కొసరి... కొసరి... | special Indiangosseberry | Sakshi
Sakshi News home page

కొసరి... కొసరి...

Published Fri, Nov 7 2014 10:42 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

కొసరి... కొసరి... - Sakshi

కొసరి... కొసరి...

కార్తికంలో ప్రతి ఇంట్లో ఉ‘సిరి’ ఉంటుంది.
రోజూ పంచ భక్ష్య పరమాన్నాలు ఉడికే ఇంట్లోనైనా...
ఈ మాసంలో ఉసిరి లేకుంటే పస్తులున్నట్టే.
ఉసిరి సిరి అంతా అందులోని వగరులో ఉంది.
అందులోని పులుపులో ఉంది.
వేడి వేడి అన్నంలో మొదటి ముద్దగా ఉసిరిని కలుపుకుంటే
అదో ప్రారంభోత్సవం!
చిక్కటి పెరుగులోనైనా, పల్చటి మజ్జిగతోనైనా
ఉసిరిని నంజుకుంటే అదో ముగింపు మహోత్సవం!
ఉసిరి పచ్చడిలోనే ఇంత మజా ఉంటే...
ఉసిరి పొడి, ఉసిరి పకోడీ, ఉసిరి చారు ఇంకెలా ఉంటాయి!!
చేసి చూడండి.
మీ పక్కవాళ్లకూ కొసరి కొసరి గిన్నెల్లో పంపించండి.

 
కావలసినవి
:  ఉసిరికాయలు - 6; నూనె - వేయించడానికి తగినంత; ఉల్లి తరుగు - పావు కప్పు; సెనగ పిండి - పావు కేజీ; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; కార్న్ ఫ్లోర్ - టేబుల్ స్పూను; ధనియాల పొడి - పావు టీ స్పూను; జీలకర్ర పొడి - పావు టీ స్పూను; ఇంగువ - కొద్దిగా; కారం - టీ స్పూను; ఉప్పు - తగినంత; కరివేపాకు - 3 రెమ్మలు; కొత్తిమీర - చిన్న కట్ట
 తయారీ: ముందుగా ఉసిరి కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పచ్చి వాసన పోయేవరకు టీ స్పూను నూనెలో దోరగా వేయించి పక్కన ఉంచాలి  ఒక పాత్రలో ఉల్లి తరుగు, సెనగ పిండి, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్, ఇంగువ, కారం, ఉసిరి తరుగు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి  ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరో మారు కలపాలి  ఉప్పు, తగినన్ని నీళ్లు జత చేసి పకోడీల పిండిలా కలపాలి  బాణలిలో నూనె పోసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పకోడీలా వేసి, బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.     
 
ఉసిరి అన్నం    
 
కావలసినవి:  అన్నం - 3 కప్పులు; ఉసిరి కాయలు - 6; పచ్చి మిర్చి - 6; ఉల్లిపాయ - 1; నూనె - 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; మినప్పప్పు - 2 టీ స్పూన్లు; ఇంగువ - కొద్దిగా; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; కరివేపాకు - 2 రెమ్మలు
 తయారీ: పచ్చి మిర్చి, ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి  ఉసిరికాయల నుంచి గింజలు వేరు చేసి, ముక్కలుగా కట్ చేసి, పచ్చి మిర్చి జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి  బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి  ఉల్లి తరుగు జత చేసి మరో మారు వేయించాలి  మెత్తగా చే సి ఉంచుకున్న ఉసిరి ముద్ద, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలియబెట్టి దించి చల్లార్చాలి   పెద్ద పాత్రలో అన్నం వేసి, దాని మీద ఉసిరి మిశ్రమం వేసి బాగా కలిపి, కరివేపాకుతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి.http://img.sakshi.net/images/cms/2014-11/81415382295_Unknown.jpg
 
ఉసిరి కోళికట్టై
 
కావలసినవి:  బియ్యప్పిండి - కప్పు; ఉసిరి కాయలు - 6; బెల్లం తురుము - అర కప్పు; ఏలకుల పొడి - కొద్దిగా; నెయ్యి - తగినంత; ఉప్పు - కొద్దిగా
తయారీ: ఒక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి  ఉప్పు, బియ్యప్పిండి వేసి బాగా కలిపి,  పిండి ఉడికిన తర్వాత దింపేయాలి  మరొక పాత్రలో కొద్దిగా నీళ్లు, ఉసిరి కాయలు వేసి మెత్తగా ఉడికించి దింపి, చల్లారాక, గింజలు వేరు చేసి, ఉసిరి కాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి  బాణలిలో తగినంత నెయ్యి వేసి కరిగాక, ఉసిరి ముద్ద, బెల్లం, ఏలకుల పొడి జత చేసి కొద్దిసేపు ఉడికించాలి  మిశ్రమం బాగా చిక్కబడ్డాక, దింపేయాలి  ఉడికించిన బియ్యప్పిండి కొద్దిగా తీసుకుని చేతితో వెడల్పుగా ఒత్తి, మధ్యలో ఉసిరి మిశ్రమం కొద్దిగా ఉంచి, అంచులు మూసేయాలి  ఇలా అన్నీ తయారుచేసుకుని, ఇడ్లీ రేకులలో ఉంచి ఇడ్లీ మాదిరిగా ఆవిరి మీద ఉడికించాలి.
 
ఉసిరి పెరుగు పచ్చడి
 
కావలసినవి:  ఉసిరి కాయలు - 5; కొబ్బరి తురుము - టీ స్పూను; గడ్డ పెరుగు - 2 కప్పులు; నూనె - టీ స్పూను; ఆవాలు - 2 టీ స్పూన్లు; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 6; కారం - అర టీ స్పూను; పచ్చి మిర్చి - 4; ఉప్పు - తగినంత; పసుపు - పావు టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు
 
తయారీ: ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి గింజలు వేరు చేసి, ముక్కలుగా కట్ చేయాలి  బాణలిలో నూనె వేసి, కాగాక ఉసిరి కాయ ముక్కలు వేసి కొద్దిగా వేగాక తీసి, చల్లారాక, పచ్చి మిర్చి, కొబ్బరి తురుము జత చేసి మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా చేయాలి  అదే బాణలిలో సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి వరసగా ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా వేయించాక, ఉసిరి ముద్ద వేసి వేయించి రెండు నిమిషాలు ఉడికించి దింపి, చల్లార్చాలి  పెరుగులో ఉప్పు, పసుపు, కారం వేసి గిలక్కొట్టాక, ఉసిరి మిశ్రమం వేసి కలపాలి  చివరగా కరివేపాకుతో అలంకరించాలి.
 
ఉసిరి చారు
 
 కావలసినవి:   ఉసిరి కాయలు - 2; నూనె - టీ స్పూను; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండు మిర్చి - 4; పచ్చి మిర్చి - 1; మిరియాల పొడి - కొద్దిగా; ఇంగువ - చిటికెడు; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా

తయారీ: ముందుగా ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి, ముక్కలు తరిగి, గింజలు వేరు చేసి, ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి  మందంగా ఉండే గిన్నెలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి వేయించాలి  సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి  ఉసిరి కాయ ముద్ద వేసి దోరగా వేయించి తగినన్ని నీళ్లు పోయాలి  ఉప్పు, పసుపు, పచ్చి మిర్చి ముక్కలు వేసి చారు మరిగించాలి  కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడి వేసి ఒక పొంగు రానిచ్చి దింపాలి.
 
 ఉసిరి పొడి
 
కావలసినవి:  ఉసిరి కాయలు - కేజీ; నూనె - టేబుల్ స్పూను; జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు; మిరియాలు - అర టీ స్పూను (పొడి చేయాలి); ఎండు అల్లం - 50 గ్రా.; ఇంగువ - కొద్దిగా; ఉప్పు - తగినంత; పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు (వేయించాలి); పుట్నాల పప్పు - టేబుల్ స్పూను; నువ్వు పప్పు - టేబుల్ స్పూను (వేయించాలి); ఎండు మిర్చి - 100 గ్రా.

తయారీ:  ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి, గింజలు వేరు చేసి, ముక్కలుగా కట్ చేసి, వాటిని రెండు రోజులు ఎండబెట్టాలి  బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉసిరి ముక్కలు, జీలకర్ర వేసి వేయించి తీసి చల్లార్చాలి  మిక్సీలో ఉసిరి కాయ ముక్కలు, మిరియాల పొడి, ఎండు అల్లం, ఉప్పు వేసి పొడి చేసి తీసి పక్కన ఉంచాలి  పల్లీలు, పుట్నాల పప్పు, నువ్వు పప్పు, ఎండు మిర్చి వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచాలి  ఒక పాత్రలో ఉసిరి పొడి, పల్లీల మిశ్రమం పొడి, ఇంగువ వేసి బాగా కలిపి వేడి వేడి అన్నంలో, కమ్మని నేతితో వడ్డించాలి.
 
ఉసిరి పచ్చడి
 

కావలసినవి:  ఉసిరి కాయలు - 4; అల్లం - చిన్న ముక్క; వెల్లుల్లి రేకలు - 2; ఉల్లిపాయ - 1 (ముక్కలుగా కట్ చేయాలి); కరివేపాకు - రెండు రెమ్మలు; పచ్చి మిర్చి - 5; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; నూనె - అర టీ స్పూను; ఇంగువ - పావు టీస్పూను
 తయారీ: ఉసిరికాయలను శుభ్రంగా కడిగి గింజలు వేరు చేయాలి మిక్సీలో ఉసిరికాయ ముక్కలు, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు, అల్లం ముక్క, ఉల్లి తరుగు, వెల్లుల్లి రేకలు వేసి మెత్తగా చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, కరివేపాకు వేసి వేయించి, ఉసిరికాయ పచ్చడిలో వేసి కలిపి అన్నంలో వడ్డించాలి.
 
 ఉసిరి ఉపయోగాలు...

ఉసిరిలో సి విటమిన్ పుష్కలంగా ఉంది.
ఇందులో క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, మినరల్స్ అధికంగా ఉన్నాయి.
ఉసిరి అతి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
ఉసిరిరసంలో తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే కంటిచూపు చక్కగా ఉంటుంది.
ఉసిరికాయను నిత్యం ఏదో ఒక రూపంలో వాడటం వల్ల జీర్ణశక్తి బాగుంటుంది.
ఉసిరి కాయను ఏ రూపంలో తీసుకున్నా గుండె కండరాలు బలంగా తయారవుతాయి.
ఉసిరి వాడకం వల్ల జుట్టు రాలిపోవడం తగ్గుతుంది.
వ్యాధినిరోధకశక్తి మెరుగుపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ సుగర్ స్థాయులు తగ్గుతాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement