
ఏ కోటలోనో పాగా వేయడానికి అతడు పాట పాడలేదు కానీ, తోటలో పని చేసుకుంటూ తను పాడిన పాట సినీ స్టార్ కమల్‌హాసన్, మ్యూజిక్ స్టార్ మహదేవన్‌ల గుండెల్లో పాగా వేసింది! ఇప్పుడతడు మ్యూజిక్‌లో ‘రాకింగ్ స్టార్’. అంటే మట్టిరాళ్లలోని మాణిక్యం!
ఎక్కడో కేరళలో రబ్బరు తోటల్లో పనిచేస్తూ కూనిరాగాలు తీసిన ఓ యువకుడి కోసం ప్రఖ్యాత సంగీత దర్శకులు గాలిస్తున్నారంటే అతిశయమే అవుతుంది. అంతేకాదు.. ఆ యువకుడిని లోక నాయకుడు కమల్ హాసన్ తన ఇంటికి పిలుచుకుని అభినందించాడంటే మరో నమ్మశక్యం కాని విషయం అవుతుంది. సంగీతం తెలియదు. అసలు చదువు కూడా అబ్బలేదు. కానీ.. ఆ మలయాళీ యువకుడి అదృష్టం ఒకే ఒక్క పాటతో మారిపోయింది. యూట్యూబ్ లో ట్రెండ్ గా మారిన ఆ మలయాళీ అసలేం చేశాడో చూద్దాం. కేరళలోని ఆళపుళ జిల్లా ఓ మారుమూల గ్రామానికి చెందిన రాకేష్ ఉన్ని రబ్బరు తోటల్లో కూలీగా పనిచేస్తున్నాడు. పని చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ చిత్రంలోని ‘ఉన్నై కానామేం..’ అంటూ సాగే పాటను హృద్యంగా పాడగా దానిని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన స్నేహితులు యూట్యూబ్ లో ఉంచారు. అనుకోకుండా ఆ పాటను విన్న కమల్ హాసన్ వెంటనే దానిని సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ చేరవేశారు.
దీంతో ఆ పాటను విన్న శంకర్ మహదేవన్ దానిని తన ట్విట్టర్ లో పెట్టి ఆ యువకుడిని కలుసుకోవాలని ఉందంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. సంగీతం తెలిసిన జ్ఞానిలా స్వరబద్దంగా రాకేష్ ఉన్ని ఆలపించిన తీరు తనకంటే చాలా బాగుందని అభినందించారు. దీంతో ఆ యువకుడి వివరాలను తీసుకున్న నటుడు కమల్ హాసన్ మంగళవారం రాకేష్‌ను చెన్నైలోని తన కార్యాలయానికి పిలిపించి అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో సమావేశమైన కమల్ హాసన్ రాకేష్ ఉన్నిను పరిచయం చేశారు. తాను కూనిరాగంగా పాడిన ఓ పాటతో తనకు ఇంతటి పేరు వస్తుందని తాను ఊహించలేదని అంటూ.. కమల్ హాసన్, శంకర్ మహదేవన్‌కు రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు శంకర్ మహదేవన్ ను కలుసుకునేందుకు తనకు ఆరాటంగా ఉందన్నారు.
– సంజయ్ గుండ్ల, సాక్షి, చెన్నై
Comments
Please login to add a commentAdd a comment