
బాబాయ్ అబ్బాయ్ ఓ పూరి జగన్నాథ్
బాబాయ్ - అబ్బాయ్ - ఒక ఫేమస్ డెరైక్టర్!
నిజానికి ఈ టైటిలే అయితే ఇంకా బాగుండేదేమో..
కానీ పూరి జగన్నాథ్ లేకపోతే బాబాయ్ - అబ్బాయ్ ఉండేవారంటారా?
అందుకే ఈ టైటిలే బెటర్!
సాయిరామ్ శంకర్‌లో పరిణతి లేదని కాదు...
ఆకాశ్‌లో సూర్యతేజం లేదనీ కాదు!
నిజానికి కొండంత డెరైక్టర్ నీడలో...
వీరిద్దరి ప్రతిభ మసకబారిందేమో అనిపిస్తోంది. కుర్రాళ్లిద్దరూ మంచివాళ్లే..!
‘చాలు చాలు... సినిమావాళ్లు మంచోళ్లా!?’
ఇంటర్వ్యూ చదవండి... మీకే అర్థమవుతుంది!
ఒక్క సినిమా స్టోరీ చెప్పలేదు... అన్నీ మనసులోంచి వచ్చిన మాటలే..!
ఎంజాయ్ సండే...
బాబాయ్-అబ్బాయ్.. సౌండింగ్ బాగుంది. మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో?
ఇద్దరూ: సూపర్ అండి. బాబాయ్-అబ్బాయ్‌లా కాకుండా ఆల్‌మోస్ట్ ఫ్రెండ్స్‌లానే ఉంటాం.
మమ్మీ-డాడీ దగ్గర చెప్పుకోలేనివి బాబాయ్‌తో..?
సాయి: పిల్లలు ఏదైనా చెప్పుకునే ఫ్రీడమ్ మా అన్న-వదిన ఇస్తారు. కాకపోతే బాబాయ్ అంటే ఫ్రెండ్‌లా కాబట్టి... సరదా సరదా విషయాలు చెబుతుంటాడు.
ఆకాశ్: డాడీ బిజీగా ఉంటారు కాబట్టి... ఏ విషయం అయినా అమ్మ దగ్గరే చెబుతాం. బాబాయ్‌తో మాట్లాడేటప్పుడు ఏది పడితే అది హ్యాపీగా మాట్లాడేస్తాం.
మీ ఫ్రెండ్లీ బాబాయ్ కెరీర్‌వైజ్‌గా సక్సెస్ కావడం లేదు కదా. మీకేమైనా బాధగా ఉంటుందా?
ఆకాశ్: ‘143’, ‘డేంజర్’, ‘బంపర్ ఆఫర్’... ఇలా మా బాబాయ్‌వి కొన్ని సక్సెస్‌లే చూశాను. సినిమాలు ఫ్లాప్ అయ్యుండొచ్చేమో కానీ, ఆర్టిస్ట్‌గా ఆయన ఎప్పుడూ ఫెయిల్ కాలేదండి.
అబ్బో.. బాగానే వెనకేసుకొస్తున్నాడు..
సాయి: వాడి వెనక నేనుంటే కనిపించను. ఎంత హైట్‌గా ఉన్నాడో చూశారుగా. ఈ రెండేళ్లల్లో బాగా పెరిగాడు. ఇంత హైట్ అవుతాడనుకోలేదు. నాకూ, పూరీ అన్నయ్యకు మధ్యలో ఉన్న మా గణేశ్ అన్నయ్య మంచి హైట్. బహుశా అది వచ్చి ఉంటుందేమో.
ఇంకా బాబాయ్ ఏమీ సాధించలేదు. ఈలోపు అబ్బాయి హీరోగా రెడీ అయిపోతున్నాడు... పోటీ?
సాయి: అస్సలు లేదు. కళ్ల ముందు పెరిగినవాళ్లు మనకన్నా మించి ఉండాలని కోరుకుంటాం కదా. అయినా నేను మావాణ్ణి బ్రదర్‌లా అనుకుంటా. ఎందుకంటే మా వదిన మమ్మల్ని సొంత కొడుకులా చూసినట్లే చూస్తుంది. అన్నను తమ్ముడు మించాలండి.
ఆకాశ్: నేను హీరో కావడానికి ఇంకో మూడేళ్లు ఉందండి. ఈ మూడేళ్లల్లో మా బాబాయ్ కెరీర్ పీక్స్‌కి వెళుతుందనుకుంటున్నా. చూస్తూ ఉండండి.. మా బాబాయ్ గట్టి హిట్ సాధిస్తాడు.
సాయి గారూ... మీ లుక్స్ బాగుంటాయి. బాగా యాక్ట్ చేస్తారు. అయినా రేంజ్ పెరగకపోవడానికి కారణం?
సాయి: లుక్స్, యాక్టింగ్ కన్నా ముందు మంచి కథ ముఖ్యం. ‘143’, ‘డేంజర్’, ‘బంపర్ ఆఫర్’ మంచి రిజల్ట్‌నే ఇచ్చాయి. కొన్ని కథలను సరిగ్గా సెలక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇలా మిగిలిపోయా (నవ్వుతూ).
కెరీర్‌వైజ్‌గా వెనకబడి... ఇలా హాయిగా నవ్వడం బహుశా మీకే సాధ్యం అవుతుందేమో?
సాయి: కీడెంచి మేలెంచమంటారు. నేనా టైపే. ఫెయిల్యూర్‌కి ప్రిపేర్ అవుతా. రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చిందనుకోండి... హ్యాపీ. లేకపోతే పెద్దగా బాధ అనిపించదు. కాసేపు బాధ పడి రొటీన్‌లో పడిపోతా.
మరి... ఆకాశ్! మీరూ మీ బాబాయ్ టైపేనా? మీ ‘ఆంధ్రా పోరి’ హిట్ కాలేదు కదా?
ఆకాశ్: నేను కూడా కొంచెం బాబాయ్ టైపే. కాసేపు బాధపడ్డా. ‘నువ్వు బాగా యాక్ట్ చేశావ్’ అని నాన్న మెచ్చుకున్నారు. ఫస్ట్ సినిమా అయినా బాగా చేశావని అందరూ అన్నారు. నా వరకూ నేను బాగానే చేశానండి.
‘ఆంధ్రా పోరి’ చూసి, మీకేమనిపించింది సాయి?
సాయి: మావాడి స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. తనలో మహీరో మెటీరియల్ ఉన్నాడని నిరూపించుకున్నాడు.
పూరీ బ్రదర్ అంటే అవకాశాలు బాగానే వస్తాయి. సినిమా సినిమాకీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారేంటి?
సాయి: ‘బంపర్ ఆఫర్’ హిట్ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ఓ పెద్ద నిర్మాత నాతో సినిమా చేస్తాననడంతో వాటిని వదిలేసుకున్నా. అక్కినేని నాగేశ్వరరావుగారు-శ్రీహరిగారు-నా కాంబినేషన్‌లో ఆ సినిమా ప్లాన్ చేశారు. నాలుగైదేళ్ల క్రితం ఏయన్నార్‌గారు మీసాలు పెంచారు. అది ఈ సినిమా కోసమే. ‘ఇదే చివరి సినిమా.. ఇక చేయను’ అని ఆయన అన్నారు. గ్రేట్ కాంబినేషన్ కాబట్టి, ఈ ఒక్క సినిమా మీదే దృష్టి పెట్టాలనుకున్నా. ఒకటీ రెండూ.. మూడు... అలా తొమ్మిది నెలలు గడిచిపోయాయ్. హఠాత్తుగా సినిమా చేయడం లేదని ఆ నిర్మాత చేతులెత్తేశాడు. అప్పుడర్థమైంది.. జీవితంలో ఎప్పుడూ ఒకే సినిమా మీద ఆధారపడకూడదని. ముఖ్యంగా హిట్ సినిమా చేశాక గ్యాప్ తీసుకోకూడదని.
మీ అన్నయ్య ఏమీ అనలేదా?
సాయి: వర్కవుట్ కాదు. అతను సినిమా తీయడని ముందే చెప్పాడు.
మీ అన్నయ్య మీతో డెరైక్టర్‌గా-ప్రొడ్యూసర్‌గా సినిమాలు చేశారు. డబ్బులు పోగొట్టుకున్నారు. మీకేమైనా గిల్టీగా..?
సాయి: గిల్ట్ ఉంటుందండి. కొడుకు మీద ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది తండ్రులు వెనకాడతారు. తమ్ముడి కోసం ఓ తండ్రి కన్నా ఎక్కువే చేశాడు. డబ్బులు నష్టపోయాడు.
బాబాయ్ కోసం మీ నాన్న డబ్బులు పోగొట్టుకున్నందుకు మీకేమైనా కోపం?
ఆకాశ్: అస్సలు లేదండి. ఒకవేళ నాన్న వేరే హీరో మీద పెట్టినా డబ్బులు పోయేవి. సొంత తమ్ముడి కోసమే కదా పెట్టారు. ఒకవేళ ఆ సినిమాలు డబ్బులు తెచ్చి ఉంటే, అప్పుడు మేమంతా ఎంజాయ్ చేసేవాళ్లం కదా...
పూరీగారు తక్కువ టైమ్‌లో కోట్లు సంపాదించి.. దాదాపు అన్నీ పోగొట్టేసుకున్నారు. చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేస్తున్నారని మీరు గ్రహించలేకపోయారా?
సాయి: బేసిక్‌గా అన్నయ్య అందర్నీ నమ్ముతాడు. కోట్లు కొట్టేస్తారని ఎవరైనా ఊహిస్తారా? మేం కూడా గ్రహించలేదు. తెలుసుకునే సరికి అంతా అయిపోయింది.
ఆ కష్టాలన్నీ మీ డాడీ మీకు చెప్పారా?
ఆకాశ్: ఇబ్బందులేవీ మాకు తెలియకూడదని నన్నూ, పవిత్ర (ఆకాశ్ చెల్లెలు)నూ హాస్టల్‌లో చేర్చారు. మూడేళ్లు హాస్టల్‌లో ఉన్నాం. వచ్చిన తర్వాత తెలిసి, బాధ అనిపించింది. మీరిందాక చుట్టూ ఉన్నవాళ్లు అన్నారు కదా.. ఒక్కోసారి వాళ్లు మా డాడీని కలవడానికి కూడా ఒప్పుకునేవాళ్లు కాదు. బిజీగా ఉన్నారనేవాళ్లు. మేం వాళ్లను బయటివాళ్లలా అనుకోలేదు. మా సొంత బాబాయ్‌లానో, మావయ్యలానో అనుకునేవాళ్లం.
సాయి: (మధ్యలోనే అందుకుంటూ...) నేను మా అన్నయ్యను కలవాలన్నా వాళ్ల పర్మిషనే తీసుకోవాల్సి వచ్చేది.
పోగొట్టుకున్న డబ్బుని పూరీగారు తక్కువ సమయంలోనే సంపాదించారు. ఇలా అందరికీ సాధ్యం కాదు...
సాయి: అన్నయ్య మంచితనమే ఆయనకు మంచి చేస్తోంది. నాకు తెలిసి గడచిన పన్నెండేళ్లల్లో లక్షా, 2 లక్షలు, ఐదు లక్షలు... ఇలా హెల్ప్ పేరుతో ఈజీగా ఐదారు కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు. అలా చేశాడు కాబట్టే, మళ్లీ ‘బౌన్స్ బ్యాక్’ కాగలిగాడు.
ఆకాశ్: యస్.. మా డాడీ నైస్ హ్యూమన్ బీయింగ్.
అన్నదమ్ముల అనుబంధం ఎంత బాగున్నా.. ఇంట్లో ఆడవాళ్ల కారణంగా ప్రాబ్లమ్ రావడం కామన్. మీకు డబ్బులు పెట్టినప్పుడు మీ వదిన ఏమైనా..?
సాయి: మీరన్నది నిజమే. కానీ, మా ఇంట్లో వేరు. మా వదిన ఒక్క మాట కూడా అనలేదు. మా ఆవిడ, వదిన బాగుంటారు. వాళ్లకు వేవ్ లెంగ్త్ కుదరడం మాకు హ్యాపీ.
ఆకాశ్... మళ్లీ బాబాయ్‌తో డాడీ ఓ సినిమా చేస్తే బాగుంటుందని అనిపిస్తోందా?
ఆకాశ్: ఇద్దరి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నా.
సాయి: అన్నయ్య నా కోసం చేయాల్సిందంతా చేశాడు. దర్శక-నిర్మాతగా ‘143’, నిర్మాతగా ‘హలో.. ప్రేమిస్తారా..’, కథ-మాటలు రాయడంతో పాటు ఆయనే ‘బంపర్ ఆఫర్’ను నిర్మించారు. ఇంకా ప్రెజర్ ఇవ్వకూడదనే నేను బయట సినిమాలు చేయడం స్టార్ట్ చేశాను. ఈ డిసెంబర్‌లో గట్టు ఎక్కేస్తానని అనుకుంటున్నాను.
ఆకాశ్: యస్... అది నిజమవుతుంది.
హీరోగా రవితేజ స్ట్రాంగ్ అవడానికి మీ అన్నయ్యే కారణం కదా!
సాయి: ఒకరికొకరు తోడయ్యారు. అన్నయ్యకు ఓ హీరో కావాలి. రవితేజగారికి ఓ దర్శకుడు కావాలి. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’తో ఇద్దరి జర్నీ స్టార్టయింది. అన్నయ్య కథలకు సరిపడే హీరో రవితేజగారు, అలాంటి ఎనర్జిటిక్ హీరోకి సరిపడా కథలు రాసిన దర్శకుడు మా అన్నయ్య.
అన్నయ్య దగ్గర ఏడేళ్లు సహాయ దర్శకుడిగా చేశారు. మీ కోసం ఓ కథ రాసుకోవాలనిపించలేదా?
సాయి: ప్రేక్షకులందరి దయతో రెండు మూడు సినిమాలు ఆడితే... అప్పుడు ఆలోచిస్తా.
ఆకాశ్: బాబాయ్ నా కోసం ఓ కథ రాయాలి.
సాక్షి: అప్పుడే అబ్బాయి కర్చీఫ్ వేసేశాడు! (నవ్వులు)
మీ డాడీ పనిచేసిన హీరోల్లో మీకు ఎవరు క్లోజ్?
ఆకాశ్: అందరూ క్లోజ్‌గా ఉంటారు. చిన్నప్పుడు నాది రింగు రింగుల జుట్టు. పెద్దయ్యాక ‘కెమెరామ్యాన్ గంగతో రాంబాబు’ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారిని కలసినప్పుడు.. ‘నీ జుట్టు బాగుండేది. ఇప్పుడేమైంది’ అనడిగారు. అందరూ బాగుంటారు.
సాయి: ఆకాశ్ పుట్టు వెంట్రుకలు తీయించడం లేటయింది. మొదటి సంవత్సరంలోపు తీయకపోతే మూడేళ్ల వరకూ తీయకూడదు కదా. దాంతో జుత్తు బాగా పెరిగిపోయింది. ‘బద్రి’ టైమ్‌లో మనోడు జాకీర్ హుస్సేన్ (తబలా ప్లేయర్)లా ఉండేవాడు. అప్పుడు షూటింగ్‌కి తీసుకువెళ్లాం. పవన్‌గారు ఆకాశ్ జుట్టుతో ఆడుకునేవారు.
ఆకాశ్! మీరు పాకెట్ మనీ ఎంత తీసుకుంటారు?
సాయి: ఆ... అన్నీ చెప్పేస్తారు మీకు (నవ్వులు).
ఆకాశ్: ఎప్పుడు సినిమాకి వెళ్లినా అమ్మ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుంటా. పాకెట్ మనీ అని ప్రత్యేకంగా తీసుకోను. మమ్మీ చాలా స్ట్రిక్ట్.
బాబాయ్‌తో ప్రేమ కబుర్లు కూడా చెబుతారా?
ఆకాశ్: నేనింకా ప్రేమించలేదు కానీ... బాబాయ్ దగ్గర పిచ్చ ఫ్రీడమ్. అన్నీ చెప్తాను.
సాయీ! మీది ప్రేమ వివాహమే కదా?
సాయి: అవునండి. అమ్మానాన్న, అన్నయ్య-వదిన దగ్గరుండి మరీ పెళ్లి చేశారు.
మీ ఫ్యూచర్ కోసం ఇద్దరికీ ఆల్ ది బెస్ట్.
ఇద్దరూ: థ్యాంక్యూ అండి... అందరికీ హ్యాపీ సండే.
- డి.జి. భవాని