రుచుల పొట్లం | Special Dishes For Gourds | Sakshi
Sakshi News home page

రుచుల పొట్లం

Published Sat, Nov 2 2019 4:02 AM | Last Updated on Sat, Nov 2 2019 4:03 AM

Special Dishes For Gourds - Sakshi

పొట్లకాయ తీరే వేరు. పొడుగ్గా పెరగడానికి రాయి కడతారు. తిన్నగా సాగాక తనంత పొడవుగా మరొకరు లేరంటూ విర్రవీగుతుంది.   జ్వరమొస్తే పథ్యమవుతుంది. పొట్లకాయ అంటే ముఖం చిట్లించక్కర్లేదు. కాస్త చాకచక్యంగా వండాలేగానీ... చవులూరించేలా... తన రుచులు సైతం తనంత పొడవంటూ నిరూపించే పొగరుకాయ పొట్లకాయ. ఆ రుచులెలా తేవాలో తెలిపే ‘పొట్ల’మ్‌ ఇది. విప్పండి... చవులతో నాలుక చప్పరించండి.

పొట్లకాయ రింగ్స్‌
కావలసినవి: బియ్యప్పిండి – పావు కప్పు; సెనగ పిండి – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను, కోడి గుడ్డు – 1 (పెద్దది); ఉప్పు – తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; పొట్ల కాయ తరుగు – 2 కప్పులు (చక్రాల్లా తరగాలి); నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ:
►ఒక పాత్రలో అన్ని పదార్థాలు (నూనె, పొట్లకాయ చక్రాలు మినహా) వేసి బాగా కలపాలి
►కొద్దిగా నీళ్లు జత చేసి బజ్జీ పిండిలా చేసుకోవాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి
►పొట్ల కాయ చక్రాలను పిండిలో ముంచి, కాగిన నూనెలో వేసి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙వేడి వేడి పొట్ల కాయ రింగ్స్‌ను, టొమాటో సాస్‌తో అందించాలి.

పొట్లకాయ కట్‌లెట్‌
కావలసినవి: లేత పొట్ల కాయ – 1; బంగాళదుంపలు – 3 (మీడియం సైజువి); తరిగిన పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 3 (మెత్తగా చేయాలి); ఉల్లి తరుగు – పావు  కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; బియ్యప్పిండి – కొద్దిగా.

తయారీ:
►పొట్లకాయను శుభ్రంగా కడిగి, పెద్ద సైజు చక్రాలుగా తరగాలి (గింజలు తీసేయాలి)
►ఉడికించి, తొక్క తీసేసిన బంగాళ దుంపలు ముద్దలా అయ్యేలా చేతితో మెదపాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఉల్లి తరుగు, మెత్తగా చేసిన వెల్లుల్లి రేకలు వేసి ఉల్లి తరుగు మెత్తపడే వరకు వేయించాలి
►బంగాళ దుంప ముద్ద, తరిగిన పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు జత చేసి బాగా వేయించి, దింపేయాలి
►ఈ మిశ్రమాన్ని పొట్లకాయ చక్రాలలో స్టఫ్‌ చేయాలి
►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాచాలి
►స్టఫ్‌ చేసిన చక్రాలను పొడి బియ్యప్పిండిలో పొర్లించి, కాగిన నూనెలో వేసి (డీప్‌ ఫ్రై కాదు) రెండు వైపులా దోరగా కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి
►టొమాటో సాస్‌ లేదా చిల్లీ సాస్‌తో అందించాలి.

పొట్లకాయ మసాలా కర్రీ
కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 5; పల్లీ పొడి – ఒక టేబుల్‌ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; ఎండు మిర్చి – 4; ఉప్పు – తగినంత; పొట్ల కాయ – 1 (లేతది); పసుపు – అర టీ స్పూను.

తయారీ:
►పొట్లకాయలను శుభ్రంగా కడిగి మధ్యలోకి నిలువుగా చీల్చి, గింజలు తీసేయాలి
►చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙ఒక గిన్నెలో పెసర పప్పు, తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి
►కొద్దిగా ఉడుకుతుండగానే, పొట్ల కాయ ముక్కలు, ఉప్పు జత చేసి బాగా కలిపి మూత ఉంచి, ఉడికించి, దింపేయాలి
►స్టౌ మీద పాన్‌ ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉల్లి తరుగు, పసుపు, ఇంగువ, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి బాగా వేయించాలి
►ఉడికించిన పొట్లకాయ + పెసర పప్పు మిశ్రమం జత చేసి బాగా కలిపి, నీరు పోయేవరకు మగ్గబెట్టాలి
►పల్లీ పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి, దింపేయాలి
►అన్నంలోకి, రోటీలలోకి రుచిగా ఉంటుంది.

పొట్లకాయ చట్నీ
కావలసినవి: పొట్ల కాయ – 1; నూనె – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను; కాశ్మీరీ మిర్చి – 3; తాజా కొబ్బరి తురుము – ముప్పావు కప్పు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు – కొద్దిగా.
పోపు కోసం: నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – అర టీ స్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు; ఎండు మిర్చి – 1; ఇంగువ – కొద్దిగా.

తయారీ:
►పొట్లకాయను శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి, గింజలు వేరు చేయాలి
►స్టౌ మీద పెద్ద బాణలిలో నూనె వేసి కాగాక, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి
►పొట్ల కాయ తరుగు వేసి సన్నని మంట మీద ముక్కలు మెత్తబడేవరకు వేయించి, దింపి, చల్లార్చాలి
►పచ్చి కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు, చింత పండు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, చిన్న గిన్నెలోకి తీసుకోవాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి, పచ్చడికి జత చేయాలి
►అన్నం, దోసె, ఇడ్లీలలోకి రుచిగా ఉంటుంది.

స్టఫ్‌డ్‌ పొట్లకాయ కూర
కావలసినవి: పొట్లకాయ – 1; ఉల్లి తరుగు – పావు కప్పు + పావు కప్పు; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టే బుల్‌ స్పూను; ధనియాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను + అర టీ స్పూను; మిరియాలు –అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; గరం మసాలా – పావు టీ స్పూను; నూనె – తగినంత.

తయారీ:
►పొట్లకాయను పెద్ద పెద్ద ముక్కలుగా గుండ్రంగా తరిగి, అందులోని గింజలను చాకుతో జాగ్రత్తగా తీసేయాలి 
► జీలకర్ర, మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి +అల్లం ముద్ద, ఉల్లి తరుగు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి 
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఉల్లి తరుగు వేసి వేయించాలి
►పసుపు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి  మసాలా ముద్ద జత మరో రెండు నిమిషాలు వేయించాలి
►పొట్ల కాయలో నుంచి వేరుచేసిన గింజలను ఈ మిశ్రమానికి జత చేసి మరోమారు వేయించాలి
►బాగా ఉడికిన తరవాత తగినంత ఉప్పు, మిరప కారం, గరం మసాలా జత చేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి సన్నటి మంట మీద రెండు నిమిషాల పాటు ఉడికించాలి
►మూత తీసి, మరోమారు బాగా కలిపి దింపేయాలి
►తరిగి ఉంచుకున్న పొట్ల కాయ ముక్కలలోకి ఈ మిశ్రమాన్ని స్పూన్‌ సహాయంతో కొద్దికొద్దిగా స్టఫ్‌ చేయాలి
►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి (డీప్‌ ఫ్రై కాదు) కాగాక, స్టఫ్‌ చేసి ఉంచుకున్న పొట్ల కాయ ముక్కలను వేసి, మూత ఉంచి, మంట తగ్గించి రెండు నిమిషాల తరవాత, ముక్కలను రెండో వైపుకి తిప్పి, మళ్లీ మూత ఉంచాలి
►ఈ విధంగా రెండు నిమిషాలకోసారి ముక్కలు మెత్తబడేవరకు తిప్పుతుండాలి
►బాగా వేగిన తరవాత దింపేయాలి
►అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.

పొట్లకాయ పాలు కూర
కావలసినవి: పొట్ల కాయ – 1; కొబ్బరి నూనె – ఒక టీ స్పూను;  ఉల్లి తరుగు – పావు కప్పు; కారం – ఒక టీ స్పూను; కొత్తిమీర – చిన్న కట్ట; కరివేపాకు – రెండు రెమ్మలు; పాలు – అర కప్పు (మరిగించాలి); ఉప్పు – తగినంత; తాజా కొబ్బరి తురుము – పావు కప్పు; జీలకర్ర – అర టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; ఆవాలు – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 4; పసుపు – పావు టీ స్పూను.

తయారీ:
►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొబ్బరి నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి వేయించాలి
►ఉల్లితరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు జత చేసి, ఉల్లి తరుగు బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి
►పొట్లకాయ ముక్కలు జత చేసి, మూత ఉంచాలి
►ముక్కలు బాగా మగ్గాక, ఉప్పు, మిరప కారం వేసి కలపాలి
►కొబ్బరి తురుము, పాలు జత చేసి మరోమారు కలిపి, మూత పెట్టి, రెండు నిమిషాలు ఉడికించాలి
►కూర బాగా దగ్గర పడిన తరవాత, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి
►అన్నం, రోటీలలోకి రుచిగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement