మెగా నం. 150 | special chit chat with hero chiranjeevi | Sakshi
Sakshi News home page

రేఖ నా విషయంలో కర‍్కశంగా ఉంది: చిరు

Published Sat, Jan 7 2017 12:23 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

మెగా నం. 150 - Sakshi

మెగా నం. 150

150 సినిమాలంటే అందాజాగా సప్త సముద్రాలు దాటినట్లే..
ఎన్నో అనుమానాలు..
ఎన్నో భయాలు..
ఎన్నో విపత్తులు..
ఎన్నో విమర్శలు..
ఎన్నో అంచనాలు..
ఎన్నో ఎదురుచూపులు...
ఎన్నో ఆశలు...
ఇవి చిరంజీవి అభిమానుల గుండెల్లోని సప్త సముద్రాలు.
ఈ సప్త సముద్రాల తీరం ఇంకా గొప్పది...
ఆ తీరం పేరే... ఫ్యామిలీ!
ఇవాళ ఈ వయసులో ఇంత మహోన్నతమైన
ప్రాజెక్ట్‌ చేపట్టిన చిరంజీవి తన ఫ్యామిలీ కనబర్చిన శక్తి
ఈ ఏడు సముద్రాలనీ దాటించేలా చేసిందని అంటున్నారు.
‘సాక్షి’ ఫ్యామిలీకి చిరంజీవి ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ...
ఎంజాయ్‌...


రిలీజులు మీకు కొత్త కాదు. కానీ, తొమ్మిదేళ్ల తర్వాత చేసిన సినిమా అంటే ఓ ప్రత్యేకమైన ఫీలింగ్‌ ఉండి ఉంటుంది...  యస్‌... గత సినిమాల విడుదలకీ, ఈ ‘ఖైదీ నంబర్‌ 150’ విడుదలకీ కచ్చితంగా వ్యత్యాసం ఉంది. అది కాదనలేని సత్యం. తొమ్మిదిన్నరేళ్ల విరామం తర్వాత నేను చేసిన రీ–ఎంట్రీ సినిమా. ఎంతవరకూ వాళ్లను ఈ సినిమా అలరిస్తుందనే మీమాంస, తర్జన భర్జనలు మాకున్నాయి. కానీ, మాకున్న గట్‌ ఫీలింగ్‌ ఏంటంటే... రామ్‌చరణ్, వీవీ వినాయక్, రత్నవేలు, గౌతంరాజు.. మేం ఆల్రెడీ  సినిమా చూసుకున్నాం. చూశాక మాకు ఓ రకమైన కాన్ఫిడెన్స్‌ మాకు వచ్చింది. ‘స్టాలిన్‌’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’.. నేను చేసిన చివరి మూడు నాలుగు సినిమాల కంటే ఈ సినిమాలో నా లుక్‌ చాలా బాగుంది. ఫస్ట్‌డే మేకప్‌ వేసుకుని లొకేషన్‌కి వెళ్లగానే, వినాయక్‌ ‘అన్నయ్యా... ‘చూడాలని ఉంది’లో చిరంజీవిలా ఉన్నారు. ఫిఫ్టీ పర్సెంట్‌ హిట్‌ ఇక్కడే కొట్టేశాం’ అన్నాడు. సో, ఎక్కడా కూడా పదేళ్ల విరామం గానీ, ప్రస్తుత వయసు గానీ తెరపై కనిపించే ఆస్కారం లేదు.

‘నేనే నిర్మిస్తా’ అని రామ్‌చరణ్‌ అన్నప్పుడేమనిపించింది?
చరణ్‌ ఆ మాట అన్నప్పుడు ‘ఇన్నేళ్లుగా నేను క్రియేటివ్‌ సైడ్‌ వెళుతూ వచ్చానే తప్ప వ్యాపార దృక్పథంతో ఆలోచించలేదు. అంజనా ప్రొడక్షన్స్‌ సంస్థ స్థాపించి మీ బాబాయ్‌ నాగబాబు సినిమాలు  నిర్మించినప్పటికీ ఎప్పుడూ నేను భాగస్వామిగా వ్యవహరించలేదు. తనను ఎంకరేజ్‌ చేస్తూ వచ్చాను. నటుడిగానే నేను ఫోకస్‌ చేశాను’ అన్నాను. అప్పుడు చరణ్‌ ఏమన్నాడంటే, ‘డాడీ.. మీ వెనకాల ఎక్కువ మంది లేరేమో. నా వెనకాల మాత్రం మీరంతా ఉన్నారు. ఏ విషయంలోనైనా నాకు సలహాలూ,  సూచనలూ ఇచ్చేవాళ్లు చాలామంది ఉండగా, నేనెందుకు వెనకంజ వేయాలి’ అన్నాడుæ. అంతేకాదు..  ‘డాడీ... మిమ్మల్ని ఎలా ప్రెజెంట్‌ చేయాలనేది మేమందరం కూడబలుక్కుని, బెస్ట్‌ టెక్నీషియన్స్‌ని పెట్టుకుని సినిమా చేస్తాం. ఆ ఛాన్స్‌ నాకే ఇవ్వండి’ అన్నాడు. కాదనలేకపోయా.

ఇంతకీ మీ నిర్మాత ఎంతవరకూ బెస్ట్‌?
సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో సూపర్‌. నిర్మాతగా అది మొదటి విజయం. ఓ హీరోగా, నటుడిగా తన నిర్మాత ఎలా ఉండాలని కోరుకుంటాడో... ఓ నిర్మాతగా తను అలానే ఉన్నాడు. ‘ధృవ’ షూటింగ్‌ కోసం చరణ్‌ బ్యాంకాక్‌ వెళ్లిన టైమ్‌లోనే మేము స్లొవేనియా, క్రోయేషియా వెళ్లాం. ‘డాడీ ఎలా ఉన్నారు? షూటింగ్‌ ఎలా జరుగుతోంది?’ అని నిరంతరం దర్శకుడితో, మా పెద్దమ్మాయి సుస్మితతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఫారిన్‌ వెళ్లినప్పుడు అక్కడి కరెన్సీకి మన డబ్బులు మార్చుకోలేక, చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడతారు. అందుకే మేకప్‌మ్యాన్‌ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ 300 యూరోలు ఇవ్వమని చెప్పాడు. అందరికీ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ సదుపాయాలు ఇచ్చాడు. అతిశయోక్తి అనుకోకుంటే ఓ మాట చెబుతా. నా నిర్మాతల్లో ‘ది బెస్ట్‌’ అని అశ్వనీదత్, అల్లు అరవింద్‌ లాంటి కొద్దిమంది పేర్లు చెప్పగలను. అందులో ప్రథమ స్థానం అనను కానీ చరణ్‌కు ప్రముఖ స్థానం ఇస్తా. చరణ్‌ ఆ స్థాయి నిర్మాత.


మీ అమ్మాయి సుస్మిత  కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేయడం..
‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’, ‘అందరివాడు’.. నా లాస్ట్‌ సినిమాలు అన్నిటికీ తనే చేస్తూ వచ్చింది. నిఫ్ట్‌లోనూ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలోనూ శిక్షణ తీసుకుంది. మొదట్నుంచీ సినిమా వాతావరణంలో పెరగడం వలన తన శిక్షణను సినిమాకి అనుగుణంగా సుస్మిత మలచుకుంది. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫెక్టివ్‌గా చూపించడంలో తను సక్సెస్‌ అయింది.  మొదట ముంబయ్‌ వాళ్లను ప్రయత్నిద్దాం అనుకున్నాం. వచ్చినవాళ్ళ యాటిట్యూడ్, కమర్షియల్‌గా మాట్లాడడం చూసిన తర్వాత ‘వద్దు. అక్కే డ్రస్సులు డిజైన్‌ చేస్తే బాగుంటుంది’ అని చరణ్‌ అన్నాడు. తమ్ముడు అడిగిన వెంటనే సుస్మిత కాదనలేదు. ఇప్పుడు తనకీ ఓ ఫ్యామిలీ ఉంది కదా. మా విష్ణు (సుష్మిత భర్త) చాలా కో–ఆపరేట్‌ చేశాడు.‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి కూడా తనే డ్రస్సులు డిజైన్‌ చేసింది.

[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]

మీ అల్లుడు విష్ణు ఏమన్నారు?
‘మా పెళ్లైన బిగినింగ్‌లో చేశారు. మళ్లీ సినిమాలు చేయలేదు. మేమంతా మీ ఫ్యాన్స్‌. మీరు సినిమాలు చేస్తే అంత కంటే ఆనందం ఉండదు. తప్పకుండా చేయాలి’ అన్నాడు. విష్ణు మాత్రమే కాదు.. ఫ్యామిలీలో యంగ్‌ హీరోలందరూ ఎంతో ఉత్సాహపడ్డారు.

కుటుంబం నుంచి చాలామంది హీరోలు రావడంపై?
ఇది చాలా గర్వపడే అంశం. వాళ్లు కూడా ఒక సుస్థిర స్థానం ఏర్పరుచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. నా తృప్తి, నా గర్వం ఇప్పుడు రెండింతలు. ‘ప్రతి ఒక్కరూ (మెగా హీరోలు) మనకి నల్లేరు మీద నడక’ అనుకోవడం లేదు. కష్టపడితేనే చిత్ర పరిశ్రమలో ఉంటాం. ఇండస్ట్రీలో ఓ స్థానం ఏర్పడడానికి చిరంజీవి కారణం కావొచ్చు.

ఒకప్పుడు బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో మీ  పిల్లల ఎదుగుదలను చూడలేకపోయారు. ఇప్పుడు కాస్త విశ్రాంతి దొరకడం ఎలా ఉంది?
దట్స్‌ ట్రూ! నా పిల్లలతో తినవి తీరా ఆడుకునే వీలు నాకు చిక్కలేదు. ఇప్పుడు నా గ్రాండ్‌ చిల్డ్రన్‌తో నేను ఆడుకుంటూ, ఆనందపడిపోతుందే సురేఖ నన్ను తదేకంగా చూస్తుంటుంది. ‘ఏంటి? ఏం చూస్తున్నావ్‌?’ అనడిగితే, ‘మన పిల్లలతో మీరు ఈ విధంగా ఆడుకున్న సంఘటనలు ఉన్నాయా? అని గుర్తు చేసుకుంటున్నా’ అంది. ఏం గుర్తుకు రాలేదు. వాళ్లు పెద్దయిన తర్వాత నేను ఊటీ, స్విట్జర్లాండ్, కాశ్మీర్‌ వెళ్లినప్పుడు నాతో వచ్చేవారు. షూటింగ్‌ నుంచి అలసిపోయి వచ్చిన నేను వాళ్లతో సరదాగా కాసేపు మాట్లాడడం తప్ప.. ఎప్పుడూ ఆడుకోలేదు.

మొదటి రోజు షూటింగ్‌కి వెళ్లినప్పుడు మీ ఫీలింగ్‌?
నిజంగా చెప్తున్నాను. మేకప్‌ వేసుకుని సెట్‌లోకి వెళ్లిన తర్వాత లైట్స్, సౌండ్, కెమేరా.. అదే సినిమా అరోమా అంటుంటాం కదా! ఇవన్నీ ఎంత ఫెమిలియర్‌ అంటే.. స్టార్ట్, కెమేరా, యాక్షన్‌ అనే ధ్వని వినపడగానే... పదేళ్ల క్రితం నన్ను నడిపించిన, నాకు ఇష్టమైన, నేను ఆస్వాదించిన వాతావరణం మళ్లి వచ్చినట్లుగా అనిపించింది. నిన్నటివరకూ షూటింగ్‌ చేసి, మళ్లీ ఈరోజు సెట్‌కి వచ్చాననే ఫీలింగ్‌ తప్ప... పదేళ్ల విరామం తర్వాత మళ్లీ వస్తున్నాననే ఫీలింగ్‌ లేదు. ఇంటి నుంచి మేకప్‌ వేసుకుని బయలు దేరినప్పుడు గానీ... మేకప్‌ తీసేసి ఇంటికి వచ్చినప్పుడు గానీ... పని తాలూకు ఉత్సాహం, వైబ్రేషన్స్‌ అన్నీ మా ఆవిడ గమనించింది. ‘ఈ మధ్య కాలంలో ఇంత హుషారుగా, ఇంత సంతోషంగా మీరు కనిపించలేదు’ అని సురేఖ అంది. ఇష్టమైన ఫీల్డ్‌లో మనకి ఇష్టమైన పని చేస్తుంటే ఉండే జోష్‌ మాటల్లో చెప్పలేను. 2007లో ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ చేసిన ఆఖరి క్షణానికీ, 2016లో ‘ఖైదీ నంబర్‌ 150’ మొదటి రోజు షూటింగ్‌ చేసిన క్షణానికీ నాకు తేడా లేదు. బాగా ఎంజాయ్‌ చేశాను.

ఇన్నేళ్లు దూరంగా ఉన్నందుకు పశ్చాత్తాపపడ్డారా?
లేదు. 30 ఏళ్లు కంటిన్యూస్‌గా నటించిన తర్వాత ఓ రకమైన అలసటకు గురయ్యాను. ఆ అలసట నుంచి మానసిక సంతృప్తి కోసం వేరే రంగానికి (రాజకీయాల్లోకి) వెళ్లాను. అందులో నేను ఎంత సాధించాను అనేది అందరికీ తెరిచిన పుస్తకమే. అందులో ఉండే తృప్తి పూర్తిగా వేరు. రాజకీయంగా ఏర్పడిన సబ్దత దృష్ట్యా 150వ సినిమాకి ప్రతీ కార్నర్‌ నుంచీ నన్ను స్వాగతించారు. అభిమానులే కాదు! అమితాబ్‌ బచ్చన్, రజనీకాంత్‌ లాంటి వారూ నేను సినిమాల్లోకి రావాలన్నారు. అంతటి గొప్ప స్వాగతం నాకు లభించింది. సో, నో రిగ్రేట్స్‌. అది (రాజకీయాలు) ఓ రకమైన సంతృప్తి. ఇది (సినిమాలు) ఓ రకమైన సంతృప్తి.

150.. 175.. మీ ఫ్యాన్స్‌ చాలా ఎక్స్‌పెక్ట్‌చేస్తున్నారు?
అవకాశమున్నంత వరకూ నేను నటిస్తూనే ఉంటా.


మీ ఫ్యామిలీలో ఎక్కువమంది హీరోలు ఉండటంతో అభిమానులు డివైడ్‌ అవుతున్నారనుకోవచ్చా?
మీ ప్రశ్న డివైడ్‌ అవుతుంటే అని కాకుండా యునైట్‌ అవుతుంటే అనాలేమో. అభిమానులు బలోపేతం అవుతున్నారు. మా ఫ్యామిలీ హీరోలు నా ఇమేజ్‌ షేర్‌ చేసుకుంటూ నన్ను బలహీనపరుస్తున్నారు అనుకోవడం లేదు.

దర్శకుడు... అభిమాని అయితే సౌకర్యం కదా?
నిజమే. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే హీరోలు ఇప్పుడు ఒక్క సినిమా, ఏడాదిన్నరకు ఓ సినిమా చేస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటంటే.. ఏ కథలు చేయాలి? ఎలాంటి సినిమాలు చేయాలి? అనే దానిపై చాలా సంఘర్షణ ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత కన్‌ఫ్యూజన్‌ వస్తుంది. ఒక్కోసారి బాగా రాణిస్తుందనుకున్న సినిమా సరిగ్గా ఆడకపోతే.. తర్వాత ఏం చేయాలన్నా ధైర్యం సరిపోదు. ఒక్కోసారి మన స్టైల్‌ రొటీన్‌ అయిపోతుందని అనుకుంటున్న టైమ్‌లో.. ‘లేదు సార్‌. అభిమానులకు అవే కావాలి, అవే కిక్‌ ఇస్తాయి’ అని చేయించుకుంటారు. ఒక్కోసారి మొనాటనీ ఫీల్‌ అవడం కామన్‌. అప్పుడు ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో!నా అభిమాని అయినటువంటి దర్శకుడికి బాగా తెలుస్తుంది. వీవీ వినాయక్‌ నా అభిమాని కావడంతో సినిమాని బాగా తీశాడు.

ఓ ఆర్టిస్ట్‌కి ‘ఇమేజ్‌’ ఏర్పడటం ఎంత ప్లస్సో అంత మైనస్‌ ఏమో.. ఎందుకంటే, ఇమేజ్‌కి తగ్గట్టుగా కథ ఉండాలి. ఉదాహరణకు తమిళ ‘కత్తి’లో లేనివి మీకోసం యాడ్‌ చేయాల్సి వచ్చింది కదా..
ఏ ఆర్టిస్ట్‌కి అయినా ఇమేజ్‌ ప్లస్సే అని నా ఫీలింగ్‌. అదొక అదృష్టం. కాకపోతే ఒక్కో ఆర్టిస్ట్‌కీ ఒక్కో ఇమేజ్‌ వస్తుంది. ఆ ఇమేజ్‌కి నిర్వచనం ఇవ్వలేం. ఇమేజ్‌ రావడం, అది రాను రాను బలం కావడం అనేది లక్‌. కాకపోతే తన బలం ఎక్కడుందో ఆర్టిస్ట్‌కి తెలియాలి. అది తెలుసుకుని దానికి తగ్గట్టుగా కథలు ఎన్నుకోవాలి. నాకున్న ఇమేజ్‌కి నేను ‘కత్తి’ చేయడమే కరెక్ట్‌. అందుకే రీమేక్‌కి రెడీ అయ్యాం. అన్ని అంశాలూ ఉన్న సినిమా అది. మంచి సోషల్‌ మెసేజ్‌ ఉంది.

స్టోరీ సెలక్షన్‌ విషయంలో చాలా స్ట్రెస్‌కి గురయ్యారు కదా?
సరిగ్గా ఏడాది పాటు కథ కోసం అన్వేషించా. నా నుంచి ప్రేక్షకులు ఏవేం కోరుకుంటున్నారో అవన్నీ సినిమాలో ఉండాలి. ఎట్‌ ద సేమ్‌ టైమ్‌... పొలిటికల్‌గా ఓ బాధ్యతాయుతమైన స్థానంలో, ఈ వయసులో, అందులోనూ పదేళ్ల తర్వాత వస్తున్నప్పుడు సామాజిక స్పృహ ఉన్న సినిమా చేయాలి. చాలా కథలు విన్నాను. ఎక్కడా పూర్తి స్థాయిలో సంతృప్తి పడే కథ రాలేదు. అప్పుడు ‘కత్తి’ చూశా. అదో మాస్‌ సినిమా. అందులో యూనివర్శల్‌ ప్రాబ్లమ్‌ ఉంది. ముఖ్యంగా వ్యవసాయమే ప్రధానంగా ఉన్న మన ఇండియాలో సమస్యను ప్రస్తావించే సినిమా. ఈరోజుకీ సమసిపోని సమస్య. దీన్ని నా యాటిట్యూడ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కీ మార్చుకోవాలనుకున్నాం. కమ్‌బ్యాక్‌ ఫిల్మ్‌కి ఇది కరెక్ట్‌ అని భావించాం.

తొమ్మిదిన్నరేళ్లు టచ్‌ వదిలిపోయిన డ్యాన్స్‌ మళ్లీ చేసేటప్పుడు ఇబ్బంది అనిపించిందా?
సాంగ్స్‌ విషయంలో కొంచెం కొత్తగా ప్రయత్నించాం. యంగ్‌ డ్యాన్స్‌ మాస్టర్స్‌ శేఖర్, జానీ, లారెన్స్‌లు ఇందులో పాటలకు కొరియోగ్రఫీ చేశారు. వీళ్ల మూమెంట్స్‌ నా బాడీపై కొత్తగా అనిపించాయి. నిజం చెప్పాలంటే ఈ ఇన్నేళ్ల గ్యాప్‌లో ఎప్పుడూ సరదాకి కూడా ఇంట్లో డ్యాన్స్‌ చేయలేదు. శ్రీజ వివాహంలో పిల్లలు బలవంత పెట్టడంతో కొన్ని సెకన్లు డ్యాన్స్‌ చేశా. అంతే. అటువంటిది డ్యాన్స్‌మాస్టర్‌ కంపోజ్‌ చేయగానే డ్యాన్స్‌ చేస్తుంటే.. కాజల్‌ అగర్వాల్‌ ఆశ్చర్యపోయింది.

కొడుకు సరసన నటించిన హీరోయిన్‌తో మీరు చేశారు...
(నవ్వుతూ) యాక్చువల్‌గా ముందు తండ్రితో, తర్వాత కొడుకుతో నటించిన హీరోయిన్లున్నారు. కాజల్‌ మాత్రం ముందు కొడుకుతో చేసి, తర్వాత తండ్రితో నటించింది.  కాజల్‌ది అరుదైన రికార్డు.
 
‘అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు...’ లిరిక్‌ని కొందరు విమర్శిస్తున్నారు...
మామూలుగా ‘కుమ్ముడు’ అనే పదం కామన్‌గా వాడుతుంటాం. ఎవరినైనా హోటల్‌కి తీసుకెళ్లినప్పుడు బాగా తింటే ‘ఇవాళ బాగా కుమ్మాడు రా’ అంటుంటాం. కుమ్ముడు పదం విన్నప్పుడు చాలా క్యాచీగా ఉంది. పైగా మాస్‌ అభిమానులు నాకు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, నేను ఏదైనా చేసేటప్పుడు వాళ్లని కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్లను అలరించడమే నా ప్రధాన లక్ష్యం. అందుకని వాళ్ల గురించి తప్పుగా మాట్లాడినా, వాళ్ల కోసం సినిమాలు తక్కువ స్థాయికి పడిపోతున్నాయని అన్నా నేను ఒప్పుకోను. కమర్షియల్‌ సినిమానే నా ప్రధానమైన ఛాయిస్‌.  

వినాయక్‌గారు చేసినవాటిలో కొన్ని నిరాశపరిచాయి. సో.. మీ కమ్‌ బ్యాక్‌ మూవీకి ఆయన్ను ఎన్నుకోవడానికి కారణం ఏంటి?
వినాయక్‌ ఎంచుకున్న కథాంశం ఫెయిల్‌ అయ్యుండొచ్చేమో కానీ, తను ఫెయిల్‌ కాలేదు. ఓన్‌ సినిమా అన్నట్లుగా చేశాడు. వేస్టేజ్‌ని కంట్రోల్‌ చేశాడు. నన్నో పువ్వులా చూసుకున్నాడు. మనసుకి మరింత దగ్గరయ్యాడు.

మురుగదాస్‌‘రమణ’ను ‘ఠాగూర్‌’గా చేశారు. ఇప్పుడు ఆయన ‘కత్తి’ని ‘ఖైదీ నం. 150’గా చేశారు. ఈ రెండింటికీ వినాయకే దర్శకుడు.
యస్‌.. అలా సెంటిమెంట్‌గా ఆలోచిస్తే.. ఇది కూడా సక్సెస్‌ ఖాయం. నో డౌట్‌ (నవ్వుతూ). ఆ టైమ్‌లో ‘ఠాగూర్‌’ని మురుగదాస్‌ చేయలేని పరిస్థితిలో ఉంటే, వినయ్‌ అయితే బాగా తీయగలడని తనతో చేశాం. ఇప్పుడు మురుగదాస్‌ ‘కత్తి’ అనుకున్నాక నాకూ, చరణ్‌కీ ‘వినయ్‌ అయితే చేయగలడు’ అనిపించింది. సక్సెస్‌ గ్యారంటీ.

150వ సినిమాతో ఓ హీరో.. 100వ సినిమాతో మరో హీరో... హీరోలిద్దరి మధ్య పోటీ గురించి బయట మాత్రం డిస్కషన్‌ నెలకొంది...
(నవ్వుతూ). పోటీ అనేది నాకు లేనే లేదు. నా 150వ సినిమా అప్పుడు బాలకృష్ణ 100వ సినిమా ‘శాతకర్ణి’ కుదరడం అనేది కాకతాళీయం. పోటీ పడి మేం చేసింది కాదు. రిలీజ్‌ టైమ్‌ ఒకేసారి కావడంతో మీడియా క్రియేట్‌ చేసిన పోటీ ఇది.

ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఈక్వేషన్స్‌?
మీరు గుర్తు చేసుకుంటే ‘శాతకర్ణి’ సినిమా ఓపెనింగ్‌కి నేను వెళ్లాను. నేను కెమెరా స్విచాన్‌ చేశాను. నూరవ సినిమాగా ఈ కథాంశాన్ని ఎన్నుకోవడమే మొదటి సక్సెస్, ఇలాంటి సినిమాలు ఆడాలని నిండు మనసుతో విష్‌ చేశాను. క్రిష్‌ ‘కంచె’ చూసి, నేను ఇంటికి పిలిచి, అభినందించాను. క్రిష్‌  టాలెంటెడ్‌. మిత్రుడు బాలకృష్ణ సినిమా సూపర్‌ హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతికి వచ్చే అన్నీ ఆడాలి.

‘ఖైదీ నం. 150’ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌కి విజయవాడలో మీరనుకున్న వేదికకు అనుమతి దొరక్కపోవడంలో రాజకీయం ఉందనే టాక్‌ ఉంది?
ఈ ఫంక్షన్‌ చేయాలనుకున్న తర్వాత ఆఫీసర్స్‌ను సంప్రదించాం. ముందు ఇస్తామన్నారు. పర్మిషన్‌ కూడా ఇచ్చేశారు. తర్వాత ‘మేం పొరపాటు పడ్డాం. కోర్టు స్టే ఉంది. ఒకవేళ ఇచ్చినా ఇంత మేరకే వాడుకోవాలి’ అన్నారు. ఓ వారం రోజులు తిప్పించుకున్నారు. ఓకే చేయలేదు. ఆ తర్వాత గుంటూరు స్టేడియం అయితే అక్కడున్న అధికారులు ముందు ఓకే అని, ఆ తర్వాత ఇవ్వమన్నారు. అప్పుడు ప్రైవైట్‌ వెన్యూ అయిన హాయ్‌లాండ్‌ని ఎన్నుకున్నాం. ఏదేమైనా.. అనుమతి దొరక్కపోవడం వెనక ఏదో రాజకీయ కుట్ర ఉందని నేను అనుకోవడం లేదు. అధికారులకు ఏవో ఇబ్బందులు ఉండి ఉంటాయ్‌. పొలిటికల్‌గా ఏదో ఉందనే మాటని కొట్టిపారేస్తున్నా.

సినిమా రంగుకి, రాజకీయ రంగు అంటుకోవడం సరైనదేనా?
తమిళనాడులో సినిమాలు, పాలిటిక్స్‌ కలగలిసి ఉన్నాయి. హీరో విజయ్‌ చేసిన ఓ సినిమాకి థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. చివరికి ‘ఇది ఎవర్నీ ఉద్దేశించి తీసిన సినిమా కాదు. పొలిటికల్‌గా ఎవర్నీ ఎయిమ్‌ చేయలేదు’ అని ఆనాటి సీఎంకి విన్నవించుకున్నాక, సమస్య తీరింది. సినిమా అనేది క్రియేటివ్‌ ఫీల్డ్‌. దీని మీద రాజకీయ ప్రభావం ఉండకపోతే బాగుంటుంది.

పవన్‌ కల్యాణ్‌ మీ ప్రీ–రిలీజ్‌ వేడుకలో పాల్గొంటారా, లేదా అన్నది ఆసక్తికరమైన టాపిక్‌. ఈ మధ్య కల్యాణ్‌గారిని మీరెప్పుడు కలిశారు?
చరణ్‌ ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం. కల్యాణ్‌ బిజీగా ఉన్నాడు. నేనూ, తనూ డిసెంబర్‌ 17న నాన్నగారి ఆబ్దీకానికి కలిశాం.

మీ అమ్మ గారు అంజనాదేవిగారు మీ సిన్మా గురించి ఏమన్నారు?
అమ్మ చాలా ఉత్సాహంగా ఉంది. మొన్న ఆదివారం తనను కలిస్తే, ‘ప్రివ్యూ షోకి నన్ను పిలవద్దురా. నేను చూడను. ప్రివ్యూ చూస్తే ఎలాంటి ఉత్సాహం ఉండదురా. నేను థియేటర్‌కి వెళ్లి చూస్తాను. అక్కడ చూస్తే ఆ కిక్కే వేరు’ అని ఉత్సాహంగా అంది (నవ్వులు).
   
మంచి స్లిమ్‌గా తయారయ్యారు.. కచ్చితంగా కఠినమైన కసరత్తులే చేసి ఉంటారనుకోవచ్చా?
సినిమా చేయాలని నిర్ణయించుకున్న నా ఆహారపు అలవాట్లు మార్చుకున్నా. ప్రతిరోజూ వ్యాయమం చేయడం మొదలుపెట్టా. కఠినమైన శిక్షణ తీసుకున్నా. ప్రత్యేకంగా ఓ జిమ్‌ కోచ్, డైటీషియన్‌ని పెట్టుకున్నా. వాళ్ల సలహాలు తీసుకున్నా. రాజకీయాల పరంగా కొంచెం విరామం వచ్చేసరికి నా లుక్, డైట్‌పై దృష్టి పెట్టే అవకాశం వచ్చింది. రిజల్ట్‌ కూడా అలాగే వచ్చింది. స్లిమ్‌ కావడం వెనక రెండు మూడు నెలల కష్టం కాదు.. ఓ ఏడాది పాటు శ్రమిస్తే వచ్చిన లుక్‌ ఇది.

సినిమాల కోసం రామ్‌చరణ్‌ కఠినమైన వర్కవుట్లు, డైట్‌ పాటించేటప్పుడు సురేఖగారు చాలా బాధపడ్డారు. మరి.. మీ విషయంలో?
అస్సలు ఇంత కూడా బాధ లేదు. నా విషయంలో రేఖ చాలా కర్కశంగా ఉంది (నవ్వుతూ).


ఇన్నాళ్ళకు నా ఆశ నెరవేరింది!  – చిరంజీవి సతీమణి సురేఖ
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవిగారు హీరోగా మేకప్‌ వేసుకోవడం పట్ల మీ అనుభూతి?
ఇది చాలా చాలా సంతృప్తినిచ్చే విషయం. మా అబ్బాయి చరణ్‌ (రామ్‌చరణ్‌), ఆయన ఇద్దరూ మేకప్‌ వేసుకుని, ఇంటి నుంచి షూటింగ్‌కి వెళుతుంటే చూడాలనేది నా కోరిక. కానీ, చరణ్‌ సినిమాల్లోకి వచ్చేనాటికి ఆయన సినిమాలకు దూరమయ్యారు. దాంతో వెలితిగా ఉండేది. ఇన్నాళ్లకు నా ఆశ నెరవేరింది. ఒకవైపు ఈయన, మరోవైపు చరణ్‌ పొద్దున్నే నిద్ర లేచి, షూటింగ్‌కి రెడీ అయి, హడావిడిగా వెళుతుంటే నాకు కలిగిన ఫీలింగ్‌ని మాటల్లో చెప్పలేను.

 
ఒకవైపు భర్త.. మరోవైపు కొడుకు.. హీరోలుగా ఇద్దరిలో ఎవరు బెస్ట్‌?

అమ్మో అది మాత్రం చెప్పలేనండి. నాకు ఇద్దరూ సమానమే. చెర్రీ (రామ్‌చరణ్‌) తండ్రికి తగ్గ కొడుకు అని ప్రూవ్‌ చేసుకున్నాడు. తండ్రి పేరుని నిలబెట్టాడు. అందుకు చాలా సంతోషంగా ఉంది.

భర్త హీరో.. కొడుకు నిర్మాత.. కూతురు (సుస్మిత) కాస్ట్యూమ్‌ డిజైనర్‌. టోటల్‌గా ఈ సినిమా మీకు ఫెస్టివల్‌..
అవునండి. చాలా గ్యాప్‌ తర్వాత డాడీ చేస్తు్తన్న సినిమా అని సుస్మిత చాలా శ్రద్ధగా కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసింది. ‘ఏం ఫర్వాలేదు.. మావయ్యగారి కాస్ట్యూమ్స్‌ మీద దృష్టి పెట్టు’ అని మా అల్లుడు కూడా సుస్మితను ఎంకరేజ్‌ చేయడం ఆనందం అనిపించింది.

ఈ సినిమా కోసం చిరంజీవిగారు సన్నబడ్డారు. దానికోసం కఠినమైన కసరత్తులు, ఆహార నియమాలు పాటించారు కదా మీకేమైనా బాధ అనిపించిందా?
అస్సలు లేదు. ఎందుకంటే హెల్దీ ఫుడ్‌ తీసుకున్నారు. అందుకని నాకు హ్యాపీయే. కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు ఫుడ్‌ తీసుకున్నారు. అసలు ఈ సినిమాయే నాకు మంచి మెమరీ. ఎలాగంటే, ఇంట్లో అందరం డిస్కస్‌ చేసుకునేవాళ్లం. సుస్మిత కాస్ట్యూమ్స్‌ గురించి, చెర్రీ ఏమో ప్రొడక్షన్‌ గురించి మాట్లాడేవాళ్లు. ‘ఇలా చేస్తే బాగుంటుంది.. అలా అయితే బాగుంటుంది’ అని ఒకరికొకరు డిస్కస్‌ చేసుకోవడం నాకు బాగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ‘మోస్ట్‌ శాటిస్‌ఫైయింగ్‌ మూమెంట్‌.
 
– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement