కాలం రేపిన... మానని గాయం | Sonam Kapoor proud of 'Chauthi Koot' | Sakshi
Sakshi News home page

కాలం రేపిన... మానని గాయం

Published Wed, Sep 14 2016 8:16 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

కాలం రేపిన... మానని గాయం - Sakshi

కాలం రేపిన... మానని గాయం

పంజాబీ చిత్రం చౌథీ కూత్
పంజాబ్‌లో ఒకప్పుడు చెలరేగిన వేర్పాటువాద ఉద్యమం... ప్రజల్లో భయాన్నీ, అనుమానాన్నీ పెంచి పోషించింది. ఆ పరిస్థితుల్ని గుర్తుచేస్తూ, మనుషుల మధ్య మానవీయ సంబంధాల్ని స్పృశిస్తూ వచ్చిన ఒక పంజాబీ సినిమా ఇవాళ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
 
ముంబయ్‌లో ఆ రాత్రి వేళ... ఆ సినిమా చూసి బయటకు రాగానే నటి సోనమ్ కపూర్ ఉద్వేగం ఆపుకోలేకపోయారు. చేతిలో ఉన్న మొబైల్‌ఫోన్ తీసుకొని, ట్విట్టర్ ఎకౌంట్ ఓపెన్ చేశారు. ‘‘ఇప్పుడే ‘చౌథీ కూత్’ చూశా. మన (భారతీయ) సినీ పరిశ్రమ నుంచి ఇలాంటి సినిమా వచ్చినందుకు గర్వపడుతున్నా. దర్శకుడు అసలు సిసలు హీరో!’’ ట్వీట్ బటన్ నొక్కాక కానీ సోనమ్ మనసు కుదుటపడలేదు. అదేమీ సోనమ్ కపూర్ చేసిన సినిమా కాదు... తీసిన సినిమా అంత కన్నా కాదు. ‘చౌథీ కూత్’... ఒక చిన్న పంజాబీ సినిమా.

రెండే రెండు గంటల నిడివి ఉన్న చిన్న బడ్జెట్ సినిమా. పేరున్న ఆర్టిసులెవరూ లేని సినిమా. ఆ సినిమా తీసిన దర్శకుడు గుర్విందర్ సింగ్‌కు కేవలం రెండో సినిమా. అందరి దృష్టినీ ఆకర్షించడానికి అవేమీ అడ్డుకాలేదు. ‘‘సమకాలీన భారతీయ సినిమాలో కీలక మైలురాళ్ళలో ‘చౌథీ కూత్’ ఒకటి. రాగల ఎన్నో ఏళ్ళు ఈ సినిమా గురించి చెప్పుకుంటారు’’ - ఇలా పెద్ద పెద్దవాళ్ళ ప్రశంసలకు కొదవ లేదు. 1980లలో పంజాబ్‌లో ప్రజ్వరిల్లిన సిక్కు వేర్పాటువాద ఉద్యమం నేపథ్యంలో నడిచే ఈ సినిమా ఈ మధ్యే రిలీజైంది. కానీ, అంతకన్నా ముందే ప్రసిద్ధ ‘కాన్స్ చలనచిత్రోత్సవం’ సహా 13 జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రశంసలందు కుంది. ఉత్తమ పంజాబీ చిత్రంగా 2015 సంవత్సరానికి జాతీయ అవార్డు గెలుచుకుంది.
 
వేర్పాటువాద ఉద్యమ కాలపు కథ
ఈ సినిమాకూ, సాహిత్యానికీ సంబంధం ఉంది. విదేశాల్లో స్థిరపడ్డ పంజాబీ రచయిత, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత వర్యమ్‌సింగ్ సంధు రాసిన ‘చౌథీ కూత్’ (నాలుగో డెరైక్షన్ అని అర్థం), ‘హూ మై ఠీక్-ఠాక్ హా’ (నేనిప్పుడు బాగానే ఉన్నా) కథల ఆధారంగా అల్లుకున్న స్క్రిప్ట్ - ఈ సినిమా. తమ ఆనుపానులు తెలిసిపోతాయి కాబట్టి, పెంపుడు కుక్కల్ని మొరగనివ్వ రాదంటూ తీవ్రవాదులు ఇచ్చిన విచిత్రమైన ఆదేశం, దాని వల్ల ఒక సిక్కు కుటుంబం పడిన మానసిక క్షోభ చుట్టూ ఒక కథ తిరుగుతుంది.

రెండో కథలో అమృత్‌సర్‌కు వెళుతున్న ఇద్దరు మిత్రులు దాదాపుగా ఖాళీగా ఉన్న ఒక రైలులోకి ఎలాగోలా ఎక్కుతారు. అందులో ఒకరు ఈ మొదటి కథ చెప్పుకుంటూ వస్తారు. 1980లలో పంజాబ్‌లో ప్రజల్లో నెలకొన్న భయం, ఎవరిని చూసినా అనుమానా నికి ఈ సినిమా అద్దం పడుతుంది. ఇలా ముఖం పై గుద్దినట్లు ఖలిస్తాన్ ఉద్యమకాల పంజాబ్‌ని చూపిన చిత్రంగా ‘చౌథీ కూత్’ది ప్రత్యేక స్థానం.
 
చిన్ననాటి జ్ఞాపకం
సిక్కు కుటుంబంలో పుట్టినా, ఎప్పుడూ మత విశ్వాసాల మూసలోకి జారిపోని దర్శకుడు గుర్విందర్‌కు రచయిత సంధు కథల్లోని భయో ద్విగ్న వాతావరణం అనుభవమే. 1984లో పదేళ్ళ పిల్లాడిగా ఢిల్లీలో చదువుకుంటున్నప్పుడు అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయ సంఘటనలతో సిక్కుల్లో కోపం నెలకొంది. అక్టోబర్ 31న అంగ రక్షకులైన సిక్కులే ఇందిరా గాంధీని హత్య చేసినరోజు గుర్విందర్‌కు గుర్తే. ఉదయం 11 గంటల టైమ్ లో పిల్లల్ని హడావిడిగా స్కూల్ బస్సులోకి ఎక్కించినప్పుడు, విషయం తెలిసింది. తలపాగా చుట్టుకొని ఉన్న గుర్విందర్‌కు తాను సిక్కుననే విషయం గుర్తొచ్చి, ఇబ్బందిపడ్డాడు. ఆ బాల్య జ్ఞాపకం ఆ కాలాన్నీ, మనసులో మానని గాయాన్నీ తెరపై చూపడానికి ఆయన్ని ప్రేరేపించింది.
 
మనసులోని భయానికి మరో రూపం
ఇటు ఖలిస్థానీ తీవ్రవాదులకూ, అటు భద్రతా దళాలకూ మధ్య అప్పట్లో పంజాబ్ ప్రజలు చిక్కుకుపోయిన పరిస్థితుల్ని ఈ ‘చౌథీ కూత్’ చిత్రం ద్వారా ప్రేక్షకుల అనుభవంలోకి తెచ్చారు. అయితే, సినిమాలో ఎక్కడా తెర మీద నెత్తురు చిందదు. దేహాన్ని ఛిద్రం చేసే బుల్లెట్‌లు కనిపించవు. ఉపన్యాసాలు, అరుపులు, కేకలుండవు. కానీ, పరిస్థితి మొత్తం మనకు అర్థమయ్యేలా చేస్తాడు దర్శకుడు. చారిత్రకంగా జనం వలసపోవడానికీ, హింసకూ ప్రతీక రైలు. అందుకే, దాన్నీ పాత్రలా వాడుకున్నారు. అదీ ఈ నవ తరం దర్శకుడి ప్రతిభ.
 
‘బాహుబలి’ని తిట్టిన దర్శకుడు!
‘కాన్‌‌స’లో జనం లేచి చప్పట్టు కొట్టడం దగ్గర నుంచి అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంస లందుకున్న ‘చౌథీ కూత్’ విచిత్రంగా రమేశ్ సిప్పీ నేతృత్వంలోని మన జాతీయ అవార్డు జ్యూరీ కంటికి మాత్రం ఆనలేదు. కారణాలు ఏమైనా, ‘బాహుబలి’, ‘భజ్‌రంగీ భాయీ జాన్’లకు ఉత్తమ చిత్రం, ఉత్తమ పాపులర్ చిత్రం అవార్డుల్ని జ్యూరీ ప్రకటించింది. ‘చౌథీ కూత్’కు కంటి తుడుపుగా ఉత్తమ పంజాబీ చిత్ర పురస్కారం ప్రకటించి, సరిపెట్టారు. సహజంగానే గుర్విందర్‌కు కోపం వచ్చింది. అందుకే, ‘‘ఈసారి నేషనల్ అవార్డుల తతంగం ఒక ప్రహసనం. ముఖ్యమైన అవార్డులన్నీ వాణిజ్య తరహా చిత్రాలకే ఇచ్చారు. ‘బాహు బలి’ లాంటి పనికిమాలిన సినిమాను జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చారు. నా దృష్టిలో ఇది బి.జె.పి. అవార్డే తప్ప, నేషనల్ అవార్డు కాదు’’ అని గట్టిగా నోరు చేసుకున్నారు.
 
వదలని వినోదాత్మక చిత్రాల మత్తు
ప్రపంచమంతా మెచ్చుకున్న ‘చౌథీ కూత్’ ఇటీవల రిలీజైనప్పుడు పంజాబ్‌లో స్పందన తక్కువగా ఉండడం విచిత్రం! వినోదాత్మక సినిమాల మత్తు అలవాటైన పంజాబీలు పెద్దయెత్తున రావట్లేదు... వచ్చి చూడట్లేదు. గుర్విందర్ మాత్రం అందుకు నిరాశపడట్లేదు. ముచ్చటగా మూడో సినిమాకు సిద్ధమవుతు న్నారు. అదీ పంజాబీలోనే! కాకపోతే, ఈసారి తీస్తున్నది - కామిక్ ఫ్యాంటసీ! విభిన్న తరహా చిత్రాలు, చిత్ర నిర్మాణం జనానికి అలవాటవ డానికి టైమ్ పడుతుందని ఆయనకు తెలుసు. అది ఆయనే చెప్పుకున్నారు, ఒప్పుకున్నారు! ఎంతైనా చూడడానికి నిరాకరించే వాస్తవాన్ని తెరపై చూపించి, ప్రజల్ని ఆలోచింపజేయా ల్సింది దర్శక, నిర్మాతలు, విమర్శకులే కదా!

 
తెరపెకైక్కిన తీవ్రవాదం!
* పంజాబ్ అనగానే మన మెయిన్‌స్ట్రీమ్ సినిమా చూపించేది - ఆనందం నిండిన కుటుంబాలు, ఆటపాటలు, జానపద గీతాలే! కానీ ఒకప్పుడు పంజాబ్ అంటే తీవ్రవాద సమస్య. ఆ సమయంలో పంజాబీలు ఎదుర్కొన్న హింసను తెరపై చూపిన సినిమాలు గుల్జార్ ‘మాచిస్’, గోవింద్ నిహలానీ ‘ద్రోహ్ కాల్’ లాంటి కొన్నే. డ్రగ్స్ అక్రమ రవాణాపై ఇటీవలి ‘ఉడ్తా పంజాబ్’ దృష్టి పెట్టింది. ‘చౌథీ కూత్’ ఆపరేషన్ బ్లూ స్టార్, సిక్కుల ఊచకోత లాంటి పరిణామాల్ని మరోసారి గుర్తుచేసింది.
 
పోటీపడ్డ హైదరాబాదీ సినిమా!
* నిరుడు ‘కాన్స్’లోని ‘అన్ సర్టెన్ రిగార్డ్’ సెక్షన్‌లో మన సినిమాలు రెండు పోటీ పడ్డాయి. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదివిన నీరజ్ ఘయ్‌వాన్ తీసిన గుండె పిండే  ప్రేమకథ ‘మసాన్’ ఒకటి. రెండోది ఈ పంజాబీ ఫిల్మ్ ‘చౌథీకూత్’.
* పంజాబ్‌లో వేర్పాటువాదం రోజుల్లోనూ హిందువులు, సిక్కులు ఒకరికొకరు అండగా నిలబడి, రక్తపాత సంఘర్షణను తట్టుకొన్నతీరుకు ‘చౌథీకూత్’ దర్పణం.

- రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement