‘వాళ్లు మన ఇళ్లు కట్టడానికి వాళ్ల ఇళ్లను వదిలిపెట్టి వచ్చారు’ అంటాడు నటుడు సోనూ సోద్ నేడు దేశ వ్యాప్తంగా కాలినడకన ఇళ్లకు మరలిన లక్షలాది వలస కార్మికుల అవస్థను చూసి. ‘వారి బాధను చూస్తుంటే మనందరం మనుషులుగా ఫెయిల్ అయ్యామని చెప్పక తప్పదు’ అని కూడా అన్నాడు అతను. ‘నాకు నిద్ర పట్టలేదు. వారే కళ్లల్లో మెదల సాగారు. వారి బాధ చూస్తూ ఏసి రూముల్లో కూచుని ట్వీట్ చేస్తే సరిపోదు. మనం కూడా రోడ్లమీద పడి ఏదైనా చేయాలి అనుకున్నాను’ అన్నాడు. అందుకే సోనూ సూద్ ఇవాళ దేశ వ్యాప్తంగా రియల్ హీరో అయ్యాడు. అతడు ముంబైలో చిక్కుకున్న కర్ణాటక వలస కూలీలను పది బస్సుల్లో వారి ఇళ్లకు పంపించాడు. అంతే కాదు, దానికి ముందే పంజాబ్‌లోని వైద్యులకు పిపిఇ కిట్లు బహూకరించాడు.
ముంబైలోని తన హోటల్‌ను కోవిడ్ చికిత్సలో పని చేస్తున్న వైద్య సిబ్బంది బసకు ఇచ్చాడు. సోనూ సూద్ వలస కార్మికుల కోసం చేసిన పని చూసి అనేక మంది తమకు సహాయం చేయమని అతనికి విన్నపాలు చేయడం మొదలుపెట్టారు. ముంబైలోనే కాకుండా జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్‌లలో చిక్కుకుపోయిన అనేక మందిని వారి స్వస్థలాలకు పంపించే పనిలో సోనూ సూద్ ఉన్నాడు. ‘చివరి వలస కార్మికుడు ఇల్లు చేరేవరకు నా చేతనైన పని చేస్తాను’ అని అతను చెప్పాడు. ఇదంతా చూసి చాలామంది మెచ్చుకున్నారు. అయితే అమెరికాలో ఉంటున్న ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా తన కృతజ్ఞతను చాటుకోవడానికి ఒక కొత్త వంటకం చేసి దానికి సోనూ సూద్ సొంత ఊరి పేరు ‘మోగా’ అని పెట్టాడు. వికాస్ ఖన్నా చూపిన ఈ స్పందనకు సోనూ చాలా సంతోషపడ్డాడు. ‘మీరు చేసిన పనికి నా సొంత ఊరు గర్వపడుతుంది’ అని బదులు ఇచ్చాడు.
చదవండి:
దుస్తులు వేలం వేసిన నిత్యామీనన్
కరోనానీ, క్రిముల్నీ కడిగి పారేద్దాం!
Comments
Please login to add a commentAdd a comment