ప్రస్తుతం వంద రోజుల మూవీ అనే ఫీట్‌ను ఇప్పటి సినిమాలు సాధించడం కష్టం అవుతోంది. కానీ సరైన కథనం, తమ నటనతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే నటీనటులు, చక్కని సంగీతం, మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో సినిమాను తెరకెక్కిస్తే.. ఇప్పటి సినిమాలు సైతం మంచి కలెక్షన్లతో వంద రోజులు ఆడతాయని నిరూపించిన మరో మూవీ రంగస్థలం.
దర్శకుడు సుకుమార్ టేకింగ్.. ఈ సినిమాకు హైలెట్. ఈ లెక్కల మాష్టారు బ్రెయిన్‌కి టాలీవుడ్ లెక్కలన్నీ మారాయి. ఏ సినిమాలోనైనా హీరో బాగున్నాడు, హీరోయిన్ బాగా చేసింది, విలన్ బాగా చేశాడనో మాట్లాడుకుంటాం. కానీ, రంగస్థలం గురించి మాత్రం అలా చెప్పడం కష్టం. ప్రతి ఒక్కరు వారి పాత్రల్లో జీవించేలా చేశారు సుకుమార్. చిట్టిబాబు పాత్రలో చెర్రీ, కుమార్‌బాబు పాత్రలో ఆది, రామలక్ష్మి పాత్రలో సమంత, రంగమ్మత్తగా అనసూయ, తండ్రి పాత్రలో నరేష్, ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబు, అజయ్ ఘోష్, జబర్దస్త్ కమెడియన్ మహేష్, శత్రు ఇలా ఏ ఒక్కరి పాత్రను తక్కువ చేయలేం. అందరూ తమ నటనతో అంతలా మెప్పించారు.
1980 నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపెట్టిన రత్నవేలు పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. నాటి పల్లెలు ఎలా ఉండేవో పరిశోధించి అచ్చం గ్రామాల్ని గుర్తుచేసేలా వేసిన ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణను కూడా అభినందించాల్సిందే. దాదాపు మూడు దశాబ్దాల కిందటి తరహాలో ఉన్న పాటలను ఉర్రూతలూగించేలా అందించి సినిమాకు పూర్తి న్యాయం చేశారు దేవీశ్రీ ప్రసాద్. బాణీలే కాకుండా సాహిత్యాన్ని కూడా ఆస్వాదించేలా రాసిన పాటల రచయిత చంద్రబోస్.. మరోసారి ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాటలను అందించారు.
నేటి డిజిటల్ యుగంలో పైరసీలు, అమెజాన్ ప్రైమ్‌లో క్వాలిటీ సినిమాలు వస్తున్నా... ఇంకా థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తోన్న సినిమాల్లో రంగస్థలం ఒకటి. నేటికి రంగస్థలం సినిమా కొన్ని థియేటర్లలో వంద రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆర్టీసి క్రాస్ రోడ్‌లోని ఓ థియేటర్‌లో ఈ సినిమా దాదాపు కోటి 70లక్షలు వసూళ్లు చేసినట్టు సమాచారం. మరికొన్ని థియేటర్లలో కోటి రూపాయల కలెక్షన్లు సాధించి రికార్డు నెలకొల్పింది.
100DAYS OF IH RANGASTHALAM ⚡ pic.twitter.com/K5FSZX3qwu
— Mythri Movie Makers (@MythriOfficial) July 6, 2018
Comments
Please login to add a commentAdd a comment