యయన వివరాలు జర్నల్ హార్ట్ రిథమ్‌లో ప్రచురితమయ్యాయి.