నెట్‌జంక్‌ | social media comments on bollywood childrens | Sakshi
Sakshi News home page

నెట్‌జంక్‌

Published Mon, Jun 11 2018 12:38 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

social media comments on bollywood childrens - Sakshi

జంక్‌ ఫుడ్‌ని చూస్తే తినబుద్ధేస్తుంది. కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. సోషల్‌ మీడియా కామెంట్స్‌ కూడా జంక్‌ ఫుడ్‌ లాంటివే. కాలక్షేపానికి బాగానే ఉంటాయి. కానీ అవి.. ‘టార్గెట్‌’ అయినవారి మనశ్శాంతిని కబళించివేస్తాయి. అందుకే.. సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ఫ్యామిలీ విషయాలను నెట్‌లో ‘పంపకానికి’ పెట్టకపోవడమే మంచిది. ‘నెట్‌ జంక్‌’ కాకుండా ఉంటారు. నిరంతరం ఆహారం కోసంవెదుకుతుండే గేలాలకు చిక్కుకోకుండా ఉంటారు. 

ఇటీవల ఆమిర్‌ఖాన్‌ ఫేస్‌బుక్‌లో, ఐశ్వర్యారాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ల వాళ్ల పర్సనల్‌ ఫొటోలను పోస్ట్‌ చేయడం వివాదం అయింది. ఆమిర్‌ తన 21 ఏళ్ల కూతురు ఇరాతో కలిసి పచ్చిక బయళ్లో ప్లేఫుల్‌ మూడ్‌లో ఉన్నప్పుడు తీయించుకున్న ఫొటో వాటిల్లో ఒకటి.  సోషల్‌ మీడియా ఆ ఫొటోను ఏమాత్రం సహించలేకపోయింది. అందులో ఇరా షార్ట్‌ గౌన్‌ వేసుకుని తన తండ్రి గుండెలపై కూర్చుని ఉంది. తండ్రీకూతుళ్ల మధ్య బంధం స్వచ్ఛమైనదే కావచ్చు. అలాంటి ఫొటోను పోస్ట్‌ చేయడంలో ఏమాత్రం స్వచ్ఛత లేదని కామెంట్‌లు వస్తున్నాయి. ఆమిర్‌ వివాదాలకు దూరంగా ఉంటారు. మాటు వేసి ఉండే ఫొటోగ్రాఫర్‌లకు కూడా ఆయన చిక్కరు. అలాంటిది ఇవాళ ఆయనకై ఆయనే స్వయంకృతాపరాధిలా నిలబడ్డారు. వయసొచ్చిన కూతురితో ఆ ఆటలేంటి, రంజాన్‌ నెలలో ఈ విపరీతం ఏంటని.. నిరంతరం ఆహారం కోసం వెతుకుతుంటే సముద్రపు చేపల్లా.. ట్రోలింగ్‌ వేటగాళ్లు ఆమిర్‌పై బాణాలు వేశారు. రాయడానికి వీల్లేని మాటల్లో ఆ తండ్రీకూతుళ్ల బాంధవ్యానికి సంబంధాలను అంటగట్టారు. ఆమిర్‌ ఏం మాట్లాడలేదు. మనం రైట్‌ అనుకున్నదాన్ని రాంగ్‌ అనేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. అందుకే కుటుంబ అనుబంధాలను ఈ రైట్‌లు, రాంగ్‌ల మధ్యకు తీసుకురాకూడదు. ఈ విషయం ఆమిర్‌కు తెలియకుండా ఉంటుందా?  

లిప్‌ టు లిప్‌ కిస్‌
తల్లికి కూతురు ఇచ్చిన ముద్దే అది. అయినా ఈ బాహాటపు ముద్దును సోషల్‌ మీడియా భరించలేకపోయింది. కూతురు ఆరాధ్య పెదవులపై తన పెదవులు ఆన్చి ముద్దు పెడుతున్న ఫొటోను ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయ్యగానే నెటిజన్‌లు చికాకుపడిపోయారు. ‘ఏంటమ్మా తల్లీ ఇదీ.. ఎబ్బెట్టుగా’ అని విరుచుకుపడ్డారు. ఐశ్వర్య ఆ ఫొటో కింద.. ‘లవ్‌ యు అన్‌కండిషనల్లీ. హ్యాపీయస్ట్‌ మామా ఇన్‌ ది వరల్డ్‌’ అని ఎంతో ఉన్నతమైన కాప్షన్‌ కూడా పెట్టారు. అయితే ఆ ఔన్నత్యాన్ని ఆ ముద్దు.. సొరచేపలా మింగేసింది. ఐశ్వర్య అభిమానుల హృదయాన్ని తల్లీకూతుళ్ల అనుబంధం కరిగించి ఉండొచ్చు. అయితే ఆమెపై కోపగించి ఎటాక్‌ చేసినవారే ఎక్కువ.‘ఐదారేళ్ల పిల్లల్ని పెదవులపై ముద్దుపెట్టుకోవడం ఏంటో.. యాక్‌!’‘లెస్బియనా ఏంటి!’‘ఐశ్వర్యా.. పిల్లలతో సెక్స్‌ తప్పు’.‘ఈ పాడు వెస్ట్రన్‌ కల్చర్‌మనకెందుకు?’..ఇలా ఐశ్వర్య నెట్‌లో ట్రోల్‌ అయ్యారు.బ్రిటన్‌ సెలబ్రిటీ విక్టోరియా బెక్‌హామ్‌ కూడా సేమ్‌ ఐశ్వర్యలాగే టార్గెట్‌ అయ్యారు. సేమ్‌ ఐశ్వర్యలాగే కాదు! ముందు ఇలా చేసింది విక్టోరియానే.. గత ఏడాది జూలైలో. అప్పట్లో ఆమె తన కూతురు హార్పర్‌ పెదవులపై పెదవులు పెట్టి కిస్‌ చేసిన ఫొటోపైన కూడా ఇలాంటి కామెంట్లే వచ్చాయి. అక్కడే వచ్చాయంటే.. ఇక్కడ రాకుండా ఉంటాయా? 

తప్పు.. ఒప్పు తేల్చేదెవరు?
పబ్లిక్‌ పర్సన్స్‌ పర్సనల్‌ లైఫ్‌ ఈజ్‌ మోర్‌ ఇంట్రస్టింగ్‌ దేన్, ప్రైవేట్‌ పర్సన్స్‌ పబ్లిక్‌ లైఫ్‌. ఎవరో తెలియనివాళ్లు ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు. పెద్దవాళ్ల వ్యక్తిగత విషయాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆమిర్, ఐశ్వర్య, విక్టోరియా.. వీళ్లు చేసింది తప్పా, ఒప్పా అని జడ్జిమెంట్‌ ఇచ్చేయడం తొందరపాటు అవుతుంది. ఎక్కువ మంది తప్పు అంటే తప్పు, ఒప్పంటే ఒప్పు అయిపోదు ఏది కూడా!  ‘ప్రేమను భౌతిక స్పర్శతో వ్యక్తం చెయ్యడంలో తప్పేమీ లేదు. పిల్లలకు బయటి వ్యక్తుల గుడ్‌ టచ్‌ ఏదో, బ్యాడ్‌ టచ్‌ ఏదో తెలియడానికి తల్లిదండ్రుల ద్వారా చల్లని స్పర్శ తెలిసి ఉండడం అవసరం. అయితే మన సమాజం ఇటువంటి భౌతిక స్పర్శను అసౌకర్యంగా భావిస్తుంది’ అనేది ఒక అభిప్రాయం. ‘వీళ్లకొచ్చిన ఇబ్బందేమిటో అర్థం కావడం లేదు. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య కొన్ని స్పెషల్‌ మోమెంట్స్‌ ఉంటాయి. వాటిని వాళ్లు ఎంజాయ్‌ చేస్తున్నట్లే మనమూ ఎంజాయ్‌ చెయ్యడానికి ఇబ్బందేమీ పడక్కర్లేదు.  పేరెంట్స్‌ ప్రేమకు విపరీతార్థాలు తియ్యడం కరెక్ట్‌ కాదు’ అనేది ఇంకో అభిప్రాయం.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement