పాదాలకు మృదు లేపనం | Soft to the foot of the workpiece | Sakshi
Sakshi News home page

పాదాలకు మృదు లేపనం

Published Thu, Apr 9 2015 3:01 AM | Last Updated on Mon, Oct 1 2018 5:41 PM

పాదాలకు మృదు లేపనం - Sakshi

పాదాలకు మృదు లేపనం

 ఐస్‌క్రీమ్ పెడిక్యూర్

ఎండ వల్ల చల్లని పానీయాలు సేవించాలని ఉంటుంది. చల్లని గాలిని ఆస్వాదించాలని తనువు, మనసు కోరుకుంటాయి. ఆ అవకాశాన్ని పాదాలకూ ఇస్తే..! అలసిన పాదాలు హాయిగా విశ్రాంతి పొందుతాయి. మడమల నొప్పులు తగ్గుతాయి. చర్మం నునుపుగా అవుతుంది. ఈ ప్రయోజనాలన్నీ ‘ఐస్‌క్రీమ్ పెడిక్యూర్’ మోసుకు వస్తోంది.

భోజనం తర్వాత చల్లగా లాగించే డిజర్ట్‌గా ఐస్‌క్రీమ్‌కు పేరుంది. అదే ఐస్‌క్రీమ్‌ను శరీర సౌందర్యంలో ఉపయోగిస్తున్నారు నిపుణులు. ఏ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ కావాలో ఎంపిక చేసుకుంటే దానిని అనుసరించి సౌందర్య చికిత్స చేస్తారు. 40 నిమిషాలలో పాదాలకు అతి చల్లని స్నానాన్ని దాంతో పాటే హాయినీ అందిస్తున్నారు .సౌందర్య చికిత్సలో విలాసవంతమై నదిగా పేరుకొట్టేసిన ఈ ఐస్‌క్రీమ్ పెడిక్యూర్, మేనిక్యూర్ ఇప్పటివరకు అంతే ఖరీదైన స్పా చికిత్సలోనే లభిస్తుండేది. ఇప్పుడు సాధారణ సౌందర్యశాలలోనూ ఈ చికిత్సలు లభిస్తున్నాయి.
 
 చల్లగా... తియ్యగా..!

గాలి తగలగానే కరిగిపోతూ చల్లగా, తియ్యగా నోరూరించే ఐస్‌క్రీమ్ జిహ్వను మైమరపింపజేయడమే కాదు, సౌందర్య సాధనాలలో దీర్ఘకాల ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందేలా చేయడంలో అమోఘంగా పనిచేస్తుంది.ఈ పెడిక్యూర్‌లో ఉపయోగించే ఎప్సమ్ సాల్ట్‌లోని గుణాలు రోగనిరోధక శక్తికి పెంచుతాయి. దీనివల్ల చర్మ సమస్యలు దరిచేరవు.  పాదాలు, చేతుల చర్మం పొడిబారవు. ఎండవల్ల కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుతుంది. గోళ్లు విరగడం, పొడిబారడం వంటి సమస్యలు తగ్గి మృదుత్వం చేకూరుతుంది.ఐస్‌క్రీమ్‌లోని పాలు, ఇతర ఉత్పత్తులు అన్నీ సహజమైనవే కావడంతో చర్మ ఆరోగ్యం, కాంతి పెరుగుతాయి.
 
అధికబరువున్నా... హాయిగా!

ఐస్‌క్రీమ్ తినాలని ఉన్నా అధికబరువున్నవారు నోరు కట్టేసుకుంటారు ‘ఫ్యాట్’ అని. అదే ‘ఫ్యాట్’ పాదాలకు మెరుగైన అందాన్ని తెస్తుంది. ఒత్తిడి నుంచి బోలెడంత విశ్రాంతినిస్తుంది. మోకాళ్లు, మడమలు, అరికాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఈ చికిత్స.
 
ఐస్‌క్రీమ్ జాబితా!

మార్కెట్‌లో ‘ఐస్‌క్రీమ్ పెడిక్యూర్ కిట్’ ప్రత్యేకంగా లబిస్తుంది. దీనిలో ప్రత్యేకమైన ఆరు రకాల నూనెలు, మినరల్స్‌ని శుద్ధి చేసి నింపిన ట్యూబ్స్, సుగంధంతో కూడుకున్న ఎప్సమ్ సాల్ట్, ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ క్రీమ్స్... ఉంటాయి. పైన ఉన్న నూనెలు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో పాదాలను ఉంచి, కొన్ని నిమిషాలు సేద దీరుస్తారు. చర్మం మెత్తబడిన తర్వాత పాదాలను నీటిలో నుంచి బయటకు తీసి, షుగర్ బేస్డ్ బాడీ స్క్రబ్ తో మృదువుగా రుద్ది, తర్వాత జొజోబా ఆయిల్, విటమిన్ ‘ఇ’ ఆయిల్ కలిపి పాదాలకు పట్టించి, వలయాకారంగా వేళ్లతో స్ట్రోక్స్ ఇస్తారు. ఈ స్ట్రోక్స్ వల్ల ఎంతో హాయిగా ఉంటుంది.

తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచి, తీసిన టర్కీ టవల్‌తో కాళ్లను, పాదాలను కప్పి ఉంచుతారు. దీని వల్ల పాదాలపై  ఉండే చర్మం స్వేదరంధ్రాలు తెరుచుకుంటాయి. మురికి వదిలిపోతుంది. తడిలేకుండా తుడిచి, వెనీలా ఐస్‌క్రీమ్‌తో పాదం మొత్తం రాసి, విశ్రాంతి తీసుకోమంటారు. తర్వాత గోళ్లను కత్తిరించి, క్యుటికల్ రిమూవర్‌తో మురికిని తొలగిస్తారు.
     
మరోసారి తడిలేకుండా పాదాన్ని తుడిచి ఐస్‌క్రీమ్ బాల్ (చాకొలెట్, దానిమ్మ, స్ట్రాబెర్రీ, తేనె, కివి, వెనీలా.. ఇలా ఏ ఫ్లేవర్ నచ్చుతుందో అది)ను తీసుకుంటారు. ఆ ఐస్‌క్రీమ్ బాల్‌ను పాదంపై రాస్తూ, మృదువుగా రుద్దుతూ ఉంటారు. అరికాళ్లలో కొంత ఒత్తిడి కలగజేస్తూ చేసే ఈ మసాజ్, ఐస్ వల్ల కలిగే చల్లదనం గిలిగింతలు పెడుతుంది. పాదాలలోని నరాలు చురుగ్గా అవుతాయి. రక్తప్రసరణ మెరుగై పాదాల నొప్పులు తగ్గుతాయి.

 పాదాలకు ఐస్‌తో చేసే పెడిక్యూర్‌లాగే ఇదీ ఉంటుంది. అయితే, ఇందులో ఉపయోగించే మసాజ్ పద్ధతులు, ఉపయోగించే సౌందర్య ఉత్పత్తుల వల్ల మేలైన ప్రయోజనాలు కలుగుతాయి. వేసవిలో ఈ పద్ధతి వల్ల మరింత విశ్రాంతి లభిస్తుంది.
 - ఎన్.ఆర్
 
 అధికబరువుకు హాయి
...

 ఒత్తిడిని ఎదుర్కొనే వారు, ఉద్యోగినులకు ఈ పెడిక్యూర్ ఎంతో విశ్రాంతినిస్తుంది. అంతేకాదు, ఊబకాయులకు ఇది చాలా మంచి మసాజ్ ప్రక్రియ. అధికబరువు పాదాల మీద పడి, నొప్పులకు దారితీస్తాయి. ఐస్‌క్రీమ్ పెడిక్యూర్‌లో కండరాలకు చేసే మసాజ్ మంచి రిలాక్సేషన్ ఇవ్వడమే కాకుండా ఎముకలకు బలాన్నిస్తుంది. అయితే, ఈ ప్రకియకు వాడే ఉత్పత్తుల ధర కూడా ఎక్కువే. ఉత్పత్తులను ఫ్రీజర్‌లో ఉంచాలి. అలాగే ఒకసారి కిట్ ఓపెన్ చేశాక, వెంటనే ఉపయోగించాలి. రూ.1000 నుంచి రూ.15,00 వరకు  ఖర్చువుతుంది.
 - సంతోషిణిప్రియ, సౌందర్యనిపుణురాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement