
డ్రైవర్ విష్ణు
కొందరు డ్యూటీ కోసం డ్యూటీ చేస్తారు.కొందరు ప్రాణం పెట్టి డ్యూటీ చేస్తారు.ప్రాణం ప్రధానమాడ్యూటీ ప్రధానమా అనడిగితేడ్యూటీ ప్రధానం అనేవారు ధన్యులు.విష్ణు అలాంటి ధన్యుడు.అందుకే అతడు జ్ఞాపకాలలో జీవించి ఉన్నాడు. సజీవంగా ఉన్నాడు.
తండ్రి, కొడుకు ఒక ఏ.టి.ఎం ఎదుట ఉన్నారు.అప్పుడే ఒక ఆర్టీసి బస్సు వేగంగా పోయింది.‘రేయ్... ఎవడ్రా వీడు.. ఇలా నడుపుతున్నాడు. మనిషి ప్రాణం విలువ తెలియదులా ఉంది వీడికి’ అన్నాడు తండ్రి ఆ వెళ్లిన ఆర్టీసి బస్సు వైపు చూస్తూ.ఒక క్షణం ఆయనకు బాగా కోపం వచ్చింది. అంతలోనే సంభాళించుకుంటూ కొడుకుతో ‘స్వీటూ హాటూ తెస్తే సరిపోతది కదరా? లేకుంటే అక్కా వాళ్లను పిలిచి చిన్న ఫంక్షన్‌లాగా చేద్దామా?’ అన్నాడు.‘నీ ఇష్టం నాన్నా.. నువ్వెట్ల అంటే అట్లా’ అన్నాడు కొడుకు. ‘సరేలే.. ఇంకా రెండు రోజులు టైమ్ ఉంది కదా.. చూద్దాం. ఈ ఏటిఎంలో డబ్బు లేదు. నేను వెతికి తెస్తా నువ్వెళ్లు’ అని కొడుకును పంపించేశాడు.ఆ రోజు తేది జనవరి 28. సంవత్సరం 2017. అప్పటికే వెయ్యి, ఐదువందల నోట్లు రద్దయి రెండున్ననెలలు అయిపోయింది. ఏటీఎమ్‌లలో డబ్బులు లేవు. తండ్రి ఆ రోజు చాలా ఏటీఎమ్‌లు తిరిగి ఓ పదివేలు తెచ్చి కొడుక్కి ఇచ్చాడు.
‘ఒక వేళ ఫంక్షన్ అనుకుంటే కొన్నయినా డబ్బులుండాలి కదా సామాన్లు తేవడానికి. ఇవి నీ దగ్గర పెట్టుకో’ అన్నాడు.ఆయన పేరు కె.విష్ణు. ఆర్‌టీసీలో డ్రైవర్. నల్గొండ జిల్లా, చండూరులో ఉద్యోగం. కొడుకు పేరు వెంకట్. పైన ఏర్పాట్లన్నీ విష్ణు రిటైర్‌మెంట్ కోసం. ఇంకో రెండు రోజుల్లో అంటే జనవరి 31న రిటైర్‌మెంట్. విష్ణుతోపాటు ఇంకో ఇద్దరు కలీగ్స్ కూడా ఆ రోజే రిటైరవబోతున్నారు. ఆ ఇద్దరితో కలిసి సింపుల్ పార్టీ చేసుకోవాలా లేక సొంతగా ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు విష్ణు. చివరకు ఫంక్షన్‌కే ఫిక్స్ అయ్యాడు. పెళ్లి చేసి పంపిన ఇద్దరు ఆడపిల్లలను పిలిచి ముచ్చటగా ఈ ఫంక్షన్ చేసుకోవాలని కోరింది ఆయన మనసు. అందుకే ఇబ్బంది పడకుండా ముందస్తుగా పదివేలు తెచ్చి కొడుకు చేతిలో పెట్టాడు. ఉదయం ఐదు గంటలకు డ్యూటీ ఉంది. అంటే ఆ రాత్రే వెళ్లి డిపోలో పడుకోవాలి. డిన్నర్ ముగించుకొని డ్యూటీకి వెళుతుంటే కొడుకు అన్నాడు–‘రెండ్రోజుల్లో రిటైర్‌మెంట్ పెట్టుకుని ఇంకా డ్యూటీ ఏంటి నాన్నా’...తండ్రి నవ్వాడు.‘రేయ్.. మీ నాన్న దేన్నయినా కాదనగలడుగానీ డ్యూటీని కాదనలేడురా’...‘అది కాదు నాన్నా’...‘ఇది లాస్ట్ డ్యూటీ. కాదనకు’... వెళ్లిపోయాడు.జనవరి 29. తెల్లవారుజాము.
ఫోన్ వచ్చింది వెంకట్‌కు.‘మీ నాన్న ఇప్పుడే డ్యూటీ ఎక్కాడు. కళ్లు తిరుగుతున్నాయి.. చక్కరొస్తుందని అంటున్నాడు. ఏవో టాబ్లెట్లున్నాయట కదా. తీసుకొని రా తొందరగా’ అని హడావిడిగా అన్నాడు కండక్టర్. వెంకట్ ఆగమేఘాల మీద బయలుదేరాడు కండక్టర్ చెప్పిన చోటికి. ఈ ఫోన్ రావడానికి కొద్దిసేపటి ముందు డిపో ఉంచి బస్సు తీశాడు విష్ణు. పదిమంది ప్యాసెంజర్లను ఎక్కించుకుని బస్‌ను బయల్దేరదీశాడు. కొంతదూరం వెళ్లింది బస్సు. సడన్‌గా ఏదో తేడా. తల తిప్పినట్టవడం.. గుండెలో నొప్పి మొదలయ్యాయి విష్ణుకి. అనీజీనెస్. అలాగే ఇంకొంత దూరం నడిపాడు. కాని వల్ల కాలేదు. బ్రేక్ మీద, ఎక్సలరేటర్ మీద కాళ్లు ఆనడం లేదు. తేలిపోతున్నాయి. బస్ కంట్రోల్ తప్పితే అందులో ఉన్న పదిమంది ప్రాణాలకూ ముప్పు. గుండెలో బాధ మెలిపెడుతున్నా మెదడు చురుగ్గా పనిచేస్తోంది. అప్పటికే టికెట్లు కొట్టేశాడు కండెక్టర్. తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులు చల్లగాలికి కునుకులోకి జారుకుంటున్నారు. కాని కండక్టర్ గమనించాడు. వెంటనే బ్యానెట్ దగ్గరకు వచ్చి.. ‘అన్నా.. ఏమైంది?’ అన్నాడు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమేమో అనుకొని. ఆపాటికే విష్ణుకు చమటలు పట్టేశాయి. సమాధానం చెప్పే స్థితిలో లేడు. రోడ్డు చుట్టుపక్కల చూస్తున్నాడు. బస్సు అటూ ఇటూ ఊగుతోంది. డ్రైవర్‌కు ప్రాణాల మీదకు వచ్చినట్టు కండక్టర్‌కు అర్థమైంది.
‘అన్నా.. నువ్వు జాగ్రత్త’ అన్నాడు వణుకుతూ.‘నా ప్రాణం కాదు.. పాసింజర్స్ ప్రాణాలు ముఖ్యం’ అతి కష్టం మీద అన్నాడు.బస్సు ఇంకా కంట్రోలు తప్పే స్థితికి వచ్చింది. కాని విష్ణు స్టీరింగ్ వదల్లేదు. ఓ చెట్టు కనపడింది. కాస్త రోడ్డు దిగి ఆ చెట్టును సపోర్ట్ చేసుకుంటూ ఆపేసి స్టీరింగ్ మీద తల వాల్చేశాడు. వెంకట్ వచ్చే సరికి అదీ దృశ్యం. ‘నాన్నా... నాన్నా’... పెద్దగా అరుస్తూ తండ్రిని లేపే ప్రయత్నం చేశాడు వెంకట్. అప్పటికే కండక్టర్, ఇంకో ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు కలిసి విష్ణును డ్రైవర్ సీటులో నుంచి బస్సులోకి తెచ్చి కాళ్లు, చేతులు రబ్ చేయసాగారు. వెంకట్ తండ్రి ఛాతిని చేతులతో అదమసాగాడు. ఈలోపే కండక్టర్ 108కి ఫోన్ చేశాడు. కాని అది వీళ్లకు అందుబాటులో లేకుండింది. వేరే వెహికిల్‌లో దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. విష్ణు ప్రాణాలు కాపాడలేకపోయారు. గుండెపోటుతో మరణించాడని ధృవీకరించారు. ఆయన లాస్ట్ డ్యూటీ చేయాలని కోరుకున్నాడు. లాస్ట్‌డ్యూటీని సక్రమంగా ముగించి శాశ్వత రిటైర్‌మెంట్ తీసుకున్నాడు.
డ్యూటీయే ప్రాణం..
‘నాన్నకు డ్యూటీ అంటే ప్రాణం. ఆయన 30 ఏళ్ల సర్వీస్‌లో ఆఫ్‌లు తప్ప ఏ రోజూ లీవ్ తీసుకోలేదు. జ్వరం వచ్చినా జలుబు చేసినా కొంచెం ఓపికున్నా చాలు డ్యూటీకి వెళ్లేవాడు. పర్సనల్ పనులు ఏమన్నా ఉంటే ఆఫ్ రోజు చూసుకునేవాడు తప్ప లీవ్ పెట్టేవాడు కాదు. బేసిగ్గా నాన్న మెకానిక్. జాబ్ రాకముందు మెకానిక్‌గానే ఉన్నాడు. బస్‌కు టెక్నికల్‌గా ఏ ప్రాబ్లమ్ వచ్చినా డిపో నుంచి మెకానిక్స్ వచ్చేదాకా చూసేవాడు కాదు. తనే రిపేర్ చేసేసి డిపోకు తీసుకెళ్లిపోయేవాడు. మా ఊళ్లో చాలామంది అబ్బాయిలకు మెకానిక్ పని నేర్పించాడు. ఊరికే పనీ పాటా లేకుండా తిరిగే బదులు పని నేర్చుకుండి అని. నాన్న చనిపోయాక నాకు ఆయన ప్లేస్‌లో కండక్టర్ జాబ్ ఇచ్చారు. రిటైర్‌మెంట్ ఫంక్షన్ గురించి రెండుమూడు రోజులగా బాగా ఆలోచించాడు. బహుశా ఆ ఎక్సైట్‌మెంట్‌తోనే ఆయనకు హార్ట్‌ఎటాక్ వచ్చిందేమో. అసలు రిటైర్‌మెంట్‌కు ఆర్నెల్ల ముందు నుంచి డ్యూటీలు వేయరట. రెస్ట్ ఇస్తారట. మరెందుకో నాన్నకు అలా ఇవ్వలేదు. పైగా ఆయనకు కంట్రోలర్‌గా ప్రమోషన్ కూడా రావల్సి ఉండింది. ఇవ్వలేదు. నాన్న ప్లేస్‌లో ఇంకో వ్యక్తికి ఇచ్చారు. అదీ మనసులో పెట్టుకున్నాడేమో. బాధ పడి ఉండొచ్చు. ప్రెషర్ ఫీలై ఉండొచ్చు. మొత్తానికి డ్యూటీ డ్యూటీ అని డ్యూటీలోనే ప్రాణం ఒదిలిండు’ అంటూ తండ్రి గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు వెంకట్.
Comments
Please login to add a commentAdd a comment