చలి అయినా, ఎండైనా దానిప్రభావం నేరుగా చర్మంపైనే పడుతుంది. ఇది నవంబరు నెల. రాబోయే నెలల్లో చలి మరింత పెరుగుతుంది. ఫలితంగా చర్మం పొడిబారిపోతుంది. అందుకే ఈ సీజన్‌లో చర్మంలో తేమ లేకపోవడంతో కాస్తంత గీరగానే తెల్లటి చారికలు పడటం అందరికీ అనుభవమే. చలికాలంలో చర్మ సంరక్షణకు సూచనలు. ఇటీవలి మారిన జీవనశైలిలో రాత్రుళ్లు సైతం చలిని లెక్క చేయకుండా ఔటింగ్స్‌కు వెళ్లడం మామూలే. టీనేజ్ పిల్లలు ఈ పని మరింత ఎక్కువగా చేస్తుంటారు. ఇలాంటివారు చర్మ సంరక్షణ ...
►రాత్రి చలిలో బయటికి వెళ్లాల్సిన వారు తప్పనిసరిగా థిక్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇక ఈ సీజన్‌లో పగటి ఎండ కూడా ఒకింత తీక్షణంగానే ఉంటుంది. అందుకే ఎండలోకి వెళ్లేవారు ట్యానింగ్‌ను, ఎండ అలర్జీలను (సన్ అలర్జీస్) నివారించడానికి సన్‌స్క్రీన్ లోషన్ వాడటం మంచిది. అయితే జిడ్డు చర్మం కలిగి ఉండే టీనేజ్ పిల్లలు మాత్రం నూనె లేని (ఆయిల్ ఫ్రీ) సన్‌స్క్రీన్స్ రాసుకోవాలి. ఇక పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండే ఆయిల్ బేస్ సన్‌స్క్రీన్స్ రాసుకోవాలి.
►ఎస్‌పీఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్) 40–50 ఉన్న క్రీములు వాడటం మంచిది. చర్మానికి జాగ్రత్తలు: చలికాలంలో వాతావరణం తేమను లాగేస్తుందన్న విషయం తెలిసిందే. వేడినీటి స్నానం చర్మాన్ని మరింత పొడిబారుస్తుంది. కానీ చన్నీళ్లు ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే బాగా వేడిగా ఉండే నీళ్లకు బదులు గోరువెచ్చని నీటినే వాడాలి.
►స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బు/గ్లిజరిన్ బేస్‌డ్ సబ్బు మంచిది.
►స్నానం చేసి, కాస్త తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాయాలి. ఇలా రోజుకు 3,4 సార్లు రాయడం మంచిది.
►తల స్నానానికి రెండు గంటల ముందర మాడుకు నూనె మసాజ్ చేసుకోవాలి. నూనె కండిషనర్‌గా పనిచేస్తుంది. పొడిజుట్టు ఉన్నవారైతే షాంపూ తర్వాత తప్పనిసరిగా కండిషనర్ వాడాలి.
►తడి జుట్టును ఆరబెట్టుకోడానికి డ్రైయర్ వాడకూడదు. ఎందుకంటే అది మాడుపైని చర్మాన్ని, నుదుటినీ మరింత పొడిబారుస్తుంది.
►రోజూ రెండు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తాగాలి. అసలే చల్లటి వాతావరణం కారణంగా ఈ కాలంలో నీటిని తాగడం తగ్గుతుంది. కాబట్టి చర్మం పటుత్వాన్ని , తేమను కోల్పోయి మరింత గరుగ్గా కనిపిస్తుంది. అందుకే తగినంత నీరూ తాగాలి. పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆకుపచ్చటి రంగులో ఉండే ఆకుకూరలు (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్) ఎక్కువగా తినాలి.
►పెదవులు పగలకుండా పెట్రోలియమ్ జెల్లీ లేదా లిప్ బామ్‌ను పెదవులపై రాస్తూ ఉండాలి.
►పాదాలకూ, చేతులకూ కాటన్ గ్లౌజ్ వేసుకోవడం చాలా మంచిది. అది పగుళ్లను నివారిస్తుంది.
ఈ క్రీమ్స్ వాడండి: ఈ సీజన్‌లో చాలామంది కోల్డ్ క్రీమ్స్ వాడుతుంటారు. అయితే ఎలాంటి కోల్డ్ క్రీములు వాడాలో చాలామందికి తెలియదు. ఈ కోల్డ్ క్రిమ్స్ ఎలా ఉండాలంటే...
►ఈ సీజన్‌లో వాడాల్సిన కోల్డ్ క్రీమ్స్ వాసనలేనివై ఉండాలి. ఒకవేళ మంచి ఫ్లేవర్‌తో కూడిన వాసన ఉన్నవాటిని మీరు వాడాలనుకుంటే... అవి ఎంత తక్కువ వాసనతో ఉంటే అంత మంచివని గుర్తుపెట్టుకోండి. వాసన తక్కువైన కొద్దీ చర్మంపై వాటి దుష్ప్రభావం అంతగా తగ్గుతుంటుంది.
►అలర్జీ కలిగించని (హైపో అలర్జిక్) క్రీమ్‌లను ఎంపిక చేసుకోవాలి. అలర్జీ కలిగించే వాటితో ఆరోగ్యపరంగా మళ్లీ ఓ కొత్త సమస్య ఎదురుకావచ్చు.
►ఈ సీజన్‌లో చర్మానికి క్లెన్సర్లు వాడకూడదు. అవి మరింత పొడిబారేలా చేస్తాయి.
డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment