'సమంత'కమణి | Special interview with samantha | Sakshi
Sakshi News home page

'సమంత'కమణి

Published Sun, Oct 15 2017 12:27 AM | Last Updated on Sun, Oct 15 2017 3:02 AM

Special interview with samantha

నాగచైతన్య తన స్నేహితురాలి కష్టాలను పంచుకున్నాడు. .. తన సఖి తప్పులను అర్థం చేసుకున్నాడు. .. తన ప్రియురాలి బాధను తుడిచేశాడు. ఇలా.. కాబోయే భార్య జీవితంలో మూడు ముళ్లను తీసేశాడు. అలా... మూడు ముడులు వేసి ప్రేమకు పట్టాభిషేకం చేశాడు. అందుకే సమంతకు ‘చై’ అంటే అంత ఇష్టం! అక్కినేని కుటుంబం నన్ను నన్నుగా గుర్తించింది. నన్ను నన్నుగా స్వీకరించింది.. నన్ను నన్నుగా ఆదరించింది. ఇవే ఆ మూడు ముడులు. మన పిల్లలు కూడా నేర్చుకోవాల్సింది ఇదేనేమో... మనిషిని మనిషిగా గుర్తించడం... స్వీకరించడం... ఆదరించడం... ప్రేమగా ఆరాధించడం. ‘‘నేను అదృష్టవంతురాలిని’’ అని సమంత చెబుతోంది. ‘చే’ ఈజ్‌ ఆల్సో లక్కీ అని మేము అనుకుంటున్నాం. చే–సమంతల సంస్కారం శమంతకమణి అంతటి విలువైనది. మూడు తరాల వెలుగులను విరాజమానం చేసే సమంతకమణి ‘గాడ్‌ బ్లెస్‌ ది కపుల్‌’!


ఇవాళ (శనివారం) సత్యనారాయణ వ్రతం చేశారు కదా. అంతకుముందు వ్రతం చూసి కూడా ఉండరేమో... ఇక చేయడం అంటే చాలా కొత్తగా ఉండి ఉంటుంది!
అవునండి. పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తారని తెలుసు కానీ, నేనెప్పుడూ చూడలేదు. మూడు గంటల సేపు వ్రతం జరిగింది. చాలా బాగా అనిపించింది. ఇవాళ మొత్తం వెజిటేరియన్‌ ఫుడ్‌ మాత్రమే తినాలన్నారు. సంప్రదాయాలెప్పుడూ బాగుంటాయండి.

 జనరల్‌గా పెళ్లయ్యాక లంచ్‌లు, డిన్నర్‌లు అంటూ ఎవరో ఒకళ్లు పిలుస్తుంటారు... మీక్కూడా అలా జరుగుతోందా?
పెళ్లయ్యాక అబ్బాయి–అమ్మాయి ఎందుకు లావు అవుతారో ఇప్పుడు అర్థమవుతోంది. విందు భోజనాలు చేస్తున్నాం. కొంచెం ఎక్కువే తింటున్నా. నేనైతే నా జీవితంలో ఎప్పుడూ ఈ రేంజ్‌లో తినలేదు (నవ్వేస్తూ). అలాగే లేజీనెస్‌ అంటే కూడా నాకు తెలియదు. పని చేయకుండా ఒక్క రోజు ఇంట్లో ఉన్నా గిల్టీగా అనిపించేది. అలాంటిది ఇప్పుడు లేజీగా ఫీలవుతున్నా. మరి... క్లైమెట్‌ వల్లో ఏమో? పని చేయబుద్ధి కావడం లేదు. ఇంకో వారం రోజులు ఇలానే రిలాక్స్‌ అవ్వాలని ఉంది. తర్వాత ‘మహానటి’ షూటింగ్‌ మొదలు కాబోతోంది. మళ్లీ షూటింగ్స్‌తో బిజీ అయిపోతా.

పెళ్లితో ఆడవాళ్ల ఇంటి పేరు మారుతుంది. ఇల్లు మారుతుంది. పిల్లలు పుట్టాక ఫిజిక్‌ కూడా మారిపోతుంది. అన్ని మార్పులూ ఆడవాళ్లకే... ఈ చేంజెస్‌ గురించి?
కరెక్టేనండి. మార్పులన్నీ మనకే. అయితే ఆ మార్పులను ఇష్టంగా తీసుకుంటే, మనకు మనంగా ఆ మార్పులను చేసుకుంటే లైఫ్‌ బాగుంటుంది. నా వరకు నేను చేసుకున్న మార్పులు గురించి చెబుతాను. పెళ్లి నుంచి వద్దాం. ‘ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిందే’ అని నన్ను మా ఇంట్లో ఫోర్స్‌ చేయలేదు. ‘చై’ (నాగచైతన్య)ని పెళ్లి చేసుకుందామనుకున్నాను. ఇంట్లో ఒప్పుకున్నారు. చేసుకున్నా.

మ్యారేజ్‌వైజ్‌గా నా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం నాకు రాలేదు. అలాగే, పెళ్లయ్యాక ‘సమంత అక్కినేని’ అని నా ఇంటి పేరుని నేను ఇష్టంగానే మార్చుకున్నా. రేపు పిల్లలు పుట్టాక నా ఫిజిక్‌ మారితే ‘ఐయామ్‌ ఓకే విత్‌ ఇట్‌’. కెరీర్‌ విషయానికొస్తే.. సినిమాలు కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ‘నో’ అని ఎవరూ అనలేదు. మన లైఫ్‌లో జరిగే మార్పులన్నీ మన ఇష్టప్రకారం జరిగితే బాగుంటుంది. నేను అదృష్టవంతురాలిని. దేవుడు నన్ను చల్లగా చూస్తున్నాడు.

పెళ్లిలో చైతూ మీ మెడలో మూడు ముళ్లు వేయగానే ఒక్కసారిగా ఏడ్చేశారు. ఎందుకంత ఎమోషనల్‌  అయ్యారు?
అంతకుముందు వరకూ అందరితో నవ్వుతూనే ఉన్నా. కానీ, మెడలో తాళిబొట్టు పడగానే ఎమోషన్‌ ఆపుకోలేకపోయాను. ఎందుకంటే, నా గురించి మొత్తం తెలిసిన వ్యక్తి నన్ను పెళ్లాడాడన్న ఆనందం. చైకి నా సక్సెస్, నా ఫెయిల్యూర్స్‌ తెలుసు. నా ఆర్థిక కష్టాలూ తెలుసు. ‘ఏ మాయ చేసావె’ షూటింగ్‌ న్యూయార్క్‌లో జరిగినప్పుడు నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అది కూడా చైకి తెలుసు. 2010లో ఆ సినిమా వచ్చింది. వెంటనే వెంటనే నాకు బోలెడన్ని ఆఫర్లు. 2012కల్లా ఫైనాన్షియల్‌గా నేను స్ట్రాంగ్‌ అయ్యాను. అదీ చైకి తెలుసు. నేను ఘోరమైన తప్పులు చేశాను. ఆ తప్పులు సరిదిద్దుకున్నాను. అది కూడా తనకు తెలుసు. మంచి పనులు చేశాను. అవి కూడా తెలుసు.

ఇలా నా జీవితం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి నన్ను పెళ్లాడటం నాకు బాగా అనిపించింది. నేను స్టార్‌ని అని తను నన్ను పెళ్లాడలేదు. డబ్బు కోసం నన్ను పెళ్లాడాల్సిన అవసరమే లేదు తనకి. నన్ను నన్నుగా ప్రేమించాడు. అందుకే చై నా మెడలో మూడు ముళ్లు వేసినప్పుడు ఎమోషన్‌ అయ్యాను. ఎందుకంటే, పెళ్లాడబోయే వ్యక్తి గురించి ఏమీ తెలియకుండానే చాలామందికి పెళ్లైపోతుంది. మా విషయం వేరు. ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఈ ప్రపంచంలో నా గ్రేటెస్ట్‌ లక్‌ ఏంటంటే... చైతో నా పెళ్లి.

ఇప్పుడు ‘మిసెస్‌ చై’ కాబట్టి.. క్యారెక్టర్స్‌ సెలక్షన్‌ విషయంలో జాగ్రత్తగా ఉంటారా? గ్లామరస్‌ రోల్స్‌ తగ్గించేస్తారా?
పెళ్లయిందని కాదు కానీ, ఇప్పుడు నేను ‘బృందావనం’, ‘దూకుడు’లో చేసిన క్యారెక్టర్స్‌ లాంటివి చేయలేను. ఎందుకంటే... నా కెరీర్‌ గ్రాఫ్‌ని పెంచుకోవాలి. అందుకే ‘రాజుగారి గది–2’లో చిన్న రోల్‌ అయినా చేశాను. అది చూసి, అలాంటి రోల్స్‌కి నన్ను తీసుకోవాలనుకుంటారు. ఆ క్యారెక్టర్‌ చాలా ఇంపాక్ట్‌ చూపిస్తుంది. అలా జనాలను ప్రభావితం చేసే క్యారెక్టర్స్‌ చేయాలనుకుంటున్నా. కమర్షియల్‌ రోల్స్‌ మాత్రమే చేసుకుంటూ పోతే నాకు బోర్‌ కొట్టేస్తుంది.

ఒకప్పుడు ఫైనాన్షియల్‌ ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశారు. ఇప్పుడు ఫుల్‌ రిలాక్స్‌. ఏమీ చేయకుండా హాయిగా ఇంటిపట్టున ఉండిపోవచ్చు. పెళ్లితో ఆ భరోసా వచ్చినందుకు ఎలా ఉంది?
మిడిల్‌ క్లాస్‌ అమ్మాయిగా ఉన్నప్పుడు హ్యాపీగానే ఉండేదాన్ని. బేసిక్‌గా నాకు డబ్బు పిచ్చి లేదు. ఏదో సాధించాలనే కసి. అందుకే, కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి అంత కష్టపడ్డాను. ఆ కసి ఇప్పుడూ ఉంది. నటిగా ఏమీ లేని స్థాయి నుంచి మంచి స్థాయికి వచ్చాను. నేను కలలో కూడా అనుకోనంత ఆ దేవుడు ఇచ్చాడు. అంతమాత్రాన ఆగిపోకూడదు కదా. ఈ స్థాయిని ఇలానే కొనసాగించాలనుకుంటున్నా.

మీ పెళ్లి వేడుకల్లో సురేశ్‌బాబు (నాగచైతన్య మేనమామ– రానా తండ్రి) డ్యాన్స్‌ చేయడం ఓ హైలైట్‌. ఆయన అంత సరదాగా ఉంటారని ఆల్మోస్ట్‌ ఎవరూ ఊహించరు...
(నవ్వేస్తూ). ఈ ఫ్యామిలీస్‌ (అక్కినేని, దగ్గుబాటి) గురించి బయటి వ్యక్తులకు చాలా విషయాలు తెలియదు. చాలా సరదాగా ఉంటారు. అయితే ఆ ఫన్‌ అంతా ఫ్యామిలీ మెంబర్స్‌ మధ్యలో ఉన్నప్పుడే. చాలా ఫ్రీగా ఉంటారు. నా ఎక్స్‌టెండెడ్‌ (అత్తగారిల్లు) ఫ్యామిలీ వెరీ నైస్‌.

మరి... మీ పుట్టింటివాళ్ల గురించి?
భవిష్యత్తులో చైతో నా పెళ్లి జరుగుతుందని ఆ దేవుడు సింబాలిక్‌గా చూపించాడేమో! మా అమ్మ వాళ్లింట్లో నేను యాక్ట్‌ చేసిన సినిమాల్లో ఒకే ఒక్క సినిమా ఫొటో ఉంది. అది ‘ఏ మాయ చేశావె’ ఫొటో. మా అమ్మగారికి  సినిమా ఫీల్డ్‌ గురించి ఏమీ తెలియదు. ఇక్కడివాళ్ల గురించి అవగాహన కూడా లేదు. మా వాళ్లకు చై మాత్రమే బాగా తెలుసు. తనతో నా పెళ్లి జరిగినందుకు మా వాళ్లు హ్యాపీ.

అక్కినేని ఫ్యామిలీ ఎలా ఉంది?
అక్కినేని కుటుంబంలో ఎవరి ఫ్రీడమ్‌ వాళ్లకు ఉంటుంది. ‘ఇలా చెయ్యండి. ఇలా చెయాలి’ అని యంగ్‌స్టర్స్‌కి రిస్ట్రిక్షన్స్‌ పెట్టరు. తప్పో... ఒప్పో... మీరే నిర్ణయించుకోండి. తప్పుల నుంచి ఒప్పు తెలుసుకోండి అన్నట్లుగా ఉంటుంది. అది బాగా నచ్చింది. ‘ఇది అక్కినేని ఫ్యామిలీ. ఈ లెగసీని మీరు కాపాడాలి. జాగ్రత్తగా క్యారీ చేయాలి’ అని చెప్పరు. అలా ఫ్రీడమ్‌ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా భయం ఉంటుంది. ఆ ఫ్రీడమ్‌ని కరెక్ట్‌గా వాడుకోవాలని జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు నాక్కూడా ‘నేను ఇప్పుడు అక్కినేని ఇంటి కోడల్ని. చాలా బాధ్యతగా ఉండాలి’ అనుకుంటున్నాను.

అందుకే చై, నేను ల్యావిష్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేయలేదు!
ఫ్యామిలీ మెంబర్స్, వెరీ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ మధ్య పెళ్లి చేసుకోవాలని చై, నేను ముందే అనుకున్నాం. ఎక్కువమందిని పిలిచినప్పుడు, వచ్చిన ప్రతి ఒక్కరూ కంఫర్ట్‌గా ఉన్నారా? అనేది తెలుసుకోవడం కష్టమవుతుంది. అదే తక్కువమంది ఉన్నారనుకోండి.. అప్పుడు అందరి ఫీలింగ్స్‌ తెలుస్తాయి. వాళ్లు వేసే జోక్స్‌ నుంచి ప్రతిదీ తెలుస్తుంది. పెళ్లి చేసుకునే మాతో పాటు వేడుకల్లో పాల్గొనే వాళ్లందరూ హ్యాపీగా ఉండాలన్నది మా ఒపీనియన్‌. అనుకున్నట్లుగానే మా మ్యారేజ్‌ చాలా హ్యాపీగా జరిగింది.

ఇంతకీ వంట నేర్చుకున్నారా?
కచ్చితంగా నేర్చుకోవాలండి. ఎందుకంటే, సురేశ్‌బాబుగారి భార్యని, మా చై వాళ్ల అమ్మని చూస్తున్నాను. ఇంకా ఇంట్లో అమలగారు, మిగతా లేడీస్‌ అంతా ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉన్నారో స్వయంగా చూస్తున్నా. రానా మదర్‌ లేకపోతే ఇంట్లో ఏమీ కదలదు. సురేశ్‌బాబుగారు ఎంత పెద్ద ప్రొడ్యూసరో తెలిసిందే. కానీ, ఇంట్లో ఆవిడ లేకపోతే ఏమీ జరగదు. రానా సిస్టర్‌ మాళవిక కూడా సూపర్‌. తనకో పాప ఉంది. పాప పనులన్నీ భలే చూసుకుంటుంది. మా ఇంట్లో లేడీస్‌లా నేనూ బాధ్యతగా ఉండాలనుకుంటున్నా. మంచి భార్య, మంచి తల్లి అనిపించుకుంటా. ప్రొఫెషనల్‌గా సక్సెస్‌ అయ్యాం కదా.. ఇంట్లో ఎలా ఉంటే ఏం? అనుకోవడంలేదు. ఇంటినీ చక్కబెట్టుకోవాలి. ఏ ఉమన్‌ అయినా అలా చేస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్‌.

ఇప్పటివరకూ  చైతూ హ్యాపీగా ఉన్న మూమెంట్స్‌ని చూసి ఉంటారు.. ఆ హ్యాపీనెస్‌కీ, ఇప్పటి హ్యాపీనెస్‌కి తేడా?
ఇప్పుడైతే చాలా రిలాక్స్‌ అయ్యాడు. ఇంకా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. ఆ డిఫరెన్స్‌ కనిపిస్తోంది. చై ఎప్పుడూ కూల్‌ పర్సన్‌.

ఇలా పెళ్లయిందో లేదో అలా షూటింగ్స్‌కి డేట్స్‌ ఇచ్చేశారు.. మరి హనీమూన్‌ ఎప్పుడు?
ఇంకా ప్లాన్‌ చేయలేదు. ఇయర్‌ ఎండింగ్‌లో వెళ్లాలనుకుంటున్నాం.

పిల్లల గురించి మాట్లాడటం టూ ఎర్లీ ఏమో కదా?
ఇప్పుడే కదా పెళ్లయ్యింది. అప్పుడే పిల్లల గురించి మాట్లాడుకోవడం నిజంగా ఎర్లీయే.
 

సినిమాలోనే ‘చిట్టి తల్లీ’... బయట ‘సామ్‌’ అని పిలుస్తారు!
‘రాజుగారి గది–2’లో నేరం చేసిన వాళ్లను మీ పాత్ర క్షమిస్తుంది. లెక్క ప్రకారం శిక్షించాలి కదా?
సినిమాలో తప్పు చేసిన అమ్మాయి తను చేసిన పని వల్ల అంత సీరియస్‌ అవుతుందని ఊహించదు. కట్‌ చేస్తే... వీడియోలో ఉన్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ సినిమా వరకూ తప్పు చేసిన వ్యక్తిని క్షమించడమే రైట్‌.

ఈ సినిమా రెస్పాన్స్‌ విని, ఎలా ఫీలవుతున్నారు?
అందరూ బాగుందంటున్నారు. మంచి సినిమా, మంచి క్యారెక్టర్‌ చేసినప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తే హ్యాపీగానే ఉంటుంది కదా. పైగా, నాది మంచి ఎమోషనల్‌ రోల్‌. ఇష్టపడి చేశాను.

ఈ సినిమాలో మీ మామ (నాగార్జున)గారు ‘చిట్టి తల్లీ’ అని పిలుస్తారు.. రియల్‌గా ఎలా పిలుస్తున్నారు?
(నవ్వేస్తూ) సామ్‌ అంటారు. చాలా అందంగా పిలుస్తారు.

ఓకే... తప్పు చేసిన వ్యక్తిని సినిమాలో క్షమించారు. కానీ, రియల్‌ లైఫ్‌లో అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాళ్లను శిక్షించాలా? ఉరి తీయాలనేంత కోపం మీకు ఉంటుందా?
అంత కోపం ఉండదు. ఎందుకంటే, మనల్ని పుట్టించింది దేవుడు. తీసుకెళ్లాల్సింది కూడా దేవుడే అనుకుంటా. అలాగని తప్పు చేసినవాళ్లను వదలకూడదు. పనిష్‌ చేయాలి. ఆ పనిష్‌మెంట్‌ చాలా కఠినంగా ఉండాలి. తప్పు చేయాలంటే ఆ పనిష్‌మెంట్‌ గుర్తుకు రావాలి. ఆ పనిష్‌మెంట్‌ గురించి తెలిసి, తప్పు చేయాలనుకున్నవాళ్లు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి.

ఓకే సామ్‌.. విష్‌ యు హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌?
థ్యాంక్స్‌ అండి.

– డి.జి. భవాని

 

సంబంధిత వార్తలు :

వివాహ బంధంతో ఒక్కటైన చైతూ, సమంత


ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..
చైతూ, సమంత పెళ్లిసందడి


చేసామ్‌ పెళ్లి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement