బాటిల్ నుంచి బ్యాటిల్ వరకు
‘ఆత్మహత్య తప్ప నాకు మరోదారి లేదు’ అనుకున్న అమ్మాయి ఇప్పుడు సాహసాల దారిలో ప్రయాణం చేస్తోంది. ‘ఇతరులతో పోల్చితే నేను జీరో. ఏమీ సాధించలేను’ అనుకున్న అమ్మాయి ఇప్పుడు హీరోగా ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది. ప్రభుత్వం ద్వారా ట్రాన్స్‌జెండర్ సర్టిఫికెట్ అందుకున్న తొలివ్యక్తిగా గుర్తింపు పొందిన విజయ వాసవే ఇప్పుడు మహారాష్ట్ర అటవీశాఖ ఫారెస్ట్ గార్డుగా నియమితురాలైన తొలి ట్రాన్స్‌జెండర్ మహిళగా చరిత్ర సృష్టించింది...
గత సంవత్సరం ఉద్యోగాల నోటిఫికేషన్‌ను చూసి దరఖాస్తు చేసింది విజయ. ఇలా దరఖాస్తు చేసిన ఏకైక ట్రాన్స్ ఉమన్ ఆమె. దరఖాస్తు మాట ఎలా ఉన్నా... ఆమె ప్రయాణంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి.
‘ఈ ఉద్యోగం నీలాంటి వాళ్ల కోసం కాదు’ అన్నట్లుగా ఉండేవి కొందరి మాటలు. అలాంటి మాటలు తనని పట్టుదలగా మరింత ముందుకు నడిపించాయి. సాంకేతిక అడ్డంకులను అధిగమించడానికి హైకోర్టు వరకు వెళ్లింది. ఉద్యోగాలు చేయడం విజయకు కొత్తేమీ కాదు... అయితే తాను దరఖాస్తు చేసిన ఉద్యోగానికి రాత, శారీరక పరీక్షలలో విజయం సాధించాలి. ఈ సవాలును అధిగమించడానికి జల్గావ్‌లోని దీప్‌స్తంభ్ ఫౌండేషన్ విజయకు సహాయపడింది. ఇద్దరు సీనియర్ ఫారెస్ట్ అధికారులు ఆమెకు తగిన సూచనలు ఇచ్చారు.
ఎన్నో సవాళ్లను అధిగమించి విజయం సొంతం చేసుకున్న విజయ ఇప్పుడు నందుర్బార్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉద్యోగ విధులు నిర్వహిస్తోంది. గిరిజన కుటుంబంలో పుట్టిన విజయ ఆశ్రమ పాఠశాలలో చదువుకునే రోజులలో ఎంతోమంది నుంచి తీవ్రమైన వెక్కిరింపులు, వేధింపులు ఎదుర్కొనేది. తోటి విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఎగతాళిగా మాట్లాడేవారు. మానసిక, శారీరక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తుండేవి.
నాసిక్‌లో కాలేజీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఒక సభకు హాజరైంది. ఆ సభలో బిందుమాధవ్ ఖిరే అనే ఉద్యమ కార్యకర్త ఉపన్యాసం తన జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది.
‘ఈ సభకు హాజరు కావడానికి ముందు నాలో ఎంతో ఆత్మన్యూనత ఉండేది. నేను ఏదీ సాధించలేను అనే అకారణ భయం ఉండేది’ అంటుంది విజయ గతాన్ని గుర్తుతెచ్చుకుంటూ.
‘బతుకంటే నిత్య పోరాటం’ అనే సత్యాన్ని తెలుసుకున్న విజయ ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత పుణెలోని కార్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ‘మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్’లో అడ్మిషన్ పొందింది.
నందుర్బార్ ప్రాంతంలో ‘ఈ అమ్మాయి మొదట అబ్బాయట’ అంటూ ఆశ్చర్యంగా ప్రజలు మాట్లాడుకోవడం మాట ఎలా ఉన్నా... విజయ స్ట్రగుల్ గురించి తెలుసుకున్న తరువాత ‘బేష్’ అంటున్నారు.
తన జీవితంలో ఎక్కువ భాగం పుణెలాంటి కాస్మోపాలిటన్ సిటీలో గడిపిన విజయకు అపరిచిత ప్రాంతంలో ఫారెస్ట్ గార్డ్‌గా విధులు నిర్వహించడం సవాలు కావచ్చు. అయితే ఆమెకు సవాలు కొత్త కాదు. వాటిని అధిగమించడం కూడా కొత్తకాదు. ఒకప్పుడు తనలాగా ఆత్మన్యూనతతో బాధపడుతున్న వారిలో, ఆశ కొడిగడుతున్న వారిలో సోషల్ మీడియా వేదికగా ధైర్యాన్ని ఇస్తోంది, ఉత్సాహాన్ని నింపుతుంది విజయ వాసవే.
బాల్యం అంటే బంగారు కాలం. అయితే నా బాల్యంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. చీకట్లో ఉంటే చీకటే కనిపిస్తుంది. వెలుగును చూడాలనే పట్టుదల ఉంటే చీకటి దూరం అవుతుంది. నేను సాధించింది చిన్న విజయమా, పెద్ద విజయమా అనేదాని కంటే ప్రతికూల పరిస్థితులను తట్టుకొని కూడా ముందుకువెళ్లవచ్చు అని నిరూపించిన విజయం. ఒకప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ బాటిల్ ఎప్పుడూ నాకు అందుబాటులో ఉండేలా చూసుకునేదాన్ని. అవమానాలు తట్టుకోలేనంత బాధ నాలో ఉన్నప్పుడు బాటిల్ మూత తీసి తాగాలని అనుకున్నాను. మూత తీసే సందర్భాలు ఎన్నో వచ్చినా నాకు నేను ధైర్యం చెప్పుకునేదాన్ని. చివరికి నాకు బాటిల్‌తో పనిలేకుండాపోయింది. ఇప్పుడు బ్యాటిల్‌పై మాత్రమే నా దృష్టి. – విజయ వాసవే ట్రాన్స్‌జెండర్
Comments
Please login to add a commentAdd a comment