APP.. యాప్ హుర్రే
సెల్‌ఫోన్.... పదేళ్ల క్రితం వరకు అది ఒక విలాస వస్తువు. కానీ ఇప్పుడు అదే సెల్‌ఫోన్ నిత్యావసర వస్తువు. ఒక్కరోజు.... కాదు కాదు ఒక్క నిమిషం చేతిలో సెల్‌ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయినట్లు బాధపడతాం. ఈ రోజుల్లో జేబులో స్మార్ట్ ఫోన్ లేని కుర్రాళ్లు లేరు. అన్నీ ఆండ్రాయిడ్‌తో పనిచేసేవే. సెల్‌ఫోన్ ఖాళీగా ఉంటే బాగుండదు కదా? అందుకని బోలెడన్ని అప్లికేషన్లు. ఆండ్రాయిడ్‌లో పనిచేసే కొన్ని వందల అప్లికేషన్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని రకాల అప్లికేషన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అయితే మరికొన్ని అప్లికేషన్లు డేటా కోసం. ఏదేమైనా ఇప్పటి యూత్ అంతా యాప్స్ గోలలో పడ్డారు. ఏ యాప్ తమకు ఉపయోగపడుతుందో వెతికి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అలా ప్రస్తుతం సిటీ యూత్ ఈ యాప్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. అవేమిటో చూద్దామా? టీసీహెచ్‌వీ రమణ
సమోసా అంటే ఇష్టపడాని వారు ఎవరుంటారు..! వేడివేడిగా సమోస తింటే హమ్మ్‌మ్మ్‌మ్మ్... ఆ టేస్టే వేరు కదా? అదేంటీ యాప్స్ అని తినడం గురించి చెప్తున్నాడనుకుంటున్నారా? సమోసా కూడా ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఫేస్‌బుక్‌లో గానీ,వాట్సాప్‌లో గానీ చాటింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని సినిమా డైలాగులను టైప్ చేసి పంపిస్తాం. అలా టైప్ చేసే బదులు డెరైక్ట్‌గా ఆ డైలాగ్‌నే ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తే? బాగుంటుంది కదా? ఈ సమోసా అందుకు ఉపయోగనడుతుంది. ఇందులో బాగా పాపులర్ అయిన సినిమా డైలాగ్స్ కొన్ని ఉంటాయి. వాటిని నేరుగా ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ కాంటాక్ట్‌కు షేర్ చేసుకోవచ్చు. భలే ఫన్నీగా ఉంటుంది.
వూమీ
టీవీలో వచ్చే సినిమాల గురించి లేదా పాటల గురించి విషయాలు తెలుసుకోవడానికి వూమీ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సింది చాలా సింపుల్. జస్ట్ అప్లికేషన్ ఆన్ చేసి వదిలేస్తే చాలు. అందులో నుంచి వచ్చే సౌండ్‌ను క్యాచ్ చేసి దానికి సంబంధించి ఇంటర్‌నెట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు కష్టపడి నెట్‌లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు.
సూపర్ బ్యాకప్
స్మార్ట్ ఫోన్స్ వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. వైరస్ రావడం వల్ల మొబైల్ స్లో అయ్యే ఛాన్స్ ఉంది. కచ్ఛితంగా మొబైల్ అప్‌డేషన్‌కు ఇవ్వాలి. సెల్‌లో ఉన్న డేటా అంటే డిలీట్ అయిపోతుంది. అది అందరికీ తెలిసినదే. అయితే కాంటాక్ట్స్ వరకు బ్యాకప్ తీసుకోవడం తెలుసుగానీ డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్స్, మెసెజస్, కాల్‌లాగ్ ఇవన్నీ లాస్ అవ్వాల్సిందే. అదే ఈ సూపర్ బ్యాకప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు ఏవీ నష్టపోవలసిన పని లేదు. కాల్‌లాగ్‌తో సహా మొబైల్‌లోని డేటా అంతటినీ బ్యాకప్ చేసుకుని మెమొరీ కార్డ్‌లో సేవ్ చేసుకోవచ్చు.
మరికొన్ని....
