ఎవరైనా అందుబాటులో ఉన్న వనరులతోనే తమ అభిరుచుల అందలాలకు సోపానాలు వేసుకుంటారు. కానీ, ఢిల్లీకి చెందిన ‘ఆర్చీ జె’ అనే పాతికేళ్ల యువతి తన గాత్రానికి పాశ్చాత్య సంగీత పరికరమైన బ్యాగ్‌పైప్‌ను నేపథ్యవాద్యంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సంగీత ప్రియుల్ని మాయావిలా బుట్టలో వేసుకుంటోంది.
మనదేశంలో బ్యాగ్‌పైప్‌ను నేర్పించేందుకు శిక్షకులెవరూ లేరు. ఆర్చీ కొన్ని పుస్తకాలు, ఆన్‌లైన్ వీడియోల ద్వారా బ్యాగ్‌పైప్‌ను ప్లే చేయడం నేర్చుకుంది. పాశ్చాత్య సంగీతంతో భారతీయ శైలిని మేళవించి మ్యూజిక్ అల్బమ్స్ చేసింది. 2018లో ‘ఇండియాస్ ఫస్ట్ ప్రొఫెషనల్ ఫిమేల్ బ్యాగ్‌పైపర్’ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకుంది. ఇవన్నీ పెద్దగా సమయం తీసుకోకుండానే జరిగిపోయాయంటే కారణం.. ఆర్చీ ప్రతిభ, ఆర్చీ స్వరజ్ఞానం. ఒకసారి టీవీలో వస్తున్న విదేశీ ఆర్మీ కవాతులో బ్యాగ్‌పైప్ ఉపయోగించడం చూసింది. దాని శబ్దం ఆమెకు విపరీతంగా నచ్చింది. దీంతో ఆ పరికరం గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. బ్యాగ్‌పైప్ పరికరాన్ని తెప్పించుకుంది. అయితే దాంతో ఎలా సాధన చేయాలి అనేది పెద్ద ప్రశ్న. ప్రపంచం నలుమూలలలో ఉన్న అనేకమంది నిపుణులైన బ్యాగ్‌పైప్ ఆర్టిస్టులకు మెయిల్స్ పంపింది. ప్రొఫెషనల్ బ్యాగ్‌పైప్ ఆర్టిస్ట్ సీన్ ఫోల్సోమ్ స్పందించి, ఆర్చీకి బోధించడానికి ‘ఎస్’ చెప్పాడు. సరైన పుస్తకాల గురించి సమాచారం ఇచ్చాడు. ఇది ఆర్చీకి బాగా ఉపయోగపడింది.
ఉద్యోగం మానేసింది
ఆర్చీది మధ్యతరగతి కుటుంబం. చదువులో జెమ్. నోయిడా లోని ఏషియన్ స్కూల్ ఆఫ్ మీడియాలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత యు.ఎస్.లోని ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అమెరికాకు వెళ్లి తన విధులను నిర్వర్తిస్తూనే పుస్తకాల సాయంతో బ్యాగ్‌పైప్ వాద్యాన్ని ప్లే చేయడం నేర్చుకుంది. రెండేళ్లపాటు సొంతగా సాధన చేస్తూన్న ఆర్చీ ఆఫీసుకు సెలవు పెట్టి స్కాట్లాండ్‌లోని గ్లాస్‌గో కు వెళ్లింది. అక్కడ బ్యాగ్‌పైప్ నిపుణులను కలుసుకొని, వారి దగ్గర ఈ కళలోని మరిన్ని మెళకువలు నేర్చుకుంది. వారం తర్వాత తిరిగి ఉద్యోగానికి వచ్చింది. కానీ, బ్యాగ్‌పైప్ మీద తప్ప.. చేస్తున్న పని మీద ధ్యాస లేదు. ఉద్యోగానికి రిజైన్ చేసి, ఇండియాకు వచ్చేసింది.
మొదటి వీడియోతోనే!
బ్యాగ్‌పైప్‌ను ప్లే చేస్తూ తన గళాన్ని వినిపించిన ఆర్చీ మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధి చెందింది. మొదట ‘ఎసి డిసి థండర్ స్ట్రక్’ అనే ఆస్ట్రేలియా బ్యాండ్ పాటను బ్యాగ్‌పైప్ పరికరంతో ప్లే చేసి ఆ వీడియోను సోషల్ మీడియాద్వారా పంచుకుంది. ట్యూన్‌లోని కొత్తదనం వీక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఫలితంగా వీడియో వైరల్ అయ్యింది. దీని తరువాత ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్, స్టార్ వార్స్, గాడ్ ఫాదర్..’ పాటలకు ఆర్చీ తన ట్యూన్లను జత చేయడంతో విశేష ప్రజాదరణ పొందింది. అక్కణ్ణుంచి తన సొంత పాటల కూర్పు వైపు కదిలింది. రెండు నెలల క్రిందట ‘ఆస్మాన్ సే’ పాటను విడుదల చేసింది. అంతకు ముందు చేసిన ‘నగీన’ పాటకు 40 లక్షల యాభై వేల వ్యూస్‌ను సంపాదించింది. – ఆరెన్నార్
స్నేక్ చార్మర్
ఆర్చీ తన కళకు ‘స్నేక్ చార్మర్’ అనే పేరును ఎంచుకుంది. బూరను ఊదుతూ పాములను లొంగదీసుకునే మంత్రగాళ్ల గురించి భారతదేశం అంతటా తెలిసిందే. దేశీయంగా మనవారి నాడిని పట్టుకొని ఆర్చీ తన యూ ట్యూబ్ ఛానెల్‌కు ‘ది స్నేక్ చార్మర్’ అని పేరు పెట్టి తన బ్యాగ్‌పైప్ సంగీతంతో వీక్షకులకు మంత్రముగ్ధులను చేస్తోంది. ఐదేళ్లలో యూ ట్యూబ్ చానెల్ ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 79 దేశాలలో 4.50 లక్షలకు పైగా సభ్యులను, మిలియన్ల మంది వీక్షకులను సంపాదించుకుంది ఆర్చీ.
Comments
Please login to add a commentAdd a comment