అప్పటి నుంచి... సలహాలివ్వడం మానేశా!
సినీ రంగంలో ఆయన ఎవరికీ వారసుడిగా రాలేదు... ఎవరినీ వారసులు గానూ తీసుకురాలేదు. తొలి చిత్రమైన బి.ఎన్. రెడ్డి గారి ‘రంగుల రాట్నం’ నుంచి ఇప్పటి దాకా ఈ 50 ఏళ్లలో ఆయన హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా... వందల సినిమాలు చేశారు. వందల రోజుల సినిమాల నటుడిగా ప్రజాదరణ పొందారు. ఆరడుగుల ఆజానుబాహుడు కాకపోయినా, పక్కన నటించిన ప్రతి హీరోయిన్‌నూ తారాపథానికి చేర్చిన సెంటిమెంటున్న ఆ వెర్సటైల్ ఆర్టిస్ట్ - చంద్రమోహన్. సినీ దిగ్గజాలు కె. విశ్వనాథ్, ఎస్పీబీలకు బంధువు. మధ్యతరగతి మల్లంపల్లి చంద్ర శేఖరరావు నుంచి ఈ స్థాయికి ఎదిగిన ఆయన మామూలుగా మీడియాకు దూరం. ఇంటర్వ్యూలకు ఇంకా... దూరం. సినీరంగానికొచ్చి 50వ ఏట అడుగిడిన చంద్రమోహన్ చాలా కాలం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ ఇదే. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మనసు విప్పి పంచుకున్న మాటలు... తెలియని కోణాలు... చేదు నిజాలు... తీపి కబుర్లు... ఈ ఆదివారం ‘సాక్షి ఫ్యామిలీ’ గిఫ్ట్.
పులగం చిన్నారాయణ
ఎలా ఉన్నారండీ?
కులాసాగా ఉన్నా. గత నెల కొంత ఇబ్బందై, ఆసుపత్రిలో చేరా. మీడియాలో ఏవేవో వార్తలొచ్చాయి. అవన్నీ తప్పు. అయావ్‌ు ఆల్‌రైట్. మళ్ళీ ఉత్సాహంగా మేకప్‌తో కెమేరా ముందుకొచ్చా.
మీరు ఫస్ట్ మేకప్ వేసుకుంది 1966 మార్చి 16న. అంటే, యాక్టర్‌గా 50వ ఏట ప్రవేశించారన్నమాట.
(నవ్వేస్తూ...) అవును. నిజమే. సినీరంగానికొచ్చి, అప్పుడే 50 ఏళ్ళయిందా అనిపిస్తోంది.
మేకప్ వేసుకున్న తొలి రోజుల్ని గుర్తు చేసుకుంటారా?
నటుణ్ణి కావాలని నేనెప్పుడూ కలలు కనలేదు. కనీసం ప్రయత్నం చేయలేదు. రంగస్థలం మీద ఒక పాత్ర కూడా చేయలేదు. సినిమా రంగంలోకి అనుకోకుండానే ప్రవేశించా. నటుడు ముదిగొండ లింగమూర్తి గారికి మా బావ గారు బాగా తెలుసు. దర్శక - నిర్మాత బి.ఎన్. రెడ్డి గారు కొత్తవాళ్ళతో సినిమా ప్లాన్ చేస్తున్నారని లింగమూర్తి గారి ద్వారా మా బావ గారికి తెలిసి, నా ఫోటోలు ఇచ్చారు. అలా రెడ్డి గారికి నా గురించి తెలిసి, మద్రాసు రమ్మన్నారు. స్క్రీన్ టెస్ట్ చేసి, సెలక్ట్ చేశారు. అన్నీ ఒకదాని వెంట ఒకటి కాకతాళీయంగా జరిగిపోయాయి.
కాకతాళీయంగా మొదలైనా కొన్ని వందల సినిమాలు విజయవంతంగా చేశారు. కానీ, ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించేసినట్టున్నారు?
అవును. రెస్పెక్ట్ ప్రాబ్లమ్... రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్. నాకే కాదు, నా లాంటి సీనియర్లు అందరిదీ ఇదే పరిస్థితి. అందుకే సినిమాలు తగ్గించుకోవడం ఉత్తమం అనిపించింది. ఓ జీవితం చూసేశాం. మిగిలిన కాలాన్ని సొంతానికి ఉపయోగించుకోవడం ఉత్తమమనిపించింది.
ఒకప్పుడు చాలా బిజీగా ఉండి, ఇప్పుడు ఖాళీగా ఉండడమంటే కష్టం కాదా?
ఆస్తుల వ్యవహారాలు, అకౌంట్స్ అన్నీ స్వయంగా చూసుకుంటా. వాటిల్లో పడి మధ్యాహ్నం నిద్ర పోవడానికి కూడా తీరిక దొరకడం లేదు. షూటింగ్స్ ఉంటేనే హైదరాబాద్ వస్తా. లేకపోతే నేను చెన్నైలో బిజీనే!
మీ ఫ్యామిలీ గురించి చెప్పండి?
నా సతీమణి జలంధర. ఆమె గురించి తెలుగు వాళ్లందరికీ తెలుసు. చాలా మంచి రచయిత్రి. ఎన్నో కథలు, నవలలు రాసింది. మా పెళ్లి కాకముందు నుంచే రచనలు చేస్తోంది. నాకు కోపమెంత ఎక్కువో, ఆమెకు సహనం అంత ఎక్కువ. దేవుడు ఆమెకు అంత సహనం ఇచ్చింది, నా కోపాన్ని తగ్గించడానికేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మాకు ఇద్దరమ్మాయిలు. పెళ్లిళ్లయిపోయాయి. హ్యాపీ లైఫ్. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్టు. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మసిస్టు. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలోనే ఉంటున్నారు. ఈ పిల్లల పెంపకం, వాళ్ల చదువులు, ఇంటి వ్యవహారాలు - అన్నీ నా భార్యే చూసుకుంది. అందుకే నా కెరీర్ హ్యాపీగా సాగిపోయింది. బంధువుల ఫంక్షన్లకు కూడా మా ఆవిడే వెళ్లేది.
మరి ఇప్పుడైనా ఫంక్షన్లకు మీరు వెళ్తున్నారా?
అప్పట్లో ఎక్కువ అవుడ్డోర్ షూటింగ్స్‌లో ఉండేవాణ్ణి కాబట్టి, ఫంక్షన్లకు వెళ్లడం కుదిరేది కాదు. ఇప్పుడు వెళ్తున్నాను. అలాగే జలంధరకు గుళ్లకూ, గోపురాలకూ వెళ్లడం ఇష్టం. నాకు పెద్ద ఆసక్తి ఉండదు. అయితే, ఆమె కోసం అప్పుడప్పుడూ వెళ్తుంటాను.
మీ సొంత ఊరు పమిడిముక్కల (కృష్ణా జిల్లా) వెళుతుంటారా?
అప్పుడప్పుడూ వెళుతుంటా. నాకో తమ్ముడున్నాడు. ఊళ్లో వ్యవసాయం చేస్తుంటాడు. వాడు కాక నాకు ఆరుగురు అక్కయ్యలు, ఇద్దరు చెల్లెళ్లున్నారు. అందులో ఇప్పుడు నలుగురే మిగిలారు.
అసలు... మీ కుటుంబంలో ఎవరైనా నటులున్నారా?
నా ముందెవరూ లేదు. నా తర్వాతా లేరు. శోభన్‌బాబు, నేను, మురళీమోహన్... మేం ముగ్గురం ఒకటే టైప్. మా ఫ్యామిలీల నుంచి ఎవరూ సినిమా వారసులు రాలేదు. శోభన్‌బాబు, మురళీ మోహన్‌లు వాళ్లబ్బాయిల్ని హీరోలుగా చేయాలనుకుంటే ఎంతసేపు చెప్పండి. నాకు మగ పిల్లలు లేరు కానీ, ఉన్నా వాళ్ళకు ఆసక్తి లేకపోతే రానిచ్చేవాణ్ణి కాదు. నటన మా ఫ్యామిలీలో నాతో మొదలైంది. నాతోనే ముగుస్తుంది!
ఇంటర్వ్యూలివ్వడానికి ఎందుకని ఆసక్తి చూపించరు?
కెరీర్ ప్రారంభంలో అయితే వాటి వల్ల కొంత హెల్ప్ ఉండేది. ఇప్పుడైతే అస్సలు అవసరం లేదు. వాటివల్ల ప్రపంచానికి కొత్తగా మా గురించి తెలిసేదీ లేదు. నాకు ఉపయోగం లేని పని నేనెప్పుడూ చేయను! పబ్లిక్ ఫంక్షన్లకూ వెళ్లను. మాట్లాడలేక కాదు. మాట్లాడితే నిజాలు మాట్లాడు కోవాలి. అది ఎవరూ భరించలేరు. ఎందుకు ఒకరినొకరు పొగుడుకోవడానికి వేదికలెక్కడం?!
సినీసీమలో హిపోక్రసీ ఎక్కువ. మీరేమో అన్నీ మొహం మీదే..
దానివల్ల ఇబ్బంది పడ్డా. ముందొక మాట, వెనుక ఒక మాట మాట్లాడడం నాకు ఇష్టముండదు. ‘ఆ చెప్పేదేదో లౌక్యంగా చెప్పొచ్చుగా’ అని ఇంట్లో అనేవాళ్లు. కొన్నాళ్లు ట్రై చేసి, ఫెయిలయ్యా.
మీపై కోపిష్ఠి అనే బ్రాండ్ కూడా ఉంది!
అవును. నాకు చాలా టెంపర్ ఎక్కువ. అయితే ఆ కోపం అనవసరంగా రాదు. అకారణంగా రాదు. నా మంచితనాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటేనే కోపం వస్తుంది. అయినా నన్ను అర్థం చేసుకున్నవాళ్లు... నా కోపాన్నీ అర్థం చేసుకుంటారు.
కొంచెం హైట్ ఉంటే బావుండేదని అనుకున్నారా?
హీరోయిన్స్ పక్కన పొట్టిగా కనబడడం వల్ల కొన్ని అవకాశాలు కూడా పోయాయి. మొదట్లో ఫీలయ్యాను కానీ, తర్వాత దాని గురించి ఆలోచించడం మానేశా. ఎవరికి రావాల్సిన అవకాశాలు వాళ్లకు వస్తాయి. బేసిక్‌గా ఈ హైట్ నన్ను ఒక ఇమేజ్‌కి పరిమితం కాకుండా చూసింది.
‘శంకరాభరణం’ నాటికి మీరు పాపులర్ హీరో అయినా గెస్ట్‌గా చేశారేం?
‘శంకరాభరణం’లో నేను, ఒకరిద్దరు తప్ప మిగిలినవాళ్లంతా కొత్తవాళ్లే. మొదట నా పాత్రకు కొత్త కుర్రాణ్ణే అనుకున్నారు. కానీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు మాత్రం ఆ పాత్రను నాతో చేయించాలని ఉంది. నేను చేస్తే సినిమాకు ప్లస్ అవుతుంది. దానికి తోడు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో అప్పటికే నేను ‘ఓ సీత కథ’, ‘సిరిసిరి మువ్వ’, ‘సీతామాలక్ష్మి’, ‘శుభోదయం’ సినిమాలు చేశాను. అన్నీ హిట్లే. అందుకే మా కాంబినేషన్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని నిర్మాత ఆశ. కె.విశ్వనాథ్ గారేమో కొత్తవాడయితేనే కరెక్ట్. ఇతను చేస్తే మైనస్ అవుతుందన్నారాయన. కానీ నిర్మాత బలవంతంగా ఒప్పించారు. నన్ననుకున్న తర్వాత ఐదారు సీన్లు పెంచారు.
మళ్లీ విశ్వనాథ్ దర్శకత్వంలో చేయలేదెందుకని?
ఈ ప్రశ్న మీరు విశ్వనాథ్‌ని అడగాలి. ‘స్వాతి ముత్యం’ మొదట నాతోనే చేద్దామనుకున్నారు. లైన్ కూడా చెప్పారు. అందులో నా పాత్రకి తోడుగా ఓ ఉడత కూడా ఉంటుంద న్నారు. నా బాధలన్నీ నేను ఉడతతో పంచుకుంటానన్న మాట. దాని కోసం నేను ఒక అడవి ఉడతను పెంచుకున్నాను కూడా! తర్వాత ఆ సినిమా కమల్ హాసన్‌తో తీశారు. అందులో హీరోకి కోపం వస్తే చెయ్యెత్తి కొట్టినట్టుగా ఓ మేనరిజం ఉంటుందిగా. అది నా ఆలోచనే. మా కజిన్‌కి ఆ అలవాటుంది. కథ చెబితే, ఈ మేనరిజమ్ నేనే చెప్పా... కానీ, కమల్ అద్భుతంగా చేశాడు.
మీ పక్కన చేస్తే కథానాయికలు తారాపథానికి చేరుకుంటారని...!
అవును. మొదట్లో సెంటిమెంట్, తర్వాత అలవాటుగా మారింది. వాణిశ్రీ, లక్ష్మి, చంద్రకళ, జయప్రద, శ్రీదేవి, రాధిక, జయసుధ, విజయశాంతి, రాధ, తులసి, పూర్ణిమ... ఇలా ఎందరో నా పక్కన నటించి, ఆ తర్వాత నాకే అందనంత ఎదిగిపోయారు.
మీ కెరీర్‌లో ఎక్కడా గ్యాప్ రానట్టుంది?
అవును. 50 ఏళ్లుగా నిర్విరామంగా నటిస్తున్నా. అప్పట్లో హీరో వేషాలు వేశా. ఇప్పుడు తండ్రి పాత్రలు చేస్తున్నా. ఈవీవీ గారి ‘ఆమె’లో ముగ్గురు పిల్లల తండ్రిగా చేశా. అప్పటికి నాకు హీరో వేషాలొస్తున్నాయి. కానీ నా పొజిషన్, నా మార్కెట్ గురించి నాకు అవగాహన ఉంది. గుమ్మడిగారు, కైకాల సత్యనారాయణగారు అప్పటికే పెద్దవాళ్లయి పోయారు. తండ్రి పాత్రలకు స్లాట్ ఖాళీగా ఉంది. శోభన్‌బాబు సినిమాలకు దూరంగా ఉన్నాడు. కృష్ణ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఇక మిగిలింది నేను. మార్పు అవసరమని అర్థమైంది. మొదట ఇలాంటి ఆఫరిచ్చింది ముత్యాల సుబ్బయ్యగారు ‘కలికాలం’లో. తర్వాత ‘ఆమె’.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక ఏమైనా మార్పులు కనిపెట్టారా?
మా తరానికీ ఈ తరానికీ చాలా తేడాలున్నాయి. అప్పట్లో మేమంతా మా సీనియర్లను గౌరవించేవాళ్లం. ఇప్పుడలా లేదు. హీరోకి ఏమైనా సలహా ఇస్తే ‘నీ పని నువ్వు చూసుకోవయ్యా’ అంటున్నారు. ఒకసారి నాకలాంటి సందర్భం ఎదురైంది. అప్పట్నుంచీ సలహాలివ్వడం మానేశా.
మీకు పారితోషికాలు ఎగ్గొట్టిన సందర్భాలున్నాయా?
ఎగ్గొట్టేవాళ్లు కొందరైతే, మధ్యలో నొక్కేసేవాళ్లు మరికొందరు. అందుకే డబ్బులిస్తేనే చేస్తానని ముందే చెప్పేస్తుంటా. కొన్ని నేను మాత్రమే చేసేవి ఉంటాయి. అలాంటి వాటికి డబ్బు తక్కువైనా చేస్తాను.
ఫైనల్‌గా సినిమా ఇండస్ట్రీలో డబ్బుకే ప్రాధాన్యం అంటారు?
నేనేంటి... ప్రపంచమంతా అదే చెబుతుంది! కాంతారావుగారు ఎంత గ్రేట్ ఆర్టిస్టు! అలాంటాయన ఆఖరి స్టేజ్ ఎలా గడిచిందో తెలుసు కదా! ఓసారి కీసరగుట్టలో షూటింగ్ జరుగుతోంది. ఆయనకూ వేషం ఉంది. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ పడేశారు కానీ, ప్రొడక్షన్ వాళ్లు పట్టించుకోలేదు. చివరకు నా రూమ్‌లో కూర్చోబెట్టుకున్నా. అలాగే నాగయ్యగారి ఉత్థాన పతనాలు చూశా. ఒకప్పుడు లక్ష రూపాయలు తీసుకున్న హీరో ఆయన. చివరకు 500 రూపాయలక్కూడా వేషం వేసేవారు. రాజనాల, పద్మనాభం... ఇలా చాలామందిని చూశా. అందుకే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఉండాలి. ఇక్కడ వేషం ఉంటేనే డబ్బు. ప్రతిరోజూ పోరాడాలి. పెన్షనూ రాదు. గ్యారంటీ లేని లైఫ్. ఏ అసోసియేషనూ పట్టించుకోదు. కొంతమంది దహన సంస్కారాలకు చందాలేసుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు వాళ్ల ఆటో గ్రాఫ్‌ల కోసం ఎంతోమంది ఎగబడి ఉంటారు. అంటే, ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. కన్నాంబ, భానుమతి, ఎస్వీఆర్‌లను మించిన ఆర్టిస్టులున్నారా? వాళ్ల గురించి ఈ తరానికి తెలియదు. మా మనవరాళ్లకి నేనే సినిమా ఆర్టిస్టునని తెలియదు.
అవార్డుల విషయంలో మీకు అన్యాయమే జరిగినట్టుంది?
‘పద్మశ్రీ’ ఎప్పుడైతే సావిత్రి, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, గుమ్మడి, కైకాలను వదిలేసి జూనియర్స్‌కి ఇచ్చారో అప్పుడే వాటి గురించి ఆలోచించడం మానేశా.
మీ ఫేవరెట్ యాక్టర్‌లు ఎవరు?
శివాజీ గణేశన్‌గారి యాక్టింగ్ అంటే నాకు బాగా ఇష్టం. ఆయనతో కలిసి ‘అండమాన్ కాదలి’ అనే సినిమా చేయగలగడం నా అదృష్టం. తెలుగులో ఈ సినిమాను ఏయన్నార్‌గాను ‘అండమాన్ అమ్మాయి’గా చేశారు. రెండింటిలోనూ నాది కొడుకు పాత్రే. శివాజీ గణేశన్‌గారితో కలిసి సీన్లు చేసినప్పుడు కొంత భయం వేసింది. తెలుగు లిపిలో తమిళ డైలాగులు రాసిస్తే చెప్పాను.
‘శ్రీ షిర్డీసాయిబాబా మహాత్మ్యం’లో నేను చేసిన నానావలి పాత్ర చూసి ‘ఊర్వశి’ శారద గారు ‘‘నీలో శివాజీ గణేశన్ కనిపిస్తున్నాడు’’ అన్నారు. ఆ నడక, ఆ డైలాగ్ డెలివరీ అచ్చం అలాగే అనిపించాయట. నాకు కూడా సినిమా చూస్తున్నప్పుడు అదే ఫీలింగ్ అనిపిం చింది. అది నాకు తెలియకుండానే వచ్చేసిన ట్టుంది. ఇమిటేట్ మాత్రం చేయలేదు. ఎమ్.జి. రామచంద్రన్ గారితో ఆయన తమ్ముడిగా ‘నాళై నమదే’లో చేశా. కన్నడంలో, మలయాళంలో ఒక్కో సినిమా చేశా. హిందీ చెయ్యలేదు.
మీరు మంచి భోజన ప్రియులట?
సినిమా ఫీల్డ్‌కొచ్చాకనే భోజన ప్రియుణ్ణి అయ్యా. ఇంట్లో అయితే ఒకటి, రెండు కూరలే ఉంటాయి. అదే షూటింగ్స్‌లో అయితే రకరకాలు పెడుతుంటారు. నేను ఇంట్లో నాన్ వెజ్ తినను కానీ, బయట తింటాను. ఫుడ్ కంట్రోల్ ఎప్పుడూ లేదు. ఇది తినాలి, ఇది తినకూడదనే నిబంధనలు ఎప్పుడూ లేవు. ఓసారి ఏయన్నార్‌గారు ‘‘ఈ తిండికి లావు అవ్వాలి. ఇలా బాడీ ఎలా మెయింటెయిన్ చేస్తున్నావు?’’ అనడిగారు. ఎంత తిన్నా అప్పట్లో బాడీ పెరగలేదు.
ఎపుడైనా నిర్మాత అవ్వాలనే ఆలోచన రాలేదా?
రాలేదు... రాబోదు. చాలామంది నిర్మాతల పరిస్థితి చూశా కదా.
మీ ఫేవరెట్ యాక్టర్‌లు ఎవరు?
శివాజీ గణేశన్‌గారి యాక్టింగ్ అంటే నాకు బాగా ఇష్టం. ఆయనతో కలిసి ‘అండమాన్ కాదలి’ అనే సినిమా చేయగలగడం నా అదృష్టం. తెలుగులో ఈ సినిమాను ఏయన్నార్‌గాను ‘అండమాన్ అమ్మాయి’గా చేశారు. రెండింటిలోనూ నాది కొడుకు పాత్రే. శివాజీ గణేశన్‌గారితో కలిసి సీన్లు చేసినప్పుడు కొంత భయం వేసింది. తెలుగు లిపిలో తమిళ డైలాగులు రాసిస్తే చెప్పాను.
‘శ్రీ షిర్డీసాయిబాబా మహాత్మ్యం’లో నేను చేసిన నానావలి పాత్ర చూసి ‘ఊర్వశి’ శారద గారు ‘‘నీలో శివాజీ గణేశన్ కనిపిస్తున్నాడు’’ అన్నారు. ఆ నడక, ఆ డైలాగ్ డెలివరీ అచ్చం అలాగే అనిపించాయట. నాకు కూడా సినిమా చూస్తున్నప్పుడు అదే ఫీలింగ్ అనిపిం చింది. అది నాకు తెలియకుండానే వచ్చేసిన ట్టుంది. ఇమిటేట్ మాత్రం చేయలేదు. ఎమ్.జి. రామచంద్రన్ గారితో ఆయన తమ్ముడిగా ‘నాళై నమదే’లో చేశా. కన్నడంలో, మలయాళంలో ఒక్కో సినిమా చేశా. హిందీ చెయ్యలేదు.
మీరు మంచి భోజన ప్రియులట?
సినిమా ఫీల్డ్‌కొచ్చాకనే భోజన ప్రియుణ్ణి అయ్యా. ఇంట్లో అయితే ఒకటి, రెండు కూరలే ఉంటాయి. అదే షూటింగ్స్‌లో అయితే రకరకాలు పెడుతుంటారు. నేను ఇంట్లో నాన్ వెజ్ తినను కానీ, బయట తింటాను. ఫుడ్ కంట్రోల్ ఎప్పుడూ లేదు. ఇది తినాలి, ఇది తినకూడదనే నిబంధనలు ఎప్పుడూ లేవు. ఓసారి ఏయన్నార్‌గారు ‘‘ఈ తిండికి లావు అవ్వాలి. ఇలా బాడీ ఎలా మెయింటెయిన్ చేస్తున్నావు?’’ అనడిగారు. ఎంత తిన్నా అప్పట్లో బాడీ పెరగలేదు.
ఎపుడైనా నిర్మాత అవ్వాలనే ఆలోచన రాలేదా?
రాలేదు... రాబోదు. చాలామంది నిర్మాతల పరిస్థితి చూశా కదా.