శ్రీహిత కుటుంబాన్ని ఓదారుస్తున్న కల్యాణి
కలచివేసే ఘటనలుజరుగుతున్నాయి.కఠినమైన చట్టాలూ ఉన్నాయి!అయినా ఆడపిల్లలపైఅఘాయిత్యాలుపెరుగుతూనే ఉన్నాయి.నిన్న మొన్న.. వరంగల్‌లోపసికందుపై ‘హత్యాచారం’..ఒంగోలులో టీనేజ్‌పై గ్యాంగ్ రేప్..!వీటిని ఆపేదెలా?!‘గట్టి చట్టాలు ఉంటేసరిపోదు..ఆ చట్టాలను..గట్టిగా అమలుపరిచేవాళ్లుండాలి’’అంటున్నారుప్రముఖ సామాజికకార్యకర్త కల్యాణి.
శ్రీహిత... తొమ్మిది నెలల పాపాయి. ఆమెకు పాలు తాగిస్తూ జో కొడుతోంది పాపాయి తల్లి. సగం పాలు తాగగానే నిద్రలోకి జారుకుంది శ్రీహిత. పాపాయిని ఒత్తిగిల తిప్పి పడుకోబెట్టింది. పాల సీసాను పక్కనే పెట్టి తనూ నిద్రలోకి జారిపోయింది. పాపాయి కదిలినప్పుడు మిగిలిన పాలు తాగిద్దామనుకుందా తల్లి. అమ్మపక్కన పడుకుని ఉన్నాననే భరోసాతో లోకాన్ని మరిచి నిద్రపోతోంది శ్రీహిత. అర్ధరాత్రి, దాదాపుగా ఒకటి ముప్పావు సమయంలో పాపాయికి ఆకలవుతుందేమోనని పాలు తాగిద్దామని తడిమి చూసుకుంది. పాపాయి లేదు. ఒంటిగంట సమయంలో టెర్రస్ మీద నిద్రపోతున్న పాపాయిని ఎత్తుకెళ్లిపోయాడు దుండగుడు! అమ్మానాన్న, బంధువులు, పోలీసులు అందరూ పాపాయి కోసం వెతకడం మొదలు పెట్టారు. దుండగుడు ఒక టవల్‌లో పాపాయిని చుట్టి పరుగులు తీస్తుండడాన్ని గమనించాడు శ్రీహిత మేనమామ. బంధువులు పరుగెత్తుకెళ్లి అతడిని పట్టుకున్నారు. దుండగుడిని పోలీసులకు పట్టించి పాపాయిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే... ఆ చంటిబిడ్డ ప్రాణాలు ఎప్పుడో గాల్లో కలిసిపోయాయి. మానవమృగాల్లో దాగిన కర్కశత్వాన్ని భరించలేని ఆ పసిప్రాణం ఈ లోకంలో ఉండకూడదనుకుంది. వరంగల్, హన్మకొండలోని కుమ్మరపల్లిలో ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున జరిగిన సంఘటన ఇది.
న్యాయపోరాటం
పాలు తాగే చంటిబిడ్డ హత్యకు గురైంది. అంతకంటే ముందు మాటల్లో చెప్పలేని అఘాయిత్యానికి కూడా బలైంది. హంతకుడిని వెతికి పట్టుకునే శ్రమ కూడా పోలీసులకు లేకుండా బంధువులే పట్టిచ్చారు. పోలీసులు హంతకుడి మీద అపహరణ, హత్య, దొంగతనం (పాపాయి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్‌లను దొంగిలించాడు), సెక్షన్‌లతోపాటు పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) కింద కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఇంకా హంతకుడి పేరు ప్రవీణ్ అని, అతడు తమ చేతికి చిక్కేటప్పటికి మద్యం సేవించి ఉన్నాడని, శ్రీహిత ప్రైవేట్ పార్ట్స్‌లో గాయాలను తాము గుర్తించినట్లు, లైంగిక వేధింపుకు గురైనట్లు కూడా చెబుతున్నారు. అయితే పోలీసులు హంతకుడిని ఎక్కడో దాచేశారని, ఎక్కడ దాచారో కూడా తెలియడం లేదని శ్రీహిత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మరే బిడ్డకూ జరగకూడదని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. శ్రీహిత సంఘటనకు వరంగల్ నగరం ఒక్కటే కాదు తెలుగు రాష్ట్రాలు రెండూ ఉడికి పోయాయి. పౌర సమాజం ఆగ్రహజ్వాలలు అగ్నికీలల్లా ఎగిసిపడ్డాయి. ‘హంతకుడికి శిక్ష విధించండి, శిక్షను బహిరంగంగా అమలు చేయండి, ఉన్మాది మీద దయ చూపకండి, ఉన్మాదిని ఉరితీయండి’ అని ఆందోళనలు చేశారు. అయితే... ఆందోళన చేస్తున్న పౌరుల మీద దాడులు జరుగుతున్నాయి తప్ప హంతకుడి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
చట్టాలను తిరగరాయండి
‘‘మన పీనల్ కోడ్ రాసుకున్నప్పటి సామాజిక పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. సమాజంలో ఇంతటి తీవ్రమైన నేరాలు లేని రోజుల్లో రాసుకున్న చట్టాలవి. ఓ సారి నిపుణులందరూ కూర్చుని చట్టాలను, ప్రస్తుత సామాజిక పరిస్థితులను సమీక్షించండి. అవసరమైన కొత్త చట్టాలను తీసుకురండి. మేల్‌సొసైటీ సున్నితత్వాన్ని కోల్పోతోంది. మహిళలు, బాలికల మీద క్రైమ్ రేట్ ఏడాదికేడాదికీ పెరిగిపోతూనే ఉంది. శ్రీహిత విషయంలో.. కేసును విచారించకనే ‘మద్యం మత్తులో నేరానికి పాల్పడ్డాడ’నే తొలి పలుకులు వినిపిస్తున్నాయి. దీనర్థం నెపాన్ని మద్యం మీదకు తోసేసి హంతకుడిని శిక్ష నుంచి తప్పిస్తారా’’ అని ప్రశ్నిస్తున్నారు శ్వాస ఫౌండేషన్ నిర్వహకురాలు గొర్రె కల్యాణి.
స్పందన కోసం ఎదురుచూపు
‘‘టీవీలో వార్త చూడగానే మనసు కలచివేసింది. టీవీ, పేపర్‌లతోపాటు సోషల్ మీడియాను కూడా ఫాలో అవుతూనే ఉన్నాను. కలెక్టర్ వచ్చిన పది నిమిషాలకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారని తెలిసింది. ఒక్క ప్రజాప్రతినిధి కూడా వచ్చిన దాఖలాలు కనిపించలేదు. ఎలక్షన్ ప్రచారంలో దోసెలు వేశారు, ఇస్త్రీ చేశారు, పిల్లలకు స్నానాలు కూడా చేయించారు. అలాంటిది ఒక
చంటిబిడ్డకు జరగరాని ఘోరం
జరిగితే ఒక్కరూ రాలేదేంటని నేనే రంగంలోకి దిగాను. ‘ప్రధాన మంత్రి మోదీకి, కేటీఆర్‌కి ‘స్పందించండి ప్లీజ్’ అని ట్వీట్ చేశాను. నా ఫ్రెండ్స్ చేత కూడా చేయించాను. అలాగే నా ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌ని.. ‘కంప్యూటర్ ముందు కూర్చుని సానుభూతి వచనాలు పోస్ట్ చేయడం కాదు, అందరూ కదిలి రోడ్డు మీదకు రావాలి. మౌనంగా అక్షరాల్లో అసహనాన్ని వ్యక్తం చేస్తే సరిపోదు, న్యాయపోరాటం కోసం
గళం వినిపించాలి’ అని కూడా కోరాను. హన్మకొండ ఏకశిలా పార్క్‌లో 22వ తేదీన ధర్నాలో పాల్గొన్నాం. వారం రోజుల్లో 15 రేప్‌లు జరిగాయి. నిర్భయ చట్టం ఏమవుతుందో తెలియడం లేదు. పోక్సో చట్టం ఎందుకు అమలు కావడం లేదో అర్థం కావడం లేదు. ఉత్తర ప్రదేశ్‌లో ఆరేళ్ల బాలికను రేప్ చేసి పారిపోయిన నిందితుడిని పోలీసులు వెతికి పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పారిపోతుంటే కాళ్ల మీద కాల్చారు ఎస్‌పి. ప్రకాశం జిల్లాలో బాలిక మీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన వాళ్లను గంటల్లో వెతికి పట్టుకున్నారు. పోలీసులు చట్టాన్ని పరిరక్షించాలనుకుంటే పరిరక్షించగలరు. శ్రీహిత విషయంలో అలా అనుకోవడం లేదు ఎందుకనేదే మా ఆవేదన. చట్టం అమలవక పోవడమూ అఘాయిత్యమే.
జనాగ్రహం
మేము ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు చెదరగొట్టేశారు. మూడు వందల మందిని ఒక చోట ఉండనివ్వకుండా ఐదారు చోట్లకు తరిమేశారు. ఆ ఘర్షణలో అక్కడ ఉన్న జనం నుంచి ‘మేము హంతకుడిని పోలీసులకు పట్టిచ్చి తప్పు చేశాం. ఒక్కొక్కరం ఒక్కొక్క దెబ్బ వేసినా చచ్చి ఊరుకునే వాడు. మరొకడు ఈ దుర్మార్గపు పనికి పూనుకోకుండా భయపడేవారు. వాడిని మాకివ్వండి నడిరోడ్డు మీద ఉరితీస్తాం. న్యాయం అడుక్కోవడం ఏమిటి, మేమే అమలు చేస్తాం’ అనే మాటలు వినిపించాయి. జనాగ్రహం ఇంత తీవ్రంగా ఉంటే ‘తొమ్మిది నెలల పాపాయిని రేప్ చేయడం జరిగే పనేనా’ అంటూ మరొక వాదన వినిపించింది. పాపాయి ప్రైవేట్ పార్ట్స్‌కు గాయాలయ్యాయని, ఎముకలు విరిగి బిడ్డ దేహం ఛిద్రమయ్యి కనిపిస్తుంటే ఆ మాటలు అనడానికి వాళ్లకు నోరెలా వచ్చిందో తెలియడం లేదు. ఇదంతా కేసును నిర్వీర్యం చేయడానికి చాప కింద నీరులా జరుగుతున్న కుట్ర ఏమో అనిపిస్తోంది’’ అన్నారు కల్యాణి.
శ్రీహితకు జరిగిన అన్యాయానికి నిరసనగా లండన్‌లో ర్యాలీ జరిగింది. ఆ సంఘటన జరిగిన వరంగల్‌లో పౌరసమాజం నోరు నొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా ఆ బిడ్డ ఎందుకు ఇంతటి దారుణానికి బలి కావాలి? ఆడపిల్లగా పుట్టడమే శ్రీహిత చేసిన తప్పా?– వాకా మంజులారెడ్డి
తక్షణం శిక్ష ఉండాలి
చంటి బిడ్డల మీద అఘాయిత్యానికి పాల్పడిన వాళ్లను ఇరవై నాలుగ్గంటల లోపు అరెస్ట్ చేసి ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయాలి. నెల రోజుల్లో తీర్పు ఇచ్చి శిక్షను అమలు చేయాలి. ఆ శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. ఎంత కఠినంగా ఉండాలంటే.. మరొకరు ఎవరైనా ఇలాంటి దురాగతానికి పాల్పడేటప్పుడు ఈ శిక్షలు గుర్తుకు వచ్చి వెనక్కు తగ్గేటట్లు భయం కలిగించాలి. అదే శ్రీహిత చట్టం. అంతటి కచ్చితమైన శ్రీహిత చట్టం.. మహిళా సమాజానికి హితకారిణి కావాలి. మద్యం తాగినందువల్లే ఇలా చేశాడని నమ్ముతుంటే... మద్యాన్ని కూడా నిషేధించాలి. నా మట్టుకు నాకు ఎదురైన సంఘటన.. ఒకసారి టాక్సీలో వెళ్తున్నప్పుడు డ్రైవర్ ఉద్దేశ పూర్వకంగా రూట్ డైవర్ట్ చేశాడు. నేనది గమనించి అతడిని గట్టిగా హెచ్చరించడంతో దారికొచ్చాడు. అప్పటి నుంచి హ్యాండ్ బ్యాగ్‌లో కత్తి పెట్టుకుని ప్రయాణిస్తున్నాను. ఆడపిల్లలు కత్తి దగ్గర పెట్టుకోగలరేమో కానీ ఎంతమంది ఆ కత్తిని ధైర్యంగా ఉపయోగించగలుగుతారు? చట్టాలే కత్తి వాదర అంత పదునుగా మారి ఆడపిల్లకు రక్షణగా ఉండాలి.– జి. కల్యాణి, శ్వాస ఫౌండేషన్ నిర్వహకురాలు
Comments
Please login to add a commentAdd a comment