ఫ్రీ వీడియో కాలింగ్ కోసం ఐఎంవో ఉంది. ఎంత సేపైనా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. కేవలం డేటా ఛార్జీలు తప్ప మెయిన్ బాలెన్స్ ఛార్జ్ అవ్వదు. మరొక యాప్... ఇది వరకు మొబైల్ టూ మొబైల్ డేటా ట్రాన్స్‌ఫర్ కోసం బ్లూటూత్ వాడేవాళ్లం. చాలా సమయం తీసుకునేది ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి. కానీ ఇప్పుడు ‘షేరిట్’ యాప్ ద్వారా 1 జీబీ మెమొరీను కూడా కొన్ని సెకన్లలోనే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటి వాళ్లందరికీ వర్క్ చాలా ‘స్మార్ట్’గా జరగాలి. అందుకే టెక్ట్స్ టైప్ చేయడానికి కూడా ఇష్టపడడం లేదు. అలాంటి వారి కోసమే ‘స్పీచ్ టూ టెక్ట్స్’ అప్లికేషన్ ఉంది. మీరు మాట్లాడితే చాలు. అది టెక్ట్స్‌గా మారి స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది.
జాగ్రత్త అవసరం
నెట్‌లో మనకు ఉపయోగపడే అప్లికేషన్స్ చాలా ఉంటాయి. అయితే అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది కాదు. కొన్ని అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం వలన మొబైల్‌లోకి వైరస్ వచ్చి సెల్ హ్యాంగ్ అయ్యేలా చేయవచ్చు. అలాగే మన డేటాను ఇతరులు హ్యాక్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైనా ఒక అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకునే ముందు ఆ యాప్‌కు ఎన్ని డౌన్‌లోడ్స్ ఉన్నాయి. డెవలపర్ ఎవరు? రివ్యూలు ఎలా ఉన్నాయి? ఇలాంటివన్నీ చూసుకుని డౌన్‌లోడ్ చేసుకుంటే మంచిది.
ఫన్నీగా ఉంది
సమోసా యాప్ చాలా ఉపయోగంగా ఉంది. ఫ్రెండ్స్‌తో సరదాగా మాట్లాడుకోవడానికి ఇందులో డైలాగ్స్ బాగుంటాయి. ఒక్కోసారి టెక్ట్స్ లేకుండా కేవలం ఈ యాప్‌లోని డైలాగ్స్‌తోనే మాట్లాడుకుంటాం. నేను ఒక డైలాగ్ పంపితే దానికి రిలేటెడ్‌గా మరొక డైలాగ్ పంపడం ఇలా అన్నమాట. నాకు ఈ యాప్ గురించి తెలియగానే వెంటనే డౌన్‌లోడ్ చేసుకున్నాను. చాలా ఫన్నీగా ఉంది ఈ అప్లికేషన్.
- హేమంత్, స్టూడెంట్
సూపర్‌గా ఉంది
నా స్మార్ట్ ఫోన్ అప్పుడప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్‌కు ఇస్తుంటాను. అప్పుడు కేవలం నా కాంటాక్ట్స్ ఒక్కటే బ్యాకప్ తీసుకునేవాడిని. మిగిలిన డేటా,అప్లికేషన్స్ అన్నీ డిలీట్ అయిపోయేవి. మళ్లీ ఫస్ట్ నుంచి నాకు కావలసిన అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. డేటా బాలెన్స్,టైం.. రెండూ వేస్ట్. అదే సూపర్ బ్యాకప్ యాప్‌తో అయితే అప్లికేషన్స్, కాల్‌లాగ్స్, మెసెజెస్ అన్నీ బ్యాకప్ తీసుకుని మెమొరీ కార్డ్‌లో సేవ్ చేసుకోవచ్చు.
- అఖిల్, స్టూడెంట్
చాటింగ్‌కు బాగుంది
నాకు ఇటీవలే మలేసియాలో జాబ్ వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరూ వైజాగ్‌లోనే ఉన్నారు. వాళ్లతో ఫోన్‌లో మాట్లాడాలి అంటే బిల్ ఎక్కువ అయిపోతుంది. అందుకే ఐఎంవో యాప్ నుంచి ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అది కూడా వీడియోతో కాలింగ్‌తో. నాలా ఫ్రెండ్స్,ఫ్యామిలీకి దూరంగా ఉండే వారికి వాళ్లతో కాసేపు టైం స్పెండ్ చేయడానికి ఈ అప్లికేషన్ బాగుంటుంది.
- శివ, మలేసియా