విష్ణుప్రీతికరం... లక్ష్మీప్రదం
మన ఇష్టదైవానికి సంబంధించిన నామాలను సాధ్యమైతే ప్రతినిత్యం లేదా సంవత్సరంలో ఆయా దేవతలకు సంబంధించిన మాసంలో లేదా వారంలో ఆయా దేవతలకు ప్రీతిపాత్రమైన రోజున స్మరించడం వల్ల ఇష్టదైవం అనుగ్రహం కలుగుతుందనడంలో సందేహం లేదు. మార్గశీర్షమాసం విష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ మాసం రోజులూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే విశిష్ట ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు స్త్రీలోకానికి దక్కిన మహావరం. మార్గశిర గురువార వ్రతాన్ని విధి విధానాలతో ఆచరించడం సర్వశ్రేయోదాయకం.
శుభప్రద షష్ఠి
మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడానికి సర్వోత్తమమైనది. ఈ రోజున శివపార్వతుల గారాల తనయుడైన కుమారస్వామిని షోడశోపచారాలతో పూజించినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. అదేవిధంగా కుజదోషం ఉన్నవారు, గోచారం ప్రకారం కుజుడు నీచస్థానంలో సంచరిస్తూ, పలు రకాలైన ఇబ్బందులకు గురవుతున్నవారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే, ఆయా దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రోక్తి. వీలయిన వారు పుట్టలో పాలు పోయడం శ్రేయోదాయకం.
(24, శుక్రవారం సుబ్రహ్మణ్య షష్ఠి)
Comments
Please login to add a commentAdd a comment