కారు తాళాలు మరచిపోవడం మతిమరుపు... మరి కారు డ్రైవింగే మరచిపోతే? అగ్గిపెట్టె ఎక్కడ పెట్టామో మరవచ్చు... అగ్గి బుగ్గి చేస్తుందన్న అంశమే మరిస్తే? పుస్తకం తెరవగానే అక్షరాలు రాలిపోయినట్టుగా మెదడులోని జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోతే? మతిమరుపు సహజం. కానీ అసలు మరచిపోయామన్న సంగతిని సైతం మరుపుకొచ్చేలా చేస్తే... అది అల్జైమర్స్! ఆ అల్జైమర్స్ పై ఎన్నో అపోహలూ సందేహాలు.. ఆ అపోహల వెనక అసలు నిజాలేమిటో నిగ్గుదేల్చి అల్జైమర్స్ పై అవగాహన కల్పించే వాస్తవాలివి...
ప్రముఖ క్రిమినల్ లాయర్ ఒకరు చాలా చరిత్రాత్మక తీర్పులతో సహా న్యాయరంగానికి చెందిన అనేక పరిణామాలను పొల్లుపోకుండా చెప్పగలరు. అలాంటి వ్యక్తి ఇటీవల చిన్న చిన్న సంఘటనలు కూడా మరచిపోతున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో 75వ పుట్టిన రోజున బంధుమిత్రుల సమక్షంలో బర్త్‌డే కేక్ కట్ చేసి, స్వయంగా ముక్కలు పంచిన వ్యక్తి.. డిన్నర్ చేస్తూ మన ఇంటికి ఇంతమంది గెస్ట్‌లు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లడానికి బదులు లాయర్ కోటుతో సహా గుడికి వెళ్లడం, తన చిరకాల సహచరుడైన న్యాయవాదిని గుర్తించలేకపోవడం వంటి అంశాలు కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. నడిచే న్యాయశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా పేరుబడ్డ ఆయన మతిమరుపునకు కారణం అల్జైమర్స్ వ్యాధి అన్నారు వైద్యులు. కుటుంబ సభ్యులకు కొన్ని సూచనలు కూడా చేశారు.
అల్జైమర్స్ మెదడులో కణాలు చనిపోతుడటం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనాసామర్థ్యం దెబ్బతింటాయి. ఇటీవలి సంఘటనలు, విషయాలను మరచిపోవడంతో మొదలై, క్రమంగా పెరిగి చివరకు తానెవరో కూడా తనకు తెలియనంతగా ఈ మతిమరుపు విస్తరిస్తుంది. అల్జైమర్స్ నిర్ధారణ అయ్యిందనగానే పేషెంట్ల కుటుంబ సభ్యులు వారి సన్నిహితులు అల్జైమర్స్, ఆ వ్యాధి లక్షణాలు, రోజువారీ జీవితంపై వాటి ప్రభావం గూర్చి చాలా అపోహలు, అనుమానాలతో అనేక ప్రశ్నలను అడుగుతుంటారు. వైద్యనిపుణుల అనుభవం, ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు నిర్ధారణ చేసిన నిజాలు తెలుసుకోవడం ద్వారా అల్జైమర్స్ వ్యాధిని సరిగా అర్థం చేసుకునేందుకు వీలుంటుంది. తమ కుటుంబ సభ్యులు, ఆప్తులు ఆ వ్యాధి బారిన పడుతున్న తరుణంలో ప్రాథమికదశలోనే దాన్ని గుర్తించి దానిని ఎదుర్కోవడానికి, అందుబాటులో ఉన్న వైద్య చికిత్స నుంచి పూర్తి ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంది. అల్జైమర్స్ పై అనేక అపోహలున్నాయి. వాటిలో ప్రధానమైనవి కొన్ని...
అపోహ : అల్జైమర్స్ వృద్ధుల్లోనే కనిపిస్తుంది.
వాస్తవం : కొంత వరకు నిజమే. అల్జైమర్స్ కు... వయసు పైబడటానికి నేరుగా సంబంధం ఉంది. 65 ఏళ్లు దాటిన ప్రతి 9 మందిలో ఒకరు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. అంతమాత్రాన ఇది కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితమైనది అనుకోవడానికి లేదు. కొన్ని సందర్భాల్లో 40–50 ఏళ్ల వ్యక్తుల్లోనూ అల్జైమర్స్ కనిపిస్తోంది. అయితే ఈ మధ్యవయస్కుల్లో కనిపించే అల్జైమర్స్ లక్షణాలను కొంతమంది డాక్టర్లు మధ్యవయసు తాలూకు మతిమరుపుగానో లేక ఒత్తిడి, మానసిక కుంగుబాటు, మహిళల్లో అయితే మెనోపాజ్ లక్షణాలుగా భావించి తేలిగ్గా తీసుకుంటారు. దాంతో వ్యాధి ముదిరి పరిస్థితి మరింత దిగజారుతుంది.
అపోహ : అల్జైమర్స్ వ్యాధి కాదు. ఇది వృద్ధాప్యంలో వ్యక్తుల్లో కనిపించే సహజ లక్షణమే.
వాస్తవం: వయసు పైబడిన దశలో జ్ఞాపకశక్తి కొంత మందగించడం సహజమే. కానీ అల్జైమర్స్ లక్షణాలైన రోజువారీ జీవితాన్ని గందరగోళపరచగల మతిమరుపు, దిక్కు తోచని స్థితిలో చిక్కుకోవడం వంటివి వృద్ధాప్యం వల్లనే వచ్చేవి కావు. తాళం చేతులు ఎక్కడో పెట్టి మరచిపోవడం సాధారణ మతిమరుపు లక్షణమే. దశాబ్దాలుగా తిరుగుతున్న వీధుల్లో దారితప్పిపోవడం వృద్ధాప్యపు మతిమరుపు కాదు. ఈ రకమైన జ్ఞాపకశక్తి క్షీణత ప్రమాదకరం. వృద్ధాప్యం వల్ల వచ్చే కొద్దిపాటి మతిమరుపునకూ, అల్జైమర్స్ కూ చాలా తేడా ఉంటుంది. ఇది మెదడులో జరిగే మార్పులు, మెదడును దెబ్బతీసే పరిణామాల కారణంగా వస్తుంది. వ్యాధి ముదిరిన కొద్దీ ఆలోచించడం, తినడం, మాట్లాడటం వంటి సామర్థ్యాలను కోల్పోతారు. వయసు పైబడిన కొందరిలో వస్తున్న వ్యాధి అల్జైమర్స్.
అపోహ : జ్ఞాపకశక్తి క్షీణించడం అంటే అల్జైమర్స్ వ్యాధి వచ్చినట్టే.
వాస్తవం : ఇది నిజం కాదు. అనేక కారణాల వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి అవకాశం ఉంది. వయసు పైబడటం కావచ్చు, పోషకాహార లోపం కావచ్చు. విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవడం వల్ల మతిమరుపు పెరగవచ్చు. కానీ జ్ఞాపకశక్తి క్షీణించడం అనే పరిణామం ఒక వ్యక్తి రోజువారీ జీవితంలోని వ్యక్తిగత పనులను అస్తవ్యస్తం చేసే విధంగా, ఆలోచనశక్తిని దెబ్బతీసే విధంగా, ఇతరులతో సంభాషించడానికి వీలులేని విధంగా ఉన్న పక్షంలో మాత్రం దానిని తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. అప్పుడు డాక్టర్‌ను సంప్రదించి అల్జైమర్స్ ఉన్నదీ, లేనిది నిర్ధారణ చేసుకోవాలి.
అపోహ : అల్జైమర్స్ వస్తే... ఆ వ్యక్తి జీవితం ముగింపునకు వచ్చినట్లేనా!
వాస్తవం : ఇది ఎంతమాత్రమూ వాస్తవం కాదు. అల్జైమర్స్ వచ్చాక కూడా చాలా ఏళ్ల పాటు అర్థవంతమైన జీవితం గడపవచ్చు. మెదడును, గుండెను ఆరోగ్యంగా ఉంచగల ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, చురుకైన సామాజిక సంబంధాలను కొనసాగిస్తూ, మెదడుకు పనిపెట్టే వ్యాపకాలను కొనసాగించడం ద్వారా అల్జైమర్స్ను అదుపులో ఉంచవచ్చు. ప్రారంభంలోని గుర్తిస్తే వ్యాధి లక్షణాలను అదుపు చేయగల చికిత్స, మంచి ఫలితాలను ఇవ్వగల మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అందుకే అల్జైమర్స్ ను తొలిదశలోనే గుర్తించడం చాలా ముఖ్యం.
అపోహ : తల్లిదండ్రుల్లో ఎవరికైనా అల్జైమర్స్ వ్యాధి వచ్చిందంటే ఆ తర్వాతి కాలంలో పిల్లలూ ఈ వ్యాధి బారిన పడతారు.
వాస్తవం : ఇది కొంతవరకే వాస్తవం. మొత్తం వ్యాధిగ్రస్తుల్లో కేవలం 5 శాతం మందికే వంశపారంపర్యంగా అల్జైమర్స్ సోకిన కేసులను కనుగొన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. ఒక వ్యక్తి తల్లిదండ్రుల్లో, తోబుట్టువుల్లో ఎవరికైనా అల్జైమర్స్ వచ్చి ఉంటే ఆ వ్యక్తికి వచ్చే అవకాశాలు కాస్తంత ఎక్కువ. వ్యక్తి తల్లిదండ్రుల్లో ఎవరికైనా వృద్ధాప్యానికి ముందే అల్జైమర్స్ వచ్చి ఉంటే ఆ వ్యక్తి కూడా వృద్ధాప్యానికి ముందే అల్జైమర్స్ బారిన పడే అవకాశం ఉంది.
అపోహ : సులభమైన వ్యాయామాలు... టంగ్ ఎక్సర్‌సైజ్, బ్రెయిన్ యాక్టివేటింగ్ ఎక్సర్‌సైజ్ ద్వారా అల్జైమర్స్ ను నివారించవచ్చు.
వాస్తవం : అల్జైమర్స్ వ్యాధికి సంబంధించి చైతన్యం పెరుగుతుండటం వల్ల, మునుపటి తరాలతో పోలిస్తే ఎక్కువ మందికి ఈ వ్యాధి వస్తుండటం, అదే సమయంలో ఆధునిక వైద్యంలో దానికి నిర్దిష్టమైన చికిత్స అంటూ ఏదీ అందుబాటులోకి రాకపోవడంతో టంగ్ ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా అల్జైమర్స్ రాకుండా జాగ్రత్తపడవచ్చనీ, అంతేగాక ఒకవేళ వచ్చినా వ్యాధి ముదరకుండా అదుపు చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. వ్యక్తి ఉదయం లేవగానే అద్దం ముందు నిలబడి నాలుకను నోటి నుంచి బయటకు పెట్టి, కుడివైపుకు, ఎడమవైపునకు వేగంగా అటు ఇటు కుదుపుతుండాలి. ఇలా రోజుకు పదిసార్లు చేయడం వల్ల మెదడులోని ప్రధాన భాగాలు ప్రేరేపితం అయి అల్జైమర్స్ రాకుండా ఉంటుందన్నది ప్రచారం. ఇక బ్రెయిన్ యాక్టివేటింగ్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా కుడి చెవిని ఎడమచేతితో, ఎడమచెవిని కుడిచేతితో పట్టుకొని గుంజీళ్లు తీయడం అన్నది ప్రధానమైంది. దీవల్ల అల్జైమర్స్ వ్యాధి దూరంగా ఉండటంతో పాటు వ్యక్తి మేధస్సు మెరుగుపడుతుందని చెబుతున్నారు. మన దేశంలో చాలా మంది ప్రార్థనలో భాగంగా చేసే ఈ గుంజిళ్లను నేర్పడానికి అమెరికాతో సహా కొన్ని పశ్చిమ దేశాలలో శిక్షణ సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి. అయితే ఇలాంటి వ్యాయామాలతో అల్జైమర్స్ వ్యాధిని నిరోధించగలమనే అంశం నిరూపితం కాలేదు.
అపోహ : అల్జైమర్స్ వ్యాధిగ్రస్తులు ఆవేశంగా, దూకుడుగా వ్యవహరిస్తుంటారు.
వాస్తవం : అల్జైమర్స్ ఉన్న కొందరు దూకుడుగా, ఆవేశపూరితంగా మారడం నిజమే. కానీ అందరూ ఒకేలా ప్రభావితం కారు. వ్యాధి వల్ల తికమకపడుతుండటం, భయానికి లోనుకావడం, ఆశాభంగం చెందడం వంటి కారణాలతో కొందరు దూకుడుగా వ్యవహరించవచ్చు. వారు అలా మారడానికి కారణాలను అర్థం చేసుకొని పరిసరాలను వారికి అనువుగా మార్చడం, ఆ విషయాలు వారికి అర్థమయ్యేలా వివరించి వారిని శాంత పరచవచ్చు. ఆ ప్రవర్తనను మితిమీరకుండా అదుపు చేయవచ్చు.
అపోహ : చికిత్సతో అల్జైమర్స్ తగ్గిపోతుంది.
వాస్తవం : వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించినప్పుడు మందులు, కుటుంబ సభ్యుల సేవలు, సహకారం వల్ల వ్యాధి లక్షణాలు పెరగకుండా, జీవననాణ్యత తగ్గకుండా చూడవచ్చు. ఈ వ్యాధికి సంబంధించి ప్రస్తుతం రెండు రకాల మందులు వచ్చాయి. కోలినెట్రేస్ ఇన్హిబిటర్స్, మెమంటైన్ అనే ఈ రెండు జనరిక్ మందులకు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం లభించింది. జ్ఞాపకశక్తి క్షీణించడం, తికమకపడటం, హేతుబద్ధంగా ఆలోచించలేకపోవడం వంటి లక్షణాలలో కొన్నింటిని అదుపు చేసేందుకు వీటిని సిఫార్సు చేస్తున్నారు. ఇంతకుమించి అల్జైమర్స్ తగ్గించే చికిత్సలేమీ అందుబాటులో లేవు. కొత్త చికిత్స ప్రక్రియల కోసం, మందుల కోసం విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
అపోహ : తలకు బలమైన గాయం తగిలితే అది అల్జైమర్స్ కు దారితీస్తుంది.
వాస్తవం : తలకు గాయం అయితే... కొన్నేళ్ల తర్వాత మతిమరుపు, అల్జైమర్స్ కు దారితీసే అవకాశం ఉందని గతంలో కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే తలకు తీవ్రగాయం అయిన ప్రతివ్యక్తికీ అల్జైమర్స్ రాదు. తలకు అదేపనిగా దెబ్బతగలడం వల్ల (ఫుట్‌బాల్, హాకీ, బాక్సింగ్ వంటి క్రీడల్లోలా) కొంతకాలానికి వ్యక్తికి తీవ్రమైన జ్ఞాపకశక్తి సమస్యలు (క్రానిక ట్రామాటిక్ ఎన్‌కెఫలోపతి) వంటి వ్యాధులకు మాత్రమే గురికావచ్చని స్పష్టం చేశాయి.
క్రమం తప్పకుండా చేసే శారీరక వ్యాయామం (గుంజిళ్ల వంటి వాటితో సహా), సమతుల ఆహారం, ఒంటి బరువును అదుపులో ఉంచుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటివి అల్జైమర్స్ను నివారించడానికి తోడ్పడతాయి. ఇవి అల్జైమర్స్ మాత్రమే కాకుండా గుండెజబ్బులు, డయాబెటిస్‌తో పాటు అనేక వ్యాధులు రాకుండా సహాయం చేస్తాయి. చురుకైన సామాజిక సంబంధాల వల్ల మెదడులోని నాడీకణాల మధ్య సంబంధాలు బలపడతాయి. వ్యక్తి ఆలోచన శక్తి దెబ్బతినకుండా ఉండటానికి ఇది తోడ్పడుతుంది.
డాక్టర్ ఆర్.ఎన్.కోమల్ కుమార్
సీనియర్ న్యూరో ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment