అరే వా! భాద్రా
సమ్‌థింగ్ స్పెషల్
రాజస్థాన్... ఎడారి ప్రాంతం... ఆ ఎడారిలో ఓ చిన్న గ్రామం... పేరు తహసిల్ భాద్రా. అక్కడికి కేవలం రెండు రైళ్లు మాత్రమే వస్తాయి. జనాభా కేవలం 40, 000. ఢిల్లీ నగరం నుండి 275 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం వార్తల్లోకెక్కింది. ఎందుకంటే.. భారతదేశంలోనే సంపూర్ణంగా, అతి చౌకగా వైఫైను వినియోగిస్తున్న గ్రామం ఇది.
బెంగళూరు, పుణే, కొచ్చి, ఢిల్లీ నగరాలలో పూర్తి వైఫై సేవలు ఉన్నప్పటికీ, వాడేవారి సంఖ్య తక్కువగా ఉంది. కాని రాజస్థాన్‌లోని భాద్రా గ్రామ ప్రజలు అందరూ వైఫై సేవలు వినియోగించుకుంటున్నారు. బస్‌స్టాండ్‌కి వెళ్లి చూస్తే, అక్కడ చాటింగ్ చేసేవారు, వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండేవారు, టికెట్ బుక్ చేసుకునేవారు కనిపిస్తారు. బస్‌స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు, గల్లీ గల్లీలోనూ, మార్కెట్లలోనూ భాద్రా గ్రామ ప్రజలు సాంకేతికంగా ముందడుగులు వేసేశారు. పూర్తిస్థాయిలో సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునేవారు కొందరు, ఆన్‌లైన్‌లో మనీ ట్రాన్స్‌ఫర్లు చేసేవారు కొందరు, వ్యాపారాలు చేసేవారు కొందరూ... ఇలా అందరూ ఎవరి పనులు వారు చ కచకా కాలు కదపకుండా చేసేస్తున్నారు. ఇంతకుముందు ఆన్‌లైన్ పాఠాలకు, జాబ్ అప్లికేషన్లకు ... భాద్రా నుంచి 160 కి.మీ. దూరంలోఉన్న హనుమాన్‌గఢ్‌కి వెళ్లవలసి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది.
కొద్దినెలల క్రితమే వైఫై ఆ గ్రామానికి వచ్చింది. అతి తక్కువ సమయంలోనే ఈ గ్రామ వాసులంతా ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. వన్ జీబీ డేటా ఒక నెలకు, ఇక్కడ కేవలం 64 రూపాయలకే దొరుకుతోంది. ఈ చిన్నగ్రామంలో రోజుకి 160 జీబీ డేటాను ఉపయోగిస్తున్నారంటే, భాద్రా ప్రజలు సాంకేతికంగా ఎంత ఎదిగిపోయారో తెలుస్తుంది. ఇక్కడి వారు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. వీడియో కాలింగ్, చాటింగ్, రీచార్జ్... అన్నీ చక్కగా ఉపయోగించుకుంటున్న గ్రామం తహసీల్ - భాద్రా. వాహ్ భాద్రా అనిపించట్లేదూ!!!
- వైజయంతి