జెండర్‌ వండర్‌ | Social pressure coming over the gender | Sakshi
Sakshi News home page

జెండర్‌ వండర్‌

Published Tue, Jan 9 2018 11:42 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

Social pressure coming over the gender - Sakshi

ఒకప్పుడు ఆమె పెనుగొండ శివ. ఇప్పుడు ఆపరేటర్‌ జానకి. ఒకప్పుడు ఆలయంలో తలదాచుకున్న అమ్మాయి. ఇప్పుడు నిలువ నీడలేని వాళ్లకు\ ఇళ్లను మంజూరు చేసే పనిలో ఉన్న ఉద్యోగిని. వివక్ష నుంచి ఉద్యోగం వరకూ.. ఇది  జానకి లైఫ్‌ స్టోరీ.. లైవ్‌లీహుడ్‌ స్టోరీ! జానకికి ఇరవై ఆరేళ్లు. వైఎస్‌ఆర్‌ జిల్లా, చెన్నూరులో హౌసింగ్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఆఫీస్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్‌. ఇల్లు లేని వాళ్ల జాబితా తయారు చేసి వాళ్లు సొంతిల్లు కట్టుకోవడానికి అవసరమైన డాటా సిద్ధం చేస్తుంటుంది. పుట్టినప్పుడు ఆమెకి అమ్మానాన్నలు పెట్టిన పేరు శివ. ఇప్పుడామె జానకి.  అవును... ఆమెను పుట్టినప్పుడు అందరూ అబ్బాయి అనే అనుకున్నారు. అయితే తనలో ఉన్నది అబ్బాయి కాదు, అమ్మాయి అని ఆమెకు తెలుస్తూనే ఉండేది. ఇంట్లో మాత్రం, అమ్మాయిలా కాదు అబ్బాయిలా ఉండమని అనుక్షణం ఆదేశాలు వినిపిస్తూనే ఉండేవి. ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా పదిహేనేళ్ల పోరాటం. ఆ స్థితిలో ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగిందన్నది.. ఆమె మాటల్లోనే విందాం.

‘‘మాది కర్నూలు జిల్లా చాగలమర్రి. ఇంటర్‌ వరకు చాగలమర్రిలోనే చదువుకున్నాను. ర్యాంక్‌ స్టూడెంట్‌ని. ‘చదువు బాగా వస్తోంది, డిగ్రీ ఇంగ్లిష్‌ మీడియంలో చేస్తే భవిష్యత్తు బాగుంటుంద’ని మా అన్న ప్రొద్దుటూరులో చేర్పించాడు. ప్రొద్దుటూరు కాలేజ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ తర్వాత పీజీ చేయాలనుకున్నాను. ఎంట్రన్స్‌ రాసి సీటు తెచ్చుకున్నాను కూడా. అప్పటికే నా జెండర్‌ మీద వస్తున్న సామాజిక ఒత్తిడిని తట్టుకోవడం కష్టమైంది. యూనివర్సిటీలో ర్యాగింగ్‌కు భయపడి బీఈడీ ఎంట్రన్స్‌ రాశాను. సీటు వచ్చింది. అధికారులకు నా పరిస్థితి చెప్పి ఇంట్లో చదువుకుని పరీక్షలు రాయడానికి అనుమతి తీసుకుని బీఈడీ పూర్తి చేశాను.

అమ్మ భోరున ఏడ్చింది!
నేను క్లాసులో అబ్బాయిలతో కలసి కూర్చునే వాడిని. కానీ అమ్మాయిలతోనే ఎక్కువగా స్నేహం చేసేవాడిని. ఎనిమిదో తరగతి నుంచి నాలో మార్పులు స్పష్టంగా తెలియడం మొదలైంది. ఇంట్లో చెప్పడానికి ప్రయత్నించినా కుదరలేదు. ‘అలా నడవ వద్దు, అబ్బాయిలా ఉండు’ అని ఒత్తిడి ఉండేది. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు చీరకట్టుకోవాలనే కోరిక బలంగా కలిగింది. అప్పుడు అమ్మకు చెప్పాను. అంతే... ఒక్కసారిగా ఏడ్చేసింది. అసలే ఆమె ఆస్థమా పేషెంట్‌. ఆమెకు ఏమవుతుందోనని భయమేసింది నాకు. ‘ఊరి వాళ్ల ముందు తలెత్తుకునేదెలా, ఆత్మహత్య చేసుకోవడమే దారి’ అంటూ కుమిలిపోయింది అమ్మ. ఇక చేసేదేమీ లేక ఊరుకున్నాను. కానీ వయసుతోపాటు వచ్చే మార్పులు నన్ను నిలవనివ్వలేదు. ఫైనల్‌ ఇయర్‌ తర్వాత స్కాలర్‌షిప్‌ డబ్బుతో ఇల్లు వదిలి వెళ్లిపోయాను.

