పులి ముందుకు వెళ్లాలంటే వేటగాడికి తుపాకీ కావాలి. తుపాకీ లేకుండా వెళ్లాలంటే ధైర్యం కావాలి. ధైర్యం కూడా లేకుండా వెళ్లాలంటే ‘ప్రేమ’ కావాలి. పులిపై ప్రేమ! ప్రమీలకు ప్రేమ మాత్రమే కాదు, పులితో ఏదో బంధం కూడా ఉన్నట్లుంది. ‘అవని’ పులితో కూతురి బంధం, అవని కూనలతో అక్క బంధం. ప్రమీల ఫారెస్ట్ గార్డ్. ఆమెతో పాటు ఐదుగురు మగ గార్డులు ‘అవని’ పిల్లల్ని వెతికి, సంరక్షించేందుకు ఏడాదిన్నరగా అడవిని గాలిస్తున్నారు. చివరికి ప్రమీలకు మాత్రమే ఆ రెండు కూనలు కనిపించాయి! ‘మదర్‌లీ ఇన్‌స్టింక్ట్’ అంటారు. పిల్లల కోసం ‘అవని’ పులి గుండె ప్రమీలలో కొట్టుకుందా? ఆ చప్పుడును అవని పిల్లలు వినగలిగాయా! అందుకే ఆమెకు మాత్రమే కనిపించాయా!
మనిషిని మెడ దగ్గర నోట కరుచుకుని వెళ్లడానికి నెత్తురు రుచి మరిగిన పులికి ఒక్క అంగ చాలు. పులికి రెండు మూడు అంగల దూరంలో మాత్రమే ఉంది ప్రమీల! మొదట పులే ఆమెను చూసింది. కొన్ని క్షణాలకు పులిని ఆమె చూసింది. పులిని చూడ్డం కాదు, పులి తననే చూస్తుండటం చూసింది. పైగా ప్రమీల ఉన్న చోటుకు పులి వచ్చేయలేదు. పులి ఉన్న చోటుకే ప్రమీల వెళ్లింది. అడవి అది. కాసేపట్లో చీకటి అడవి అవుతుంది. ఈమె వన్య సంరక్షకురాలు. ఆమె (ఆడపులి) అరణ్య సంచారి. ప్రమీల మనిషి కాకుండా పులి అయివున్నా, పులి.. పులి కాకుండా మనిషి అయివున్నా ఇద్దరూ తల్లీకూతుళ్లలా ఉండేవారు. ప్రమీల వయసు ఇరవై ఆరేళ్లు. పులి వయసు ఆరేళ్లు. ఆరేళ్లంటే మనుషుల్లో యాభై ఏళ్లు. అలా చూసినా ప్రమీల పులికి కూతురవుతుంది.
అప్పటికే పది మంది మనుషుల్ని చంపేసిన ఆ పులి.. ప్రమీలను చూసి కూడా చూడనట్లు వెళ్లిపోయింది! పది మందిని చంపేసిన పులి అదే అని ప్రమీలకు తెలియదు. తను చూసింది పులిని మాత్రమే అనుకుంది. అక్కడి నుంచి వచ్చేశాకే.. మనుషుల్ని చంపడానికి అలవాటు పడిన ‘టీ1’ పులి అదేనని తెలిసింది. పులుల జాడ కోసం అడవిలో కెమెరా ట్రాప్‌లను అమర్చే పనిలో ఉంది ప్రమీల ఆ రోజు. కెమెరాలెందుకు నేరుగానే కనిపిస్తున్నా కదా అన్నట్లు ఎదురొచ్చింది ఆ పులి! డ్యూటీ ముగించుకుని చీకటి పడే వేళకు తను ఉంటున్న అంజి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయ నివాసానికి చేరుకుంది ప్రమీల. అంజి రేంజ్ మహారాష్ట్రలోని యావత్మల్ పర్వత శ్రేణుల కిందికి వస్తుంది.
చీకటితో పాటే ఆ చుట్టుపక్కల ఇళ్ల తలుపులకు గడియలు పడుతున్నాయి. గాలొచ్చి తలుపు తట్టినా, ‘టీ1’ పులి వచ్చి తడుతున్నట్లే ఉలిక్కిపడుతున్నారు.
రాత్రి పూట పులి చూపు మనిషి చూపు కన్నా ఆరు రెట్లు చురుగ్గా ఉంటుంది. పగటి పూట అన్ని రెట్లు ఉండదు. అందుకేనా ప్రమీల తనకసలు కనిపించనే లేదన్నట్లు పులి వెళ్లిపోయింది! లేక, పూర్వ బంధంలా ఏదైనా అపూర్వ బంధంతో ‘ఈ తల్లీకూతుళ్ల’ను కలపాలని యాభై వేల చదరపు కి.మీ. విస్తీర్ణంలోని ఆ అటవీ ప్రాంతం తనకు తానుగా సంకల్పించుకుందా! అంజి రేంజ్‌లో రెండు వందల ఎకరాల అటవీ ఆవరణలో ప్రమీల డ్యూటీ. ఆ ఆవరణలోనే పులి తనను చూసింది. చూసి వదిలేసింది.
‘టీ1’ అనేది పులికి అధికారులు పెట్టిన పేరు. వన్యప్రాణి ప్రేమికులు పెట్టుకున్న పేరు ‘అవని’. అవని చంపిన మనుషుల సంఖ్య పదమూడుకు చేరాక.. ఓ రోజు హైదరాబాద్ నుంచి వెళ్లిన హంటర్.. అవనిని చంపేశాడు. అడవిలో ప్రమీల అవనిని చూసింది 2017 సెప్టెంబర్ లో. అవనిని హంటర్ చంపేసింది 2018 నవంబర్‌లో. చనిపోయే నాటికి అవనికి రెండు పిల్లలు ఉన్నాయి. తుపాకీ తూటాకు తల్లి నేలకొరుగుతున్న సమయంలో అవి తల్లి దగ్గర లేవు. ఉండి ఉంటే, తల్లి కోసం అవి ఏమైనా చేసి ఉండేవి. ఏమీ చేయలేకపోయినా హంటర్‌ని అవి గుర్తుపెట్టుకుని ఉండేవి. చెప్పలేం, ఆ హంటర్‌కి వాటి చేతుల్లో ఏనాటికైనా ఏమైనా రాసి పెట్టి ఉందేమో. పులులకు చూపు తీక్షణతే కాదు, జ్ఞాపకశక్తి కూడా ఎక్కువే.
అవని పిల్లల్లో ఒకటి ఆడ కూన. ఒకటి మగ కూన. తల్లి చనిపోవడంతో పది నెలల వయసులోనే అనా«థలయ్యాయి. ఆ కూనల జాడలు కనిపెట్టి వాటిని సంరక్షించే çపనిని మగ గార్డుల మీద పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్! ‘‘నేను కూడా వెళ్లి వెతుకుతాను సర్’’ అంది ప్రమీల. అధికారులు వెళ్లనివ్వలేదు. ‘‘పగటి పూట అడవిలోకి వెళ్లడం వేరు. రాత్రి పూట వెళ్లడం వేరు. ఎందుకమ్మాయ్ రిస్కు?’’ అన్నారు. అభర్ణ అనే మహిళా డిప్యూటీ కన్జర్వేటర్ బదిలీపై అక్కడికి వచ్చే వరకు కంప్యూటర్ ఆపరేటర్‌గానే ఉండి పోయింది ప్రమీల. ఆమె ‘ఎస్’ అనగానే.. దారితప్పి జనారణ్యంలోకి వచ్చి, మళ్లీ ఏ విధంగానో తనుండే అరణ్యంలోకి దారి కనుక్కున్న పులిలా నైట్ డ్యూటీలోకి దుమికింది ప్రమీల. అప్పటికే ఐదుగురు మగ గార్డులు కూనల కోసం గాలిస్తున్నారు. చివరికి ప్రమీల మాత్రమే వాటిని గుర్తించగలిగింది! అడవిలో మూల మూలలా ఎరలు వేసి, పంజా ముద్రలు పడే మెత్తలు (పబ్ ఇంప్రెషన్ ప్యాడ్స్) పరిచి, కిలో మీటర్ల కొద్దీ నడిచీ.. రేయింబవళ్లు శ్రమించిన ఏడాదిన్నరకు ప్రమీలకు మొదట.. ఆడకూన కనిపించింది! మిగతా మగ గార్డులకు కనిపించని ఆడకూన ప్రమీలకు కనిపించింది. తల్లి బిడ్డను ఒడిలోకి తీసుకున్నట్లుగా ఆ కూనను తన సంరక్షణలోకి తీసుకుంది ప్రమీల.
రెండున్నరేళ్ల వయసు వచ్చేవరకు పులి పిల్లలు తల్లితోనే ఉంటాయి. అప్పటికి ఆ కూన వయసు పద్దెనిమిది నెలలు. అవని పులికి ప్రమీల కూతురు అనుకుంటే, అవని పులి పిల్లలకు ప్రమీలను అక్క అనుకోవాలి. తనకు పుట్టబోయే బిడ్డల కోసమే ఆ రోజు ప్రమీలను ఏం చేయకుండా వదిలేసిందా.. అవని?! ఆడకూన కనిపించిన కొన్నాళ్లకే జూన్‌లో మగకూన కూడా కనిపించింది. అదీ ప్రమీలకే. అయితే ఇలా కనిపించి, అలా మాయమైంది. అసలైతే క్షేమంగానే ఉంది. అదీ సంతోషం. దాన్నిప్పుడు పట్టి, భద్రంగా చేతుల్లోకి తీసుకునే వెదకులాటలో ఉంది ప్రమీల. తల్లి లేని బిడ్డల్ని అక్కడికీ ఇక్కడికీ కాకుండా.. నేరుగా తల్లి లాంటి వాళ్ల చెంతకి చేర్చే శక్తి ఒకటి పనిచేస్తూ ఉంటుందేమో ప్రకృతి యంత్రాంగంలో! అవనిపులి పిల్లలకు అక్కలా దొరికిన ప్రమీలకు ఈ నెల 21న ‘అంతర్జాతీయ అడవుల దినోత్సవం’ రోజు రెండు ఐదొందల నోట్ల కట్టలను జాతీయ పులుల సంరక్షణ సంస్థ బహుమతిగా ఇవ్వబోతోంది.
అవని 2018 నవంబర్ 2 వేటగాడి తూటాకు బలైన ఆడపులి
Comments
Please login to add a commentAdd a comment