సాక్షి, హైదరాబాద్: కంపెనీల ప్రకటనలు మొదలు కొని సినిమాల వరకూ మహిళను వివక్షతో చిత్రీకరించడాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు నిరసించాలని, అలాంటి ప్రకటనలు, సినిమాలను తిరస్కరించడం, తమ అభ్యంతరాలను స్పష్టంగా చెప్పడం అవసరమని తెలంగాణ గవర్నర్, పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నా.. విస్తృత స్థాయిలో సమాజంలో మాత్రం వివక్ష కొనసాగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రింట్, వీడియో, సినిమాల్లో లింగ వివక్ష, మహిళలను నిర్దిష్ట దృక్కోణం (స్టీరియో టైపింగ్)లో చూపడాన్ని నియంత్రించడం, రూపుమాపడం లక్ష్యంగా ఇండియన్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) శుక్రవారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘వాయిస్ ఆఫ్ ఛేంజ్’’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళలు నిత్యం వివక్షకు గురవుతూనే ఉన్నారని, ప్రతిక్షణం మహిళను నిర్దిష్ట దృక్కోణంతో చూపుతున్నారని ఈ సందర్భంగా గవర్నర్ సోదాహరణంగా వివరించారు.
మహిళలు గవర్నర్లు కారని.. వయసు మీరిన పురుషులే అవుతారన్నట్టుగా ఎనిమిదేళ్ల బాలిక చెప్పడాన్ని తాను ఒక విమానాశ్రయంలో విన్నానని తెలిపారు. ఆఖరుకు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కొన్ని పోటీల్లో బహుమతులుగా వంట పాత్రలు ఇస్తున్నట్లు ప్రకటించారని.. వారి దృష్టిలో ఆడవారంటే వంటిల్లుకు మాత్రమే పరిమితం అని వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పుడు పురుషుల కంటే మహిళ పైలట్లే ఎక్కువగా ఉన్నారని విమానయాన శాఖ మంత్రి తనతో చెప్పినప్పుడు ఎంతో సంతోషించానని, దురదృష్టవశాత్తూ సమాజంలో చాలామంది పాత, మూస పద్ధతుల్లోనే మహిళలను చూస్తున్నారని అన్నారు.
సమాజంలో పదిరెట్లు ఎక్కువ కష్టం మాది...
ప్రకటనల్లో లింగ వివక్షను ప్రస్తావిస్తూ.. ‘‘ఒక దాంట్లో మహిళ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను చూపారు. ఫర్వాలేదని అనుకుంటూండగానే.. ఆమె ఓ పురుషుడి బనియన్ చూసి తన్మయంతో ఊగిపోతున్నట్లు చూపారు. ఆఖరుకు పురుషుడి లోదుస్తుల ప్రకటనకూ మహిళను స్టీరియోటైపింగ్ చేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తంజావూర్ మెడికల్ కాలేజీలో గైనకాలజిస్టుగా ఉండగా... కవలల తల్లి మగబిడ్డకు చనుబాలు, ఆడబిడ్డకు పలచన చేసిన ఆవుపాలు ఇచ్చిన సంఘటన తాను గమనించానని అన్నారు.
ఇలాంటి అంశాల విషయంలో సమాజం మైండ్‌సెట్ మారాలని.. ప్రకటనలు తయారు చేసే వారు కూడా ఈ మార్పునకు తమవంతు సాయం అందించాలని కోరారు. మీడియా, అడ్వర్టైజ్‌మెంట్ రంగాల వారు ఇలాంటి అంశంపై చర్చించడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఐఏఏను ప్రశంసించారు. సమాజంలో మహిళలు అన్ని విషయాల్లోనూ పురుషుల కంటే పది రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని ఈ పరిస్థితిలో మార్పు రావాలని, ఇకపై లింగ వివక్ష, స్టీరియోటైపింగ్ విషయాల్లో అందరూ తమ అభ్యంతరాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మాత్రమే ఈ మార్పు సాధ్యమని వివరించారు.
‘నిర్భయ’ తరువాత కొంత మార్పు...
ప్రకటనలు, సినిమాలు, ఇతర కంటెంట్‌లలో మహిళ వివక్ష, స్టీరియోటైపింగ్ నిర్భయ ఘటన మారిందని, బాధితుల పేర్లు ప్రస్తావించకపోవడం మొదలుకొని, వారినే దోషులుగా చూపడం వరకూ మీడియా సంయమనంతో వ్యవహరిస్తోందని పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ.ఎల్.శారద తెలిపారు. డిజిటల్ మాధ్యమం కారణంగా మహిళల అంశాలపై వివరంగా చర్చించే అవకాశం లభిస్తోందని, ప్రకటనలు ఇతర కంటెంట్‌లలో మహిళలను కించపరచడం తగ్గిందని, యువతకు సంబంధించిన ప్రకటనలో అందరినీ కలుపుకుపోయేలా కంటెంట్ ఉంటోందని ఆమె వివరించారు. ఈ మార్పు భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్న ఆశాభావాన్ని డాక్టర్ ఏఎల్ శారద వ్యక్తం చేశారు.
అంతకుముందు యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్స్ నిపుణులు గీతాంజలి మాస్టర్ మాట్లాడుతూ ప్రకటనల్లో లింగవివక్ష, స్టీరియోటైపింగ్‌లపై యునిసెఫ్ జరిపిన పరిశోధన వివరాలను వెల్లడించారు. సమావేశంలో యాక్సెంచర్ మేనేజింగ్ డైరెక్టర్ చారులత రవికుమార్ ‘రెస్పాన్సిబుల్ కమ్యూనికేషన్’ అన్న అంశంపై ప్రసంగిస్తూ కంటెంట్‌లో ఇప్పటికే సున్నితంగా.. పరోక్షంగా లింగవివక్ష కొనసాగుతోందని వివరించారు. ఐఏఏ ఇండియ ఛాప్టర్ అధ్యక్షులు అవినాశ్ పాండే, ఐఏఏ విమెన్స్ ఎంపవర్‌మెంట్ కమిటీ ఛైర్‌పర్సన్ నీనా ఎలవియా జైపూరియా, ‘సాక్షి’ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘జెండర్ కాన్షస్ అండ్ పర్పస్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్’ ‘జెండర్ కాన్షస్ క్రియేటివిటీ ఇన్ కమ్యూనికేషన్స్’, ‘కాన్షస్ క్రియేటివిటీ ఇన్ ఫిల్మ్స్, ఓటీటీ, అండ్ అడ్వర్టైజింగ్’ అంశాలపై ప్యానెల్ డిస్కషన్ నడిచింది. యాంకర్ స్వప్న సమన్వయకర్తగా వ్యవహరించగా సినీ నటుడు అవసరాల శ్రీనివాస్, దర్శకులు నందినీ రెడ్డి, వైల్యులు ప్రణతి రెడ్డి, ఐపీఎస్ అధికారిణి శిఖా గోయెల్ తదితరులు పాల్గొన్నారు. కాస్మోస్ మాయా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో మేఘ తాత ఒక ప్యానెల్ డిస్కషన్‌కు సమన్వయ కర్తగా వ్యవహరించారు.
చదవండి: అసెంబ్లీలో కేటీఆర్, ఈటల మధ్య ఆసక్తికర సన్నివేశం..
Comments
Please login to add a commentAdd a comment