Gourds
-
పొట్లకాయ పుష్టికరం
అనాదిగా వస్తున్న ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకైనా, వ్యాధి చికిత్సకైనా ఔషధం కన్నా ఆహారవిహారాలకు అధిక ప్రాధాన్యం ఉంది. మూలికా ద్రవ్యాలతో బాటు ఆహార పదార్థాలను కూడా విశ్లేషిస్తూ ‘భావమిశ్రుడు’ ఒక సంహితనే రూపొందించాడు. ∙‘....చిచిండో వాత పిత్తఘ్నో బల్యః పథ్యో రుచి ప్రదః‘ శోషణోతి హితః కించిత్ గుణైః న్యూనః పటోలతః‘‘ పొట్లకాయ సంస్కృత నామం ‘చిచిండః’. దీనికే ‘సుదీర్ఘ, గృహకూలక, శ్వేతరాజి మొదలైన పర్యాయ పదాలున్నాయి. వృక్షశాస్త్రపు పేరు Trichosanthes cucurmerina మరియుT. Anguina. ►ఇది శరీరానికి మిక్కిలి బలకరం, పథ్యం (హితకరం), రుచికరం. కొవ్వును కరిగించి బరువుని తగ్గిస్తుంది. వాతపిత్త దోషాలను పోగొట్టి మేలు చేస్తుంది. ►చేదు పొట్ల (పటోల) అనే మరొక శాకం ఉంది. దీనిని ఔషధంగా మాత్రమే వాడతారు, ఆహారంలో ఉపయోగించరు. పైన చెప్పిన గుణ ధర్మాలు దీనికి మరీ అధికంగా ఉంటాయి. ►దీని ఆకులు, వేళ్లు, కాయలోని గింజలు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ►పొట్లకాయను కోడిగుడ్డుతో కలిపి తింటే వికటిస్తుందని కొన్ని ప్రాంతాలవారి నమ్మకం. ఆధునిక శాస్త్ర విశ్లేషణ పొట్లకాయలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. పిండి పదార్థాలు, మాంసకృత్తులు తగుపాళ్లలో ఉంటాయి. కొలెస్ట్రాల్ శూన్యం. పొటాషియం అధికంగా (359 శాతం), సోడియం తక్కువగా (33 శాతం) ఉంటుంది. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, అయోడిన్ వంటి అంశాలు తగినంత లభిస్తాయి. నీరు అధిక శాతంలో ఉంటుంది. ►యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. నొప్పులు, వాపులు తగ్గటానికి ఉపకరిస్తుంది. జీర్ణాశయ కృత్యాల్ని పెంపొందించి దేహపుష్టి కలిగిస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహ వికారాలలో గుణకారి. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. బరువును తగ్గించడం, నిద్ర కలిగించే గుణాలు ఉన్నాయి. ►విటమిన్ ఎ, బి 6, సి, ఇ సమృద్ధిగా ఉన్నాయి. ►పొట్ల కాయల రసాన్ని తల మీద పైపూతగా రాస్తే, చుండ్రు తగ్గి కేశవర్థకం గా పనిచేస్తుంది. చర్మకాంతిని మెరుగు పరుస్తుంది. ►తేలికగా జీర్ణమై నీరసం తగ్గిస్తుంది కనుక ఎటువంటి అనారోగ్యం ఉన్నవారికైనా ఇది పథ్యంలా పనిచేస్తుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
రుచుల పొట్లం
పొట్లకాయ తీరే వేరు. పొడుగ్గా పెరగడానికి రాయి కడతారు. తిన్నగా సాగాక తనంత పొడవుగా మరొకరు లేరంటూ విర్రవీగుతుంది. జ్వరమొస్తే పథ్యమవుతుంది. పొట్లకాయ అంటే ముఖం చిట్లించక్కర్లేదు. కాస్త చాకచక్యంగా వండాలేగానీ... చవులూరించేలా... తన రుచులు సైతం తనంత పొడవంటూ నిరూపించే పొగరుకాయ పొట్లకాయ. ఆ రుచులెలా తేవాలో తెలిపే ‘పొట్ల’మ్ ఇది. విప్పండి... చవులతో నాలుక చప్పరించండి. పొట్లకాయ రింగ్స్ కావలసినవి: బియ్యప్పిండి – పావు కప్పు; సెనగ పిండి – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను, కోడి గుడ్డు – 1 (పెద్దది); ఉప్పు – తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; పొట్ల కాయ తరుగు – 2 కప్పులు (చక్రాల్లా తరగాలి); నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►ఒక పాత్రలో అన్ని పదార్థాలు (నూనె, పొట్లకాయ చక్రాలు మినహా) వేసి బాగా కలపాలి ►కొద్దిగా నీళ్లు జత చేసి బజ్జీ పిండిలా చేసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి ►పొట్ల కాయ చక్రాలను పిండిలో ముంచి, కాగిన నూనెలో వేసి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙వేడి వేడి పొట్ల కాయ రింగ్స్‌ను, టొమాటో సాస్‌తో అందించాలి. పొట్లకాయ కట్లెట్ కావలసినవి: లేత పొట్ల కాయ – 1; బంగాళదుంపలు – 3 (మీడియం సైజువి); తరిగిన పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 3 (మెత్తగా చేయాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; బియ్యప్పిండి – కొద్దిగా. తయారీ: ►పొట్లకాయను శుభ్రంగా కడిగి, పెద్ద సైజు చక్రాలుగా తరగాలి (గింజలు తీసేయాలి) ►ఉడికించి, తొక్క తీసేసిన బంగాళ దుంపలు ముద్దలా అయ్యేలా చేతితో మెదపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఉల్లి తరుగు, మెత్తగా చేసిన వెల్లుల్లి రేకలు వేసి ఉల్లి తరుగు మెత్తపడే వరకు వేయించాలి ►బంగాళ దుంప ముద్ద, తరిగిన పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు జత చేసి బాగా వేయించి, దింపేయాలి ►ఈ మిశ్రమాన్ని పొట్లకాయ చక్రాలలో స్టఫ్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాచాలి ►స్టఫ్ చేసిన చక్రాలను పొడి బియ్యప్పిండిలో పొర్లించి, కాగిన నూనెలో వేసి (డీప్ ఫ్రై కాదు) రెండు వైపులా దోరగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి ►టొమాటో సాస్ లేదా చిల్లీ సాస్‌తో అందించాలి. పొట్లకాయ మసాలా కర్రీ కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 5; పల్లీ పొడి – ఒక టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; ఎండు మిర్చి – 4; ఉప్పు – తగినంత; పొట్ల కాయ – 1 (లేతది); పసుపు – అర టీ స్పూను. తయారీ: ►పొట్లకాయలను శుభ్రంగా కడిగి మధ్యలోకి నిలువుగా చీల్చి, గింజలు తీసేయాలి ►చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙ఒక గిన్నెలో పెసర పప్పు, తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ►కొద్దిగా ఉడుకుతుండగానే, పొట్ల కాయ ముక్కలు, ఉప్పు జత చేసి బాగా కలిపి మూత ఉంచి, ఉడికించి, దింపేయాలి ►స్టౌ మీద పాన్ ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉల్లి తరుగు, పసుపు, ఇంగువ, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి బాగా వేయించాలి ►ఉడికించిన పొట్లకాయ + పెసర పప్పు మిశ్రమం జత చేసి బాగా కలిపి, నీరు పోయేవరకు మగ్గబెట్టాలి ►పల్లీ పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి, దింపేయాలి ►అన్నంలోకి, రోటీలలోకి రుచిగా ఉంటుంది. పొట్లకాయ చట్నీ కావలసినవి: పొట్ల కాయ – 1; నూనె – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను; కాశ్మీరీ మిర్చి – 3; తాజా కొబ్బరి తురుము – ముప్పావు కప్పు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు – కొద్దిగా. పోపు కోసం: నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు; ఎండు మిర్చి – 1; ఇంగువ – కొద్దిగా. తయారీ: ►పొట్లకాయను శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి, గింజలు వేరు చేయాలి ►స్టౌ మీద పెద్ద బాణలిలో నూనె వేసి కాగాక, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ►పొట్ల కాయ తరుగు వేసి సన్నని మంట మీద ముక్కలు మెత్తబడేవరకు వేయించి, దింపి, చల్లార్చాలి ►పచ్చి కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు, చింత పండు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, చిన్న గిన్నెలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి, పచ్చడికి జత చేయాలి ►అన్నం, దోసె, ఇడ్లీలలోకి రుచిగా ఉంటుంది. స్టఫ్డ్ పొట్లకాయ కూర కావలసినవి: పొట్లకాయ – 1; ఉల్లి తరుగు – పావు కప్పు + పావు కప్పు; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టే బుల్ స్పూను; ధనియాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను + అర టీ స్పూను; మిరియాలు –అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; గరం మసాలా – పావు టీ స్పూను; నూనె – తగినంత. తయారీ: ►పొట్లకాయను పెద్ద పెద్ద ముక్కలుగా గుండ్రంగా తరిగి, అందులోని గింజలను చాకుతో జాగ్రత్తగా తీసేయాలి ► జీలకర్ర, మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి +అల్లం ముద్ద, ఉల్లి తరుగు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఉల్లి తరుగు వేసి వేయించాలి ►పసుపు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి మసాలా ముద్ద జత మరో రెండు నిమిషాలు వేయించాలి ►పొట్ల కాయలో నుంచి వేరుచేసిన గింజలను ఈ మిశ్రమానికి జత చేసి మరోమారు వేయించాలి ►బాగా ఉడికిన తరవాత తగినంత ఉప్పు, మిరప కారం, గరం మసాలా జత చేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి సన్నటి మంట మీద రెండు నిమిషాల పాటు ఉడికించాలి ►మూత తీసి, మరోమారు బాగా కలిపి దింపేయాలి ►తరిగి ఉంచుకున్న పొట్ల కాయ ముక్కలలోకి ఈ మిశ్రమాన్ని స్పూన్ సహాయంతో కొద్దికొద్దిగా స్టఫ్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి (డీప్ ఫ్రై కాదు) కాగాక, స్టఫ్ చేసి ఉంచుకున్న పొట్ల కాయ ముక్కలను వేసి, మూత ఉంచి, మంట తగ్గించి రెండు నిమిషాల తరవాత, ముక్కలను రెండో వైపుకి తిప్పి, మళ్లీ మూత ఉంచాలి ►ఈ విధంగా రెండు నిమిషాలకోసారి ముక్కలు మెత్తబడేవరకు తిప్పుతుండాలి ►బాగా వేగిన తరవాత దింపేయాలి ►అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పాలు కూర కావలసినవి: పొట్ల కాయ – 1; కొబ్బరి నూనె – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; కారం – ఒక టీ స్పూను; కొత్తిమీర – చిన్న కట్ట; కరివేపాకు – రెండు రెమ్మలు; పాలు – అర కప్పు (మరిగించాలి); ఉప్పు – తగినంత; తాజా కొబ్బరి తురుము – పావు కప్పు; జీలకర్ర – అర టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; ఆవాలు – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 4; పసుపు – పావు టీ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొబ్బరి నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి వేయించాలి ►ఉల్లితరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు జత చేసి, ఉల్లి తరుగు బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి ►పొట్లకాయ ముక్కలు జత చేసి, మూత ఉంచాలి ►ముక్కలు బాగా మగ్గాక, ఉప్పు, మిరప కారం వేసి కలపాలి ►కొబ్బరి తురుము, పాలు జత చేసి మరోమారు కలిపి, మూత పెట్టి, రెండు నిమిషాలు ఉడికించాలి ►కూర బాగా దగ్గర పడిన తరవాత, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి ►అన్నం, రోటీలలోకి రుచిగా ఉంటుంది. -
పామును తలపించేలా ఉన్న పొట్లకాయ
మిరుదొడ్డి(దుబ్బాక): ఆకుపచ్చరంగులో ఉన్న ఈ ఆకారాన్ని చూడగానే సుడులు తిరిగిన పాముల అనిపిస్తుంది కదూ. అచ్చం పామును పోలిన ఈ ఆకారం మనం ఆహారంగా తీసుకునే పొట్లకాయనే. మండల పరిధిలోని లక్ష్మినగర్ గ్రామానికి చెందిన లచ్చవ్వ ఇంటి పెరడిలో కాసిన ఈ పొట్లకాయ అచ్చు గుద్దినట్టు పామును తలపించింది. పాము ఆకారంలో ఉన్న ఈ పొట్లకాయను తిలకించడానికి జనం ఆసక్తి చూపుతుండటంతో ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. -
ఇంట్లో పోట్లాట
పొట్లకాయ... సన్నగా లేతగా నాజూగ్గా ఉంటుంది దాంతో వంట గదిలో ఏ మ్యాజిక్ అయినా చేయచ్చు రుచి కూడా అంతే! రుచిలో పొట్లకాయతో పోట్లాడే కూరగాయ లేదేమో దీనిని వండితే ఇంట్లో పోట్లాటలు తప్పవేమో వండండి... పోటీ పడి తినండి పొట్లకాయ దోశె కావలసినవి: చిన్న సైజు పొట్లకాయ – 1, బియ్యప్పిండి – 1/4 కప్పు, బొంబాయి రవ్వ – 1 స్పూన్ (ఆప్షనల్), జీలకర్ర – 1/4 టీ స్పూన్, పచ్చిమిర్చి – 2, ఉల్లిపాయ – 1 (ఆప్షనల్), కొత్తిమీర – కొంచెం, ఉప్పు – రుచికి సరిపడ, నూనె – సరిపడ. తయారీ: ∙పొట్లకాయను కడిగి, గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ∙ఒక జార్లో పొట్లకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి సరిపడ నీరు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ∙ఒక గిన్నెలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, జీలకర్ర, సరిపడ ఉప్పు, తరిగిన కొత్తిమీర, పొట్లకాయ పేస్ట్ అన్నీ కలిపి సరిపడ నీరు పోసి దోశె పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ పైన పెనం పెట్టి అర స్పూన్ నూనె వేసి వేడయ్యాక గుండ్రంగా దోశె వేసి పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ∙దోశెకు చిల్లులు పడి కాలిన తర్వాత కొంచెం నూనె వేసి రెండో వైపు కూడా బాగా కాలనివ్వాలి కొత్తిమీర చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. పొట్లకాయ పెరుగు పచ్చడి కావలసినవి: పొట్లకాయ ముక్కలు – 1 కప్పు, పెరుగు – 1/2 లీటరు, ఎండుమిర్చి – 2, పోపు దినుసులు – అర టీ స్పూన్, తరిగిన మిర్చి – 3, ఉప్పు – రుచికి సరిపడ, కారం – 1/2 టీ స్పూన్, పసుపు – చిటికెడు, జీలకర్ర పొడి – 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ – 1; కరివేపాకు – 2 రెబ్బలు, ఇంగువ – చిటికెడు, మెంతిపొడి– 1/2 టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్. తయారి: ఒక గిన్నెలో పెరుగు తీసుకుని గిలకొట్టి, సరిపడ ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె వేసి వేడయ్యాక ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి ∙వేగిన పోపులో ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, మెంతిపొడి వేసి నిమిషం వేగనిచ్చి, పొట్లకాయ ముక్కలు వేసి మరో పది నిమిషాలు వేయించుకోవాలి ∙పొట్లకాయ ముక్కలు మగ్గిన తర్వాత పెరుగు గిన్నెలోకి ఈ పొట్లకాయ ముక్కలను, జీలకర్ర పొడిన వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ! పొట్లకాయ బజ్జీ కావలసినవి: పొట్లకాయ – 1, శనగపిండి – 2 కప్పులు, బియ్యప్పిండి – 1/4 కప్పు, వాము – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు; కారం – 1/2 టీ స్పూన్, వంట సోడా – 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడ, నూనె – వేయించడానికి సరిపడ, చాట్ మసాలా – 1 టీ స్పూన్ (ఆప్షనల్). తయారీ: ∙పొట్లకాయను స్పూన్‌తో పై పొట్టును తీసుకోవాలి ∙పొట్లకాయను మనకు కావలసిన షేప్‌లో అంటే రింగ్స్‌లా కానీ, పొడవుగా కానీ కట్ చేసుకుని పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో పొట్లకాయ ముక్కలు, నూనె తప్ప మిగిలినవన్నీ కలిపి కొంచెం కొంచెం నీరు పోస్తూ మరీ జారుగా కాకుండా పిండి కలుపుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి నూనె పోసి బాగా వేడయ్యాక మీడియమ్ మంటమీద పొట్లకాయ ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి ∙పొట్లకాయ బజ్జీలను నూనె లేకుండా ప్లేట్లోకి తీసుకుని లైట్‌గా చాట్ మసాలా చల్లి వేడి వేడిగా సర్వ్ చేయండి. గుత్తి పొట్లకాయ కావలసినవి: పొట్లకాయ – 1 (అంగుళంన్నర ముక్కలుగా కట్ చేసుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు, ఉల్లిపాయ – 1, అల్లం – 2 అంగుళాల ముక్క, వెల్లుల్లి – 10 రెబ్బలు, జీలకర్ర – 1 టీ స్పూన్, ధనియాలు – 1 టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, చీజ్ – 4 టీ స్పూన్స్, పసుపు – కొంచెం, మిర్చి – 1/4 టీ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు – 1/2 టీ స్పూన్ (లేదా ఆమ్చూర్ పౌడర్ – 1 టీ స్పూన్), ఉప్పు – రుచికి సరిపడ, నూనె 4 టీ స్పూన్. తయారీ: ∙పొట్లకాయ పైపొట్టును స్పూన్‌తో తీసి కడగాలి. స్టవ్ చేసుకోవడానికి వీలుగా మధ్యలో ఉన్న గింజలు కూడా తీసేయాలి ∙మిక్సీ జార్లో ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మిరియాలు అన్నీ కలిపి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ∙స్టౌ పైన బాణలి పెట్టి 2 స్ఫూన్లు నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి ∙తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ మసాలా ముద్ద, పొట్లకాయను గింజలు, చింతపండు గుజ్జు, గరం మసాలా, ఛీజ్ కూడా వేసి మరి కాసేపు వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన స్టఫింగ్‌ను పొట్లకాయ ముక్కలలో కూరుకోవాలి మరొక బాణలిని వేడి చేసి 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడయ్యాక స్టఫింగ్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేగనివ్వాలి ∙చిన్న మంట మీద 5 నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలి. తర్వాత నెమ్మదిగా అన్ని వైపులా కాలేలా స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి ∙పూర్తిగా వేగిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే గుత్తి పొట్లకాయ రెడీ! – సేకరణ: జ్యోతి గొడవర్తి -
అబ్బురపరుస్తోన్న పెరటి పొట్ల
సాక్షి, రామిరెడ్డిపల్లి (నందిగామ): ఎటువంటి ఎరువులు వినియోగించనప్పటికీ ఓ ఇంటి పెరట్లో పొట్ల పాదు ఏకంగా 8 అడుగుల మేర కాయలను ఇస్తూ చూపరులను అబ్బురపరుస్తోంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లెకంటి వెంకమ్మ తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో పొట్ల విత్తనాలు నాటింది. ఆ పాదు ఇప్పటికే వందకు పైగా పొట్లకాయల దిగుబడినిచ్చింది. ప్రతి కాయ సుమారు 7 అడుగుల నుంచి 8 అడుగుల వరకు ఉండటం గమనార్హం. చెట్టుకు ఎలాంటి ఎరువులు, మందులు వినియోగించలేదని వెంకమ్మ చెప్పారు. పందిరికి పాముల వలె వేలాడుతున్న పొట్లకాయలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. -
పొట్లతో హెల్త్‌కు మెట్లు
గుడ్ ఫుడ్ జ్వరం తగ్గాక ఆరోగ్యకరమైన ఆహారం అవసరమంటూ కొద్దిరోజుల పాటు పథ్యంగా ఇచ్చే కూరల్లో పొట్లకాయ ఒకటి. దాని విశిష్టత ఏమిటన్నది ఈ ఉదాహరణతోనే తెలుస్తోంది. ►పొట్లకాయ డయాబెటిస్‌ను నివారిస్తుంది. అంతేకాదు... చైనీస్ మెడిసిన్‌లో పొట్లకాయను డయాబెటిస్ చికిత్స కోసం వినియోగిస్తుంటారు. ఇక ఇందులో క్యాలరీలు చాలా తక్కువ కాబట్టి డయాబెటిస్ రోగులు దీన్ని నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. ►గుండెదడ (పాల్పిటేషన్) వంటి గుండెజబ్బులను పొట్లకాయ సమర్థంగా నిరోధిస్తుంది. గుండెపై ఒత్తిడిని తొలగించి, రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూసే గుణం పొట్లకాయలో ఉంది. ►కామెర్ల వంటి వ్యాధులు వచ్చి కోలుకుంటున్నవారు పొట్లకాయను తినడం వల్ల కాలేయం మీద ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇలా కాలేయం త్వరగా కోలుకునేలా పొట్లకాయ తోడ్పడుతుంది. ►పొట్లకాయలో పీచుపదార్థాలు ఎక్కువ. అందుకే జీర్ణకోశ వ్యాధుల నివారణకు, ఆహారం బాగా జీర్ణం కావడానికి, మలబద్దకాన్ని నివారించడానికి పొట్లకాయ ఉపకరిస్తుంది. ► పొట్లకాయ చుండ్రును కూడా అరికడుతుంది. మళ్లీ రాకుండా నివారిస్తుంది. ► పొట్లకాయలో అన్ని రకాల ఖనిజలవణాలు ఉన్నాయి. ఎన్నో సూక్ష్మపోషకాలను (మైక్రోన్యూట్రియెంట్స్‌ను) సమకూర్చే అద్భుత ఆహారం ఇది.