forest guard
-
లంచం ఇవ్వకుంటే పిస్టల్‌తో కాల్చేస్తా.. ఫారెస్డ్ గార్డ్ బెదిరింపులు
మైసూరు(బెంగళూరు): కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తూ సమాజంలో మంచి పేరుతో పాటు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంటే మరికొందరు లంచానికి ఆశపడుతున్నారు. తాజాగా లంచం కోసం ఓ ఫారెస్ట్ గార్డ్ హల్ చల్ చేయగా ఆ వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. అడిగినంత డబ్బు ఇవ్వక పోతే పిస్టల్‌తో కాల్చి వేస్తామని ఫారెస్డ్ గార్డు లారీ డ్రైవర్‌ను బెదిరించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కర్ణాటక–తమిళనాడు సరిహద్దులో పోలార్ వద్ద చెక్‌పోస్టు ఉంది. ఇక్కడ విధుల్లో ఉన్న ఫారెస్ట్ గార్డు అటుగా వచ్చిన లారీని నిలిపి సోదా చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేదంటే పిస్టల్‌తో కాల్చివేస్తామని లారీ డ్రైవర్‌ను డిమాండ్ చేశాడు. దృశ్యాలను సదరు లారీ డ్రైవర్ సెల్ఫోన్లో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. సదరు ఫారెస్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. చదవండి: వీడియో: తప్పతాగిన సెక్యూరిటీ గార్డు వీరంగం.. లేడీస్ హాస్టల్లో యువతిపై వికృత చేష్టలు! -
ప్రమీలక్క
పులి ముందుకు వెళ్లాలంటే వేటగాడికి తుపాకీ కావాలి. తుపాకీ లేకుండా వెళ్లాలంటే ధైర్యం కావాలి. ధైర్యం కూడా లేకుండా వెళ్లాలంటే ‘ప్రేమ’ కావాలి. పులిపై ప్రేమ! ప్రమీలకు ప్రేమ మాత్రమే కాదు, పులితో ఏదో బంధం కూడా ఉన్నట్లుంది. ‘అవని’ పులితో కూతురి బంధం, అవని కూనలతో అక్క బంధం. ప్రమీల ఫారెస్ట్ గార్డ్. ఆమెతో పాటు ఐదుగురు మగ గార్డులు ‘అవని’ పిల్లల్ని వెతికి, సంరక్షించేందుకు ఏడాదిన్నరగా అడవిని గాలిస్తున్నారు. చివరికి ప్రమీలకు మాత్రమే ఆ రెండు కూనలు కనిపించాయి! ‘మదర్లీ ఇన్స్టింక్ట్’ అంటారు. పిల్లల కోసం ‘అవని’ పులి గుండె ప్రమీలలో కొట్టుకుందా? ఆ చప్పుడును అవని పిల్లలు వినగలిగాయా! అందుకే ఆమెకు మాత్రమే కనిపించాయా! మనిషిని మెడ దగ్గర నోట కరుచుకుని వెళ్లడానికి నెత్తురు రుచి మరిగిన పులికి ఒక్క అంగ చాలు. పులికి రెండు మూడు అంగల దూరంలో మాత్రమే ఉంది ప్రమీల! మొదట పులే ఆమెను చూసింది. కొన్ని క్షణాలకు పులిని ఆమె చూసింది. పులిని చూడ్డం కాదు, పులి తననే చూస్తుండటం చూసింది. పైగా ప్రమీల ఉన్న చోటుకు పులి వచ్చేయలేదు. పులి ఉన్న చోటుకే ప్రమీల వెళ్లింది. అడవి అది. కాసేపట్లో చీకటి అడవి అవుతుంది. ఈమె వన్య సంరక్షకురాలు. ఆమె (ఆడపులి) అరణ్య సంచారి. ప్రమీల మనిషి కాకుండా పులి అయివున్నా, పులి.. పులి కాకుండా మనిషి అయివున్నా ఇద్దరూ తల్లీకూతుళ్లలా ఉండేవారు. ప్రమీల వయసు ఇరవై ఆరేళ్లు. పులి వయసు ఆరేళ్లు. ఆరేళ్లంటే మనుషుల్లో యాభై ఏళ్లు. అలా చూసినా ప్రమీల పులికి కూతురవుతుంది. అప్పటికే పది మంది మనుషుల్ని చంపేసిన ఆ పులి.. ప్రమీలను చూసి కూడా చూడనట్లు వెళ్లిపోయింది! పది మందిని చంపేసిన పులి అదే అని ప్రమీలకు తెలియదు. తను చూసింది పులిని మాత్రమే అనుకుంది. అక్కడి నుంచి వచ్చేశాకే.. మనుషుల్ని చంపడానికి అలవాటు పడిన ‘టీ1’ పులి అదేనని తెలిసింది. పులుల జాడ కోసం అడవిలో కెమెరా ట్రాప్లను అమర్చే పనిలో ఉంది ప్రమీల ఆ రోజు. కెమెరాలెందుకు నేరుగానే కనిపిస్తున్నా కదా అన్నట్లు ఎదురొచ్చింది ఆ పులి! డ్యూటీ ముగించుకుని చీకటి పడే వేళకు తను ఉంటున్న అంజి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయ నివాసానికి చేరుకుంది ప్రమీల. అంజి రేంజ్ మహారాష్ట్రలోని యావత్మల్ పర్వత శ్రేణుల కిందికి వస్తుంది. చీకటితో పాటే ఆ చుట్టుపక్కల ఇళ్ల తలుపులకు గడియలు పడుతున్నాయి. గాలొచ్చి తలుపు తట్టినా, ‘టీ1’ పులి వచ్చి తడుతున్నట్లే ఉలిక్కిపడుతున్నారు. రాత్రి పూట పులి చూపు మనిషి చూపు కన్నా ఆరు రెట్లు చురుగ్గా ఉంటుంది. పగటి పూట అన్ని రెట్లు ఉండదు. అందుకేనా ప్రమీల తనకసలు కనిపించనే లేదన్నట్లు పులి వెళ్లిపోయింది! లేక, పూర్వ బంధంలా ఏదైనా అపూర్వ బంధంతో ‘ఈ తల్లీకూతుళ్ల’ను కలపాలని యాభై వేల చదరపు కి.మీ. విస్తీర్ణంలోని ఆ అటవీ ప్రాంతం తనకు తానుగా సంకల్పించుకుందా! అంజి రేంజ్లో రెండు వందల ఎకరాల అటవీ ఆవరణలో ప్రమీల డ్యూటీ. ఆ ఆవరణలోనే పులి తనను చూసింది. చూసి వదిలేసింది. ‘టీ1’ అనేది పులికి అధికారులు పెట్టిన పేరు. వన్యప్రాణి ప్రేమికులు పెట్టుకున్న పేరు ‘అవని’. అవని చంపిన మనుషుల సంఖ్య పదమూడుకు చేరాక.. ఓ రోజు హైదరాబాద్ నుంచి వెళ్లిన హంటర్.. అవనిని చంపేశాడు. అడవిలో ప్రమీల అవనిని చూసింది 2017 సెప్టెంబర్ లో. అవనిని హంటర్ చంపేసింది 2018 నవంబర్‌లో. చనిపోయే నాటికి అవనికి రెండు పిల్లలు ఉన్నాయి. తుపాకీ తూటాకు తల్లి నేలకొరుగుతున్న సమయంలో అవి తల్లి దగ్గర లేవు. ఉండి ఉంటే, తల్లి కోసం అవి ఏమైనా చేసి ఉండేవి. ఏమీ చేయలేకపోయినా హంటర్ని అవి గుర్తుపెట్టుకుని ఉండేవి. చెప్పలేం, ఆ హంటర్‌కి వాటి చేతుల్లో ఏనాటికైనా ఏమైనా రాసి పెట్టి ఉందేమో. పులులకు చూపు తీక్షణతే కాదు, జ్ఞాపకశక్తి కూడా ఎక్కువే. అవని పిల్లల్లో ఒకటి ఆడ కూన. ఒకటి మగ కూన. తల్లి చనిపోవడంతో పది నెలల వయసులోనే అనా«థలయ్యాయి. ఆ కూనల జాడలు కనిపెట్టి వాటిని సంరక్షించే çపనిని మగ గార్డుల మీద పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్! ‘‘నేను కూడా వెళ్లి వెతుకుతాను సర్’’ అంది ప్రమీల. అధికారులు వెళ్లనివ్వలేదు. ‘‘పగటి పూట అడవిలోకి వెళ్లడం వేరు. రాత్రి పూట వెళ్లడం వేరు. ఎందుకమ్మాయ్ రిస్కు?’’ అన్నారు. అభర్ణ అనే మహిళా డిప్యూటీ కన్జర్వేటర్ బదిలీపై అక్కడికి వచ్చే వరకు కంప్యూటర్ ఆపరేటర్గానే ఉండి పోయింది ప్రమీల. ఆమె ‘ఎస్’ అనగానే.. దారితప్పి జనారణ్యంలోకి వచ్చి, మళ్లీ ఏ విధంగానో తనుండే అరణ్యంలోకి దారి కనుక్కున్న పులిలా నైట్ డ్యూటీలోకి దుమికింది ప్రమీల. అప్పటికే ఐదుగురు మగ గార్డులు కూనల కోసం గాలిస్తున్నారు. చివరికి ప్రమీల మాత్రమే వాటిని గుర్తించగలిగింది! అడవిలో మూల మూలలా ఎరలు వేసి, పంజా ముద్రలు పడే మెత్తలు (పబ్ ఇంప్రెషన్ ప్యాడ్స్) పరిచి, కిలో మీటర్ల కొద్దీ నడిచీ.. రేయింబవళ్లు శ్రమించిన ఏడాదిన్నరకు ప్రమీలకు మొదట.. ఆడకూన కనిపించింది! మిగతా మగ గార్డులకు కనిపించని ఆడకూన ప్రమీలకు కనిపించింది. తల్లి బిడ్డను ఒడిలోకి తీసుకున్నట్లుగా ఆ కూనను తన సంరక్షణలోకి తీసుకుంది ప్రమీల. రెండున్నరేళ్ల వయసు వచ్చేవరకు పులి పిల్లలు తల్లితోనే ఉంటాయి. అప్పటికి ఆ కూన వయసు పద్దెనిమిది నెలలు. అవని పులికి ప్రమీల కూతురు అనుకుంటే, అవని పులి పిల్లలకు ప్రమీలను అక్క అనుకోవాలి. తనకు పుట్టబోయే బిడ్డల కోసమే ఆ రోజు ప్రమీలను ఏం చేయకుండా వదిలేసిందా.. అవని?! ఆడకూన కనిపించిన కొన్నాళ్లకే జూన్‌లో మగకూన కూడా కనిపించింది. అదీ ప్రమీలకే. అయితే ఇలా కనిపించి, అలా మాయమైంది. అసలైతే క్షేమంగానే ఉంది. అదీ సంతోషం. దాన్నిప్పుడు పట్టి, భద్రంగా చేతుల్లోకి తీసుకునే వెదకులాటలో ఉంది ప్రమీల. తల్లి లేని బిడ్డల్ని అక్కడికీ ఇక్కడికీ కాకుండా.. నేరుగా తల్లి లాంటి వాళ్ల చెంతకి చేర్చే శక్తి ఒకటి పనిచేస్తూ ఉంటుందేమో ప్రకృతి యంత్రాంగంలో! అవనిపులి పిల్లలకు అక్కలా దొరికిన ప్రమీలకు ఈ నెల 21న ‘అంతర్జాతీయ అడవుల దినోత్సవం’ రోజు రెండు ఐదొందల నోట్ల కట్టలను జాతీయ పులుల సంరక్షణ సంస్థ బహుమతిగా ఇవ్వబోతోంది. అవని 2018 నవంబర్ 2 వేటగాడి తూటాకు బలైన ఆడపులి -
పక్షులకు రక్షకులు ఎడారిలో ఫారెస్ట్ గార్డు ఉద్యోగం
ఇద్దరమ్మాయిలు.. ఇద్దరూ పాతికేళ్ల వయసు వాళ్లే. వాళ్లు ఏదైనా ఘనత సాధించారేమో, ఆ గొప్ప పని గురించి ఇక్కడ రాశారేమో అనుకుంటే పొరపాటే. అయితే వాళ్లు ఏమీ సాధించలేదా అంటే... ఆ మాట అస్సలే అనలేరు. ఆ అమ్మాయిలిద్దరూ రాజస్థాన్ సుదాసారీ అడవుల్లో ఫారెస్ట్ గార్డు ఉద్యోగం చేస్తున్నారు! అడవంటే మనకు తెలిసినట్లు చీమలు దూరని చిట్టడవులు, కాకులు దూరని కారడవులు కావవి. ఎడారి అడవి. ఎక్కడో ఒకచోట తుప్పలు తప్ప పచ్చటి ఆకులు కూడా కనిపించవు. ఆ అడవుల్లో ఎండాకాలంలో యాభై డిగ్రీల ఉష్ణోగ్రతను ఎదుర్కొంటూ ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ల వయసు, కష్టాలు, ఉద్యోగాలే కాదు, వారి పేర్లు కూడా దగ్గరగా ఉన్నాయి. ఒకమ్మాయి పేరు పుష్పా శెకావతి, మరో అమ్మాయి పుస్తా పవార్. ఇద్దరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు. పుష్ప స్వస్థలం రాజస్థాన్‌లోని నగార్ జిల్లా కసుంబీ. ఆమె భర్త వీరేందర్ ప్రతాప్ శెకావత్ ఐదేళ్ల కిందట యాక్సిడెంట్లో మరణించాడు. కొంతకాలానికి ఫారెస్ట్ గార్డు ఉద్యోగం వచ్చింది. పిల్లాడిని దగ్గర ఉంచుకుని కోడలిని ఉద్యోగానికి పంపించారు అత్తగారు. రోజూ సొంతూరికి వెళ్లి వచ్చే పరిస్థితి లేదామెకు. అడవిలో ఉద్యోగం చేసుకుంటూ రెండు రోజులకోసారి ఇంటికి వెళ్లి కొడుకును చూసుకుంటోంది. పుస్తా పవార్‌ది పోఖ్రాన్. ఆమె పరిస్థితి కొద్దిగా వేరు. ఆమెకు భవిష్యత్తు మీద ఉన్నతమైన ఆలోచనలున్నాయి. వాటిని నిజం చేసుకోవాలంటే ఈ మాత్రం త్యాగం తప్పదనుకుంది. కుటుంబానికి దూరంగా అడవిలో ఉద్యోగం చేసుకుంటూ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతోంది. పుస్తా ప్రోత్సాహంతో పుష్ప కూడా పరీక్షలకు సిద్ధమైంది. వాళ్లిద్దరికీ అడవిలో పాలులేని టీతో రోజు మొదలవుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన చిన్న మట్టి ఇంటిలో నివాసం. వాటర్ ట్యాంకర్ తెచ్చిన నీటిని అడవిలో అక్కడక్కడా కట్టిన సిమెంట్ తొట్టెల్లో నింపడం, ఆ నీటిని బకెట్లతో మోసుకెళ్లి పక్షులకు అందుబాటులో ఉంచడం వారి రోజు వారీ పని. ‘నీటిని మోసుకుంటూ ఇంతింత దూరం నడవడం కష్టంగా అనిపించలేదా’ అని ఎవరైనా అడిగితే బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిన వాళ్లం. చేతిలో ఉన్న నీటిని పక్షులకు అందించడం కష్టమెలా అవుతుంది’ అంటారు. ‘ఈ ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తున్నాం’ అని కూడా అంటారు వాళ్లిద్దరూ. మంజీర కాపలా సరిహద్దు సుదాసారి డెజర్ట్ నేషనల్ పార్క్... రాజస్థాన్ పశ్చిమ ప్రాంతం. జై సల్మీర్‌కు అరవై కిలోమీటర్ల దూరాన దేశ సరిహద్దుకు దగ్గరగా ఉంది. సరిహద్దు దాటితే పాకిస్థాన్. ఈ అడవిలో అంతరించిపోతున్న పక్షి జాతులను సంరక్షిస్తున్నారు. గోదావాన్ పక్షిని సంరక్షించే బాధ్యత ఈ అమ్మాయిలకు అప్పగించారు. ఆ పక్షితోపాటు అడవిలోని పక్షి జాతులకు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి అపాయం కలగకుండా చూడడంతోపాటు సమీప గ్రామాల ప్రజల దాడుల నుంచి రక్షించడం కూడా వాళ్ల ఉద్యోగమే. పశువులకు మేత నెపంతో అడవిలోకి వచ్చిన వాళ్లు పక్షుల వేటకు పాల్పడుతుండడంతో ఈ అమ్మాయిలిద్దరూ గ్రామస్థుల మీద ఓ కన్నేసి ఉంచారు. దాంతో సమీప గ్రామస్థులు కూడా వీళ్లతో మానవసంబంధాలు పెంచుకోవడానికి ఇష్టపడడం లేదు. కనీసం వాళ్ల దగ్గర పాలు కొనుక్కోవాలన్నా కూడా సహకరించకుండా వీళ్లను బహిష్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ ఈ అమ్మాయిలు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. పక్షులను కాపాడుతున్నారు. -
‘రియల్ బాహుబలి’
హైదరాబాద్ : ఫొటోలోని వ్యక్తిని చూశారా?. అతని కంటే ఎక్కువ బరువుండే గున్న ఏనుగును ఎలా మోసుకెళ్తున్నారో. ఆయన పేరు పళనిచామీ శరత్‌కుమార్. తమిళనాడులో ఫారెస్ట్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. గత వారం ఓ ఏనుగు పిల్ల అడవిలో లోయలో పడిపోయింది. దీంతో దాని తల్లి అటవీ ప్రాంతంగా గుండా వెళ్లే రోడ్డు మార్గంపై అడ్డుగా నిల్చుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొందరు వ్యక్తులు ఏనుగును రోడ్డు మార్గం నుంచి తరిమేందుకు ప్రయత్నించగా.. గుంతలో పడి ఉన్న గున్న ఏనుగు కనిపించింది. దీంతో వారు ఫారెస్టు సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న శరత్.. ఏనుగు రక్షించేందుకు గుంతలోకి దిగారు. ఆయనకు కొందరు సాయం చేశారు. గున్న ఏనుగును భుజాలపై ఎత్తుకున్న శరత్.. దాన్ని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం తల్లి చెంతకు చేర్చారు. అతను ఏనుగు పిల్లని ఎత్తుకుని తీసుకెళుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శరత్‌కుమార్ ఫొటోను చూసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ‘రియల్ బాహుబలి’ అంటూ ట్వీట్ చేశారు. -
ఫారెస్టు గార్డును చంపేసిన ఎలుగుబంటి
ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో ఓ ఎలుగుబంటి ఫారెస్టు గార్డును చంపేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా రికార్డయింది. ఈ దారుణ ఘటన డిసెంబర్ 21వ తేదీన జరిగింది. దాన్ని ఎవరో ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. సూరజ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన ఆడ ఎలుగుబంటి.. ముందుగా ఓ స్థానికుడిని చంపేసింది. అటవీ సిబ్బంది దాన్ని అడవిలోకి తరిమేయాలని ప్రయత్నించారు. అయితే, ఆ బృందంలో ఉన్న ఓ ఫారెస్టు గార్డు మీద ఆ ఎలుగుబంటి దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన గార్డు మరణించాడు. ఆ తర్వాత ఎలుగుబంటిని అటవీశాఖ సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి మళ్లీ అడవిలోకి తరిమేశారు.