
తల్లి సుజాతతో క్రి కెటర్ అజింక్యా రహానే
‘టెక్నికల్లీ సౌండ్’ అనే మాట ఆటల్లో వినిపిస్తుంటుంది. ఎక్కువగా క్రికెట్‌లో. ఒడుపు తెలిసిన ఆటగాళ్లను అంటారు టెక్నికల్లీ సౌండ్ అని. ‘సౌండ్ పార్టీ’ అని ఇంకో మాట ఉంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వ్యక్తిని అంటుంటారు. అజింక్యా రహానే ఇప్పుడు టెక్నికల్‌గా, ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉన్నాడు. ముంబై కుర్రాడు. తొమ్మిదేళ్ల క్రితం క్రికెట్‌లోకి వచ్చాడు. 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. క్రికెట్ అంటే ప్రాణం. కష్టపడి పైకొచ్చాడు. కష్టపడి పైకొచ్చిన ఇలాంటి కుర్రాళ్లంతా, ఇంట్లో వాళ్లనూ కష్టపెట్టే ఉంటారు! ‘ఇన్‌స్పిరేషన్’ అని ఇండియా టుడే టీవీలో ఒక స్పోర్ట్స్ ప్రోగ్రామ్ వస్తుంటుంది. ఆ ప్రోగ్రామ్‌లో రహానే చెప్పిన విషయాలు వింటే, వెంటనే ముంబై వెళ్లి అతడి తల్లిదండ్రులను కలిసి కాసేపు మాట్లాడి వస్తే బాగుండనిపిస్తుంది.
పేదరికంలో ఉన్న పిల్లలు బాగా అభివృద్ధిలోకి వచ్చి నలుగురికీ తెలిశారంటే.. వాళ్ల వెనుక వాళ్ల అమ్మానాన్న చేసిన త్యాగాలు కచ్చితంగా ఉంటాయి. ముంబై దగ్గరి డోంబివ్లీలో ఉండేది రహానే కుటుంబం. తండ్రి మధుకర్ బాబూరావ్ రహానే. తల్లి సుజాత. తమ్ముడు శశాంక్, చెల్లి అపూర్వ. ‘‘నాకు బాగా గుర్తు. అప్పుడు నాకు ఏడేళ్లు. ఒక చేత్తో నా కిట్ బ్యాగుని, ఇంకో చేత్తో తమ్ముణ్ని మోస్తూ అమ్మ ఏడెనిమిది కి.మీ నడిచి నన్ను డోంబివ్లీలోనే కోచింగ్ సెంటర్‌కి తీసుకెళ్లేది. రిక్షాలో వెళ్లడానికి మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. తిరిగి వచ్చేటప్పుడూ అంతే. నేను నడవలేకపోయేవాడిని. ‘‘మనం ఎందుకు రిక్షాలో వెళ్లలేం అమ్మా’’ అని మూలుగుతూ అడిగేవాడిని. అమ్మ దగ్గర సమాధానం ఉండేది కాదు. వారానికి ఒక రోజు మాత్రం రిక్షాలో వెళ్లొచ్చేవాళ్లం’’ అని టీవీ ప్రోగ్రామ్‌లో చెప్పాడు రహానే. వాళ్ల నాన్న కూడా తక్కువ శ్రమేమీ పడలేదు.
ఆ ఏడేళ్ల వయసులోనే రహానే కోచింగ్ సెంటర్ మారవలసి వచ్చింది. దోంబివ్లీ నుంచి సిఎస్‌టికి. అంటే ఛత్రపతి శివాజీ టెర్మినస్. ఇక్కడ ట్రైన్ ఎక్కి అక్కడ దిగాలి. ప్రాక్టీస్ అయ్యాక అక్కడ ట్రైన్ ఎక్కి, ఇక్కడ దిగాలి. అమ్మకు బదులుగా నాన్న రావడం మొదలు పెట్టాడు. అయితే రైలు ప్రయాణం అలవాటు అవడానికి ఒక రోజు వస్తాను. రెండో రోజు నుంచి నువ్వే వెళ్లి వస్తుండాలి అని చెప్పాడు. ఒక రోజు అయింది. గంటన్నర ప్రయాణం. వెళ్లడానికి గంటన్నర, రావడానికి గంటన్నర. రెండో రోజు రహానే ఒక్కణ్ణే ట్రైన్ ఎక్కించి తను ఆగిపోయాడు. ‘‘నాన్న ఆగిపోయారనే అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది. వెనక బోగీలో ఎక్కి నాన్నగారు నన్ను ఫాలో అయ్యేవారని!’’ అని కళ్లు చెమ్మగిల్లుతుండగా చెప్పాడు రహానే. ‘‘నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది మా అమ్మానాన్న వల్లనే. కోచింగ్ తీసుకుంటున్నప్పుడు, తర్వాత టీమ్‌లోకి వచ్చినప్పుడూ.. ఎప్పుడూ కూడా వాళ్లు గెలుపు ఓటముల కళ్లతో నన్ను చూడలేదు. నన్ను మాత్రమే చూశారు. వాళ్ల కొడుకుగా’’ అన్నాడు రహానే.
Comments
Please login to add a commentAdd a comment