డాక్టర్‌ నిర్ధారణ!
ఇంటి నుంచి వెళ్లడం వెళ్లడం నేరుగా డాక్టర్‌ దగ్గరకెళ్లాను. పరీక్షించి నిజమేనన్నారు. ఇంకా వయసు పెరిగే కొద్దీ దేహం పూర్తిగా స్త్రీత్వం సంతరించుకుంటుందని చెప్పారు. అదే విషయం ఇంట్లో చెబితే మా అన్న నన్ను విపరీతంగా కొట్టారు. నిజానికి అన్నకు నేనంటే చాలా ప్రేమ. కానీ ఇలాంటి స్థితిని ఫేస్‌ చేయడానికి వాళ్లకు భయం అంతే. ఇల్లు వదిలి వచ్చాక కొన్నాళ్లు గుడిలో తలదాచుకున్నాను. లైఫ్‌ క్రాస్‌రోడ్స్‌లో ఉన్నట్లయింది. íపీజీ ఎంట్రన్స్‌ రాయడానికి కడప వెళ్లినప్పుడు నాలాంటి చాలా మంది కనిపించిన సంగతి గుర్తొచ్చి వాళ్లను కలిశాను. వాళ్లు నన్ను బాగా కలుపుకున్నారు. వాళ్లతో కలసి జీవించడానికి స్వాగతించారు. కానీ చదువు కొనసాగించాలనే కోరికను బయటపెడితే సమాజంలో ఉన్న పరిస్థితులను వివరించి, సాధ్యం కాదన్నారు. వాళ్లతోనే ఉంటూ చెవులు, ముక్కు కుట్టించుకుని, చీర కట్టుకుంటూ, చక్కగా అలంకరించుకుని స్త్రీలాగానే జీవించాను. వేడుకల్లో డాన్సులు చేశాను. జానకి అని పేరు మార్చుకున్నాను. నాకు గాయని జానకి పేరు, ఆమె పాటలు చాలా ఇష్టం. నా ఫోన్‌లో స్క్రీన్‌ మీద కూడా ఆమె ఫొటో ఉంటుంది. నాకు ఆమె పేరునే పెట్టుకున్నాను. 2012 నుంచి ఈ ఉద్యోగం వచ్చే వరకు కడపలోనే ఉన్నాను.

ఆధార్‌ మలుపుతిప్పింది!
ఆధార్‌ కార్డు, ఓటర్‌ లిస్టుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ కోసం కలెక్టర్‌ ఆఫీస్‌లో క్యాంప్‌ పెట్టి పిలిపించారు. అప్పుడు కలెక్టర్‌గారు మాతో చాలా సేపు మాట్లాడారు. మాకు ఎదురయ్యే కష్టాలను చెప్పాం. అప్పుడు ఏం చదువుకున్నావని అడిగి, ఉద్యోగానికి అప్లయ్‌ చెయ్యమన్నారు. డిసెంబర్‌ పదవ తేదీన ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చాలా బాగుంది. ఆఫీసర్లు, తోటి ఉద్యోగులు అందరూ ప్రోత్సహిస్తున్నారు. ఇలాగే సమాజం కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మాలాంటి వాళ్లకు మా ఇళ్లలో స్థానం ఉంటుంది. సమాజం ఆమోదించనంత కాలం అమ్మానాన్నలు, అక్కచెల్లెళ్లు కూడా మమ్మల్ని ఇంట్లో ఉంచుకోవడానికి భయపడతారు. మాలాంటి వాళ్లను ఇంట్లో ఉండనిస్తే ఉద్యోగాలు, చేతనైన పనులు చేసుకుంటూ సామాజిక దాడుల బారిన పడకుండా గౌరవంగా జీవిస్తాం. అర్థం చేసుకోండి ప్లీజ్‌’’ అంటోంది జానకి.

అమ్మ ఇంటికి రమ్మంది.. కానీ!
మా అక్క అంగన్‌వాడీ టీచర్, అన్న బి.ఎ, బీఈడీ చేశాడు. ఇంకా ఉద్యోగం రాలేదు. తమ్ముడు ఇటీవలే సి.ఆర్‌.పి.ఎఫ్‌ ఉద్యోగంలో చేరాడు. మా అమ్మ నాతో ఏదో ఒక రకంగా మాట్లాడుతుంటుంది. ఇంట్లో అందరి క్షేమ సమాచారం చెప్తుంది. మొదట్లో ఓ సారి నన్ను ఇంటికి వచ్చేయమన్నది. నన్ను చీరకట్టుకోనిస్తేనే వస్తానని చెప్పాను. దాంతో ఊర్లో బతకనివ్వరంటూ కన్నీళ్లు పెట్టుకుంది. గంపలు అల్లి కుటుంబాన్ని పోషించి, మమ్మల్ని చదివించి ఇంతటి వాళ్లను చేసింది మా అమ్మ. ఆమె సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. నన్ను కూతురిగా స్వీకరించడానికి ఆమె సిద్ధమైతే అమ్మ దగ్గరే ఉంటాను.
– జానకి, ఆంధ్రప్రదేశ్‌లో తొలి ట్రాన్స్‌జెండర్‌ ఎంప్లాయీ 
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement