మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్ కొనిస్తున్నారా?
జాగ్రత్త
ఈ రోజుల్లో పది పన్నెండేళ్లు దాటిన చిన్నారులు కాస్త మారాం చేయగానే స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ ఫోన్లు కొనివ్వడం తలిదండ్రులకు మామూలైపోయింది. అయితే ఆ ఫోన్ కొనిచ్చిన కొద్దిరోజుల తర్వాత కానీ వారికి తెలియడం లేదు... తామెంత తప్పు చేశామనేది. ఫోన్లు... ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టాబ్‌లు పిల్లల నిద్రను దూరం చేస్తాయని, చదువును చెడగొడతాయని, వారికి, తోటి పిల్లలతో స్నేహ సంబంధాలను దెబ్బతీస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దాదాపు రెండువేలమందికి పైగా ప్రాథమికోన్నత, హైస్కూలు స్థాయి చిన్నారులపై నిర్వహించిన ఈ సర్వేలో తేలినదేమిటంటే- పొద్దస్తమానం టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం వల్లనే పిల్లల చదువు దెబ్బతింటుంద ని ఇంతవరకు వాపోతున్నారు పెద్దలు.
అయితే స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్‌లు వంటివి వాడే పిల్లల పరిస్థితి వీరికన్నా మరింత దారుణంగా తయారవుతున్నట్లు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. వెండితెరకన్నా బుల్లితెర, బుల్లితెరకన్నా కంప్యూటర్ తెర, కంప్యూటర్ తెరకన్నా ఫోన్ స్క్రీన్ చిన్నారులను నిద్రకు మరింతగా దూరం చేస్తాయని, తగినంత నిద్రలేని పిల్లలు చదువులోనే కాకుండా, ఇతర విషయాల్లో కూడా వెనకబడతారని వీరంటున్నారు. కాబట్టి మీ స్మార్ట్‌కిడ్స్‌కు స్మార్ట్‌ఫోన్ కొనిచ్చేముందు మరికాస్త స్మార్ట్‌గా ఆలోచించమని నిపుణులు సలహా ఇస్తున్నారు.