హ్వా మ్యులన్ పాత్రధారి లీ యూఫీ
ఇంటికొకరు సైన్యంలో చేరాలని చైనా చక్రవర్తి ప్రకటించాడు. ఒక ఇంట్లో జబ్బున పడి ఉన్న తండ్రి తరఫున ఆయన కూతురు మారువేషం వేసుకుని సైన్యంలో చేరింది! శత్రు సైన్యాలతో పోరాడి చైనాసైన్యం సత్తాను చాటింది. ఆమె పేరు హ్వా మ్యులన్. చైనా జానపద కథ ఇది. డిస్నీ వాళ్లు ఇరవై రెండేళ్ల క్రితమే ముల్యన్ పాత్రతో ఓ యానిమేషన్ సినిమా తీశారు. ఇప్పుడు ఆ పాత్ర పేరుతోనే ‘మ్యులన్’ అనే హాలీవుడ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్ధంగా అయితే ఉంది కానీ, చైనాలో విడుదలే డౌట్‌గా ఉంది. ఒకవేళ విడుదలైనా సుమారు 15 వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా అంత పెద్ద మొత్తాన్ని వసూలు చేయగలదా అని నిర్మాతలు సంశయంలో పడ్డారు. కరోనా వైరస్ కారణంగా ‘మ్యులన్’ చిత్రానికి ఎదురైన అవరోధం ఇది. మార్చి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా చైనాలో 70 వేలకు పైగా థియేటర్‌లు ఇప్పటికే మూత పడ్డాయి. వైరస్ తగ్గుముఖం పట్టి పరిస్థితులు పూర్తిగా మెరుగైతే మార్చి 27 లోపు థియేటర్‌లన్నిటినీ తెరిచేందుకు అనుమతిస్తాం అని చైనా అంటోంది. అనుమతించినప్పటికీ ఎంతమంది ప్రేక్షకులు ధైర్యం చేసి థియేటర్‌లకు వస్తారన్న ఆందోళనలో నిర్మాతలు ఉన్నారు. ఆ రోజుకీ కరోనా ప్రభావం తగ్గకుండా ఉంటే ఈ చిత్రానికి చైనాలో భారీ నష్టం సంభవించవచ్చు. ఇందులో ఎవరైనా చేయగలిగిందేమీ లేదు. కరోనాపై పోరాడేందుకు మ్యులన్ లాంటి శక్తిమంతమైన యోధురాలైన ఔషధాన్ని ఎవరైనా సృష్టించాలి.
Comments
Please login to add a commentAdd a comment