భారతీయ జనతా పార్టీ తెలంగాణ కీలక నేతలు ఢిల్లీ చేరారు. హస్తిన నుంచే ఏదో కొత్త ఆపరేషన్ మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ హస్తినాపురానికి వెళ్లిన నేతలు కొన్ని కీలక అంశాలపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొన్ని కీలక అంశాల్లో అధిష్టానం వీరికి దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.
కారు నుంచి దించాలి.. కమలంలో చేర్చాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సిట్టింగులకే సీట్లు అని స్పష్టం చేశారు. దీంతో గులాబీ పార్టీలోని అసమ్మతి నేతలు, ఆశావహులు పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని కాషాయ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని మునుగోడుతో తేలిపోవడంతో ఆ నేతలు కూడా కాషాయ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు చర్చించుకుంటున్నారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాయినింగ్స్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు దాటింది. తాజాగా బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీ కీలక నేతలు ఢిల్లీలో ఎదో చేస్తున్నారనే ప్రచారం మాత్రం సాగుతోంది. హస్తిన నుంచే ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఉంటే ఇంటెలిజెన్స్ ఇబ్బందుల కారణంగా, ఆ రాడార్ పరిధికి దూరంగా ఉండి జాయినింగ్స్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హస్తిన నుంచే హస్తానికి షాక్
తెలంగాణలో కాంగ్రెస్‌ను మరింత బలహీనపరచాలని బీజేపీ భావిస్తోంది. ఆ పార్టీ నేతల మధ్య విభేదాలను అదునుగా తీసుకుని బలమైన నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడంపై కాషాయదళం కసరత్తు చేస్తోంది. రేవంత్ రెడ్డి తీరు నచ్చనివారు, కాంగ్రెస్‌లో భవిష్యత్ లేదని భావిస్తున్న బలమైన నేతలను కమలం పార్టీ క్యాష్ చేయాలనుకుంటోంది. ఇప్పటికే మర్రి శశిధర్‌రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేతలో భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆయన తాను ఢిల్లీకి వెళ్లడం కొత్తేంకాదని క్లారిటీ ఇచ్చుకున్నా సమయం చూసి కాషాయతీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఢిల్లీ వేదికగా ఈటల చేపడుతన్న ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? లేదా అనేది భవిష్యత్ లో తేలనుంది.
ఢిల్లీకి కావాల్సింది రిజల్ట్సే
మునుగోడు ఉప ఎన్నికల ఓటమి బాధ నుంచి బీజేపీ శ్రేణులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఓటు బ్యాంకు పెరిగిందని పైకి సంబురపడుతున్నా లోలోన మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌ను ఢీకొట్టడం అంత ఈజీ కాదనే భావనలో ఉంది. దీనిపై అధిష్టానం కూడా కాస్త సీరియస్ గానే ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీంతో రాష్ట్ర బీజేపీ అలర్ట్ అయింది. నేతలు యాక్షన్ లోకి దిగి చేరికలపై దృష్టి సారిస్తున్నారు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment