
రామ్‌చరణ్
‘బీయింగ్ ఇన్ ఎ గుడ్ ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్’.అంటే.. మనసు ఒక మంచి చోట ఉండాలి.మనసు కుదుటగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి.రంగస్థలం మీద ఎన్నో భావాలు కనబడొచ్చు, వినబడొచ్చు.
కానీ రంగస్థలం మాత్రం నిశ్చలంగా ఉంటుంది. మనసుకు అలాంటి రంగస్థలం మంచి స్థలం.
అంతకుముందులా కాకుండా మీలో మార్పు కనిపిస్తోంది. వ్యక్తిగా, ఆర్టిస్ట్‌గా ‘మంచి స్పేస్’లో కూల్‌గా ఉన్నారనిపిస్తోంది. ఎక్కువ కాన్ఫిడెన్స్‌తోనూ కనిపిస్తున్నారు...
రామ్‌చరణ్: నేను మార్పు కోరుకునే వ్యక్తిని. ‘సెల్ఫ్ చెక్’ అవసరమని నా నమ్మకం. పదేళ్లయింది... నేను ఇండస్ట్రీకి వచ్చి. నటుడిగా, వ్యక్తిగా ప్రతీ ఐదేళ్లకు నన్ను నేను సెల్ఫ్ చెక్ చేసుకొని మారాలనుకుంటాను. ఐదేళ్ల క్రితం వేరు. ఇప్పుడు వేరు. ఐదేళ్ల తర్వాత ఇంకో మార్పు.
ఈ మార్పుకి కొంత మీ బెటరాఫ్ ఉపాసనగారు కూడా కారణం అనుకోవచ్చా?
కొంత మార్పు స్వతహాగా వచ్చింది. ఇంకో మనిషి జీవితంలోకి వచ్చాక వాళ్ల ప్రభావం మన మీదా.. మన ప్రభావం వాళ్ల మీదా పడుతుంది. నా మార్పుకి కొంత కారణం ఉపాసన. ‘ఐయామ్ హ్యాపీ ఫర్ దట్’.
మీ డైట్ గురించి మీరు హైరానా పడాల్సిన అవసరం లేనంతగా ఉపాసనగారికి హెల్దీ డైట్ మీద అవగాహన ఉందికదా?
యస్. మేం ఎక్కువ శాతం వెజిటేరియన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాం. నాన్–వెజ్ దాదాపు తగ్గించేశాం. నిజానికి మా డైట్ వినడానికి చాలా బోరింగ్‌గా ఉంటుంది. అన్నీ వెజిటబుల్ సూప్స్ ఉంటాయి. బీట్‌రూట్, స్పినాచ్ ఇలా. డైట్ గురించి నేను పెద్దగా శ్రద్ధ పెట్టను. నేను కష్టపడకుండా నా డైట్ అంతా తనే చూసుకుంటుంది.
‘రంగస్థలం’కి డైట్ ఏమైనా ఫాలో అయ్యారా?
అస్సలు ఫాలో అవ్వలేదు. శుభ్రంగా తిన్నాను. గోదావరి చేపలన్నీ లాగించేశా (నవ్వుతూ). ‘ధృవ’ సినిమాకు పూర్తి ఆపోజిట్ ఇది. ఆ సినిమాకు డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాణ్ణి.
‘ధృవ’కి శారీరకంగా, ‘రంగస్థలం’కు మానసికంగా కష్టపడ్డారు. రెండిటిలో ఏది ఎక్కువ కష్టంగా అనిపించింది?
‘రంగస్థలం’ కష్టం. క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ చేశా. అయితే అంతే భారం కూడా అనిపించింది. ఇంటికి వస్తే ‘చిట్టిబాబు’ (‘రంగస్థలం’లో రామ్‌చరణ్ పేరు) ఎక్కడ చరణ్‌లా అయిపోతాడో అని అదే మూడ్‌లో ఉండటానికి ట్రై చేసేవాణ్ణి. షూటింగ్ ఇన్సిడెంట్స్ రాత్రి కల్లోకి వచ్చేవి.
స్ట్రెస్ ఏమైనా ఫీల్ అయ్యారా?
స్ట్రెస్ అనను కానీ నాలో చాలా భాగాన్ని ‘చిట్టిబాబు’కి ఇవ్వాల్సి వచ్చింది. ‘ఏంటి ఎప్పుడూ’ అనకుండా నా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసింది. ఎక్కువ శాతం రాజమండ్రిలో ఉన్నాం. అక్కడ ఉన్నన్ని రోజులూ రాత్రీ పగలు షూటింగ్‌లో ఉండేవాళ్లం.
గళ్ల లుంగీ, పూల చొక్కా ఇవన్నీ కొత్తగా అనిపించాయా?
మా ఇంట్లో సాయంత్రమైతే నేను లుంగీలోనే ఉంటా. కంఫర్ట్‌బుల్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా ఎఫెక్ట్ అని కాదు. ఒక రెండు సంవత్సరాల నుంచి లుంగీ కట్టుకోవడం అలవాటైంది. సుక్కూ (సుకుమార్) ఈ కథ చెప్పటానికి వచ్చినప్పుడు నేను లుంగీలోనే ఉన్నాను. యాక్చువల్లీ ముందు షార్ట్స్ అని డిజైన్ చేశాం. కానీ నన్ను లుంగీలో చూసి మాకు కావల్సిన విధంగానే ఉన్నావని ఇదే ఫిక్స్ చేసేశారు.
వినికిడి లోపం ఉన్న చిట్టిబాబుగా ‘రంగస్థలం’లో నటించారు కదా.. ఆ క్యారెక్టర్ నుంచి సినిమా పూర్తి కాగానే బయటికి రాగలిగారా?
నిజం చెప్పాలంటే ఈ పాత్ర నుంచి బయటకు రావడం కొంచెం కష్టమే. సినిమా కంప్లీట్ అయిన కొన్ని రోజుల వరకూ నన్ను హాంట్ చేసింది. బేసిక్‌గా మంచి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఈ ఫీల్ ఉంటుంది.
లోపం లేకుండా ఉన్నట్టు నటించడం కష్టం. ఎలా మేనేజ్ చేశారు. సీన్స్‌లో ఎప్పుడైనా విన్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టేసి, టేక్స్ తీసుకున్నారా?
అలా జరగలేదు. సీన్ టూ సీన్ డిజైన్ చేసి మరీ చేశాం. వినికిడి లోపం ఉన్నవాళ్లు టక్కున రియాక్ట్ కారు. కొంచెం డిలే ఉంటుంది. ఒకటికి రెండు మార్లు గట్టిగా చెప్పాలి. ఇందులో పూర్తిగా చెవుడు కాదు. గట్టిగా మాట్లాడితే తప్ప వినిపించదు.. అంతే.
సరిగ్గా వినిపించనివాళ్లు ఎదుటి వ్యక్తి లిప్ మూమెంట్‌ని అబ్జర్వ్ చేస్తారు. ఆ విషయం మీకు తెలుసా?
అవునండి. నాక్కొంచెం ఐడియా ఉంది. సుక్కూ (సుకుమార్) చాలా బాగా తీశాడు. ప్రతీ పాత్రను రీసెర్చ్ చేసి మరీ రాశాడు. నేనైతే నా ఒక్క పాత్ర గురించి తెలుసుకుంటే చాలు. తను అందరి పాత్రలూ బాగా స్టడీ చేశాడు. విమర్శకులు కూడా ఏం వంక పెట్టలేరు. ప్రతి సీన్‌కీ కేర్ తీసుకున్నాడు. యాస విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాం. డబ్బింగ్ అప్పుడు ప్రతీ పదం కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకున్నాం.
పాత్ర కోసం వినికిడి లోపం ఉన్నవారితో మాట్లాడారా?
ఒక వ్యక్తితో మాట్లాడా. వినికిడి లోపం ఉన్న స్కూల్‌లో కేర్ టేకర్ ఆయన. వాళ్లు ఎలా ఉంటారు? మిషిన్ పెట్టుకొని ఎలా ఉంటారు? తీసేసినప్పుడు ఎలా వింటారు? అని బాగా రీసెర్చ్ చేశాం.
ఇప్పటివరకూ మీరు చేసిన అన్ని క్యారెక్టర్స్‌లోకీ చిట్టిబాబు డిఫరెంట్. ఎలా అనిపించింది?
నటుడిగా ఒక మార్పు కోరుకుంటున్నా. ఫుల్ డిఫరెంట్‌గా ఉండే స్టోరీ వస్తే బాగుండు అనుకుంటున్న టైమ్‌లో ‘రంగస్థలం’ స్క్రిప్ట్ వచ్చి నా ఒళ్లో పడింది (నవ్వుతూ). చాలా మంచి రోల్. ఇలాంటి రోల్స్ చాలా ఎక్కువ రావాలి అని కోరుకునేటటువంటి రోల్. చాలా ఎంజాయ్ చేశాను.
సో.. కావాలని సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ అన్నమాట?
యస్. కావాలని తీసుకున్నదే. ఇలాంటి మార్పు కనిపించకపోతే ఒక యాక్టర్‌గా నా జాబ్ నాకే బోర్ కొడుతుంది. డిఫరెంట్ రోల్స్ చేయాలి. అలాగే కమర్షియల్ హంగులన్నీ ఉండాలనుకున్నాను. అటు ఆడియన్స్‌కు ఇటు విమర్శకులకు... ఇద్దరికీ నచ్చేలాంటి కథ ఇది.
ఒకేసారి అటు ఫ్యాన్స్‌కీ, ఇటు ఫిల్మ్ క్రిటిక్స్‌కీ నచ్చే స్క్రిప్ట్ అంటే చాలా రేర్‌గా కుదురుతుందేమో కదా?
అవును. ఇద్దరికీ నచ్చే సినిమాలంటే నా కెరీర్‌లో ‘మగధీర’.. అలా కొన్ని ఉన్నాయి. డాడీ (చిరంజీవి) ఎయిటీస్‌లో చేసినవన్నీ అలాంటి సినిమాలే కదా. అప్పట్లో రియలిస్టిక్‌గా, జెన్యూన్‌గా తీసేవారు. అవే కమర్షియల్‌గా కూడా బాగా ఆడేవి. హీరో క్యారెక్టర్ ఫ్యాన్స్‌కు నచ్చేలా, కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా డిజైన్ చేసేవారు.
మీరు పెరిగిందంతా సిటీలోనే. గేదెలను, ఆవులను పల్లె వాతావరణాన్ని దగ్గరగా చూసి ఉండరేమో?
అలా ఏం లేదండి. మాకు ఫార్మ్ ఉంది కదా. అక్కడ ఆవులు, గేదెలు అన్నీ ఉన్నాయి. మాకు పాలు అవీ అక్కడ నుంచే వస్తాయి. కానీ పల్లెటూరి వాతావరణంలో ఎక్కువ రోజులు ఎప్పుడూ ఉండలేదు. ‘ఆపద్బాంధవుడు’ షూటింగ్ టైమ్‌లో పూడిపల్లి వెళ్లాను. కానీ అది జస్ట్ ఒక వారం అంతే. డాడీ బర్త్‌డే ఉందని అక్కడికి వెళ్లాం.
అప్పటి జ్ఞాపకాలేమైనా గుర్తున్నాయా?
ఆ సినిమాలో డాడీ ఒడ్డున కూర్చుని శివలింగంతో మాట్లాడతారు. అది షూట్ చేసిన చోటే మేం ‘రంగస్థలం’ షూట్ చేశాం. నేను ఈత కొట్టే షాట్ అక్కడే షూట్ చేశాం. అప్పుడు మేం వెళ్లినప్పుడు ఉన్న ఇల్లు కూడా చూశాం.
‘రంగస్థలం’ చూశాక మీ మమ్మీ, డాడీ ఏమన్నారు?
సాధారణంగా అమ్మ నా సినిమాలు చూసినప్పుడు బావుంది, నీ క్యారెక్టర్ బావుందని చెబుతుంటారు. కానీ ఈ సినిమా చూశాక చేయి పట్టుకొని పక్కన కూర్చున్నారు. ‘ఒక ఐదు నిమిషాలు అలా పక్కన కూర్చోరా’ అన్నారు. ఏం మాట్లాడలేదు. ఒకలాంటి బరువైన ఫీలింగ్‌లో ఉండిపోయారు. అది ఎక్స్‌ప్రెస్ చేయలేని ఫీలింగ్. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది.
ఉపాసనగారు మిమ్మల్ని ‘మిస్టర్ సి’ అని ట్విట్టర్‌లో సంబోధిస్తుంటారు. అలానే పిలుస్తారా?
ట్విట్టర్‌లో వర్డ్స్ లిమిటేషన్ ఉంటుంది కదా. అందుకే ‘మిస్టర్ సి’ అని పెడుతుందేమో (నవ్వుతూ).
ఇంతకీ ఆమె ఈ సినిమాని చూశారా?
తనింకా చూడలేదు. నేనూ ఓన్లీ డబ్బింగ్‌లో చూశాను.
గమనిస్తే మీకు పిల్లల మీద ప్రత్యేకమైన ఇష్టం కనిపిస్తుంటుంది. షూటింగ్స్ స్పాట్స్‌లో పిల్లలతో దిగిన ఫొటోలవీ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి...
నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం. జంతువులను కూడా ఇష్టపడతాను. వాళ్లున్నంత స్వచ్ఛంగా ఎవరూ ఉండరు. ఆ ప్యూరిటీకి దగ్గరగా ఉండాలని ఎక్కడైనా పిల్లలు కనిపించినప్పుడు సరదాగా టైమ్ స్పెండ్ చేస్తాను. అలాగే యానిమల్స్‌కి కూడా దగ్గరగా ఉంటాను.
నెక్ట్స్ మూవీస్?
నెక్ట్స్ బోయపాటిగారితో సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత రాజమౌళిగారి సినిమా. నేనూ తారక్ ఇద్దరం ఫ్రీ అయ్యాక ఈ ఇయర్ ఎండ్‌లో ఆ సినిమా స్టార్ట్ అవ్వొచ్చు.
ఫైనల్లీ ఈరోజు మీ బర్త్‌డే. ఎలా జరుపుకోబోతున్నారు?
హడావిడి ఏం లేదండి. సింపుల్‌గానే.
బర్త్‌డేకి రెండు రోజుల తర్వాత ‘రంగస్థలం’ రిలీజ్ అవుతోంది.. మీ బర్త్‌డే గిఫ్ట్ అనుకోవచ్చా?
ఎగ్జాట్లీ. డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ క్యారెక్టర్. మంచి బహుమతి.
అల్లు అర్జున్ తనయుడు అయాన్ ‘రంగస్థలం’ కోసం మీరు వేసుకున్నట్లుగానే లుంగీ, చొక్కా తొడుక్కున్నా డు. అయాన్‌ని ఆ గెటప్‌లో చూసి మీకేమనిపించింది?
మామూలుగా అయాన్ వాళ్ల నాన్నని ‘చరణ్ మామ పాట పెట్టు’ అని అడుగుతుంటాడట. ‘ధృవ’నుంచి ఇలా అడగడం మొదలుపెట్టాడట. ‘అయాన్‌ని మీ ఇంటికి తీసుకెళ్లిపో’ అని బన్నీ సరదాగా అంటుంటాడు. ఇప్పుడు ‘రంగస్థలం’ గురించి అడగడం మొదలుపెడితే, వాళ్ల నాన్న తన షర్ట్‌ని ఆల్ట్రేషన్ చేయించి కుట్టిస్తే.. దాన్నే లుంగీలా అనుకున్నాడట అయాన్. ఆ విషయం బన్నీ చెబితే నేను టైలర్‌ని పిలిపించి, ‘రంగస్థలం’లో నేను వేసుకున్నట్లుగానే లుంగీ, చొక్కా కుట్టించి ఇచ్చాను. అవి తొడుక్కుని చిట్టిబాబులా అయాన్ స్టిల్లిచ్చాడు. పిల్లలు వెరీ స్వీట్ అండీ.
చిరంజీవిగారు అయ్యప్ప మాల వేసుకుంటారు. మీరూ మీ నాన్నగారిని ఫాలో అవుతుంటారు. మాలలో ఉన్నన్ని రోజులూ నేల మీదే పడుకుంటారా?
అవును. దీక్షలో ఉన్న ఆ నలభైరోజులు జస్ట్ చాప మీద పడుకుంటా. చాలా నిష్టగా చేస్తా. అలా చేయగలననే నమ్మకం ఉంది కాబట్టే మాల వేసుకుంటాను. ఇలాంటి దీక్షలు చేసినప్పుడే మన మీద మనకు ఎంత కంట్రోల్ ఉంటుందో అర్థమవుతుంది. దీక్షలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ‘రంగస్థలం’ సినిమా స్టార్టింగ్ అప్పుడు కూడా మాలలోనే ఉన్నాను. మాల తీసేసిన తర్వాత కూడా ఆ ప్రశాంతత చాలా రోజులు నాతోనే ఉంటుంది.
మీకు దైవభక్తి కూడా ఎక్కువే కదా....
నేను బేసిక్‌గా ఆంజనేయస్వామి భక్తుణ్ణి. నా పేరు కూడా ఆయనదే కదా. దేవుడంటే నమ్మకమే. కానీ సోమవారం ఈ దేవుడు.. మంగళవారం ఆ దేవుడు.. అని రోజుకొక దేవుణ్ణి కొంతమంది పూజిస్తుంటారు కదా. నాకు అంత లోతుగా తెలియదు. ఆంజనేయ స్వామిని పూజిస్తాను.
ఉపవాసాలు చేస్తారా?
అబ్బే... అస్సలు లేదు.
జీవితం అంటేనే ‘రంగస్థలం’ అంటారు.. ఈ జీవిత రంగస్థలం గురించి ఏం చెబుతారు?
ఫస్ట్ సాంగ్‌లో ఎగ్జాట్‌గా అదే చెప్పాం. మనమంతా కేవలం బొమ్మలం. మనమంతా రంగులేసుకోకుండా ఉన్న తోలు బొమ్మలం అని. అదే జీవితం.
మీరు జీవితాన్ని ఎలా చూస్తారు. తేలికగా తీసుకుంటారా? సక్సెస్‌ని, ఫెయిల్యూర్‌ని ఒకేలా తీసుకునేంత పరిపక్వత ఉందా?
కొంతవరకూ తేలికగా తీసుకోగలుగుతా. లైఫ్ గురించి పెద్ద పెద్దగా చెప్పడం పెద్దగా తెలియదు. అయితే మన జీవితంలో రోజువారీ జరిగే విషయాలను ఎనలైజ్ చేసుకుంటూ వెళితే లైఫ్ అంటే ఏంటి? అనేది తెలిసిపోతుందని నమ్ముతాను.
ఎప్పుడూ లేని విధంగా మీరు అనాథ శరణాలయాలకు వెళ్లడం, అక్కడ పిల్లలతో డ్యాన్స్ చేసి, స్వీట్స్ పంచడం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తోంది. దీనికి ఎవరు ఇన్‌స్పిరేషన్?
ఇలా చేయాలని లోలోపల ఎప్పటి నుంచో ఉంది. కానీ అది ఆచరణలో పెట్టాలంటే అన్నీ కలసి రావాలి. ఆవైపు నన్ను ముందుకు నడిపే వ్యక్తి దొరకలేదు. ఉపాసన వచ్చిన తర్వాత ‘నీ ఆలోచనలు అటువైపు ఉన్నాయి. మనం వెళ్దాం’ అని నన్ను తీసుకెళ్తుంది. నా ఆలోచనలు ఆచరణలోకి వచ్చింది ఉపాసన వల్లే. తనకు థ్యాంక్స్ చెప్పాలి. తనలోనూ స్వతహాగా ‘హెల్పింగ్ నేచర్’ ఉంది. నాకూ అదే ఉండేసరికి ఇద్దరి ఈక్వేషన్ కుదిరింది. ‘ఇలాంటి ఈవెంట్స్ ఏవైనా ఉంటే చెప్పు. తప్పకుండా ఖాళీ సమయాల్లో వస్తాను’ అని తనకు చెప్పాను.
– డి.జి.భవాని